సుబ్బుమామయ్య కబుర్లు!
మంచి అలవాట్లు
పిల్లలూ ఈనెల మిమ్మల్నో ప్రశ్న అడుగుతానర్రా! అదేమిటంటే..మీలో ఎంతమంది నేనడగంగానే స్కేల్, పెన్సిలు, ఎరేసర్, షార్ప్ నర్ తెచ్చి చూపిస్తారు? అలా చూపించ గలిగితే మీరు మంచి అలవాట్లు ఉన్న పిల్లలన్నమాట.
నాకు తెలిసి పిల్లలందరూ స్కూళ్లు ఓపెన్ అవడానికి ముందే పుస్తకాలకి చక్కగా బ్రౌన్ కలర్ అట్టలేసుకుని, క్లుప్తంగా పేరు, తరగతి, స్కూలు పేరు, సబ్జెక్ట్ మొదలైన విషయాలున్న లేబుల్స్ అట్టలమీద అంటించుకుని బ్యాగులో నీట్ గా సర్దుకుని ఒకపక్క కంపాస్ బాక్స్, మరో పక్క టిఫిన్, వాటర్ బాటిల్ అందంగా పెట్టుకుంటారు. స్కూళ్లు ఓపెన్ అయ్యాక కొత్త యూనిఫామ్ తో బ్యాగ్ భుజాన వేసుకుని గర్వంగా స్కూళ్లోకి అడుగుపెడతారు.
కొంతకాలానికి కొంతమంది పిల్లల దగ్గర పుస్తకాలు అట్టలూడిపోయి, కంపాస్ బాక్స్ లోని వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి. అడగంగానే ఏదైనా వెతక్కుండా ఇవ్వలేరు.
మంచి పిల్లలవెప్పుడూ మంచి అలవాట్లే. చదువునిచ్చే పుస్తకాలు కదా..సాక్షాత్తు చదువుల తల్లి సరస్వతీదేవిని భక్తిగా చూసినట్టు చూసుకుంటారు. ఒకవేళ పుస్తకాల అట్టలు చిరిగి పోయినా అమ్మానాన్నలకు చెప్పి మార్పించుకుంటారు. కంపాస్ బాక్స్ లోని ఐటమ్స్ తో పని అయిపోగానే మళ్లీ చక్కగా సర్దుకుంటారు. ఇలా ఏ ఒక్కరోజో కాదు. సంవత్సరాంతపు (ఫైనల్) పరీక్షలు పూర్తయ్యేవరకు అలాగే నీట్ గా ఉంచుకుంటారు. పరీక్షలయిపోయాక ఎవరికన్నా ఆ పుస్తకాలిచ్చినా..వాళ్లు శ్రద్ధగా కళ్లకద్దుకుని తీసుకుంటారు. చదువంటే అంత శ్రద్ధ ఉండాలి మరి. చక్కగా పుస్తకాలతో అమర్చి ఉన్న మన పుస్తకాల బ్యాగ్ ను చూస్తే మనకే చదువంటే ఆసక్తి కలుగుతుంది. బ్యాగ్ లు చిరిగిపోయి, పుస్తకాలకి వేసిన అట్టలు నలిగిపోయి, కంపాస్ లో విరిగిపోయిన పరికరాలు ఉంటే మనకి మాత్రం చదువు మీద ఇంట్రస్ట్ ఎలా వస్తుంది?
ఇహ నుంచి మనం మన స్కూల్ బ్యాగ్ ను చక్కగా ఉంచుకుందాం. సరేనా? పరీక్షలయిపోంగానే మీ బ్యాగ్ ఎలా ఉందో ఈ మామయ్యకి చెప్పడం మర్చిపోకండే!
ఉంటానర్రా!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు.
No comments:
Post a Comment