స్వవాసమా? ప్రవాసమా? - అచ్చంగా తెలుగు
స్వవాసమా? ప్రవాసమా?
శ్రీ రవి భూషణ్ శర్మ కొండూరు 
శ్రీమతి ఇందు కిరణ్ కొండూరు


“ఇదిగో .... ఇంట్లోనే … 8.15 అయింది, ఆ  DMV ఆఫీసు… 8.30 కే Open చేస్తారు, ఎంత దగ్గరయినా ... మంచి ట్రాఫిక్ టైము... ... తమరు... త్వరగా తెమలాలి” అని అరుస్తున్నాడు శ్రీకర్ కొంచెం అసహనంగా. 
“ఆ...  ఆ...  అయింది...  వస్తున్నా” అంటూ హడావిడిగా డ్రెస్సుసర్దుకుంటూ “నా డ్రెస్ బావుందా?” అని అడిగింది శ్రీనిధి.
ఒక్కసారి  BP పెరిగినట్టు,  ... “నా డ్రెస్ బావుందా? అని అడిగే టైమా ఇది? ఇప్పుడు బాగుండ లేదు అంటే ... మళ్ళీ మారుస్తావా?... అసలు ... ఈ రోజు వెళదామా వద్దా?...  ఐనా ... మనం ... మూవికి కాదు కదా... వెళ్ళేది,” అంటూ అరిచాడు కోపంగా శ్రీకర్. 
“ఇందాకటి ... దాకా ... తను FB చూసుకుంటూ ... కూర్చోని ... ఇప్పుడు ... తెగ హడావిడి చేస్తున్నారు...” అని గొణుక్కొని “సరే పదండి” అంది  శ్రీనిధి. 
“ఆ... అప్లికేషనుకి ... కావాల్సిన Proof లన్నీ తీసుకున్నవా? ఎప్పుడూ ... ఏదోకటి ... మర్చిపోవటం ... నీకు అలవాటు” అంటూ అడిగాడు శ్రీకర్,
ఒక సారి తన బాగ్ లోకి చూసి “ఆ ... ఆ...  అన్నీ ... ఉన్నాయి” అంది శ్రీనిధి. 
ఇద్దరూ మొత్తానికి కారు ఎక్కి బయలు దేరారు.
“ఏ .. దేవుడి దయవల్లో ... ఇన్నాళ్ళకి ... డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని.... బుద్ధి పుట్టింది నీకు,  పోనీలే ఇప్పటికైనా ... నా ... దారిలోకి వస్తున్నావు ఆ సంతోషంతో,  నేనే స్వయంగా నిన్ను DMV ఆఫీసుకి తీసుకు వెళదామని ... ఈ రోజు ... సెలవు కూడా తీసుకున్నా... అయినా ... ఈ దేశంలో ... పనులన్నీ ... ఇట్టే... గంటలో అయిపోతాయి, అసలు నన్నడిగితే .... శెలవ అక్కరలేదు... ఏదో నీకు సహకరిద్దామని”, ఘనకార్యం చేసినవాడిలా అన్నాడు శ్రీకర్.
“డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ... మీ దారిలోకి  వచ్చినట్టానా?”  అని తన అందమైన చాపంలాంటి కనుబొమ్మలు పైకి ఎగరవేస్తూ అన్నది శ్రీనిధి.
“ఆ...  మరీ ... అంత...  నిక్కు వద్దులే... ఇన్నేళ్ళ బట్టి (US లో) ఈ దేశంలో వున్నాము... ఇప్పటికి...  ఎన్నిసార్లు చెప్పాను... నువ్వు వింటేగా... నీ ధోరణి ... నీదే కదా” అన్నాడు శ్రీకర్.
“నా ... ఆశ నాది ... అనండి .... ఒప్పుకుంటాను” అన్నది చిరు కోపంతో శ్రీనిధి.
“సరే... ఆశో... ధోరణో... ఏదైనా... అనుకో...  నా మాట... నేను ఎప్పటికైనా ... నెగ్గించు కుంటా” అని స్టైలుగా కన్ను కొట్టాడు శ్రీకర్. 
“ఏమిటో...  ఇప్పుడు ... మన భారతదేశం... స్త్రీ పురుష ... సమానత్వంతో విలసిల్లుతోంది...  అంటే ... ఏమిటో అనుకున్నా... పురుషాధిక్యత చూపె మీలాంటి వారు .... చాలా మంది ... ఈ దేశానికి(US) వచ్చేస్తున్నారన్న మాట,మన దేశ ...పురోభి వృద్ధిని... ఎప్పటికైనా ... చుస్తానన్నాను గా... దానికి ...ఇదే నిదర్శనం ” అంది శ్రీనిధి కొంచెం సరదాగా.
“అవును ... అవును ... నీకొక్కదానికే ... ఈ స్వదేశాభిమానం ఉందిమరి, ఇక్కడ ... వీర తాళ్ళు ... వేసే వాళ్ళు ఎవరూ లేరు... ఈ సారి మీ నాన్న వచ్చి నప్పుడు ... ఇద్దరూ కూర్చోని దేశాభిమానం చాటండి, అదిగో DMV ఆఫీసు వచ్చేసింది తమరు దిగచ్చు” అన్నాడు శ్రీకర్ కొంచెం వెటకారంగా.
“అబ్బా!! నా కంటే ... ఎక్కువ.... ఎన్ని సార్లు ... తలుచుకుంటారో... మా నాన్న గారిని” అని వ్యంగంగా అంటూ, కారు దిగింది శ్రీనిధి.
ఇద్దరూ కారు పార్క్ చేసి చూసేసరికి, DMV ఆఫీసు మెయిన్ గేటు నుంచి రమారమీ పార్కింగు వరకూ జనాలున్నారు.  కొండవీటి చాంతాడు లాంటి క్యూ చూసే సరికీ ... అంతే... ఇద్దరికీ ... ఒక్కసారి... పై ప్రాణాలు పైనే పోయాయి. 
“అదేమిటండీ...  ఈ క్యూలో ... నుంచున్నాము మనం, ఇది ... నో అప్పాయింట్మెంట్ లైను కదా? మీరు ... ఎప్పుడో అప్పాయింట్మెంట్ ... తీసుకున్నానన్నారుగా”  అంది శ్రీనిధి కొంచెం ఆశ్చర్యంగా కొంచెం అనుమానంగా.
శ్రీకర్ ఏమీ మాట్లాడ లేదు. శ్రీకర్ చాలా ఆత్రంగా ఆ లోపలి దాక వెళ్ళొచ్చి “ఈ క్యూ లైన్లో ... లోపల హాలులో షుమారు 60 మంది, బయట మనముందు ఒక 15 మంది,  మొత్తం  75 మంది వరకూ వుండొచ్చు ... బహుశా మనకి చాలా టైము పడుతుంది... ఇప్పుడు చెప్పు ... ఈ దేశం విశేషాలు చెప్పుకోని ... ఏమేమి తిట్టుకున్నారు ... నువ్వూ ... మీ నాన్న” అన్నాడు శ్రీకర్.
“మేమేదో ... చెప్పుకుంటాము గానీ ... అసలు విషయం చెప్పండి ... అప్పాయింట్మెంట్ తీసుకున్నారా లేదా?” అని మాట దాటేస్తున్న శ్రీకర్ ని ఒకటికి నాలుగు సార్లు అడిగింది శ్రీనిధి.
“అంటే...  ట్రై ... చేశాను... ఇంటర్నెట్లో ... అప్పాయింట్మెంట్ ... మూడు నెలలోపు లేవని వచ్చింది, మళ్ళీ నువ్వు మనసు మార్చుకుంటా వని... ఇవాళే అప్పాయింట్మెంట్ తీసుకున్నానని... చెప్పా... అయినా పిల్లల్ని ఇండియా లో అమ్మా  వాళ్ళ దగ్గర దింపి వచ్చాము కదా ఈ సమయాన్ని ఇలా ఉపయోగించు కుందామని ...  అంతే”  అని సన్నగా చెప్పాడు శ్రీకర్.
అది అసలే కాలిఫోర్నియా, అందునా... నడి ఎండాకాలం... ఎర్రని ... భగభగ మండే సూర్యుడు...  శ్రీనిధి రూపంలో వున్నడా అన్నట్టుగా వుంది.
కొంచెం శ్రీనిధికి కోపం తగ్గించే ప్రయత్నంలో... “సరే.. కానీ ... ఇందాక ... డ్రెస్సు బావుందా?  అని అడిగావుగా ... నిజంగా చాలా బావుంది. ఏమాట కామాటే ... ఇక్కడున్న... నల్ల వాళ్ళ ... మధ్యలో నిన్ను... నుంచో పెడితే ... చుక్కల్లో చంద్రుడులా ... ఉంటావు” అని అన్నాడు శ్రీకర్ కొంటెగా.
కొంచెం శాంతించినప్పటికీ శ్రీనిధి, భర్తని కొర కొరా చూస్తోంది.
ఓ గంట .... గడచిన తరువాత, బయట పార్కింగు నుంచి మెయిను హాలు లోపలికి రాగలిగారు. “అబ్బా ఎంత చల్లగా వుందో” అన్నారు ఇద్దరూ ఒకేసారి...
ఆ క్యూలో రకరకాల దేశాల వారు, వింత వస్త్ర ధారులూ, అనేక రంగులలో హెయిర్ డ్రెస్సింగ్ చేసుకున్న వారూ, వొళ్ళంతా టాటూలు (పచ్చ బొట్లు) వేసుకున్న వారూ, భీకరాకారులూ, పసి పిల్లలతో వచ్చిన వారూ, గర్భిణులు, వృద్ధులూ, కాలేజి కెళ్ళే వారిని చూసి “అబ్బా... ఎన్నిరకాల వారున్నారో.... ఇక్కడ” అనుకుని...
“ఈ దేశంలో ... కారు ... చాల అవసరమనే మాట వాస్తవమే, వయసుతో నిమిత్తం లేదు, అరా కొరా  పబ్లిక్ ట్రాన్స్పోరర్టీషను కొన్ని చోట్ల వున్నా ... అవి ... అన్ని అవసరాలనూ తీర్చవు”  అని మనసులో అనుకుంటు, ఆ కౌంటర్స్ వైపు తొంగి తొంగి చూస్తోంది శ్రీనిధి, అక్కడ చాలా కౌంటర్స్ వున్నాయి.
అక్కడ... మోటారు వెహికల్స్ ... వినియోగానికి సంబంధించిన ... అన్ని ... నియమ నిబంధనలు ... మొత్తం 6 భాషలలోరాసి ఉండటం, అందులో ... చాలా ఆశ్చర్య కరంగా మన హిందీ మరియు బెంగాలి భాషలో కూడా రాసి ఉండటం గమనించి  [నశ్రీనిధి] ఒక్క సారి ఇండియాని చూసినట్టు ముఖం వెలిగి పోయి “ఏమండీ అక్కడ చూడండీ హిందీ బెంగాలిలో కూడా వ్రాసి ఉంది” అని భర్తతో అన్నది శ్రీనిధి.
“అదే ... నేను చెప్పేది ... US అంటేనే అంత, ఇక్కడ అన్ని రకాల వారికి అన్ని దేశాల వారికి స్థానం ఉంటుంది అనిచెప్తే ఒప్పుకోవుగా” అన్నాడు శ్రీకర్.
“అబ్బా ... మళ్ళీ ... మొదలు పెట్టారా ... మీ US భజన?” అంటూ, 
“ఈ మధ్య ఇండియా వారిమీద youtubeలో వ్యతిరేకంగా వీడియోలు, వారి మీద బహిరంగ నినాదాలు, వారిమీద కాల్పులు చూడలేదా? అమెరికా అంతా రెండు వర్గాలుగా చీలిపోలా? ఇక్కడ జాతి అహంకారము, బానిసత్వము మొన్న మొన్నటిదాకా లేవా?” అని ఎదురు ప్రశ్నలు సంధించింది శ్రీనిధి.
అది పట్టించుకోనట్లు , ... “ఇక్కడ... ఒకొక్కరికీ ... టోకెను ఇస్తారు. అదిగో చూశావా ... ఆ TVలో ... మన టోకెను నంబరు వచ్చినపుడు ఆ కౌంటర్ దగ్గరకు మనం వెళ్ళాలన్న మాట, ఇక్కడ అంతా సిష్టమాటిక్, అన్నీ... పద్ధతిగా... రూల్స్ ప్రకారం ... జరుగుతాయి, ఇలా మన దేశంలో వుంటాయా?” అని US గురించి వీర గర్వంగా చెప్పసాగాడు శ్రీకర్.
“నిజమే, ఈ దేశం వారి నుంచి మన దేశం వారు ఎన్నో నేర్చు కోవాలి, ఐనా, ఏ దేశం గొప్పదనం, పద్ధతులు, అవసరాలూ ఆ దేశానివి  అంటూ... అదిగో ... ఆ కౌంటరు 3, 6, 7 లలో 15 నిముషాలనుంచి యెవ్వరూ ... లేరు, ఇక్కడ మన ముందు ఇంకా 30 మంది ఉన్నారు .... మన వెనుక 70 మంది చేరారు.... ఆ కౌంటరు 1 లో ఆవిడ...  ఒక పెద్ద పర్వతాకారిణిలా వుంది ... పాపం కదల లేక పోతోంది... ఒకరి పనే ... 20 నిముషాలనుంచీ చేస్తోంది.... మరి ఇదిగో ఈ నల్లావిడ  నిలబడిన కౌంటరులో ఉన్నావిడ ... ఎంత వృద్ధురాలో .... పాపం చేతిలో వున్న కాగితం కూడా వణకటం కనపడుతోంది. అదిగో నెంబర్ 8 ఆయన్ని చూడండి .... మనం “జూ టోపియా” అనే సినిమాలో చూశామే అలా పని చేస్తున్నాడు... ఆహా ... ఆహా ... ఎంత గొప్పగా వుంది  US working style  నత్తగుల్లల్లగా? అన్నది శ్రీనిధి వ్యంగ్యంగా.
ఈ లోపు నెమ్మదిగా పసి పిల్లల ఏడుపులు, పెద్ద వాళ్లు .... విసుగ్గా... 
“ఇంత సేపా?...  ఈ క్యూ లోనే రోజు గడిచేటట్టు ఉంది”, అని ఒకడు 
“తల్లీ కొంచెం త్వరగా ... పని ముగించు...”, అని మరొకడు 
“బాబూ... సోది చెప్పింది చాలు గానీ... కాస్త పనికూడా చెయ్యండి”, అని ఒకావిడ
“పొద్దున్నించి నిల్చుని నిల్చుని నా ప్రాణాలు పోతున్నాయి”....  అని మరి కొందరు ... అంటూ నిట్టుర్పులూ, 
“నా స్థానం కొంచెం చూస్తారా? ఇప్పుడే వెళ్లి వస్తాను” అనే “రిక్వస్ట్లు” లూ మొదలయ్యాయి.
“ఇదిగో ... ఇదేనా .... సిష్టమాటిక్ అంటే, నేను మొన్న DMV గురించి నెట్ లో search చేస్తుంటే “ప్రపంచంలో మొదటి పది నరక ప్రాయమైన ప్రదేశాలు (Top 10 places that are Hell On Earth)” అనే శీర్షిక క్రింద DMV ఆఫీసు 10th placeలో వుందని కనపడింది, చూడండి ... జనాలు ఎలా అల్లాడి పోతున్నారో, మీలాంటి వాళ్ళు US కాబట్టి కిక్కురు మన కుండా ... క్యూలో నిలుచుంటారు... అదే... మన దేశంలో ... అయితే ... ఒకరి పనే .... ఎంత సేపు చేస్తావమ్మ? అని నిలదీస్తారు”.
“ఇక్కడ rest  rooms దగ్గర నుంచీ ... అన్నిటికి క్యూలే, అదే మన దేశంలో అయితే .... ఇదే జనాలకి ... ఎంత నామోషీనో క్యూలో నిల్చోటం” అని శ్రీనిధి అంటూ వుండగా, ఈ మాటల మధ్యలో వారి వరకూ వచ్చింది క్యూ, శ్రీనిధి, శ్రీకర్ కౌంటర్ దగ్గరకు వెళ్ళారు, “Hai, What can I do for you?” అని చక్కగా నవ్వుతూ పలకరించింది అక్కడున్న తెల్లావిడ “Hai, Good afternoon” అంటూ “ఐ కేం ఫర్ అప్ప్ల్యింగ్ డ్రైవర్స్ లైసెన్స్ (నేను డ్రైవర్స్ లైసెన్స్ దరఖాస్తు కోసం వచ్చాను)” అని సమాధానం చెప్పింది శ్రీనిధి నవ్వుతూ.
ఆవిడ కాగితాలు అన్నీ పరిశీలించింది, డబ్బు కట్టమంది, రసీదు ప్రింట్ అయ్యేలోపు 
“మీరు, మీ దేశస్తులు చాలా అందంగా ఉంటారు, మీ దుస్తులు వాటి రంగులు కూడా చాలా బాగున్నాయి, మీకు వివాహం అయి ఎన్ని సంవత్సరాలు అయింది?“ అని అడిగింది, కుతూహలంగా.
“ధన్యవాదములు, మాకు 13 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది” అంది శ్రీనిధి.
“అవునా!!! అన్ని ఏళ్ల నుంచి ఎలా కలిసి ఉంటున్నారు మీరు?” అన్నది చాలా ఆశ్చర్యంగా ఆ తెల్లావిడ.
“అదే మా దేశము యొక్క గొప్పతనం, మిమ్మల్ని కూడా మెచ్చు కోవాలి. ఈ విషయం గుర్తించి నందుకు. నా దేశం అన్నా, నా వాళ్ళు అన్నా, నాకు అమితమైన ప్రేమ” అన్నది శ్రీనిధి చాలా గర్వంగా.
“అయిపోయాను రా ... దేవుడా ... మా ఆవిడాకే ... తగలాలా ... ఈవిడ... మనకి క్లాసు గారెంటీ” అని మనసులో అనుకొని, “ఈవిడ తిక్కదిలా... వుంది... మా అమ్ముమ్మ తాతయ్యలు 50 ఏళ్ళుగా కలసి జీవిస్తున్నారని  ఈవిడకి తెలీదు, మన 13 ఏళ్ళకే నోరెళ్ళ బెడుతోంది, ఇదిగో ... ఈ విషయం ... రాత్రికి ... మీ నాన్నకి ... ఫోను చేసి... చెప్పాల్సిందే ... నేను గుర్తుచేస్తాలే” అని వెనక నుంచి గొణుగు తున్నాడు శ్రీకర్. 
“మీరు, అక్కడ ఉన్న కౌంటర్ దగ్గరకు వెళ్ళండి, మీకు మంచి జరుగు తుంది” అంది తెల్లావిడ నవ్వుతూ.
“ధన్యవాదములు, మీకు కూడా మంచి జరుగు గాక” అంది శ్రీనిధి. 
అబ్బా ... ఒక్క నిమిషం ... కామ్ గా వుండలేరా? అంటూ శ్రీనిధి, శ్రీకర్ తో కలిసి అక్కడ display  అయిన నంబరు 9 counter దగ్గరికి వెళ్ళింది.
అక్కడ మళ్ళీ క్యూ ... అది.... ఫోటో తీసుకునే చోటు, వారి ముందు నుంచున్న ఆవిడ జుట్టునీ, డ్రెస్సునీ తెగ సర్దు కుంటోంది. శ్రీనిధికి ఆవిడని చూస్తే జాలి వేసింది, పొద్దున్న 9గం లకి వచ్చింది ... పాపం ... ఇప్పుడు 1:30 (ఒకటిన్నర) అయింది... ఎంత సర్దు కుంటే మాత్రం ... ఈ ఎండకి ... మేకప్ వుంటుందా? అమాయకత్వం కాకపొతే ... అనుకుంది మనసులో.
అక్కడ ఫోటో తీసేది ఒక ఆడ మనిషి.... ఒకాయనకు ... పదే పదే చెప్తోంది, “No...  Sir... మీరు కళ్ళు మూస్తున్నారు, ఫోటో తేసేటప్పుడు ... మీ కళ్ళు మూయ కండి.. నేను 1... 2... 3... అంటాను సరేనా?.” అంది. అక్కడ ఉన్నాయన ఒక చైనా వాడు .... ఇంగ్లిషేమో అసలు అర్ధం కావట్లేదు, లైనేమో ముందుకు కదలట్లేదు. 
శ్రీనిధి శ్రీకరులు అలా నిలబడి అక్కడ ఫోటో దిగే వాళ్ళని చూస్తున్నారు.
“అదిగో నిధీ...  వాణ్ణి చూడు... తప్పిపోయిన వారి ఆచూకి తెలుపగలరు అని ఫోటోలు పెడతారే.. అలా పెట్టాడు వాడి మొహం” అన్నాడు శ్రీకర్, “ఏయ్ ఎవరైనా వింటారు” అంది శ్రీనిధి. అదేమీ విననట్టు, 
“అబ్బో వీడు చూడు Mr. Bean లా” అని ... ఇంకొకరినీ,
“అమ్మా మా దేశంలో కానీ పెళ్లి చూపులు,మీ దేశంలో అక్కర్లేదు, అంత పోజు వొద్దులే తల్లీ ఏదో పెళ్లి చూపుల ఫోటోకి లాగా “ అని 
“అబ ... అబ ... వాడు చూడు ... ఏమి ... పెట్టాడో పోజు... సినిమాలో బ్రహ్మానందం నవ్వుతూ అతివినయం చూపించే పోజు” అనీ ఇంకొకరి గురించి.
“వీడిని చూడు... వీడికి  ఇంకో 10 నిమిషాలు లేటు అయితే DMV ఆఫీసులో తీసుకున్న  ఈ ఫొటోనే అంతిమ యాత్ర ఫోటోలా అయ్యేట్టుందని” ఒకరినీ
“వాడ్ని చూడు ... మా గుంటూరు విజయవాడ బస్ డిపోలలో జేబుదొంగ లున్నారు జాగ్రత్త అనే లిస్టుకి సరిపోతాడు” అని ఇంకొకరినీ, 
“ఇదిగో నిధీ .. ఎలాగు .... నువ్వు బాగానే వుంటావు కదా?  ఆవిడ 1,2,3, అన్నప్పుడు తప్ప కళ్ళు ఆర్పకు” సరేనా !! అని శ్రీకర్ ఒక్క నిమిషం కూడా  నోటికి రెస్టు ఇవ్వకుండా ఏదో కామెంటు చెస్తూనే వున్నాడు.
ఒక మూల ... కొంచెం కోపం వున్నా ...., ఎవరూ చూడ కుండా కష్టపడి నవ్వుని  ఆపుకుంటోంది శ్రీనిధి. 
చివరికి శ్రీనిధి దాక క్యూ వచ్చింది. ఆ ఫోటో ఘట్టము, మిగతా అన్నీ పూర్తి చేసుకొని... కారు దగ్గరకి వచ్చే టప్పటికీ  మధ్యాహ్నం 2:30 (రెండున్నర) యింది. కారు నడుపుతూ “నీకు  Drivers licence ఇప్పించా, మొత్తానికీ నేను గెలిచా” అన్నాడు శ్రీకర్.
శ్రీనిధి కూడా ఏమాత్రం తగ్గ కుండా “Drivers licence వస్తే... మీరు గెలిచి నట్టా? ఇక్కడ Settle ... అయిపోవాలని Rule ఏమైనా వుందా? ఐనా ... అన్ని పనులూ... ఈ దేశంలో.. గంటలో అవుతాయన్నారు? మీ ఉద్దేశ్యము... మధ్యాన్నం మూడోగంటా?  విన్నారుగా? ఇందాక  ఆ తెల్లావిడ... మన దేశం గురించి ఎంత గొప్పగా చెప్పిందో? అది మనం తెలుసు కోవాలి, అయినా... నేను మళ్ళీ ... అదే చెప్తున్నా... ఏ దేశం గొప్పదనం, పద్ధతులు, అవసరాలూ ఆ దేశానివి .....అంతే కానీ... ప్రతి క్షణం.... లోపాలు వెతుకుతూ, పోలిక చేస్తూ ... చూడ కూడదు, ఈ దేశం ఏ మాత్రం బాగుండక  పోతేనే ఇంతమంది ఇక్కడ Settle అవుతున్నారా? అంత మాత్రాన.... మనం దేశం ... బాగుండదని అర్ధమా?”
“ఇక్కడ నియమ, నిబంధనలు పాటించే వారిలో చాల మంది.... మన దేశానికి వెళితే ... అక్కడ పాటించరు, ఆ మార్పు వారిలో తెచ్చుకోకుండా, అబ్బో ... మొన్ననే ఇండియా వెళ్ళా .... ఎన్నాళ్ళైనా ... ఇండియా మారదు... అనటం ... ఎంత .... వరకూ సమంజసం? Rules, Regultions, Principles అన్ని దేశాలకీ వుంటాయి, ఆచరణ సాధ్యం, ఆచరణ యోగ్యతలని, ఆచరణ శీలులని బట్టి వాటి అస్తిత్వం వుంటుంది. అయినా మీరన్నట్టు US అన్ని విషయాలలో గొప్ప అయి వుండ వచ్చు కానీ, అందంగా లేదని తమ తల్లిని, ‘తల్లి’ కాదని... ఎవరూ అనరు కదా?.
ఇక స్వవాసమా? ప్రవాసమా? అన్న విషయానికి వస్తే, మీతో సావాసం, మీతో జీవించటం నాకు ఇష్టం ... అదీ మన దేశంలో వుంటే మరింత ఇష్టం” అంటూ నవ్వుతూ శ్రీనిధి, కారు నడుపుతున్న శ్రీకర్ చేతిమీద చెయ్యి వేసింది... 
“ఇదిగో... ఇప్పటికే 3:00 (మూడు గంటలు) దాటింది, మనం హోటలు కెళ్లి అక్కడ భోజనం చేద్దాము” అన్నాడు శ్రీకర్.
“ఇంత లేటు అవుతుందని ముందే ఊహించి... అన్నీ పొద్దున్నే ... వండి రెడీగా పెట్టివచ్చా... 5 నిమిషాల్లో వడ్డన చేస్తా, నాకు లైసెన్స్ కార్డు వొచ్చిన తరువాత నేను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ మిమ్మల్ని హోటల్ కి తీసుకు వెళ్ళతాను” అంది శ్రీనిధి.
“ఏదైనా చెప్పు నిధీ.... నీ తెలివీ, ముందు చూపు, ఆలోచన... నువ్వు మొత్తం ... Differrent..” అన్నాడు చాలా మెప్పు కోలుగా శ్రీకర్.
“ఒప్పుకోక తప్పలేదన్నమాట” అంది కొంచెం నిక్కుగా శ్రీనిధి.
“ఐనా, నీ సూక్తి ముక్తావళి ... ఎప్పటికైనా ఏ TV లో అన్నా ... వినాలని నా కోరిక, ఆ రోజు మాత్రం నీ డ్రెస్ నేనే సెలెక్ట్ చేస్తా ... ఏమంటావ్?” అని చిలిపిగా అంటూ .... ఇంటి ముందు కొచ్చి ... కారు ... దిగి శ్రీనిధి వెనక అడుగులో అడుగేశాడు శ్రీకర్.
***

No comments:

Post a Comment

Pages