నిజమైన గురువు
- పి.వి.ఆర్. గోపీనాథ్.
అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్లును భరించలేక స్విచ్ ఆఫ్ చేసి, ఓ రెండు నిమిషాలైనా ఆగలేరా అనుకుంటూ విసురుగా తలుపు తీయబోయిన సుజాత బయటనున్న రంగారావును చూసి గతుక్కుమంది. సాధారణంగా స్పెషల్ క్లాసులంటూ రాత్రికి గానీ రాని భర్త అంత త్వరగా లంచి వేళకన్నా ముందే రావడం చూసి తెల్లబోయింది. పైగా ముఖంలో ఎన్నడూ చూడని వింత కాంతి ఆమెకు పూర్తిగా మతి పోయేట్లు చేసింది. గిల్లుకోవడమొక్కటే తరువాయి అనుకుంటూండగానే...
తర్వాత గిల్లుకుందువుగానిలే ముందు నన్ను లోపలకు రానివ్వు అంటూ ఆయన తోసుకువచ్చేసేడు. వస్తూనే చేతిలో ఉన్న పేపరు సోఫాలో పడేసి అక్కడే పడక్కుర్చీలో ఉన్న తాతగారి కాళ్ళకు నమస్కరించేడు. ఈలోగానే పేపరు తీసుకు చూసిన సుజాత నమ్మలేనట్లు కళ్ళు పదే పదే నులుముకుని మరీ చూసింది.
"స్టేట్ బెస్ట్ టీచరు బెజవాడ రంగారావ్"
అడుగునే అయినా మొదటి పేజీలోనే ప్రముఖంగా వచ్చిన ఆ వార్తను ఆనందం పట్టలేక భర్త వంక మెరిసే కళ్ళతో చూస్తూ పైకే చదివేసింది సుజాత ...
"ఎంతైనా వాడు నా..." గతం గుర్తు రావడంతోపాటు తండ్రి కూడా తనవైపు ఇప్పుడేమంటావ్ అననట్లు చూడటంతో వాక్యం పూర్తిచేయ లేకపోయాడతని తండ్రి సుబ్బారావు.
ఆ గతం నిన్న మొన్నటిది కాదు మరి. దాదాపు పాతికేళ్లనాటిదాయె...
***
"వాట్ మిస్టర్ సుబ్బారావ్? నా మిసెస్ దెబ్బలాటకు వచ్చినా మా బామ్మరిదిని కాదని నిన్ను సెక్రటరీని చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావే."
క్లబ్బులో కనిపించిన డాక్టర్ సుబ్బారావును కడిగేశాడు అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ రామారావు.
"పిల్లాడేదో వాగితే ఆయనేమి చేస్తాడండీ గురూ గారూ? " సముదాయిస్తున్నట్లుగా అన్నప్పటికీ బంధుత్వాల పేరుతో తనకే వదవీ దక్కనివ్వలేదని ప్రెసిడెంటుపై శంకరరావు మనసులో ఒకింత గుర్రు మరి.
"ఓహో మీ బావగారు గనుక తమరి సమర్థనా? "
"బంధుత్వాలు చెల్లవని ప్రెసిడెంటుగారే రుజూ చేసేరుగా"
వ్యంగ్యమో మరొహటో తెలియని రీతిలో ట్రెజరర్ వెంకటేశ్వరరావుగారి ముక్తాయింపు.
అసలంతకీ ఏమయిందో చెప్పరాదుటండీ...కాస్త వినయమూ, విసురూ కూడా ధ్వనించింది మరో డాక్టర్ గొంతులో. అవతల పార్టీ వేళ మించిపోతున్నది మరి.
నేనెందుకూ చెప్పడం. పక్కనే ఉన్నాడుగా ఆయన స్రీవారి బావగారు ఆయన్నే అడగండి ...రామారావుగారి గొంతులో ఇంకా చల్లారని ఆవేశానికి వ్యంగ్యం పూత.
***
"ఆచార్య దేవో భవ..!"
కంగు మన్నది సుబ్బారావు గొంతు. అవి అది ఓ పేరున్న పాఠశాలలో వక్తృత్వ పోటీ వేదిక. స్కూలు విడవబోతున్న విద్యార్థులు తమ భవిష్యత్ప్రణాళికలపై ప్రసంగించాల్సి ఉంది.
"అవును. నేను ఉపాధ్యాయుడినే కాదలిచాను. సమాజానికి ఉపాధ్యాయులకంటే మిన్నయైన సేవలిందించగలవారుంటారనుకోను. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు ... ఇలా ఏ వృత్తిని తీసుకున్నా చివరకు ఉపాద్యాయ వృత్తినే తీసుకున్నా వీరందరినీ తయారు చేసేది మాత్రం ఉపాధ్యాయులే కదా. వైద్యులను నారాయణుడితో పోల్చారు నిజమే. కానీ గురువులను విష్ణువుతోపాటూ పరమేష్టితోనూ, పరమ శివునితో కూడా సమానం చేశారనేది మనం మరువ గలమా. ఒక వైద్యుని తప్పుతో అప్పటికి ఒక ప్రాణమే పోతుంది. కానీ, అదే ఉపాద్యాయుడు తప్పు నేర్పితే.. లేదా తప్పు దారిన నడిస్తే.... అందుకే నేను ఎప్పటికీ ఉపాద్యాయ వృత్తిని మించినది లేదనుకుంటాను..తప్పుగా మాట్లాడి ఉంటే ఏమీ అనుకోవద్దనీ మిమ్మల్ని కోరుకుంటాను."
ఇలా ఐదు నిముషాలపాటు ఉపమానాలు, ఉదాహరణలతో సాగిన ఆ ప్రసంగం సారాంసం ఇదే. వేదికపై ఆ స్కూలు హెడ్మాస్టరూ, తెలుగు పండితుడూ ఉన్నప్పటికీ న్యాయ నిర్ణేతలలో మాత్రం డాక్టర్ రామారావు గారితోపాటు ఓ చీఫ్ ఇంజనీరుగారూ, మరో న్యాయమూర్తిగారే ఉన్నారు. బహుశా అందుకేనేమో అతనికి బహుమతి ఏదీ రాలేదు. అది విషయాంతరం. కానీ, రావసలసిన స్పందన బానే వచ్చింది. డాక్టర్స్ క్లబ్బులోనే కాదు, అతని ఇంట్లో కూడా !
ఇంటికి వస్తూనే అసలే మందుమీదున్నాడేమో మంచంపై ఆదమరిచి నిద్రపోతున్న కొడుకుని లేపి మరీ చావగొట్ట సాగాడు.
వెధవా. పగలూ రాత్రీ తేడా లేకుండా ఆస్పత్రిలో ఛస్తూ చదివిస్తున్నది ఇందుకా. మీ మామ చెప్పబట్టిగానీ లేకపోతే ఆస్పత్రి నుంచి నేరుగా సన్యాసులలో కలిసిపోయేవాడిని. అప్పుడే తెలిసి వచ్చేది నీకూ, నీ తాతకూ కూడా...
తన ప్రస్తావన రాగానే కొత ఊహించీ, కొంత గ్రహించలేకా ఏం జరిగిందో అనుకుంటూ పెద్దాయ కామేశ్వరరావు గారూ లేచి వచ్చారు. వెనకే ఆయన భార్యా, కోడలు లక్ష్మీనూ.
కొడుకును స్థిమితంగా కూర్చోమని చెప్పి కాసిన్ని మజ్జిగ ఇచ్చి చల్లబరచి సంగతేమిటని వాకబు చేసింది సుబ్బారావు తల్లి. జరిగిందంతా చెప్పి మళ్లీ కొడుకుమీదకు పోబోయేడు. వెంటనే కామేశ్వరరావుగారే అడ్డుకున్నారు. ఒక్కడే నలుసు వాడు. కోరినది చదివించుకో. వాడేమీ చదువాపేసి బిజినెస్ చేస్తాననడంలేదే. సర్ది చెప్పబోయాడు.
గఁయ్ మని లేచాడు సుబ్బారావు. “మీరు ఊరుకోండి నాన్నా. ఒక్కడే కాబట్టే నా ప్రాక్టీసు అందుకుంటాడేమోనని ఆశ. అదీ తప్పేనా.?”
“ఒరేయ్. నేను గ్రూప్ ఫోర్ గుమాస్తానే అయినా నువ్వడిగావు కదాని అప్పులు చేసి మరీ చదివించా. మరిచిపోయావేంరా. నీ చదువు వల్లనే కదా మనం ఆ ఉప్పలపాడులో డాబా తెగనమ్ముకోవాల్సి వచ్చిందీ.” పిత్రార్జితం పోయిందన్న బాధ ఆ పెద్దాయనను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎక్కడా చేయి జాపని గుమాస్తా అన పేరు తప్ప ప్రమోషన్లకు నోచుకోని అల్పజీవి మరి.
“ఆం. చెప్పిచ్చారు లెండి మహా. అప్పుడెంత రాద్ధాంతమయిందో మీరు కూడా మరిస్తే ఎలా?”
అదీ నిజమే. కామేస్వరరావుగారు అంతంత చదువులు చెప్పించలేననీ కావాలంటే టీచరుగా చేరి మరింత మంచి పేరు సంపాదించుకోవచ్చనీ చెప్పి చూసేరు. కానీ, తన భార్యా, ఆమె తరఫువారు కూడా దెబ్బలాటకు రావడంతో విధిలేక సరేనన్నాడు. అదృష్టవశాత్తూ సుబ్బారావూ మెరిట్ స్టూడెంటే కావడంతో స్కాలర్ షిప్పులు ఆదుకున్నాయి. అయినా చివరలో ఇల్లు వదులుకోక తప్పింది కాదంటే అది విషయాంతరం.
***
అప్పటికి గొడవ సర్దుమణిగినట్లనిపించినా తిరిగి రెండేళ్లకే మొదలు. టెన్తులో తొంభై శాతం సాధించగానే తండ్రి ఇంటరులో బుద్ధిగా బైపీసి తీసుకోమన్నాడు సుబ్బారావు. రంగారావు కూడా అలాగే అన్నాడు. కొడుకులో మార్పు వచ్చిందనుకున్నాడా తండ్రి. తండ్రి పలుకుబడీ, తమ స్తోమతా చూసి వాడే దిగివచ్చాడనుకుని మురిసింది ఆ తల్లి. అది తాత చెప్పిన పాఠం అని వారుభయులూ గుర్తించలేదు. నిజానికి టెన్తులోనేగాక, ఇంటరులో ఉన్నప్పుడూ కంబైన్డ్ స్టడీస్ పేరిట ఓ మోస్తరు ఉపాధ్యాయునిగానే వ్యవహరించాడతను. కాకపోతే ఆ విషయం తాతకు సైతం తెలియనివ్వలేదంతే !
తండ్రి ఎన్ని వేలు కట్టి కోచింగ్ ఇప్పించినా రంగారావు మాత్రం ఎంసెట్ ర్యంకు సాదించలేకపోయాడు. అలా అనుకునేకంటే సాధించ దలచుకోలేదు కాబట్టే అనుకుంటే సబబేమో.
సుబ్బారావుగారు డొనషనే కట్టి అయినా చెన్నై పంపుతానన్నాడు. అప్పుడే మొద్దలయింది రగడ. తనకు సక్తి లేదనీ బీయస్సీ బియ్యీడీయే చేస్తానని దాదాపు తండ్రి కాళ్ళుపట్టుకున్నంత చేశాడు రంగారావు. తల్లి ఎటూ చెప్పలేక గుడ్ల నీరు కుక్కుకుంటూ కూర్చుంది. వారం రోజులపాటు ఆ ఇంట్లో ఎవరూ ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోలేదంటే అతిశయోక్తి కాదేమో. ఒక దశలో కొడుకు పట్టుదల ఎరిగి ఉన్న కామేశ్వరరావుగానే ఓ మెట్టు దిగి వచ్చి మనవడికి నచ్చ జెప్పబోయాడు. కానీ అతనూ ఆ తండ్రి కొడుకేనాయె. తరం మారి, పరిసరాలూ మారుతూండడంతో తాతలోని సర్దుకుపోయే గుణం ఏ ఒక్కరికీ రాలేదు మరి.
***
అప్పు చేయడానికి తల్లీ, భార్యా కూడా అంగీకరించకపోవడంతో చేసేది లేక పళ్ళు నూరుకుంటూనే కొడుక్కి బియ్యెస్సీ ఫీజు కట్టి వచ్చాడు సుబ్బారావు. అయితే మొదటి సంవత్సరం గడిచి రెండో సంవత్సరం మొదలయిందో లేదో చాలా పెద్ద యుద్ధమే జరిగిందా యింట్లో.
ఆస్పత్రిలో ఆపరేషన్ విజయవంతంగా చేయించుకున్న ఓ పేషెంటు తాలూకు వ్యక్తులు సుబ్బారావును ఆకసానికి ఎత్తేశారు. అయితే అక్కడే ఉన్న మరో డాక్టరుగారు ప్రశంసో, వెటకారమో తెలియనట్లుగా..
“మరేండి. ఇంత పెద్ద డాక్టరుగారి అబ్బాయీ తోటి పిల్లలకూ, చిన్న పిల్లలకూ కూడా ట్యూషన్లు చెపుతుంటాడు. బాగా చెప్తాడనీ పేరు కదా..” అన్నాడు. దాంతో మానుతోందనుకున్న పుండు మళ్లీ రేగింది.
తాను ఇల్లు చేరినా, రాత్రి పదవుతున్నా రంగారావు ఇల్లు చేరకపోవడంతో ఆజ్యం తోడయింది. కాసేపు అతనిని వెనకేసుకు వస్తున్నారంటూ తల్లి దండ్రులనూ, తనను గట్టిగా బలపరచనందుకు భార్యనూ తిట్టుకుని మరీ పడుకున్నాడు. ఓ రాత్రివేళ కొడుకు ఇల్లు చేరడం తెలిసినా గదిలోంచి బయటకు రాలేదు. అతనికి తెలిసీ బయటకు రాలేదన్న సంగతి గ్రహించిన వీరు హమ్మయ్య సర్దుకున్నాడు లెమ్మనుకున్నారు. కానీ ప్రళయమే ముంచుకు రానున్నదనుకోలేదు.
తెల్లారి లేస్తూనే హాల్లో అందరి ఎదుటా కొడుకుని పిలిచి ...
“తక్షణం నీ బట్టలూ, పుస్తకాలూ తీసుకు పో. మళ్లీ నా కంట పడవద్దు. నా కొడుకుననీ చెప్పుకోవద్దు. ట్యూషన్లే చెప్పుకుంటావే వారాలే చేసుకుంటావో నాకు తెలియదు. కావాలంటే ఈ పది వేలూ తీసుకో ఖర్చులకుంటాయేమో...” అనేసి నోట్ల కట్ట చేతిలో పెట్టేసి మరో మాటకు ఆస్కారమివ్వకుండా బయటకు వెల్లిపోయాడు.
తర్వాత తల్లీ, బామ్మా, చివరకు తాత కూడా తిట్టిపోసేరు. అలాంటి పని ఎందుకు చేస్తున్నావని. తాను ట్యూషన్లు చెప్పడం లేదనీ కేవలం తెలియనిది అడిగితే చెప్తున్నాననీ వివరించాడు. వారు అర్థం చేసుకున్నా ఇప్పుడిక ఏం చేయాలో తోచక తలలు పట్టుక్కూచున్నారంతా. తాత కామేశ్వరరావుగారే ముందుగా తేరుకున్నాడు. కాలేజీకి సెలవు పెట్టు, మీ నాన్న వచ్చాక మాటాడతా అన్నారాయన. అన్నారేగానీ తనకూ అనుమానమే. కొడుకు తత్త్వం తనకే బాగా తెలుసు మరి.
అయితే, సుబ్బారావు కూడా తన వైఖరిలో ఒక మెట్టు దిగి వచ్చాడు. డబ్బులు పంపుతాననీ మిగిలిన షరతులు మాత్రం అంతేననీ అన్నాడు. అంటే తాను డాక్టర్ సుబ్బారావుగారి కొడుకుగా చెప్పుకోకూడదు. ఇంట్లో తనకు స్థానం లేదు. అక్కడికి అంతే చాలుననుకుని తనకు బాగా తెలిసిన మిత్రుడి గదిలో చేరాడు. వారాలు, నెలలై, ఏళ్ళే గడిచినా సుబ్బారావులో మార్పు రాలేదు. అంతస్తుతోపాటూ పట్టుదలా పెరగసాగింది.
***
కాలం ఒక్కలా ఎప్పుడూ డదు కదా.. అటు రంగారావు కిందా మీదా పడి బియ్యీడీ, పీజీ కూడా చేసి పక్క ఊరిలోనే సైన్స్ టీచరుగా ఉద్యోగం సంపాదించాడు. స్కూల్లోనూ, సెలవు దినాలలో కూడా అడిగిన పిల్లలందరికీ ఉచితంగా శిక్షణ ఇస్తూ దేవుడు మాస్టారైనాడు. తల్లి తండ్రులు పోరు పెట్టడం, భార్య కూడా సున్నితంగా మందలిస్తూండడంతో తప్పని సరై సుబ్బారావుగారే దగ్గరుండి కొడుకు పెళ్ళి అయిందనిపించాడు. కోడలూ టిచరే. పైగా ఇది ప్రేమ వివాహం కూడా కావడంతో ఆయన మరోసారి తాను ఓడిపోవాల్సి వచ్చిందంటూ మధన పడ్డాడు. కానీ, చేసేదేమీ లేక మనసులోనే దిగమింగుకున్నాడు.
సుబ్బారావుగారు మజిలీలన్నీ దాటి మిత్రులతో కలసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరాడు. అక్కడా తన ప్రతిభ చూపి డిప్యూటీ సూపరింటెండెంటైనాడు. కానీ.....ఇక్కడే విధి కాటేసింది. ఒక మెడికో లీగల్ కేసులో ఏదో ప్రలోభానికి లొంగి తప్పుడు నివేదిక ఇవ్వాల్సి వచ్చింది. దాంతో అప్పటికే ఆయన ఉన్నతిని జీర్ణించుకోలేక సమయం కోసం కాచుకు కూర్చున్న ఓ డాక్టరు అసలు విషయం ప్రత్యర్థికి చేరవేశాడు. ఫలితంగా సుబ్బారావు పదవీ, పరువూ రెండూ పోయాయి. ఆ దిగులుతో మరి ఆ ఊర్లో ఉండలేక ఇల్లూ వాకిలీ కూడా తెగనమ్ముకుని ఏదో పల్లెటూరుకు వెళ్ళిపోయాడు.
అయితే దైవం మనం అనుకున్నట్లు అన్నీ కష్టాలే కలిగించడు కదా. ఇక్కడ తండ్రి పరిస్థితి ఇది కాగా, అటు రంగారావు తన మంచి తనంతో ప్యానెల్ హెడ్మాస్టరైనాడు. భార్య సుజాత కూడా పీజీ చేయడంతో మంచి హోదా పొందిందా స్కూలులోనే. సొంత ఇల్లూ ఏర్పాటయింది. వెంటనే తండ్రి దగ్గరకు చేరి గట్టిగా చెప్పి తల్లి దండ్రులనూ, తాతా బామ్మలనూ కూడా తనతో తీసుకుపోయాడు. మొదట తాము రానే రామని వాదించి, తర్వాత ఏ ముఖం పెట్టుకు రావాలని వాపోయిన సుబ్బారావు దంపతులు కామేశ్వరరావు గారు నచ్చజెప్పడంతో సర్దుకుపోక తప్పలేదు.
***
వార్త వింటూనే బిల బిలమంటూ వచ్చేశారు విలేఖరులూ, టీవీ ఛానెల్స్ వారూ. అందరికీ ఒక మాట.
“నిజమేనండీ. సాధారణంగా ఎవరికీ యాభై ఏళ్ళు దాటినా పట్టని అదృష్టం నాకు ఇంత త్వరగా దక్కిందంటే ప్రధాన కారకులు మా నాన్నగారు డాక్టర్ సుబ్బారావు గారే. అవును వారిలోని పట్టుదలే నాకూ వచ్చింది. అనుకున్నది సాధించాను.!”
ఇది విన్న సుబ్బారావు కొద్దిగా ఇబ్బందిగా పీలైనా కొడుకు మాటలలో అంతరార్తం గ్రహించి ఆనందించాడు. ఇక రంగారావు తాతగారి సంగతి చెప్పనక్కర్లేదు కదా...
***
No comments:
Post a Comment