కశ్యప మహర్షి - అచ్చంగా తెలుగు
కశ్యప మహర్షి  
మంత్రాల పూర్ణచంద్రరావు 

ఒకనాడు మరీచి మహర్షి  కపిలమహర్షిని చూచుటకు వచ్చెను. అచటనే ఉన్న కర్దమ ప్రజాపతి మరీచి మహర్షిని తన ఇంటికి తీసుకొని వెళ్లి తన కూతుర్లలో ఒకరు అయిన కళ ను ఇచ్చి వివాహము చేసెను.మరీచి మహర్షి భార్యతో కలిసి తపోవనమునకు పోయి సుఖముగా ఉండెను.
కొంతకాలమునకు కళ మరీచి మహర్షి దయతో ఒక కుమారుని కనెను.మరీచి మహర్షి ఆతనికి కశ్యపుడు అను పేరుపెట్టి యుక్తవయసు  వచ్చినపుడు ఉపనయనము చేసి తపోవనమునకు వెళ్ళెను.
కశ్యపుడు పెరిగి పెద్ద వాడు అయిన తరువాత  బ్రహ్మ దేవుని ఆనతి మేరకు దక్ష ప్రజాపతి తనకు కలిగిన కుమార్తెలలో అదితి, దితి, దనువు, కాల,అవాయువు, సింహిక, ముని, కపిల,క్రోధ,ప్రధ, క్రూర,వినతి,కద్రువ లను వారిని కశ్యపునకు ఇచ్చి వివాహము చేసెను.కొంతకాలమునకు కశ్యప మహర్షి దయచే అదితి ధాత, మిత్రుడు,అర్యముడు,శుక్రుడు,వరుణుడు,అంశుడు, భగుడు,వివస్వంతుడు,పూషుడు,సవిత్రుడు,త్వష్ట,విష్ణుడు, అను ద్వాదసాదిత్యులను కనెను. కశ్యపుని వలన దితి కి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మించెను.దనువునకు విప్రచిత్తి,శంబర మొదలగు నలుగురు దానవులు  జన్మించిరి. కాల అను ఆమెకు వినాసన, క్రోధ మొదలగు వారు ఎనిమిది మంది జన్మించెను.అవాయువు అను ఆమెకు బల వీరాదులు నలుగురు పుట్టిరి.సింహికకు రాహువు, ముని అను ఆమెకు భీమ సేనుడు,ఉగ్రసేనుడు అను గంధర్వులు కలిగెను. కపిలకు అమృతము,గోగణము, బ్రాహ్మణులు, మేనక మొదలగు అప్సరసలు కలిగెను.క్రోధ అను ఆమెకు క్రోధవశ గణములు,ప్రధ అను ఆమెకు సిద్ధాదులు,క్రూర అను ఆమెకు సుచంద్ర,చంద్ర హంత్రాదులు ను జన్మించిరి.
మనలో ఉన్న లక్షణములు అన్నియు కూడా మనుష్య రూపమున కశ్యపుని శరీరము నుండి వచ్చినవే అని తెలియుచున్నది కదా.
తరువాత కొంతకాలమునకు కద్రువ, వినతులు సంతానము పొంద తలచి కశ్యప మహర్షి వద్దకు వచ్చి తపము చేయగా ఆ మహర్షి వారిని వరములు కోరుకొనమనెను. అంత కద్రువ వేయి మంది సంతానము కావలెను అనియు, వినత గొప్ప బలవంతులయిన ఇద్దరు కుమారులను ఇవ్వమని కోరెను.అంత కశ్యప మహర్షి పుత్రకామేష్ఠి యాగము చేసి కద్రు వినతులను గర్భములు జాగ్రత్తగా కాపాడుకొనమని చెప్పి పంపెను.కొంత కాలమునకు వారిద్దరికీ అండములు పుట్టెను, వారు వాటిని ఒక కుండ లో భద్రపరచగా కద్రువ అండమునుండి శేషుడు, వాసుకి, తక్షకుడు,కర్కోటకుడు మొదలగు వేయిమంది నాగ ప్రముఖులు ఉదయించెను.వినత తన అండములు పగల లేదని తలచి ఒక అండమును పగుల కొట్టెను, అందు నుండి యనూరుడు అను కుమారుడు ఉదయించి తాను అంగ హీనముగా పుట్టితిని ఇంకొక అండమును అయినా పూర్తిగా కాపాడుకొనమని తల్లికి చెప్పి తాను సూర్యునకు సారధి అయ్యెను.కొంతకాలమునకు రెండవ అండమునుండి గరుత్మంతుడు ఉదయించెను.
గరుత్మంతుడు తల్లి దాస్య విమోచనమునకు అమృతము తెచ్చెదను అని చెప్పి , తండ్రి అగు కశ్యపుని వద్దకు వెళ్లి తనకు ఆహారము కావాలెను అని అడిగెను, కుమారుని మెచ్చుకొని విభావసుడు సుప్రతీకుడు అను బ్రాహ్మణులు పోరాడుకొని కూర్మ గజ రూపులయి పోవుచున్నారు వారిని భక్షింపుము అని కోరెను.అంత గరుత్మంతుడు అతి వేగముగా హిమాలయములకు వెళ్లి ఆ బ్రాహ్మణులను తిని అతి బలము తో అమృతమును తెచ్చి తల్లి కోర్కె నెరవేర్చెను.
ఒకప్పుడు కశ్యప ప్రజాపతి మహర్షులను చూచుటకు నైమిశారణ్య మునకు వచ్చెను  అప్పుడు అక్కడి ఋషులు అతనిని పూజించి  స్వామీ మాకు ఎల్లప్పుడూ నీరు లభించుటలేదు, కావున మీ పేరు మీదుగా గంగానది ఇటువయిపు వచ్చునట్లు చేయుము అని కోరెను.
కశ్యపుడు వారి కోరికను మన్నించి అమ్బుదాద్రి అను పర్వతమునకు వెళ్లి పరమ శివుని గూర్చి మహా తపస్సు చేసెను.అంత శివుడు ప్రత్యక్షమయి వరము కోరుకొనమనెను. కశ్యపుడు గంగను భూలోకమునకు ప్రవహింప చేయుము అని కోరెను శివుడు అంగీకరించి తన జడ నుండి గంగా నదిని ఒక పాయగా విడిచెను.కశ్యపుడు శివునికి నమస్కరించి గంగతో నైమిశారణ్యమునకు తిరిగి వచ్చి గంగను ప్రవహింప చేసెను.ఋషులు మహా ఆనందము చెంది ఆ గంగా పాయకు కాశ్యపి అను పేరు పెట్టిరి.ఈ కాశ్యపియే కలియుగమున సాభ్రమతి అని ప్రసిద్ధి చెందెను.  తరువాత ఈ కాశ్యపి నది ఒడ్డున దత్తాత్రేయ,విశ్వామిత్ర,భారద్వాజ మొదలగు మహర్షులు తపస్సు చేసెను కశ్యపుడు తపస్సు చేసిన ప్రదేశమునకు కాశ్యప తీర్ధము అను పేరునూ, అక్కడ నిర్మించిన కుండమునకు కాశ్యప కుండము,అక్కడ స్థాపించిన లింగమునకు  కుశేశ్వరుడు అను పేరున ప్రసిద్ధి పొందెను. 
కొంతకాలమునకు భూమి పై ధర్మము నశించి అధర్మము పెరిగిపోయి బ్రాహ్మణులు తమ విధులను ఆచరించక చెడ్డపనులు చేయుచుండెను. అందులకు  కోపించి భూమి పాతాళమునకు పోవుచుండెను. అప్పుడు కశ్యప మహర్షి భూదేవిని ఆపగా భూదేవి ఉత్తమ క్షత్రియులను తెచ్చి  వారి యొక్క పరాక్రమముతో ధర్మమును రక్షించి తన్ను కాపాడమని అడిగెను.అప్పుడు కశ్యపుడు పరశురాముని వలన మరణించని రాజులు ఎవరు అని అడిగెను,అందులకు భూదేవి సంతోషము చెంది పౌరవంశజుని విదూరధుని కొడుకు ఋక్షపర్వతమున ఋక్షములు రక్షించుచూ ,సౌదాసుని వంశమునకు చెందిన ఒకడు పరాశర మహర్షి వద్ద అక్రుత్యములు చేయుచూ,శిబి మనుమడు గోపతి అను వాడు గోవులను కాచుకుంటూ,బ్రతర్దన కుమారుడు వత్సరాజు అట్లే జీవించి యుండెను, వారందరినీ పిలిపించి రాజ్యములు అప్పగించుము అని చెప్పెను.కశ్యప మహర్షి సంతోషము చెంది వారిని అందరినీ పిలిపించి భూమిని నాలుగు భాగములుగా విభజించి వారిని రాజులుగా చేసి పరిపాలింపుము అని ఆజ్ఞాపించెను.ఆ రాజులు అందరూ కశ్యపునకు నమస్కరించి వారి వారి రాజ్యములు పరిపాలించుచూ అనేక మంది పుత్ర పౌత్రులను కని సంతోషముగా ఉండెను.
ఒకసారి బలిచక్రవర్తి భ్రుగ్వుడు మొదలగు వారిని పూజించి అతి బలవంతుడయి స్వర్గలోకము ను ఆక్రమించగా ఇంద్రుడు మొదలగు దేవతలు సూక్ష్మ రూపము ధరించి తమకు వీలు ఉన్నచోట తల దాచుకొనెను.బలి అంతులేని సంపదలు పొందగా భ్రుగ్వుడు మొదలగువారు అతనితో నూరు అశ్వమేధములు చేయిన్చిరి.ఇట్లుండగా అదితి తన బిడ్దల పాట్లు, సవతి బిడ్డల ధనము చూసి చింతించి కశ్యప మహర్షి తన వద్దకు రాగా తన బిడ్డలను రక్షింపుము అని కోరెను.కశ్యప మహర్షి రాబోవు కాలమును ఊహించి నారాయణుని ప్రార్ధించమని చెప్పి పయోభక్షణ అను మంత్రమును ఉపదేశించెను.అదితి అలాగే నారాయణుని ప్రార్ధించగా నేను నీకు కుమారునిగా పుట్టి నీ కోర్కె తీర్చెదను,కశ్యపుని వద్దకు వెళ్ళుము అని చెప్పెను. అదితి ఆనందముతో భర్తకు సపర్యలు చేయుచుండగా ఒక నాడు కశ్యపుని అనుగ్రహమున గర్భము ధరించెను.శంఖు చక్ర గదా ధరుడు అయిన నారాయణుడు తన కడుపున ఎలా ఉండును అని కశ్యపుని కోరగా, కశ్యపుడు నారాయణుని అనేక విధముల ప్రార్ధించగా నారాయణుడు వామన రూపము ధరించి కశ్యపుని ఇంట పుట్టెను. వామనుడు పెరిగి పెద్దవాడు అయిన తరువాత ఉపనయనము చేసిన తదుపరి బలి చక్రవర్తి  వద్దకు వెళ్లి మూడు అడుగుల నేల అడిగి ఆతనిని పాతాళమునకు తొక్కి తన సోదరులను విడిపించి తల్లి కోర్కె తీర్చెను.
 ఒకరోజున కశ్యపుడు కద్రువ సంసార సుఖమున ఉండగా , ఆ సమయముననే అదితికి కూడా భర్తతో గడపవలెను అని కోరిక కలగగా  నూతన వస్త్రములు ధరించి కశ్యపుని ఆశ్రమమునకు వెళ్ళెను.అక్కడ కశ్యపుని కద్రువను చూసి కోపముతో మీరిద్దరూ నరులుగా జన్మింపుము అని శపించెను.అందువలననే కశ్యపుడు వాసుదేవునిగా కద్రువ దేవకిగా జన్మించెను. వారిద్దరి కి శ్రీకృష్ణుడు జన్మించెను.కశ్యపునకు ఇచ్చిన వరము వలన విష్ణుమూర్తి ఇక్కడ కృష్ణుడిగానూ, తరువాత జన్మయందు దశరధుడు, కౌసల్యలుగా కశ్యపుడు కద్రువ జన్మించగా శ్రీ రామునిగా విష్ణుమూర్తి వారికి జన్మించెను ఈ విధముగా వామనుడు, శ్రీకృష్ణుడు,శ్రీరామునిగా పుట్టి విష్ణుమూర్తి కశ్యపుని కోర్కె నెరవేర్చెను. 
ఒకనాడు కశ్యపుడు సముద్రుని అనుమతితో ఆయన హోమధేనువులను తీసుకొని వెళ్లి పెంచుచుండెను.తరువాత కొంతకాలమునకు సముద్రుడు వచ్చి తన గోవులను ఇవ్వుమని అడుగగా కశ్యపుడు అందులకు సిద్ధపడగా ఆయన భార్య అగు అదితి వద్దు అని వారించెను.కశ్యపుడు తిరిగి ఇచ్చుటకు నిరాకరించెను సముద్రుడు వెళ్లి బ్రహ్మతో చెప్పగా ఆయన ఏమీ చేయలేను అని చెప్పెను.అప్పుడు సముద్రుడు కోపించి కశ్యపుని గోవుల కాపరిగా పుట్టామని శపించెను.అందువలననే కశ్యపుడు వసుదేవునిగా పుట్టి శ్రీ కృష్ణునకు జన్మనిచ్చెను.
కశ్యపుని భార్యలలో దితి,దనువు ఒకప్పుడు తమ కుమారులు దేవతల చేతిలో మరణించి రని.విచారముగా ఉండెను.అప్పుడు కశ్యపుడు వారిని ఓదార్చి పురాతన కర్మలు అనుభవించక తప్పదు.మీ కుమారులు దయాధర్మములు పాటించలేదు.అందువలన వారు మరణించిరి.మీరు వారి కొరకు విచారించవద్దు.విచారము సత్య ధర్మములను నశింప చేయును.ధర్మ క్షీణము వలన పుణ్యము నశించును.పుణ్యము నశించుటయే సర్వ అనర్ధములకు కారణము.. అందువలననే ఋషులు సంసారము చేయక ఘోరతపములు చేయుదురు. నిత్యుడు,నిర్వికారుడు,నిర్గుణుడు అగు పరమాత్మ మాయాశక్తి వలన పంచ తన్మాత్రలు,పంచభూతములు పుట్టినవి.వానివలన స్థూల శరీరములు పుట్టినవి, జ్ఞానేంద్రియ ప్రాణ పంచకములు, మనోబుద్ధులు పుట్టినవి. ధర్మము,శరీరము,సత్యము,హృదయము అగు విష్ణుమూర్తిని పూజించి ,భజనలు చేసి ఆ కీర్తన స్మరించుచూ పూజావందనములతో జీవుడు జీవత్వ భావము విడిచి పరమాత్మలో ఐక్యము కాగలడుఅని వారికి వివరించి తాను తపోవనమునకు వెళ్ళెను.
కశ్యప స్మృతి ,లేక కశ్యప ధర్మ సూత్రములు అను పేర ధర్మ శాస్త్రము ఉన్నది అని పెద్దలు చెప్పి యుంటిరి. అగ్ని సాక్షిగా వివాహము చేసుకొనకుండా ఓక స్త్రీ ని ఇంటి యందు ఉంచుకొనిన ఆ స్త్రీ భార్య కాజాలదు. ఆమె దైవ కార్యములకు గాని,పితృ కార్యములకు గాని పనికిరాదు అని కశ్యపుడు చెప్పిన శ్లోకమును బోధాయనుడు చెప్పెను.  కశ్యప మహర్షి క్షమా గుణములను ప్రశంసించుచూ  తెలిపినదే కశ్యపగీతి అను పేరు. వేదములు,యజ్ఞములు,శౌచము,సత్యము,విద్య,ధర్మము,సచారాచరమయిన జగము అంతయూ ఈ క్షమ యందె నిలచినవి.
(కశ్యపగీతి)
       క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా వేదా క్షమా శ్రుతమ్
      య ఏతదేవం  జానాతి న సర్వం క్షంతు మర్హతి ? ll
       క్షమా బ్రహ్మ క్షమా సత్యం క్షమా భూతం చ భావి చ 
       క్షమా తపః క్షమా శౌచం క్షమ యేదం ద్రుతమ్ జగత్ ll
       అతియజ్ఞవిదాన్ లోకాన్ క్షమిణః ప్రాప్నువంతి చ 
       అతిబ్రహ్మవిధాం లోకా నతి చాపి తపస్వినామ్ ll
       అన్యేవై యజుషాం లోకాః  కర్మణామపరే తధా
       క్షమావంతాం  బ్రహ్మ  లోకే లోకాః పరమపూజితాః ll
       క్షమా తేజస్వినాం  తేజః క్షమా బ్రహ్మ తపస్వినామ్
       క్షమా  సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా శమః  ll
క్షమ అనగా ఇతరులను క్షమించుట మాత్రమే కాదు,తనకు వచ్చిన కష్టములను కూడా భరించుట అని అర్ధము. తనకు ఎవరి వలనో ఆపద కలిగినది అని అనుకొనక తన కర్మ ఫలముననే కలిగినది అని అనుకొనుటయే మానవ ధర్మము. ఎవరి కర్మ వారు అనుభవించుచున్నారు అని జ్ఞానము కలిగిన మనము ఇతరుల వలన ఏదయినా ఆపద సంభవించినప్పుడు చూపిన క్షమా గుణమే మన కర్మలను కరిగించును 

లోకా సమస్తా సుఖినోభావంతు !
***

1 comment:


  1. చాాల ఓపికగా వివరముగా ఇస్తున్నావు. పూర్ణన్నా. అభినందనలు.

    ReplyDelete

Pages