గోవిందుడి సంతకం
ఆండ్ర లలిత
అనగనగా లక్ష్మీ పురం అనే ఒక కుగ్రామం. ఆ గ్రామంలో పూర్వీకులిచ్చిన నాలుగు ఎకరాల మాగాణి శ్రద్ధ గా సాగు చేసుకుంటు బ్రతికే వాడు గోవిందుడు. ఒకరోజున గోవిందుడి 5వ తరగతి చదువుతున్న పిల్లాడు శ్రవణుడు దీక్షతో చదువుకుంటూ, పొలం రాబడి లెక్కలు చూసుకుంటున్న నాన్నతో “ నాన్నా! నాకు వైద్యుడు అవ్వాలని ఉంది. నన్ను చదివిస్తావా”అని అడిగాడు.
“ఓ, తప్పకుండా చదివిస్తాను. కాని ఎందుకు అవ్వాలనుకుంటున్నావు? ముందు నాకు చెప్పు” అన్నాడు గోవిందుడు శ్రవణుడి పక్కన కూర్చుని పిల్లాడి మాటలకు సంబరపడుతు.
“మనము వైద్యుడు దగ్గరకి నొప్పి, బాధ ఇంకా జ్వరం ఉంటే వెళ్తామని మా ఉపాధ్యాయుడు అన్నారు. అమ్మోనొప్పి, బాధ తట్టుకోలేక ఏడుపు కూడా వస్తుంది. అప్పుడు వైద్యుడు మనని పరీక్ష చేసి మంచి మందు ఇస్తారు. దానితో చక్కగా మన రోగం తగ్గిపోయి మళ్ళీ చిరునవ్వు మన మొహం మీద వస్తుంది. వైద్యవిద్య చదివి అందరి రోగాలు తగ్గిద్దామనుకుంటున్నాను. నేను ఎవరైనా బాధపడుతుంటే చూడలేను నాన్నా” అన్నాడు శ్రవణుడు గోవిందుడి కళ్ళల్లో సమాధానం వెతుకుతూ.
“ఓ, అలాగే చేద్దువుగాని. నా బంగారు తండ్రి. ఎంత పెద్దవాడైయ్యావురా!” అన్నాడు శ్రవణుడిని చూసి సంబరపడి గోవిందుడు.
“చదువుకో నాన్నా! ఆ భగవంతుడు చల్లగా చూస్తే అలాగే అవ్వుదువుగాని”అని శ్రవణుడికి తలనిమిరాడు గోవిందుడు . మళ్ళీ తను పద్దు చూసుకోవటంలో పడ్డాడుకాని, దృష్టి కేంద్రీకరించ లేక పోయాడు.
ఎలా చదివించాలా అని ఆలోచనలో పడ్డాడు గోవిందుడు. తన సంపాదన సరిపోదు. ఉన్నది ఆ కాస్త పొలమే. దాని రాబడి ఎలా పెంచాలనే ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తూ, ఆ భగవంతుడిని దారి చూపమని వేడుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ప్రొద్దున్న లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుని , మంచి తలపులతో భగవంతుడుని ఆరాధించి, తను శ్రద్ధతో చేసే పనిలోనే భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో పొలానికి బయలుదేరాడు. పొలం దగ్గర పక్క పొలం యజమాని నారాయణుడు కారులో వచ్చిన నలుగురు పెద్ద మనుషులుతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ సూటు బూటు వేసుకున్న పెద్ద మనుషులు కారులో వెళ్ళగానే... గోవిందుడు విషయం నారాయణుడిని అడిగి కనుక్కున్నాడు.
నారాయణుడికి అనంతవరం అనే వూరిలో కూడా భూములున్నాయి. అక్కడికీ ఇక్కడికీ దూరం 50మైళ్ళు. రెండూ సాగు చేయటం కష్టమౌతోంది. తన సహాయానికి చేతి క్రింద ఎవ్వరూ లేరు. అందుకని ఇక్కడ అమ్మి, అక్కడ ఈ ధనంతో పొలం కాస్త ఎక్కువ కొనుక్కుని , అక్కడే ఉండి సాగు చేద్దామని నారాయణుడి ఉద్దేశ్యం. నారాయణుడి మాటలు విన్నాక ఆ పొలం తను కొనుక్కుంటే రాబడి పెరిగి, శ్రవణుడిని చదివించగలిగే స్తోమత వస్తుందని ఆశ పుట్టింది గోవిందుడికి. గబగబా పొలం పనులు ముగించుకుని గ్రామీణ బ్యాంకుకు వెళ్ళి తనేమైనా అప్పు తీసుకోవచ్చేమోనని వివరాలు కనుక్కున్నాడు. కానీ బ్యాంకు వారి షరతులు ఒప్పుకునే స్తోమతలేక, దుఃఖంతో దిక్కు తోచక రోడ్ పక్కన రావి వృక్షం క్రింద సేద తీర్చుకుందామని చతికిల పడ్డాడు గోవిందుడు.
బడి నుంచి ఇంటికి వెళ్తున్న సోమశేఖరం పంతులుగారు రావి వృక్షం క్రింద కూర్చున్న గోవిందుడిని చూసి, “గోవిందా ! ఎలా ఉన్నావురా? అసలు బొత్తిగా కనబడటంలేదు. ఇవాళే మీ అబ్బాయి శ్రవణుడుని నీ గురించి అడిగాను. నీ అదృష్టం రా. మంచి చురుకైన పిల్లాడు. చదువు ఆపకు వాడికి. మంచి వృద్ధి లోకి వస్తాడు. ఆ భగవంతడు చల్లగా చూస్తే నీ కలలు నిజమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయిరా” అన్నారు సోమశేఖరం పంతులుగారు గోవిందుడి బుజం తట్తూ ప్రేమతో.
మళ్ళీ అందుకుంటూ “ఏవిటిరా!అలా ఉన్నావు? ఏమన్నా సమస్యా? చెప్పు”అన్నారు సోమశేఖరం పంతులుగారు గోవిందుడి కళ్ళలో ఆతృతగా సమస్య వెతుకుతూ. బుజాన్నున్న తుండుగుడ్డతో మొహం తుడుచుకుని నుంచుని పంతులుగారికి నమస్కారం పెట్టి, “మీ సలహా తీసుకుందామని మీ ఇంటికే బయలుదేరాను బాబుగారూ. ఓపిక లేక ఇలా కూర్చుండిపోయాను. నారాయణుడు తన పొలం గిట్టుబాటు ధర వస్తే అమ్ముదామను కుంటున్నాడు”అంటూ విషయం అంతా తూచా తప్పకుండా వెళ్ళడించాడు.
అంతా విని, “నాకు తెలిసిన ఒక పెద్ద వ్యాపారస్థుడు పేరు సుందర శివరావు. అతని దగ్గరకి వెళ్ళు. నేనొక పత్రం రాసి ఇస్తాను. అతనికివ్వు. నామీద నమ్మకంతో పెట్టుబడి పెడతాడు. కాని నువ్వు అతను ఏమంటే అది ఒప్పుకో” అన్నారు సోమశేఖరం పంతులుగారు.
సంతోషంగా మర్నాడు వ్యాపారస్థుడు సుందరశివరావు గారి దగ్గరకు వెళ్ళాడు. పని పది నిమషాలలో జరిగిపోయింది. దస్తావేజులు చదవనుకూడా లేదు. పెద్దవారి మాటంటే చాలా నమ్మకంతో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాడు. నారాయణుడి పొలంకూడా వ్యాపారస్థుని ధన పెట్టుబడితో కొనుక్కుని సాగుచేసుకున్నాడు. గోవిందుడు బంగారం పడించాడు. ఇది చూసి, వ్యాపారస్దుడికి ఆశపుట్టి అంతా నాదేనని ఏవో లెక్కలు చూపించి, గోవిందుడు సోమశేఖరం పంతులుగారిపైనున్నగౌరవంతో సరిగా చూసుకోకుండా ఒప్పుకుని దస్తావేజుల మీద చేసిన సంతకాలను చూపించి గోవిందుడిని తరిమేస్తాడు. గోవిందుడు పంతులుగారి దగ్గరకొచ్చి ఏడుస్తూ “ బాబుగారండి నేను ఐదేళ్ళ వ్యవధిలో వ్యాపారస్థుడు సుందరశివ రావుగారు పెట్టుబడి వడ్డితో ఇస్తానన్నానండి. దస్తావేజులో ఉన్నది అదే అనుకుని సంతకం పెట్టానండి. కాని కాదటండి, ఏడాదిలో ఇవ్వాలట. అలా ఇవ్వలేదు కాబట్టి, పొలం వ్యాపారస్థుడిది అయ్యిందట “ అని పంతులుగారి కాళ్ళు పట్టుకున్నాడు.
“పద గోవిందా నేను మాట్లాడతాను” అని సోమశేఖరం పంతులుగారు గోవిందుడితో తన నేస్తం దగ్గరకు వెళ్ళారు. సుందరశివరావు గోవిందుడు అబధ్ధం చెప్తున్నాడని నమ్మించాడు యుక్తితో. గోవిందుడు మీద పంతులుగారికి కూడా చాలా కోపం వచ్చింది. గోవిందుడు ఎంత ప్రాధేయపడినా సోమశేఖరం పంతులుగారు వినలేదు. దిక్కు తోచక మనసు బాగులేక, గుడిలో కూర్చున్నాడు. అంతలో అక్కడికి రామశాస్త్రి గారు వచ్చి గోవిందుడిని చూసి “గోవిందా ఎలా ఉన్నావురా? నీ అవసరం పడిందిరా నాకు. చేయగలవా!”అన్నారు.
ఉలుకు పలుకు లేని గోవిందుడుతో “ఏవిటిరా సమాధానం ఇవ్వవు! ఏమైంది? మాట్లాడు”అన్నారు రామశాస్త్రి గారు.
గోవిందుడు జరిగినదంతా చెప్పి భోరని ఏడ్చాడు. రామశాస్త్రిగారు అంతా విని గోవిందుడితో,” గోవిందా బాధ పడకు. నీ పనితనమే నీ ఆయుధం. రంగంలోకి దిగు. నిజం నిలకడమీద తెలుస్తుంది గోవిందా! తెలియక తప్పు చేసావు. మళ్ళీ చేయవులే. నేను పట్నములో ఉంటున్నానుకదా, ఇక్కడ నా భూములు ఇంక నువ్వే చూసుకోవాలి. జీతంతో బాటు నీ పనితనం చూసి ఎంతో కొంత వాటాకూడా ఇస్తానులే. బాధ పడకు.నీకు పోయిన భూములకన్నా ఎక్కువే ముట్టచెప్తాను. పిల్లాడి చదువు గురించి బెంగపెట్టకోకు. నేను చూసుకుంటా గోవిందా” అని తన భూములను గోవిందుడికి కౌలికి ఇస్తున్నట్లుగా సరైన కాగితాలు చేయించి సంతకం పెట్టేముందు లాయరు గారిని సంప్రదించమని సలహా ఇచ్చాడు. ఎప్పుడైనా సరే పూర్తిగా చదవకుండా అర్ధం చేసుకోకుండా లేక సరైన వారిదగ్గర నుండి సలహా తీసుకోకుండా సంతకాలు పెట్టద్దు అని మందలించారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిది అని సలహా ఇచ్చారు.
“ఆర్ధిక వ్యవహారాలలో పరస్పర నమ్మకాలు చాల ముఖ్యం, కాని వ్యక్తిగత వ్యవహారాలవల్లే చూడకూడదు మరి అని భుజంపై చేయి వేసి మందలించారు. నమ్మకం ఉండాలి అయినా ఎవరి జాగ్రత్తలో వారుండాలి. మొహమాట పడకూడదు. మనమెవరి చేత మోసపడకూడదు, ఎవరినీ మోసం చేయకూడదు. మరొకరి చేత వ్యవహారాలను పరీక్ష చేయుంచు కోడానికి గాని, పరీక్షింప పడడానికిగాని మోహమాటపడకూడదు. అది ఇరువరికీ మంచిది, అపనమ్మకం కానేకాదు. ఎంతటి వాడినైనా తప్పుదారి పట్టించగలిగే శక్తి ధనానికుంది” అని రామశాస్త్రిగారు సలహా ఇచ్చారు. ఆయన వారంలో వస్తానని కాగితాలన్ని పరీక్షింప చేయించుకోమని చెప్పి వెళ్ళిపోయారు.
కాలక్రమంలో గోవిందుడు రామశాస్త్రిగారి పొలాన్ని తన పొలంతో పాటుగా సాగుచేసి, శ్రవణుడుని వైద్యవిద్య కూడా చదివించగలిగాడు. ఈ విషయమంతా గమనించి అనుభవించిన గోవిందుడి సంసారానికీ స్నేహితులకు కూడా గోవిందుడు చూసుకోకుండా చేసిన సంతకాల వల్ల వచ్చిన అనర్ధాల అనుభవం ఒక గుణపాఠమయ్యంది.
***
Manchi sandesam
ReplyDeleteధన్యవాదాలు అశ్వినీ
Delete