బాంక్ లాకర్ - అచ్చంగా తెలుగు
బాంక్ లాకర్ 
బి.ఎన్.వి.పార్థసారధి

చంద్ర మోహన్ భల్లా, రూపాలి భల్లా భార్యా భర్తలు. వీరికి లేక లేక కలిగిన సంతానం ఒక్క కుమారుడు పేరు కుల్ భూషణ్ భల్లా. ఒక్కగానొక్క సంతానం అవటంతో బాల్యం లో కొడుకుని ఎంతో అల్లారుముద్దుగా పెంచారు భల్లా దంపతులు. ఆరు నెలల నుండి దాదాపు మూడేళ్ళవరకు కుల్ భూషణ్ కి ఫారెక్స్ ముఖ్య ఆహారం గా ఇచ్చేవారు. దానికి కుల్ భూషణ్ ఫారెక్స్ ఎక్కువగా ఇష్టపడటం ఒక కారణం. కుల్ భూషణ్ కి ఏడాది పుట్టినరోజు నాడు వాళ్ళ నాన్న చంద్రమోహన్ భల్లా ఒక చిన్న వెండి గిన్నె, చెంచా కొన్నాడు. అప్పటినుంచి కుల్ భూషణ్ కి రోజూ ఫారెక్స్ ఆ వెండి గిన్నె లోనే తినిపించేవారు. చంద్రమోహన్ భల్లా ఒక అంతర్జాతీయ సంస్థ లో ఉన్నత పదవి లో వుండేవాడు. రాత్రనక పగలనక ఆఫీసు పనులతోనే తలమునకలయ్యేవాడు. దానితో కుల్ భూషణ్ బాల్యం లో తండ్రిని ఒక పరాయి వ్యక్తి గా భావించేవాడు. తండ్రి ఎప్పుడైనా ఇంట్లోవుంటే కుల్ భూషణ్ అతనిని ఒక అపరిచితుడిగా చూసేవాడు. అయినప్పటికీ తనకి ఆకలి అయినప్పుడు తండ్రి వెండి గిన్నె లో ఫారెక్స్ కలిపి తినిపిస్తే మాత్రం కిమ్మనకుండా తినేవాడు కుల్ భూషణ్. ఒకవిధంగా తండ్రీకొడుకుల బంధాన్ని వెండి గిన్నె, ఫారెక్స్ నిలపగాలిగాయి అని చెప్పొచ్చు. 
మూడేళ్ళు దాటాక కుల్ భూషణ్ ఫారెక్స్ తినటం మానేసాడు. అయినా పదేళ్ళ వరకూ రోజూ అదే వెండి గిన్నెలో పాలు తాగేవాడు. పదేళ్ళ తరవాత కుల్ భూషణ్ పాలు తాగటం మానేసాడు. కానీ ప్రతీ పుట్టిన రోజు నాడు మాత్రం తప్పకుండా తల్లి రూపాలి  కొడుకు కుల్ భూషణ్ కి  ఏదో ఒక స్వీట్ స్వయంగా చేసి  అదే వెండి గిన్నె లో పెట్టి తినిపించేది.  అంతర్జాతీయ సంస్థ లో ఉన్నత పదవిలో ఉండటం వల్ల చంద్ర మోహన్ భల్లా అడపా తడపా పార్టీలకి వెళ్లటం, అక్కడ మద్యం సేవించటం చేసేవాడు. కొన్ని పార్టీలకి భార్యని కూడా తీసుకుని వెళ్ళాల్సి రావటం తో రూపాలి  కూడా క్రమేపీ మద్యం తాగటం మొదలు పెట్టింది. కొన్నేళ్ళకి ఈ పార్టీల సంఖ్య పెరగటంతో తరచూ తాగటం మూలాన అది భార్యా భర్తలు ఇద్దరికీ ఒక వ్యసనంలా తగులుకొంది. కుల్ భూషణ్ కి పద్నాలుగు ఏళ్లు వచ్చేసరికి అతని తల్లితండ్రులు ఇద్దరూ తాగుడుకి బానిస అయ్యారు. అదే సమయంలో చంద్ర మోహన్ భల్లా కి పదోన్నతితో పారిస్ కి బదిలీ ఆయింది. దాదాపు మూడేళ్ళు అతను ఉద్యోగ రీత్యా పారిస్ లో వుండటం ఆ సమయంలో అతని భార్య రూపాలి ఏకంగా ఇంట్లోనే రోజూ మందు దుకాణం పెట్టడం క్రమంగా జరిగిపోయాయి. మూడేళ్ళ తరవాత చంద్రమోహన్ భల్లా ఇండియా కి తిగిరి రావటం భార్య తో ఈ విషయం మీద ఘర్షణ పడటం, కొన్నాళ్ళకి చిలికి చిలికి గాలి వానగా మారి ఇద్దరూ విడాకులు పుచ్చుకోవటం జరిగింది. చిత్రం ఏమిటి అంటే విడాకులు పుచ్చుకున్న తరువాత భార్యా భర్తలు ఇద్దరూ ఎదురు బొదురు ఫ్లాట్ల లో ఒకే  అపార్ట్మెంట్ లో వుండటం మొదలు పెట్టారు. తల్లితండ్రులు విడాకులు పుచ్చుకునే నాటికి కుల్ భూషణ్ కి పంతొమ్మిది ఏళ్లు. హాస్టల్ లో వుంటూ ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నాడు. 
చంద్రమోహన్ భల్లా కి, రూపాలి కి బాంక్ లో జాయింట్ గా ఒక లాకర్ వుండేది. విడాకులు తీసుకున్న తరువాత అదే బాంక్ లో ఎవరికి వారు విడిగా చెరో లాకర్ తీసుకున్నారు. కుల్ భూషణ్ ఇంజనీరింగ్ కోర్స్ ముగించి ఉద్యోగం లో చేరాడు. కొన్నాళ్ళకి తల్లి రూపాలి లివర్ వ్యాధి తో మరణించింది. ఆమె మరణానంతరం చంద్ర మోహన్ భల్లా రూపాలి  నివసిస్తున్న ఫ్లాట్ లోని వస్తువులు చక్క బెడుతుండగా అతనికి అనుకోకుండా ఆమె బాంక్ లాకర్ కీ కనిపించింది. బాంక్ కి వెళ్లి వాకబు చేస్తే బాంక్ వాళ్ళు ఆమె తన లాకర్ లోని వస్తువులకి  కొడుకు కుల్ భూషణ్ ని వారసుడిగా నియమించినట్టు తెలిపారు. ఉద్యోగ రీత్యా బెంగుళూరు లో వున్న కొడుకు కుల్ భూషణ్ కి చంద్రమోహన్ ఫోన్ చేసి ఈ విషయం చెప్పి శలవు పెట్టి రమ్మన్నాడు. మరో వారానికి తండ్రీ కొడుకులు ఇద్దరూ లాకర్ కీ తో బాంక్ కి వెళ్లారు. 
కుల్ భూషణ్ మేజర్ కాబట్టి పైగా తల్లితండ్రులు విడాకులు తీసుకోవటం, ఈ లాకర్ అతని తల్లిది అవటం మూలాన బాంక్ వారు లాకర్ గది లోకి కేవలం కుల్ భూషణ్ ని అనుమతించి మరో ఇద్దరు సాక్షుల సమక్షంలో లాకర్ తెరచారు. లాకర్ లోపల ఒక చిన్న సంచీ వుంది. సంచీ బయటికి తీసి చూస్తే అందులో చిన్న వెండి గిన్నె , చెంచా కనిపించాయి. తన బాల్యం లో తల్లి ఈ వెండి గిన్నె లోనే తనకి ఫారెక్స్ తినిపించటం గుర్తుకి వచ్చి కుల్ భూషణ్ కళ్ళు చెమర్చాయి. బాంక్ లాకర్ గది లోంచి బయటికి వచ్చిన తన కొడుకు చేతిలో వెండి గిన్నె, చెంచా చూసి తండ్రి చంద్రమోహన్ భల్లా కొడుకుని కావులించుకుని భోరుమన్నాడు. బాంక్ మేనేజర్ మాత్రం తండ్రీ కొడుకులు ఎందుకు ఏడుస్తున్నారో అర్ధం కాక విస్తుపోయాడు. 

No comments:

Post a Comment

Pages