ప్రేమతో నీ ఋషి – 30 - అచ్చంగా తెలుగు
ప్రేమతో నీ ఋషి30
-       యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ  మృణాల్ శవం కనిపిస్తుంది. మృణాల్ నకిలీ పెయింటింగ్స్ తయారుచేసే వర్క్ షాప్ ను ఎక్కడ ఏర్పరిచాడో ఋషి పరిశోధిస్తూ, తన మిత్రుడైన ఫోరెన్సిక్ డాక్టర్ వశిష్ట ఆచార్య చేసిచ్చిన మహేంద్ర వేలిముద్రల నకలుతో ఆ రహస్య గదిని తెరుస్తాడు. ఇక చదవండి...)

ఆ గది చాలా చిన్నగా ఉంది. లోపలికి మెట్లు ఉన్నాయి. వాళ్ళు ఆ మెట్లగుండా వెళ్ళగా, భూగర్భంలో ఉన్న ఒక పెద్ద హాల్ వచ్చింది. అది పైనున్న హాల్ కంటే కూడా పెద్దగా ఉంది.
ఆ హాల్ నిండా ఎంత పెద్ద పోర్ట్రైట్ నయినా, క్షణాల్లో స్కాన్ చేసి, నకలును సృష్టించగల పరికరాలు, తయారుచేసిన నకిలీ చిత్రాలు ఉన్నాయి. తాను పనిచేస్తున్న ఆఫీస్ లో ఇంత పెద్ద మోసం జరిగేందుకు తగినంత సాంకేతికత దాగి ఉందని, స్నిగ్ధ నమ్మలేకపోయింది. అక్కడున్న ప్రతి పరికరం, ప్రతి కాగితంలో ఏముందో తెలుసుకునేందుకు స్నిగ్ధ ఆ హాల్ లోని ఒక మూల నుంచి మరొక మూలకు పరిగెత్తి, చూడసాగింది. అక్కడున్న మొత్తం వ్యవస్థకు అలవాటు పడేందుకు వారక్కడ అరగంట గడిపారు.
అక్కడున్న కంప్యూటర్ లో అన్ని పోర్ట్రైట్ ల డేటాబేస్ ఉంది. అందులో ఏ చిత్రాన్ని ఎక్కడనుంచి కొన్నదీ, దాని ప్రమాణ పత్రాల వివరాలు, అన్నీ ఉన్నాయి. దీనికి తోడుగా, ఆ నకిలీ చిత్రాలను కొనబోయే వారి వివరాలు కూడా ఉన్నాయి.
“అంటే, మేము మ్యూజియం కోసం కొన్న చిత్రాల నకిలీ ప్రింట్ అవుట్లు మృణాల్ తీసేవాడన్నమాట! ఇతరులకు ఆ నకిలీ చిత్రాలను అతను అమ్మి ఉండాలి. ఈ రకంగా అతను అన్ని పోర్ట్రైట్లకు కలిపి, కనీసం 400-500 కోట్లు సంపాదించి ఉండాలి.” తన మోచేతి క్రిందే ఇంత పెద్ద మోసం జరగడాన్ని స్నిగ్ధ ఊహించుకోలేకపోయింది.
ఋషి అదనపు సమాచారం కోసం అక్కడున్న పత్రాలు, రిసీట్లు చూడసాగాడు.స్నిగ్ధ దృష్టి ఆ గదిలో ఒక మూలన పెట్టి ఉన్న విశ్వామిత్ర పోర్ట్రైట్ మీద పడింది. ఆమె దాన్ని గమనించగానే వెంటనే “ఋషి, మూడో చిత్రం ఇక్కడుంది చూడు, “ అంటూ అరిచింది.
ఇద్దరూ వెంటనే అటు దూకి, దాన్ని పరిశీలించారు. అప్పటికే మరో రెండు చోట్ల ఆ చిత్రాన్ని చూసి ఉండడం వల్ల, ఇదే మూడోదని వారు తేలిగ్గా అర్ధం చేసుకోగలిగారు. కాని, వేరే ఎవరు చూసినా, అదే అసలు విశ్వామిత్ర పెయింటింగ్ అనుకుంటారు. !
“అంటే, గిల్సీ పెయింటింగ్ సృష్టించేందుకు మృణాల్ వాడిన చిత్రం ఇదేనన్నమాట !దాన్ని సృష్టించి, అతను క్రూయిస్ ఆక్షన్ హౌస్ కు అమ్మాడన్నమాట! నకిలీ ప్రమాణ పత్రాలను, నకిలీ అమ్మకాలను సృష్టించేందుకు ఇది అతను చేసిన ప్రయత్నం కావచ్చు. అక్కడినుంచి, ఇది ఇటలీ లో బెనెడిట్టో వద్దకు చేరేదాకా, అతను దీన్ని ఫాలో అయ్యాడన్నమాట ! బెనెడిట్టో నుంచి అతను దీన్ని మళ్ళీ కొని, ఇది ఆర్ట్ మ్యుజియం కోసం కొన్న ప్రామాణికమైన పెయింటింగ్ లాగా కనబడేలా చేసాడన్నమాట!” ఇదంతా ఎలా జరిగి ఉంటుందో ఋషి ఊహించి చెప్పసాగాడు.
“కానీ, వీళ్ళకు ఈ విశ్వామిత్ర పోర్ట్రైట్ ఎలా దొరికింది? నిజమైన, అసలైన పెయింటింగ్ గార్డెన్ హోటల్ లోనే ఉంది కదా!’ వారు చూస్తున్న పెయింటింగ్ వైపే చూస్తూ, అడిగింది స్నిగ్ధ. ఇప్పటికీ ఆమెకు రెండు విషయాలు అర్ధం కావట్లేదు. మొదటిది - అసలు ఈ పెయింటింగ్ ఎక్కడనుంచి వచ్చింది?రెండవది – తాము మ్యూజియం కోసం కొన్న తర్వాతే, మృణాల్ పెయింటింగ్స్ బయటివారికి అమ్మేందుకు కాపీలు తియ్యగా, ఈ విశ్వామిత్ర చిత్రం కోనేముందే కాపీ ఎందుకు తీసినట్టు?
తన అనుమానాలు సరైనవేనా అని తెలుసుకునేందుకు ఆమె ఋషి వైపు తిరిగింది.
ఋషి పోర్ట్రైట్ ల అమ్మకాల కాంట్రాక్టులు పరిశీలించసాగాడు. అన్ని అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బును వేసేందుకు ఒకే ఎకౌంటు ఇచ్చారు. “స్నిగ్ధ, మరో విషయం తెలిసింది. ఇక్కడ అమ్మకాల డబ్బును జమచేసేందుకు ఇచ్చిన ఖాతా అప్సరది !” అన్నాడు ఋషి ఆశ్చర్యంగా.
ఇప్పుడు వారు పూర్తి గందరగోళంలో పడ్డారు. అంటే ఈ మోసంలో అప్సరకు కూడా భాగం ఉందా? ఈ కారణం వల్లే అప్సర మృణాల్ తో ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండేదా? ఇందువల్లనే మృణాల్ హైదరాబాద్ కు పెయింటింగ్స్ పంపడంలో ఆలస్యం చేసేవాడా?స్నిగ్ధ మనసంతా జవాబుల కంటే, ప్రశ్నలతోనే నిండిపోయింది.
వెంటనే ఆమె ఋషి వద్దకు వెళ్లి, “ఋషి, ఇంక మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవడం మంచిదేమో. గడిచే ప్రతి క్షణం నాలో భయాన్ని నింపుతోంది. ఇది కేవలం ఒక్క పోర్ట్రైట్ కు సంబంధించిన అంశం కాదు. ఇదొక పెద్ద ఎత్తున జరిగే మోసంలా ఉంది. అందుకే మనం ఇదంతా చేస్తున్నామని అప్సరకు, మృణాల్ కు తెలియనివ్వవద్దని మహేంద్ర చెప్పారేమో. ఇక్కడినుంచి బయటకు వెళ్లి, మనం చూసినదంతా మహేంద్రకు చెప్దాం పద,” అంది. ఋషి కూడా అంగీకరించాడు. అక్కడున్న వాటిని పరిశీలించిన కొద్దీ, కొన్ని అనుకోని ప్రమాదాలు కొనితెచ్చుకునే అవకాశాలు పెరుగుతాయని అతనికి అనిపించింది.
కనీసం ఆ మూడో పెయింటింగ్ ను కళ్ళారా చూడగలిగినందుకు అతను తృప్తి చెందాడు. అదే పెయింటింగ్ ను చూస్తూ అతను మరికొద్ది క్షణాలు గడిపాడు. స్నిగ్ధ మరోసారి గుర్తు చెయ్యగానే, అతను ఆమెతో కలిసి, మెట్ల దిశగా ఆమెతో కలిసి వెళ్ళాడు. వాళ్ళు మెట్లెక్కుతూ ఉండగా, క్రింద ఉన్న బేస్మెంట్ లోని టెలిఫోన్ రింగ్ అవసాగింది. ఋషి ఆ ఫోన్ తీసేందుకు ఒక్క క్షణం ఆగాడు. స్నిగ్ధ వద్దని వారించింది. కాని, ఋషి ఆమె చెప్పిన మాట వినకుండా క్రిందకు వెళ్లి, ఫోన్ తీసాడు.
“హలో, మృణాల్, గుడ్ ఈవెనింగ్. ఎలా ఉన్నావు?” అవతలి వ్యక్తి మృణాల్ కు అత్యంత ఆప్తుడిలా ఉన్నాడు.
ఋషి మొదట మౌనంగా ఉన్నా, తర్వాత ఇలా అన్నాడు, ‘మిష్టర్ మృణాల్ ఇప్పుడు అందుబాటులో లేరు. ఆయనకు ఏమైనా చెప్పమంటారా?” చాలా మామూలు స్వరంతో అడిగాడు.
“అలాగా! నేను జెర్మనీ నుంచి అశ్విన్ మెహతా ను మాట్లాడుతున్నాను. రెండు నెలల క్రితం మిష్టర్ మృణాల్ నాకోసం ఒక పోర్ట్రైట్ ను ఏర్పాటు చేసారు. దానికి సంబంధించిన ప్రమాణ పత్రాలు కావాలి. గత కొన్ని వారాలుగా అతన్ని అడుగుతున్నాను. అతను నన్ను తప్పించుకు తిరుగుతున్నాడని నాకు తెలుసు. బహుశా ఇప్పుడీ విషయం నేను నేరుగా అప్సరతోనే చర్చించి, పరిష్కరించుకోవాలేమో. ఇప్పటికే చాలా అతి చేసాడు.” ఇలా అని, అతను ఫోన్ పెట్టేసాడు.
ఋషి కూడా ఫోన్ పెట్టేసి, స్నిగ్ధతో బయలుదేరాడు. తర్వాత చెయ్యవలసిన దానిని నిర్ణయించేముందు తాను, అసంపూర్ణంగా ఉన్న చాలా విషయాలని పరిగణనలోకి తీసుకోవాలి. స్నిగ్ధ కూడా అతన్ని మరే ప్రశ్నలూ అడిగే ధైర్యం చెయ్యలేదు. ఆమె కూడా అంతే గందరగోళంలో ఉంది.
బయటకు వెళ్తూ ఉండగా, అతను స్నిగ్దను ఇలా అడిగాడు,”ఎప్పుడైనా నువ్వు అశ్విన్ మెహతా అనే పేరు విన్నావా?” స్నిగ్ధ వెంటనే గుర్తు చేసుకోలేకపోయింది. కాని, కొద్ది నిముషాల తర్వాత,” నేను బహుశా ఇతని పేరును వేలం రోజున విన్నాను. మనం చివరికి గెలిచే ముందు ఎక్కువ సొమ్మును వేలం పాట పాడింది అతనే.”
ఋషి వెంటనే ఆ గదిలో ఉన్న పత్రాలు పరిశీలించసాగాడు. కొన్ని నిముషాల తర్వాత అశ్విన్ కు అమ్మిన పెయింటింగ్ తాలూకు వివరాలు అతను సేకరించగలిగాడు. వేలం సమయంలో అప్సర కొన్న పోర్ట్రైట్ లలో అది ఒకటి.
ఋషి దాన్నే కాసేపు పరిశీలించి, ఇక తాము బయలుదేరాలని స్నిగ్ధకు సలహా ఇచ్చాడు. సాయంత్రం బాగా ఆలస్యం అవుతోంది.
వారిద్దరూ అక్కడినుంచి బయట పడ్డాకా, ఋషి కార్ నడపసాగాడు. స్నిగ్ధ ఉత్సుకత ఆపుకోలేక,”తర్వాత ఏం చేద్దాం?” అని అడిగింది.
ఋషి చాలా స్పష్టంగా చెప్పాడు, “స్నిగ్ధ మనకు తెలియని వారెవరో మన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. లేదా, వాళ్ళు మనకు తెలిసిన వారూ కావచ్చు. అక్కడ బేస్మెంట్ లో విశ్వామిత్ర అసలు చిత్రం ఒకటి ఉంది. మొదట నేను మృణాల్ ఏవో విచిత్రమైన కారణాల వల్ల ఒక కాపీ సృష్టించి, అమ్మి, మళ్ళీ తనే కొన్నాడని అనుకున్నాను. కాని, నేను దాని గురించి ఆలోచించిన కొద్దీ, అశ్విన్ వద్దనుంచి వచ్చిన కాల్ దృష్ట్యా, ఇది మృణాల్, అప్సర కలిసి ఆడుతున్న నాటకమని తెలుస్తోంది. ఆక్షన్ హౌస్ ల నుండి ఆర్ట్ కల్లెక్టర్స్ నుండి పెయింటింగ్స్ కొనడం, నకళ్ళు సృష్టించడం, వేలం పాటలో అధికంగా పాడిన వారిని టార్గెట్ చేసి అమ్మడం, ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మృణాల్ లేడు కనుక, నేను అప్సర పైనే నా అదృష్టాన్ని పరిశీలించుకుని, ఈ గుట్టు విప్పాలి. కాని, ఇదంతా నీ అనుమతితోనే సుమా !”
“ఋషి, ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు. మనల్ని ఈ ఉచ్చులోంచి బయట పడేసేందుకు నువ్వేమి చేసినా నేను పూర్తిగా సహకరిస్తాను. ఇది మనస్పూర్తిగా చెబుతున్నాను, ఈ విషయంలో అప్సరకు నీపై ఉన్న ఆకర్షణను నువ్వు ఉపయోగించుకోవాలని అనుకున్నా, నేనేం అనుకోను. మనచుట్టూ చీకటి అలముకున్నట్టుగా ఉంది, ఇప్పుడు నాకు మ్యుజియం ప్రాజెక్ట్, మహేంద్ర గౌరవం, నా విశ్వాసనీయత అన్నిటికంటే ముఖ్యం. నీ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళు.”
ఋషి ఆమె చేతిని తీసుకుని, సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు. “స్నిగ్ధ, నన్ను నమ్ము, నువ్విచ్చిన స్వేచ్చను దురుపయోగం చెయ్యను. కాని, మనం ఈ రహస్యాన్ని చేధించి, త్వరలోనే దీని అంతు చూద్దాము. నేను నిన్ను ఇంటివద్ద దింపి, అప్సర ఇంటికి వెళ్తాను.”
ఆ తర్వాత స్నిగ్ధ ఇల్లు చేరేదాకా వారేమీ మాట్లాడలేదు. స్నిగ్ధ కార్ దిగంగానే ఋషి కూడా దిగి, ఆమెను హత్తుకున్నాడు. స్నిగ్ధ ఇంటివైపు బయలుదేరింది.
“ఒక రెండు గంటలు విశ్రాంతి తీసుకో. ఈ లోపుగా తిరిగి వచ్చేస్తాను,” అని ప్రమాణం చేసాడు ఋషి. స్నిగ్ధ మరోమారు అతన్ని హత్తుకుని, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అప్సరను ఒంటరిగా ఋషితో వదలడమనే ఆలోచనే ఆమెకు నచ్చలేదు, కాని ఇప్పుడు మరో మార్గం లేదు!
(సశేషం)



No comments:

Post a Comment

Pages