ఇతడే!
పారనంది శాంత కుమారి
ఇతడే!
బాల్యంలో క్షణంపాటు అమ్మ కనబడకుంటే,
ఆ అమ్మకోసం ఏడుస్తూ,క్రిందపడి దొర్లుతూ,
అమ్మే తనలోకంగా,ఆమెఎడబాటే శోకంగా,
భావిస్తూ వచ్చినవాడు ఇతడే!
యవ్వనం వచ్చేసరికి తల్లిని విడిచి,
ప్రియురాలికోసం ఏడిచి,ఆమెనే తన ఆధారంగా తలిచి
ఆమెదూరాన్ని పెనుభారంగా భావిస్తూ,
ఆమెకై తపిస్తూ,ఆమెపేరునే జపిస్తూ వచ్చినవాడు ఇతడే!
వివాహమయ్యేసరికి ప్రియురాలిని మరిచి,
భార్యనే తన సర్వంగా,ఆమె సన్నిధినే స్వర్గంగా భావిస్తూ,
ఆమెనే వలచి,ఆమెనే కొలుస్తూ వచ్చినవాడు ఇతడే!
అర్ధాంతరంగా ఆలి వెళ్ళిపోతే,
తన జీవితంనుండి మళ్ళిపొతే,
అంతలోనే ఆమెను మరిచి,
వింతగా పిల్లలపై తన దృష్టిని మరల్చి,
వారి ఆదరణకై ప్రాకులాడుతూ
వారినే తనజీవితంగా,
వారినే శాశ్వతంగా భావిస్తూ వచ్చినవాడు ఇతడే!
మనవళ్ళు పుట్టేసరికి పిల్లల్నిమరిచి
మనవళ్ళ ఆలనతో,వారి పాలనతో
వారి ముద్దూముచ్చట్లతో
వారే తన ప్రాణంగా,వారే తనజీవంగా
భావిస్తూ వచ్చినవాడు ఇతడే!
***
No comments:
Post a Comment