అష్టలక్ష్మి కుబేరయంత్రం - అచ్చంగా తెలుగు

అష్టలక్ష్మి కుబేరయంత్రం

Share This
అష్టలక్ష్మి కుబేరయంత్రం  
పెయ్యేటి శ్రీదేవి   
            
ఆరువందల గజాలున్న స్థలంలో కట్టిన పెద్ద పురాతనమైన ఇల్లు.  తండ్రి తరువాత కొడుకు రాఘవయ్యగారు తన భార్య, ఇద్దరమ్మాయిలు, కొడుకుతో వుంటున్నారు.  ఓ ప్రైవేటు కంపెనీలో చేసి రిటైర్మెంటు తీసుకున్నారు.  ఉన్న రెండెకరాల పొలం అమ్మేసి అతి కష్టం మీద ఎలాగో పెద్దపిల్ల కనకలక్ష్మి పెళ్ళి చేసారు.  ఇప్పుదు రెండోపిల్ల లత పెళ్ళి చెయ్యాలి.  రాక రాక మంచి సంబంధం వచ్చింది.  పది లక్షలు కట్నం అడిగారు.  కొడుకు డిగ్రీ చదువుతున్నాడు.  పిల్లకి పెళ్ళి చెయ్యాలంటే డబ్బు కావాలి.  ఎప్పట్నించో పక్క బిల్డింగులో వుంటున్న బిల్డరు ఇల్లు అమ్మేస్తే అపార్టుమెంటు కట్టి అందులో రెండు ఫ్లాట్లు ఉచితంగా ఇస్తానన్నాడు.  బంగారం లాంటి అంత పెద్ద ఇల్లు అమ్మడం ఇష్టం లేకపోయినా, శిథిలావస్థకి చేరుకోబోతున్న ఇల్లు పిల్ల పెళ్ళి కోసం అమ్మక తప్పింది కాదు.  అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి అన్నట్లు, అవసరం తనది కాబట్టి వచ్చిన ధరకే అమ్మేసి, చిన్న ఇంట్లో అద్దెకుండి పిల్ల పెళ్ళి చేసాడు.  అపార్టుమెంటు పూర్తయ్యాక ఒక ఫ్లాట్లో తనుండి, రెండో ఫ్లాట్ అద్దెకిద్దామనుకున్నాడు.  రెండో అల్లుడు కట్నం చాల్లేదంటూ ఆ ఫ్లాట్ దురాక్రమణ చేసి అందులో చేరాడు.  చిన్నల్లుడికైతే ఫ్లాట్ ఇచ్చారు, నాకూ వాటా కావాలంటూ పెద్దల్లుడూ గొడవ చేసాడు.  ఇదిలా వుండగా మరోపక్క కొడుకు, చదువుకి ఫీజు కట్టలేక పోయేసరికి, చదువు మానేసి ఒక కార్ల కంపెనీలో చిన్న గుమాస్తాగా చేరతాడు.  అదివరకు ఇండిపెండెంట్ హౌస్ లో హాయిగా వున్న ఆ కుటుంబానికి ఈ అపార్ట్ మెంట్ లో నీళ్ళకి కరువు.  టేంకర్లలో నీళ్ళు కొనుక్కోవాలి.  మెయింటినెన్స్ కి నెలకి వెయ్యి రూపాయలు ఇవ్వాలి.  నీళ్ళ టేంకర్లకంటూ మరో వెయ్యి గుంజుతారు.  వాడుకోటానికి, తాగటానికి నీళ్లకి కరువున్నా, డ్రైనేజి నీళ్ళకి మాత్రం కరువుండదు.  పై ఫ్లోర్ లో వాళ్ళు వాడే నీరంతా లీకయి బాత్ రూంలో వీళ్ళ నెత్తిన పడుతూంటుంది.  ఇది  చాలదన్నట్లు డ్రైనేజి నీళ్ళు గొట్టాలద్వారా పైకి వీళ్ళ వాటాలోకొచ్చి, పండగని కూడా లేకుండా ఇల్లంతా డ్రైనేజి నీళ్ళతో నిండిపోయింది.  వంట చేయడానికి లేదు.  అప్పుడు కింద వాచ్ మెన్ భార్యని పిలిచి ఆ మురికి నీళ్ళన్నీ తీయిస్తుంది రాఘవయ్య భార్య సీత.  పుండుమీద కారం చల్లినట్లు పక్క ఫ్లాట్ పిల్లలు వీళ్ల గుమ్మం నిండా చెత్త పోస్తారు.  వాళ్ళమ్మతో చెబితే పిల్లలకి తప్పని చెప్పకపోగా మీరే మా గుమ్మంలో చెత్త పోస్తున్నారంటూ పెద్దగా దెబ్బలాడుతుంది.  ఈ బాధలన్నీ తట్టుకోలేక సీత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోతుంటే పక్కవాళ్ళ టి.వి.లో వస్తున్న అష్టలక్ష్మి కుబేరయంత్రం ప్రకటన కిటికీలోంచి కనబడింది.
          ' ఉండండి.  కాసేపు ఆలోచించండి.  బాధలన్నీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోతున్నారా?  ఆ ప్రయత్నాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త వినండి.  మా అష్టలక్ష్మి కుబేరయంత్రం కొంటే, అష్టలక్ష్ములు మీ యింట కొలువు దీరి, అన్ని బాధలూ తొలగిపోయి అష్టైశ్వర్యాలూ సిధ్ధిస్తాయి.  దీని ధర కేవలం రెండువేల తొమ్మిది వందల తొంభయితొమ్మిది రూపాయలు మాత్రమే.  వెంటనే ఆర్డరు చేయండి.'
          ఆ ప్రకటన చూసి సీత తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని ఆ అష్టలక్ష్మి కుబేరయంత్రాన్ని తెప్పించి ధరిస్తుంది.
          ఆ మర్నాడు, ' మీ తండ్రిగారు మా నాన్నగారికి అప్పిచ్చి చాలా సాయం చేసారు.  మాకు వ్యాపారంలో బాగా లాభాలొచ్చాయి.' అంటూ శేఖరం అనే పెద్ద కార్ల కంపెనీ యజమాని వడ్డీతోసహా బాకీ తీర్చేస్తాడు.  ఆ డబ్బుతో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుని అందులోకి మారతాడు రాఘవయ్య.  అపార్ట్ మెంట్ లో వున్న రెండు ఫ్లాట్లు ఇద్దరు కూతుళ్ళకి ఇస్తాడు.  అతడి కొడుకుకి శేఖరం తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాడు.  అతడ్ని తన కంపెనీకి యజమానిని చేసి విశ్రాంతి తీసుకుంటాడు.
          ' చూసారా మరి, అష్టలక్ష్మి కుబేరయంత్రం ధరించడం వల్ల సీత కుటుంబ కష్టాలన్నీ ఎలా కడతేరాయో?  వాళ్ళకి అష్టైశ్వర్యాలు సిధ్ధించి ఆనందంగా వున్నారు.  అందుకే మీరూ మీ కష్టాల్నించి బైటపడి సుఖంగా బతకాలంటే ఈ అష్టలక్ష్మి కుబేరయంత్రాన్ని ధరించండి.  దీని ధర కేవలం రేండువేల తొమ్మిది వందల తొంభయి తొమ్మిది రూపాయలు మాత్రమే.  ఇప్పుడే ఆర్డరు చేస్తే అష్టలక్ష్ములున్న పెండెంట్ ఉచితం.  పోస్టేజి మూడువందలు అదనం.' అంటూ ప్రఖ్యాత సినీ కమ్ టి.వి.సీరియల్ సీనియర్ నటి ధనశ్రీ తన మెళ్ళో ధరించిన అష్టలక్ష్మి పెండెంట్ వున్న గొలుసు చూపిస్తూ చెబుతోంది.                           ***************************
          టి.వి.లో అష్టలక్ష్మి కుబేరయంత్రం ప్రకటన చూసి తనూ ఆర్డర్ చేద్దామనుకుంది కావ్య.
          ఫోను చేద్దామనుకుంటుండగా తలుపు తోసుకుంటూ దూకుడుగా వచ్చింది పక్కింట్లో వుండే కావ్య స్నేహితురాలు విమల.
          ' అర్జంటుగా ఓ వెయ్యి రూపాయలుంటే ఇయ్యవే, ఇంటి ఓనరు అద్దె ఒక వెయ్యి పెంచాడు.  ఆ వెయ్యి కూడా ఇప్పుడే ఇమ్మని పీక మీద కూర్చున్నాడు.  ఆయన ఆఫీసు నించి రాగానే ఇచ్చేస్తాను.'
          ' తల్లీ, నీకు వెయ్యి రూపాయలిచ్చే ఆర్థిక స్తోమతే వుంటే ఈ కష్టాలనించి గట్టెక్కడానికి అష్టలక్ష్మి కుబేరయంత్రం ఎందుకు తెప్పించుకుంటాను?  ఉండు, అష్టలక్ష్మి కుబేరయంత్రం రానీ, నా డబ్బు కష్టాలన్నీ గట్టెక్కుతాయి.  అప్పుడు వెయ్యేం ఖర్మ, ఎన్ని వేలైనా ఇస్తా.  ఇప్పుడు మాత్రం అడక్కు.'
          ' అంటే, నేను వెయ్యి రూపాయలడిగిన పాపానికి, అదీ ఓ ఆర్థిక ఇబ్బందిగా భావించి, ఆ టి.వి.లో వచ్చే అష్టలక్ష్మి కుబేరయంత్రం తెప్పించి, దాని మహిమ వల్ల నువ్వో పెద్ద లక్షాధికారిణివో, కోటీశ్వరురాలివో అయిపోయి, అప్పుడు నేనెంత అడిగినా ఇచ్చేస్తావా?  నీకీ యంత్రాల, మంత్రాల పిచ్చి తగ్గదా?  ఓమూల డబ్బు లేదంటూనే, ఆ టి.వి.లో వచ్చే ప్రకటనల్ని నమ్మి, బోలెడు డబ్బులు తగలేసి అవన్నీ తెప్పిస్తున్నావు.  నిన్ను బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు.'
          ' విమలా!  మనం అతిసామాన్య మధ్యతరగతి వాళ్ళం.  మన బతుకులకి, జీవితాలకి, మన జీతాలకి లంచాలు తీసుకోవడం, అడ్డదార్లు తొక్కి సంపాదించడం ఏవిధంగాను కుదరదు.  మనవి ఎదుగూ బొదుగూ లేని బతుకులు.  అందుకే మనం గొప్పగా బతకాలని ఆశలు, కోరికలు వుండడం తప్పుకాదు కదా?  అందుకే నే చేసేది తప్పంటావా?  నేనేం అన్యాయంగా ఎవరి సొమ్మూ తీసుకోటల్లేదు కదా?'
          ' ఎవరి సొమ్మో తీసుకోవటల్లేదు, సరే, నీ సొమ్ము ఎందుకు పాడు చేసుకోవాలి?  జుట్టు పెరగడానికో మందు, సన్నబడటానికో మందు, మోకాళ్ళ నెప్పులకి ఏవో తైలాలు, రుద్రాక్షధారణ చేస్తే సకల శుభాలు కలుగుతాయని, మీ జాతకానికి సరిపడే రాయి ధరిస్తే మంచి జరుగుతుందని, నీ కష్టాలు తీరి భాగ్యవంతురాలివవడానికి అష్టలక్ష్మి కుబేరయంత్రం, ఇవన్నీ మధ్యతరగతివాళ్ళ బలహీనతలని ఆసరాగా తీసుకుని చేసే వ్యాపారాలు.  ఇవన్నీ నమ్ముతావా?  ఇక ఉదయాన్నే సాక్షాత్కరిస్తారు అన్ని ఛానెళ్ళలో జాతకబ్రహ్మలు.  కుంభరాశి వారికి ఎరుపురంగు ధరించమని ఒకరు, నీలం రంగు ధరించమని మరొకరు, ఇలా పదిమంది పదిరకాలు చెబుతారు.  ఒక్కరోజు జాతకానికి వాళ్ళు చెప్పే ఆ రంగుబట్టలు ధరించాలా?  ఒకవేళ ఆ రంగువి లేకపోతే వెంటనే షాపుకెళ్ళి కొనుక్కోవాలా?  నాకు ఎప్పటికీ తీరని అదో పెద్ద సందేహం.
          జుట్టు ఎదగడానికి ఏ ఆయిల్ రాయాలి?  ఉన్న జుట్లే కత్తిరించుకుని జుట్లు విరబోసుకోవడం ఇప్పుడు ఫేషన్.  మరి ఆ ప్రకటన ఎందుకిస్తారో అర్థం కాదు.  సన్నబడటానికి తిండి తగ్గించాలి, వ్యాయామాలు చెయ్యాలి.  మందులకి పని చేస్తుందా?  మూడువేలు పెట్టి మోకాళ్ల నెప్పులకి ఆయిల్ కొని, కొన్ని రోజులు రాసి మూల పడేస్తారు.  వాటికి తగ్గకపోగా ఎంత డబ్బులు వృధా అవుతున్నాయి?  మోకాళ్ల నెప్పులుంటే మంచి డాక్టరు దగ్గరకి వెళ్ళాలి గాని ఇలా వ్యాపార ప్రకటనల మీద ఆధారపడడమెందుకు?
          ఇహ నీ కష్టాలకి అష్టలక్ష్మి కుబేరయంత్రం ధరిస్తే నీ కష్టాలు తీరిపోతాయా చెప్పు?  మనకొచ్చే రాబడిలోనే పొదుపుగా వాడుకోవాలి.  పక్కవాళ్ళేదో గొప్పగా వున్నారు, మనమూ అలాగే వుండాలన్న ఆశ వుండకూడదు.  ఆ యంత్రం ధరిస్తే కారు కొన్నట్టు, కొడుక్కు ఉద్యోగం వచ్చినట్టు, కష్టాలన్నీ తీరిపోయినట్టు, ధనవంతులైనట్టు ప్రఖ్యాత నటీనటుల చేత చెప్పిస్తారు.  నిజంగా అలా జరిగితే మన దేశంలో పేదరికమే వుండదు.  అందరూ ఆ యంత్రాలు తెప్పించి కుబేరులవచ్చుగా?  అందుకే అవన్నీ నమ్మకు.  డబ్బు సంపాదనకి మధ్యతరగతివాళ్ళ బాధలే ఆధారం.  నా చిన్నప్పుడు ఎనిమిదో క్లాసు చదువుతున్నా అనుకుంటా, చందమామ పత్రికలో మేజిక్ ఉంగరం అని, అది ధరిస్తే మీ బాధలన్నీ తీరిపోతాయని ప్రకటన వచ్చేది.  ఇరవై ఐదు రూపాయలకే రెండు పట్టుచీరలని వ్యాపార ప్రకటన వచ్చేది.'
          ' ఔను, అవి నేనూ తెప్పించాను.'
          ' అంటే చిన్నప్పట్నించీ నీకీ పిచ్చి వుందన్నమాట ఏది పడితే అది నమ్మేసి తెప్పించడం!  ఏమైంది, ఆ రింగు ధరించావా?  పట్టుచీరలు వచ్చాయా?'
           ' ఇరవైరూపాయలకి ఓ రాగిరింగు పంపాడు.  అది నా వేలుకి బాగా వదులైంది.  కష్టపడి దారం చుట్టి ధరించా.  ఎన్నాళ్లకీ ఏం జరగలేదు.  పైగా ఆ లూజు రింగుతో నానా అవస్థా పడేదాన్ని.  ఇంక విసుగేసి మూల పడేసా.'
          ' మరి చీరలు?'
          ' అవేం పట్టుచీరలు కాదు.  కాళ్లకి దెబ్బ తగిలితే గాజుగుడ్డ కడతారుగా?  అచ్చం అలాగే వున్నాయి దోమతెరల్లాగ ఆ చీరలు.'
          ' మరెందుకు తెలిసి తెలిసి టి.వి.లో వచ్చే ప్రకటనలు నమ్మి అన్నీ తెప్పిస్తావు?'
          ' అందరూ తెప్పిస్తూంటేనే కదా, వాళ్ళు ఆ ప్రకటనలు పదే పదే వేస్తారు?'
          ' వాళ్ళూ నీలాంటి పిచ్చివాళ్ళే కాబట్టి.  మీలాంటి వాళ్ళకోసమే ఆ వ్యాపారప్రకటనలు.  ఎవరూ కొనకపోతే వాళ్ళూ అమ్మరుకదా?  సరే, నే వస్తా.  ఇంటి ఓనరుకేదో సమాధానం చెప్పి పంపించాలి.'
          ' ఏయ్ విమలా, ఆగు.  వెయ్యిరూపాయలు ఇమ్మన్నావుగా?'
          ' లేవన్నావుగా?'
          ' అష్టలక్ష్మి కుబేరయంత్రం తెప్పించవద్దన్నావుగా?  ఆ డబ్బే నీకు ఇస్తున్నాను.'
          ' చాలా చాలా ధాంక్స్.  నా మాట పాటించినందుకు.  సాయంత్రానికల్లా నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాలే.' అంటూ వెళిపోయింది విమల.
          ఒక టి.వి.ఛానెల్లో ధర్మసందేహాలు కార్యక్రమం వస్తుంటే వెంటనే ఫోన్ చేసింది.
          ' కృష్ణమూర్తిగారికి, రాఘవాచారి గారికి నమస్కారమండీ.  నేను గుంటూరు నించి మాట్లాడుతున్నాను.  నాపేరు కావ్యండీ.'
          ' దివ్యంగా వుంది మీ పేరు.  అమ్మా, చెప్పండి మీ సమస్య.'
          ' ఏం లేదండీ.  ఇప్పుడు టి.వి. ఛానెళ్ళలో అష్టలక్ష్మి కుబేరయంత్రం ధరిస్తే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి.  మీ కష్టాలు, మీ సమస్యలన్నీ తీరిపోయి మీరు చాలా సుఖంగా వుంటారు అంటూ ప్రకటనలొస్తున్నాయి.  ఆ అష్టలక్ష్మి కుబేరయంత్రం ధరిస్తే నిజంగా ఆర్థిక ఇబ్బందులుండవంటారా?'
          ' అమ్మా, మీరు చాలా మంచి ప్రశ్న వేసారు.  కాని ఈ ప్రశ్న ధర్మసందేహాలు కార్యక్రమానికి వేయవలసిన ప్రశ్న కాదు.  ఇలాంటివి నేను చెప్పకూడదు.  ఐనా అడిగారు కాబట్టి చెబుతున్నాను.  ఇప్పుడు అనేక న్యూస్ పేపర్లు, అనేక పత్రికలు వస్తున్నాయి.  అన్నీ మీరు కొనరు కదా?  మీకిష్టమైనదేదో, మీ స్వభావానికి నచ్చింది తీసుకుంటారు.  ముఖ్యమంత్రయినా, ప్రధాన మంత్రయినా అన్ని పేపర్లలో ఒక పేరే వుంటుందిగా?  ఎక్కడో యాక్సిడెంట్లయినా, బాంబు పేలుళ్ళు జరిగినా అన్ని పేపర్లలోనూ ఆ వార్తలు వస్తాయి.  కాని రాసే విధానం తేడాగా వుంటుంది.'
          అలాగే టి.వి.ఛానెళ్ళలో కూడా ఎన్నో వ్యాపార ప్రకటనలొస్తుంటాయి.  మోకాళ్ళ నెప్పులకి ఆయిలు రాస్తే నెప్పులు తగ్గిపోయి త్వర త్వరగా మెట్లెక్కేయడం చూపిస్తారు.  డాక్టర్ల దగ్గరకెళితే ఆపరేషన్ చెయ్యాలంటారు.  దానికి ఐదులక్షలు ఖర్చు.  అది భరించే తాహతు లేక మూడువేలు పెట్టి ఆయిలు తెప్పిస్తారు.  సన్నబడాలనుకునే వాళ్ళు, లావుగా అవాలనుకునే వాళ్ళు ఏ టీయో తెప్పిస్తారు.  జుట్టు పెరగడానికి ఏదో ఆయిలు కొనమంటే అదీ తెప్పిస్తారు.  ఇవన్నీ పని చేస్తున్నాయా చెప్పండి?  నేతిబీరకాయ లాంటివే ఆ ప్రకటనలన్నీ.  శరీరం బరువు ఎక్కువైతే కొవ్వు తీయించుకుని స్లిమ్ గా తయారవాలని ఆపరేషన్ చేయించుకుంటున్నారు.  అందువల్ల ప్రాణాలే పోతున్నాయి.
          మునపటికీ ఇప్పటికీ జీవన విధానం, ఆహార నియమాల్లో మార్పులొచ్చాయి.  ఆడంబరాలూ ఎక్కువయాయి.  నియమాలేవీ పాటించని, క్రమపధ్ధతి లేని ఈ అక్రమ జీవన విధానం వల్ల అనేక రోగాలు కొనితెచ్చుకుని సమస్యల్లో చిక్కుకుంటున్నారు.  ఈ బలహీనతల్ని ఆసరా చేసుకునే, మీ అవసరాలు వాళ్ళు గమనించి, ఎన్నో కనిపెట్టి, వ్యాపార ప్రకటనలు గుప్పిస్తున్నారు.
          ఇంక అష్టలక్ష్మి కుబేరయంత్రం కొనవచ్చా అని అడిగారు.  ఇదీ అంతే.  లక్ష్మీదేవి అంటే ధనాన్నిస్తుంది.  కుబేరుడు ధనవంతుడు అని మీరూ చిన్నప్పుడు చదువుకునే వుంటారు.  టి.వి.లో చూపించినట్లుగా లక్ష్మీదేవి చేతులోంచి డబ్బు నాణాలేం రాలవు.  దేవుడి పేరు చెప్పి ఇలాంటి ప్రకటనలొస్తుంటాయి.
          హాయిగా వున్నంతలో పొదుపు చేసుకుంటూ తృప్తిగా జీవించండి.  పక్కవాళ్లకి డబ్బుంది, మేడ వుంది, మనకి లేదే అని మనసు పాడు చేసుకుని ఆలోచనలు పెట్టుకోకండి.  అనారోగ్యం వస్తే మంచి వైద్యం చేయించుకోండి.  లావుగా వుంటే కొవ్వు తీయించుకుని కష్టాలని కొనితెచ్చుకోవద్దు.  వేళకి మితంగా పౌష్టికాహారం తీసుకోండి.వ్యాయామాలు చెయ్యండి.  చూసిన ప్రతీదీ నమ్మకండి.  మనకి ముఖ్య శత్రువులు బధ్ధకం, అత్యాశ, వృధా కాలయాపన.  ఇవన్నీ విడిచి హాయిగా జీవించండి.  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పూర్వులు.'
          కావ్య టి.వి. కట్టేసింది.  ఇంచుమించు విమల చెప్పినవే ఈయనా చెప్పారు.  మొహం చల్లటినీళ్ళతో కడుక్కుని, ఆలోచనలన్నీ పక్కకి పెట్టి కాసేపు పడుకుందామనుకుంటుండగా కాలింగ్ బెల్ విని తలుపు తీసింది.
          ఆఫీసు నించి భర్త, స్కూలు నించి పదకొండేళ్ల సుపుత్రుడు మధు, ఎనిమిదేళ్ళ కూతురు రమ్య వచ్చారు.
          భర్త సంతోషంగా ఒక అష్టలక్ష్ముల లాకెట్టున్న గొలుసు కావ్య మెడలో వేసాడు.  వింతగా చూస్తోంది కావ్య.
          ' కావ్యా!  నీకు సర్ ప్రైజ్ ఇద్దామని ముందుగా చెప్పలేదు.  ఎప్పట్నించో టి.వి.లో చూసి అష్టలక్ష్మి కుబేరయంత్రం తెప్పించాలనుకుంటున్నావుగా?  ఇదిగో, ఈ అష్టలక్ష్మి కుబేరయంత్రం పూజలో పెట్టు.'
          ' ఐతే అమ్మా, ఈ అష్టలక్ష్మి కుబేరయంత్రం కొన్నారు.  నేను టెన్త్ ఫస్టుక్లాసులో పేసవుతా.  డాడీ కారు కొనేస్తారు.' పుత్రోవాచ.
          ' మమ్మీ!  నాకోప్పది పట్టులంగాలు, గాగ్రా చోళీలో పది కొను.  ఒక బంగారం నెక్కిలీసు కొను.  మా ఫ్రెండ్సందరికీ వున్నాయి.  నాకే లేదు.' పుత్రికోవాచ.
          ' పక్కింటి ఆంటీ వాళ్ళ బిల్డింగ్ కన్న పెద్ద బిల్డింగ్ కడదాం' మళ్ళీ సుపుత్రుడు.
          ' ఇంక మన కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా వుందాం కావ్యా!' భర్తోవాచ.
          కావ్య బుర్రంతా మళ్ళీ ఖరాబయిపోయింది !!!

************

2 comments:

Pages