వ్యావహారిక భాషా పితామహుడు - గిడుగు వెంకట రామమూర్తి - అచ్చంగా తెలుగు

వ్యావహారిక భాషా పితామహుడు - గిడుగు వెంకట రామమూర్తి

Share This
తెలుగు సరస్వతి నోముల పంట – వ్యావహారిక భాషా పితామహుడు
గిడుగు వెంకట రామమూర్తి(1863 – 1940)
కొంపెల్ల శర్మ 

ముగ్గురే ముగ్గురు! – సారస్వత త్రిభువనాలు
“తెలుగుదేశంలో ముగ్గురు మహనీయులు పందొమ్మిదోశతాబ్ది రెండోభాగంలో ఉద్యమకర్తలై సమాజానికి ఎంతో సేవ చేశారు కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). బాల్యవివాహాలు, ముసలివాళ్ళు చిన్నపిల్లలను పెండ్లి చేసుకోవటం, మరణించిన భర్తతో బలవంతంగా భార్యను సహగమనం చేయించటం (సతీసహగమనం), వితంతువివాహాన్ని నిషేధించటం, ఆడపిల్లల్ని అమ్ముకోవటం (కన్యాశుల్కం), అస్పృశ్యత, వేశ్యాలోలుపత్వం ముఖ్యంగా అగ్రవర్ణాలలో ఉన్న మూఢవిశ్వాసాలు, మూఢాచారాల్లో కొన్ని. తన రచనల ద్వారా, వీటిని నిర్మూలించి సంఘంలో అభ్యుదయభావాలను, నూతనచైతన్యాన్ని తేవటానికి వీరేశలింగంగారు అవిశ్రాంతకృషి చేశారు. చాలావరకు కృతకృత్యులైనారు కూడా. ఉదాత్తశిల్పంతో సృజనాత్మకరచనల (కథానికలు, కన్యాశుల్కం, ముత్యాలసరాలు) ద్వారా సమాజంలో ఉన్న దురాచారాలను చిత్రించి సమాజాన్ని మరమ్మత్తు చేయటంతో పాటు ఆధునిక సాహిత్యప్రక్రియలకు మార్గదర్శకుడైనాడు గురజాడ అప్పారావు. వ్యవహార భాషలో 1897లో ఆయన మొదటరచించిన కన్యాశుల్కం ఈనాటికీ గొప్పనాటకమే. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన శిష్టవ్యావహారికంలో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.” అని ప్రముఖ భాషావేత్త డా.భద్రిరాజు కృష్ణమూర్తి గారన్నది అక్షరాలా నిజం.
ఈ తెలుగు జంట మన వెలుగు పంట – ఇద్దరూ ఇద్దరే
కొన్ని కొన్ని ఉద్యమాలను కొందరు మహనీయులు జంటగా చేపట్టి నడిపిస్తారు. జయప్రదంగా కొనసాగిస్తారు. మన తెలుగు దేశంలో గిడుగు వెంకట రామమూర్తి (1863 – 1940), గురజాడ వెంకట అప్పారావు (1862-1915) జంటగా భాషా సాహిత్యాలనే ప్రజా ఉద్యమాలను చేపట్టి నడిపి ప్రగతికి దారి తీశారు. ఈ తెలుగు జంట మన వెలుగు పంట. ఈ ఇద్దరి మిత్రుల ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు, ఊహలు, ఉద్యమాలు, ఉమ్మదిగానే ఉన్నా, ఇద్దరూ చేసిన ఉద్యోగాల స్వభావాలు ఇతర వ్యాపకాలు వైవిధ్యమున్నాయి. కనుక వారి జీవిత చరిత్రలను వేరువేరుగా చెప్పుకొంటున్నా కొన్ని సందర్భాల్లో ఒకరి గురించి రాసేటప్పుడు రెండోవారి ప్రసక్తి వస్తుంది. గురజాడ వాడుక భాషకు సృజనాత్మక సాహిత్యం వల్ల ‘లక్ష్యం’ ప్రసాదిస్తే, గిడుగు వారు తమ పాండిత్యంతో లక్షణాలను సూచించారని సాహితీపరులు భావిస్తారు. అయితే గురజాడకు భాశాతత్త్వం బాగా తెలుసు; దానిపై ప్రామాణికమైన వ్యాసాలు రాశారు. గిడుగు వారికి కావ్య ధర్మాల గురించి స్పష్టమైన అవగాహన ఉంది. గిడుగు వారి కళా సిద్ధాంతాల నిగ్గు, మనకు గురజాడ వారి సృజనాత్మక రచనల్లో ప్రతిఫలిస్తాయి. జమీందారీ యుగంలోని భాషా సాహిత్యోద్యమాల్లో అభ్యుదయాకామ్క్షలకు, శ్రామికజన పక్షపాత బీజాలకూ గిడుగూ, గురజాడల జీవితాలు దర్పణాలు.
మారుతూన్న దేశభాషాలలితాంగి – తరగెత్తు జీవనది ‘భాష’
“కాలము బట్టి, దేశమునుగాంచి, ప్రభుత్వమూనెంచి, ‘దేశభాషా లలితాంగి మారు”నని తిరుపతి వెంకట కవులు అన్నారు. ఎప్పటికప్పుడు ఒడ్లు మునుగునట్లు పొంగెత్తు పరిణామములను, తిరుగుబాటులను కూలంకషంగా పరిశీలించిన గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యవహారచ్యుతములైన మాటలు, నిఘంటువులను ఆశ్రయించుకొని, జీవించు పదములు, రచనోపయోగులు కావని, రచయితలకు శిష్ట వ్యావహారికభాషయే శరణ్యమని ఒక మహోద్యమమును లేవనెత్తారు. ప్రాచీన కావ్యములు వల్లేవేయించినంతనే, పాతపడిన వ్యాకరణములును పుక్కిట పట్టించి నంతనే, ప్రజల్లో విద్యావ్యాప్తి కలిగినట్లు కాదని, వీరు స్పష్టపరిచారు. భాషకు శాశ్వతముగా ఒక వ్యాకరణము నిర్మించడమంటే, దానికి సమాధి కట్టినట్లే అని, కొత్త నీటిని చేర్చుకొని, తరగెత్తు జీవనదిలా భాష ఎప్పటికప్పుడు సరికొత్త వాడుక మాటలను తనలో కలుపుకొని ముందుకు సాగాలని ఎలుగెత్తి ఘోషించారు.  కాలర్భాన కలిసిపోయిన దేశి రచనలను పునరుద్ధరించవలసిన ఆవశ్యకతను ఉద్ఘాటించారు. సమాజంలో వలే, కళారంగము కూడ మార్పులు అనివార్యమని చెబుతూ – “ఏ తరంలోని సాహిత్యమైనా, తన కాలపు ఆలోచనా స్వభావాదులను ప్రతిబింబిస్తుంది. ఒక యుగం, వెనుకటి యుగపు సాహిత్య ప్రమాణాలను గుడ్డిగా అనుసరించదు; అది వర్తమాన కాలంనుంచీ ఆవేశాన్ని పొందుతుంది. విషయ స్వీకరణలో, భావవ్యక్తీకరణలోమ రెండింటా, తన లక్ష్యం జీవిత విమర్శేకాని, నిర్జీవ పదార్థ విమర్శ కానేకాదని,అది ఉద్ఘాటిస్తుంది.” అని నిర్ద్వందంగా ప్రస్తావించారు. సహజ స్వేచ్చాప్రియత్వం, నవ్యతాప్రీతి ఉన్న యువకులకు వ్యావహారిక భాషోద్యమము ఏనుగంత బలమిచ్చింది. గిడుగు గురజాడల ఉద్యమకాంతులు వారి అంతస్సులను రాగరంజిత మొనర్చాయి. వారి వాక్కులకు అంతవరకూ ఉన్న ఉక్కు పంజరాలు ఊడిపోయాయినట్లు అనిపించసాగింది. వ్యావహారిక భాషోద్యమం యువకవుల భుజాల్ని తట్టి, వారిచేత స్వచ్చంద రీతిలో సరికొత్త రచనలు చేయించుటకు సాయపడింది.
కారణ జన్ములు
బహుముఖ ప్రజ్ఞావంతుడు విభిన్న రంగాల్లో విశిష్ట విజయాలను సాధిస్తాడు. ఇతరులకు అసాధ్యాలుగా తోచే వాటిని తన దీక్షాదక్షతలతో ప్రజలకోసం పాటుపడి సఫలం చేసినవారు, ఆ కార్యసాధన కోసమే పుట్టారని లోకులు భావించడం మన పూర్వాచారం. అలాంటి ప్రసిద్ధులను ‘కారణజన్ముల’ని లోకం కొనియాడుతుంది. గిడుగు వెంకట రామమూర్తిగారు వ్యావహారిక భాషోద్ధరణ కోసమే పుట్టారని కొందరూ, సవర భాషకూ, సవరులకూ అభ్యున్నతి ప్రసాదించడానికే జన్మించారని మరి కొందరూ భావిస్తారు.
ఉదాత్త చరితుడు – గిడుగు పిడుగు
“గిడుగు పిడుగని జగతిలో కేర్తి బడసి, పుడమి విడనాడి దివికేగే పుణ్యమూర్తి, రావుసాహేబు వేంకట రామమూర్తి” – అని ఆంధ్ర పత్రిక ఆయన మరణం సందర్భంగా (22 జనవరి 1940) నివాళి ప్రకటించింది. జీవితమంటే చాలామందికి ఆరాటం. కొద్దిమందికే పోరాటం! ఆ పోరాటం కూడా బ్రతుకు తెరువుకోసమో, కీర్తి ప్రతిష్ఠలకోసమో కానే కాకుండా, పుట్టి, పెరిగిన సమాజానికి ఏ మేలు, ఎలా చేయాలన్నదే ఆ ఆరాటం. ఆ కోవకు చెందిన వారే గిడుగు రామమూర్తి పంతులు గారు. ఆయన ఆరాటమంతా ఆంధ్రప్రజల కోసం, ఆంధ్రులందరికీ చేరువయ్యే మాట్లాడే తెలుగు భాషకు పట్టం కట్టడం కోసమే! అందుకే గిడుగు పిడుగులా విజ్రుంభించారు.
“వ్యావహారిక భాష” అనగానే మనకు గుర్తుకొచ్చేది గిడుగు వారే. వ్యావహారిక భాషోద్యమంలో కీలకపాత్ర వహించి, నాలుగు దశాబ్దాలకు పైగా గ్రాంథికవాదులతో పోరాడి, వ్యావహారిక భాషకు పట్టం కట్టారు. తెలుగు సాహిత్యం అందారికీ అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలో రచనలు సాగాలన్నది ఆయన వాదన. బోధనాభాషగా కూడా వ్యావహారిక భాష ఉండాలన్నది ఆయన ఆకాంక్ష, ఆశ,ఆశయం. అందుకోసమే ఆయన తన జీవితాన్ని వెచ్చించారు. ఈరోజుల్లో పత్రికల్లోనూ, ఇతర మాధ్యమాల్లోనూ అందరికీ అర్థమయే వ్యవహారిక భాష ఉందంటే అందుకు గిడుగు రామమూర్తివంటి ఉద్దండులు చేసిన గట్టి ప్రయత్నాలు ఫలించాయనే గుర్తుంచుకోవాలి. ఈ లెక్కన ఎన్ని శతాబ్దాలు వెనక్కెళ్ళినా తెలుగువారు తమలో తాము సుమారుగా ఇప్పటి భాషలోనే మాట్లాడుకుని ఉంటారని అనిపిస్తుంది. సులువైన పద్ధతులను విడనాడి ఇనపగుగ్గిళ్ళను కోరుకోవడం పండితులలక్షణమేమో. మొదట్లో పత్రికలను నడిపినవారిని సంపాదకులు అనకుండా యెడిటర్లు అనే అనేవారట. బోధనా పద్దతులలో మార్పుకి కృషి చేసిన ఈ ఆధునిక భాషా శాస్త్రవేత్త తెలుగులో మొదటి ఆధునిక భాషా విమర్శకులు. సవరలకు, సవర భాషకు ఎన్నో సేవలనందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘గిడుగు’వారి జన్మదినం – ఆగష్ట్ 29న – ‘తెలుగు భాషా దినోత్సవం’ గా ప్రకటించడం హర్షణీయం.
గిడుగు జీవితవిశేషాలు
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగిడుగు వెంకట రామమూర్తి . గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్తచరిత్రకారుడు, సంఘసంస్కర్తశిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ గిడుగు రామ్మూర్తి మూలానే  వీలైంది.
గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29 వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలోజన్మించాడు. తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవాడు. 1877 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయాడు.
విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపాడు. 1879 లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తి పై బడింది. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్‌.ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ప్యాసయ్యాడు. 1896 లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నాడు. ఇంగ్లీషుసంస్కృతాలు గాక, ప్రధాన పాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో మొదటి తరగతిలో, రెండోర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు. రాజావారి ఉన్నత పాఠశాల కళాశాల అయింది. అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.
సవర భాషోద్యమ సేవలు
ఆరోజుల్లోనే ఆయనకు దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. ఈపరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళుపెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళభాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసుప్రభుత్వం వారు ఈకృషికి మెచ్చి 1913లో రావ్‌ బహదూర్‌బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణనిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. సవర దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబభాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషాకుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మనదేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని శబరులనే ఆదిమజాతిగా ఐతరేయబ్రాహ్మణం (క్రీ.పూ. 7వశతాబ్ది) లో పేర్కొన్నారు. హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగదేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివారు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించారు. 1911లో గిడుగువారు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయారు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది.
వచనభాష సంస్కరణోద్యమం
1907లో J. A. Yates అనే ఇంగ్లీషుదొర ఉత్తరకోస్తాజిల్లాలకు స్కూళ్ళ ఇన్స్పెక్టర్‌గా వచ్చాడు. చిన్న తరగతుల్లో తెలుగుపండితులు పాఠాలు చెప్పేపద్ధతి ఆయనకు అర్థం కాలేదు. ప్రజలు వ్యవహరించేభాష, పుస్తకాలభాష మధ్య ఎందుకు తేడాలున్నాయి అన్నది ఆయన ముఖ్యసమస్య. అంతకుముందు తమిళదేశంలోనూ అదే సమస్య ఆయన్ను వేధించింది. విశాఖపట్నంలో Mrs A.V.N. College ప్రిన్సిపాల్‌గా ఉన్న పి.టి. శ్రీనివాస అయ్యంగారిని అడిగితే ఆయన గురజాడ, గిడుగులు దీనికి సమాధానం చెబుతారని అన్నారు. ఆవిధంగా గిడుగువారు జీవిత ఉత్తరార్థంలో ఈవిషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించారు. గురజాడ గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సుదొర ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారికభాషోద్యమం ఆరంభమైంది. అప్పటికే ఇంగ్లీషులో భాషాశాస్త్రగ్రంథాలు చదివిన గిడుగు ప్రతియేడూ జరిగే అధ్యాపకసదస్సుల్లో జీవద్భాష ప్రాధాన్యాన్ని గురించి ఉపన్యాసాలిచ్చారు. నన్నయ్య కాలానికే కావ్యభాషకు శాసనాల్లో కనిపించే వ్యవహారభాషకు దూరం ఏర్పడుతున్నట్టు గుర్తించవచ్చు. నన్నయ్య తనకు ముందు రచనల్లో సాంప్రదాయికంగా వచ్చే రూపాలను వాడాడు. శాసన భాషలో ఇస్తిమి, నాలుగో, ఇచ్చినాడు వంటి రూపాలు ఆకాలానికే ఉన్నాయి. లక్షణగ్రంథాలు కవిత్రయంవారి ప్రయోగాలే ఆధారంగా వెలిశాయి. పదసాహిత్యంలో వ్యవహారరూపాలు ఎక్కువగా కనిపించినా వ్యాకర్తలు వీటికి సాధుత్వం కల్పించలేదు. ప్రామాణికమైన వచనవాఙ్మయం తెలుగులో ఇటీవలి శతాబ్దుల్లోనే మొదలైంది. ఇంగ్లీషుపాలనలో అచ్చుయంత్రం రావటం, స్కూళ్ళు, కాలేజీలు స్థాపించి అందరికీ అందుబాటులో వుండే నూతనవిద్యావిధానం స్థాపించటం, కథ, వ్యాసం, నవల, నాటకం మొదలైన సాహిత్యప్రక్రియలు వ్యాపించటంవల్ల వచనభాషలో రచనలసంఖ్య పెరిగింది. దానికి కావ్యభాష అనువైందికాదని పైనలుగురు భాషాసంస్కరణోద్యమం చేపట్టారు.
విజయనగరంలో ఆంధ్రసాహిత్యసంఘముఏర్పడ్డది; దానికి గిడుగు రామమూర్తి 1912-13లో స్కూలుఫైనల్‌ లో వ్యాసరచన కావ్యభాషలో గాని ఆధునికభాషలో గాని రాయవచ్చునని స్కూలుఫైనల్‌ బోర్డు కార్యదర్శి ఒక జీ.ఓ. ఇచ్చాడు. ఆధునికభాషకు లక్ష్యంగా బ్రౌన్‌ తెలుగు రీడర్‌ ను, ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రచరిత్రను ఉదాహరించాడు. ఈమార్పుల వల్ల తెలుగుసాహిత్యానికి అపకారం జరుగుతుందని పండితుల్లో అలజడి బయలుదేరింది. మద్రాసులో జయంతి రామయ్య అధ్యక్షతన ఆంధ్ర సాహిత్యపరిషత్తుఏర్పడ్డది. వావిలకొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి లాంటి పండితులు జయంతి రామయ్య వాదాన్ని బలపరిచారు. దేశం అంతటా సభలుపెట్టి వ్యాసరచనపరీక్షలో ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛను ఉపసంహరించాలని పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీసారు.
1913 ఏప్రిల్‌ నెలలో మద్రాసు యూనివర్సిటీ వారు ఎఫ్‌.ఏ. లో తెలుగువ్యాసరచనకు ఏభాషను ఉపయోగించాలో నిర్ణయించటానికి కాంపోజిషన్‌ కమిటీని నియమించారు. దానిలో (1) ఆధునికుల ప్రతినిధులుగా గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావు, పి.టి. శ్రీనివాస అయ్యంగారు, బుర్రా శేషగిరిరావులను, (2) ప్రాచీనభాషావాదుల ప్రతినిధులుగా వేదం వేంకటరాయ శాస్త్రి, జయంతి రామయ్య, కొమర్రాజు లక్ష్మణరావు, జి. వేంకటరంగయ్యలను నియోగించారు. మధ్యస్థులుగా ఆర్‌. రంగాచారి (అధ్యక్షుడు), ఠాంసన్‌ నియుక్తులైనారు. రంగాచారి ముగ్గురువ్యక్తులతో ఒక సబ్‌ కమిటీ వేసి ఆధునిక ప్రాచీనరూపాల జాబితాలు రాయమని నిర్దేశించాడు. పై ఆదేశానుసారం ఆధునికరూపాలనే గిడుగు గురజాడలు సేకరిస్తే, కొమర్రాజు, జయంతి ప్రాచీనరూపాలజాబితాలు రాశారు. “as well as” అంటే సాహిత్యభాషలో ఉండి ఇప్పటివాళ్ళకు కూడా అర్థమయ్యేరూపాలనే విపరీతార్థం తీసారు. ఈలోపల మరోనలుగురు సభ్యులను రాయలసీమనుంచి కమిటీలో వేశారు. వాళ్ళంతా గ్రాంథికవాదులే. ఎక్కువమంది గ్రాంథికం వైపు మొగ్గటంతో వ్యావహారికవాదుల తీర్మానం నెగ్గలేదు.  గురజాడ అప్పారావు “Minute of Dissent”ను కాంపోజిషన్‌ సబ్‌కమిటీకి అందచేశాడు. ఇది వ్యావహారిక భాషోద్యమంలో ఒక ముఖ్యమైన మైలురాయి. యూనివర్సిటీ నిర్ణయాన్నిబట్టి ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 22, 1915 న శైలీస్వేచ్ఛను ఉపసంహరిస్తూ ఒక ఉత్తరువు జారీ చేసింది. విద్యావిధానంలో వ్యవహారభాషకు స్థానం లేకుండాపోయింది. ఈపరిస్థితి 1970ల దాకా సాగింది.
స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళగ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏరచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు తెలుగుఅనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాసపాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆపత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారికభాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా వర్తమానాంధ్ర భాషాప్రవర్తకసమాజంస్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతిమహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో Miscellany of Essays (వ్యాససంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. 1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తు ఆధికారికంగా వ్యావహారికభాషానిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్యపరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే ప్రతిభఅనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా జనవాణిఅనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.
మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషావ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవరభాషాకృషికి మెచ్చి Kaizer-e-Hind పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు.
తుది విన్నపమని చెప్పినది నిజంగానే తుది విన్నపమే
గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరిమాటలు
దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి.గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థంచేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?
స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామికపరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మనప్రజలకు, సామాన్యజనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.
(From the Report submitted by the Telugu Language Committe to Andhra University, 1973: 99).
రామమూర్తిగారి తుది విన్నపమని చెప్పినది నిజంగానే తుది విన్నపమే అయింది. సరిగ్గా, పన్నెండు రోజుల తర్వాత  గిడుగు రామమూర్తి 1940, జనవరి 22 న కన్ను మూశారు. యశ:కాయాన్ని ధరింఛి వారు నిజంగా కీర్తిశేషులయ్యారు.
   
“గిడుగు” గురించి పలువురి ప్రశంసలు:
సమకాలీకుల మాటల్లో గిడుగు రామమూర్తి గారు:
Ø  నిగర్వ చూడామణులు, నిష్కపటులు, నిర్భయమానసులు, నిష్కల్మష చరిత్రులు. (శ్రీ విక్రమదేవవర్మ – జయపురాధీశులు)
Ø  గిడుగు పిడుగు (చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి)
Ø  మహాప్రస్థానం గీతాలకు కారణం ఎవరంటే భాషకు సంబంధించినంత వరకూ గిడుగువారే. (శ్రీశ్రీ)
Ø  తెలుగు సరస్వతి నోముల పంట (విశ్వనాథ సత్యనారాయణ)
Ø  యుగపురుషుడు (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి)
Ø  నిష్కామకర్మ ఆమరణమూ చేసిన కర్మవీరుడు. (చింతా దీక్షితులు)
Ø  నడుస్తున్న విశ్వవిద్యాలయం (జయంతి గంగన్న)
Ø  భారతయుద్ధము వంటి భాషాయుద్ధము చేసినా, వారు అజాత శత్రువులే. (నోరి నరసింహ శాస్త్రి)
Ø  మహాత్ముని శక్తికన్నా పంతులు వారి ధారణా శక్తి గొప్పదనిపిస్తుంది. (శ్రీనివాస శిరోమణి)
Ø  వారిది ఉదార హృదయము. ప్రజాస్సేవ, లోక కళ్యాణము వారి ఆశయములు. వారు పూనుకొన్న కార్యాలన్నింటికీ ఇదే మూల సూత్రము. (తెలికిచెర్ల వెంకటరత్నం)
Ø  వారి తెలివి, పట్టుదల, ఓర్పు నేర్పు, ఔదార్యం, పాండిత్యం, సమయస్ఫూర్తి,ఇత్యాదులు అద్భుతం. వాటిని మించినది నిష్కల్మష హృదయం. (టేకుమళ్ళ కామేశ్వరరావు)

Ø  “Let him believe a cause to be just and true, and he would give himself body and soul to it....... Carelesses of personal gain, rather welcoming loss for its sake.” (J.A.Yates)

No comments:

Post a Comment

Pages