ముత్యాల ముగ్గులో ఓ చుక్క
కంభంపాటి రవీంద్ర
చెరుకుల కాలవ పక్కనే ఉన్న మఱ్ఱి చెట్టు కింద సైకిళ్ళు అద్దెకిచ్చే సుర్ల నానాజీ గాడు ఆ రోజు ఎండెక్కగానే గ్రంధి కళావతి గారింటికెళ్లి గోడవెట్టేసుకున్నాడు . కళావతి మొగుడు బాబ్జీ గాడు రెండు వారాల క్రితం రామచంద్రపురం వెళ్ళొస్తానని నానాజీ గాడి దగ్గిర సైకిలు అద్దెకి తీసుకుని ఇంతవరకూ అయిపు లేడంట .
'ఆడెక్కడికెళ్లాడో నాకేం తెలుసు ..అద్దెకిచ్చింది నువ్వు ..తీసుకున్నదాడు ..ఆడ్నే అడుగు .. నా మొగుడు సచ్చినాడు ఏవైపోయేడోనని ఇక్కడ నేనూ నా పిల్లలూ ఏడుస్తున్నాం ..మద్దెలో నీ ఎదవ గొడవేంటీ ' అని కళావతి ఎదురుతిరిగేసరికి డౌనైపోయిన నానాజీ 'కనీసం ఈ రెండు వారాలకీ సైకిలు అద్దె డబ్బులన్నా ఇవ్వమ్మా ' అని బతిమిలాడితే 'ఆ డబ్బే నా దగ్గిర ఉంటే నా పిల్లలకి రెండు పూటలా తిండెట్టేదాన్ని కదా ' అని ఏడ్చేసింది.
'ఎండన పడొచ్చేరు ..కొంచెం మజ్జిగ నీళ్లు తాగండని ' కళావతి పెద్ద కూతురు పదేళ్ల పుణ్యవతి ఓ సీనరేకు గ్లాసుతో మజ్జిగిస్తే , ఆ కళావతిని డబ్బుల కోసం బెదిరించాలో లేక ఏడుపాపమని ఓదార్చాలో తెలీక ఆ ఇంటి ముందు కూలబడిపోయేడు నానాజీ .
ఓ వారం రోజుల తర్వాత సాయంత్రప్పూట బాబ్జీ గాడు సైకిలట్టుకునొచ్చి నానాజీకి ఇవ్వాల్సిన అద్దె డబ్బులన్నీ ఇచ్చేసి , ఓ శేరు కరకజ్జం , తీపి బూందీ పొట్లాలు కూడా ఇచ్చి , చెప్పేడు 'నానాజీ గారు . . అమలాపురం దగ్గిర నాగేసర్రావు , వాణిశ్రీ షూటింగవుతూందంటే నేనూ , పూలకొట్టు కిట్టి గాడూ మీ దగ్గిర సైకిలు తీసుకుని వెళ్లేమండి .. అదృష్టం కొద్దీ నాకు నాగేసర్రావు గారికి గొడుగట్టుకునే పని అప్పగించేరండి .. ఇహ చూస్కోండి .. ఆయనకి నీడలా ఉండి , కావాల్సినవన్నీ చూస్కున్నానండి .. ఆయన తెగ సంతోషపడిపోయి , షూటింగంతా అయిపోయిన తర్వాత .. .. ఒడ్డు , పొడుగూ బావున్నావు .. సినిమాల్లోకి రావచ్చు కదా ..అనేసేరండీ !'
'ఏంటీ ..నిన్నే .. ఆ నాగ్గాడు సినిమాల్లోకి ఒచ్చెయ్యమనడమే ?' అని నానాజీ అడిగితే
'నాగ్గాడేంటండీ .. మర్యాదగా నాగేసర్రావు గారు అన్లేరేంటీ ?' అని కోప్పడిపోయాడు బాబ్జీ
'సరేలేవో .. ఇంతకీ నువ్వు చెప్పొచ్చేదేంటీ ?' అన్నాడు నానాజీ
'ఏవీ లేదండి .. అంత పెద్ద నాగేసర్రావు గారే సినిమాల్లోకి రమ్మంటే మనం యెల్లకుండా ఉంటే బాగోదు కదండీ .. మా కళావతి కూడా ఒప్పుకుందండి .. రేపు రాత్రి దొంగల బండికి మెడ్రాసెల్లిపోతున్నాను .. మెల్లగా ఈరోనయ్యాక మా కళావతిని , పిల్లల్నీ తీసుకెళ్తాను ' అని ఓ దణ్ణమెట్టి వెళ్లిపోయేడా బాబ్జీ గాడు
మదరాసెళ్లిన బాబ్జీ కి , 'నాగేసర్రావు గారు మెడ్రాసులో ఉండరు .. ఆయన షూటింగులెక్కువగా హైద్రాబాదులోనే ' అని విజయ వాహిని స్టూడియో బయట నుంచున్న అనేకమంది జనాల్లో ఎవడో తూగో జిల్లావోడు పలకరించి చెప్పేసరికి , ఏడుపొచ్చినంత పనయ్యింది . వొట్టి చేతుల్తో ఊరెళ్ళలేక , అలాగని ఏ సినిమా ఛాన్సు లేక పెయింట్ డబ్బాలో పడిన ఈగలా ఉంది అతని పరిస్థితి .
గోడలమీద సినిమా పోస్టర్లు అంటించడం దగ్గిర్నుంచి , ఆర్కాట్ రోడ్డులోని నేషనల్ థియేటర్ లో దొడ్లు కడగడం దాకా అన్ని పనులూ చేస్తూ సినిమా ఛాన్సు కోసం తెగ ప్రయత్నిస్తున్నాడా బాబ్జీ.
అలా రెండు మూడేళ్లు ప్రయత్నించిన తర్వాత బాపు గారి సినిమా ముత్యాలముగ్గు సినిమా లో రావుగోపాల్రావు పక్కన చిన్న వేషం వచ్చిందని , ఒక్క రోజు పనికి యాభై రూపాయలు ఇచ్చారని పిఠాపురానికి కబురంపేడు .ఆ నెల్లోనే భార్య కళావతిని , పిల్లల్నీ మెడ్రాసొచ్చెయ్యమని ఉత్తరం రాస్తే వాళ్ళు మూటాముల్లె సర్దుకుని పిఠాపురం ఒదిలి బాబ్జీ దగ్గిరికెళ్ళిపోయేరు.
బాబ్జీగాడు ఊరొదిలెళ్ళిపోయినా , పిఠాపురం అంతా ఆడు సినిమా యాక్టరైపోయెడన్న విషయం పాకిపోయి , వాడు నటించిన ముత్యాలముగ్గు సినిమా ఎప్పుడు రిలీజవుద్దా అని అందరూ ఎదురుచూసారు .
చిన్న సెంటరు కాబట్టి ముత్యాలముగ్గు సినిమా పిఠాపురం లో రిలీజవ్వదని , వీలయితే కాకినాడెళ్ళి చూడమని బాబ్జీ గాడు వాడి స్నేహితులందరికీ రాస్తే , ఆళ్లందరికీ నానాజీ గారు సైకిళ్ళు ఊరికే అద్దెకిచ్చేరు ' నా దగ్గిర సైకిలు అద్దెకి తీసుకున్నోడు యాక్టరైయ్యాడు .. అదే గొప్ప విషయం' అంటూ !
రిలీజు రోజు ఉదయాన్నే కష్టపడి సైకిళ్ళు తొక్కుకుంటా కాకినాడెళ్ళి ముత్యాలముగ్గు సినిమా చూసేరు బాబ్జీ గాడి ఫ్రెండ్సు నారాయణ , సత్తిపండు , ఎంకన్న బాబు , దూసి వెంకట్రావు ..ఈళ్లెవరికీ సినిమా లో బాబ్జీ గాడు కనిపించలేదు . ఆరోజు సాయంత్రం తిరిగి పిఠాపురం వెళ్తూ బహుశా కాకినాడకంపిన ప్రింటు లో బాబ్జి గాడి క్యారక్టరు తాలూకా రీలు లేదని , వెంటనే ఆ రోజు రాత్రికి బాబ్జీ గాడికి టెలిగ్రామిచ్చేరు .
ఆ టెలిగ్రామందుకున్న బాబ్జీ ఒళ్ళు మండిపోయి వెంటనే ఉత్తరం రాసేడు 'ఎదవ నా కొడుకుల్లారా .. సినేమా సూడకుండా ఎదవ కబుర్లు సెబుతారా .. ఆ సినిమా పిఠాపురం లో రిలీజవ్వనీండి .. నేను సొయంగా పిఠాపురమొచ్చి, మిమ్మల్నందరినీ సినిమా కి తీసుకెళ్లి, ఒక్కోడి సెమడాలు తియ్యకపోతే ఆ అన్నారం సత్తిబాబు మీదొట్టు ' అంటూ !
ముత్యాలముగ్గు సినిమా చాలా పెద్ద హిట్టైపోయి కాకినాడ లోనే ఆరేడు వారాలు ఆడేసి , ఆ తర్వాత పిఠాపురం శ్రీరామా టాకీసు లో రిలీజని వార్త రాగానే , సత్తిపండు గాడు ఆ విషయం బాబ్జీ గాడికి టెలిగ్రామిస్తే , రిలీజు ముందు రోజుకి బాబ్జీ పెళ్ళాం పిల్లలతో సహా పిఠాపురం లో దిగిపోయేడు .
ఆ సాయంత్రం ఆ షూటింగు విషయాలు అన్నీ వివరంగా చెబుతా , తన ఆక్టింగు చూసి రావుగోపాల్రావు డంగైపోయాడనీ , 'ఇలాంటి కారెక్టర్లు చెయ్యడానికి ఓలిండియా మొత్తానికి బాబ్జీ ని మించినోడు లేడని ' బాపు గారితో చెబుతూంటే ఆయన పైపు కాల్చుకుంటా షూర్ షూర్' అన్నారని వెలంపేట లోని మఱ్ఱిచెట్టు మీది సిమెంటు చప్టా దగ్గర మూగినవాళ్లందరికీ బాబ్జీ గాడు చెప్పేసరికి , అక్కడున్నాళ్లందరూ ఆ మర్నాడు ఉదయం ఆట బాబ్జీ గాడి తో చూసి తీరాలని చెప్పేసుకున్నారు .
సాయంత్రం ఏడవుతుంటే , బాబ్జీ , సత్తిపండు కలిసి ఓ శ్రీ రామా టాకీసు మేనేజర్ పేరూరి చిట్టబ్బాయి గారిని కలిసి ' రేపు ఉదయం ఆటకి బాల్కనీ , కుర్చీ క్లాసులకి ఓ యాభై టిక్కెట్లు కావాలండి ' అని అడిగితే ఆయన వీళ్ళకేసి పిచ్చాళ్ళని చూసినట్టు చూసి 'ఇదేమీ ఎన్ఠీఆర్ , ఏఎన్నార్ సినిమా కాదు ..బాపు గారి సినిమా.. అడిగినోళ్ళకి అడిగినన్ని టిక్కెట్లు ' అన్నాడు
'ఈ సినిమా లో ఈడు యాక్టింగు చేసేడండి .. అందికే ముందు జాగ్రత్తగా బుకింగు చేస్తున్నానండి ' అని సత్తిపండు గాడు చెబితే , దర్జాగా నుంచుని చూస్తున్న బాబ్జీ గాడి కేసి ఆరాధనగా చూసిన చిట్టబ్బాయి గారు 'ఆ మాట ముందే చెప్పొచ్చుకదండీ .. బాపు గారి సినిమా అంటే మాటలా .. ఉండండి ఇప్పుడే కూల్ డ్రింకు తెప్పిస్తాను ' అంటే , గంభీరంగా 'గోల్డు స్పాట్ ' అన్నాడు బాబ్జీ .
మర్నాడు ఉదయం వెలంపేట లోని ఆడంగులంతా ఉన్నవాటిలో మంచి చీరలు కట్టుకుని తయారైపోతే , కళావతి కొత్త చీర కట్టుకోడం తో పాటు మొహానికి మెడ్రాసు నుంచి తెచ్చుకున్న స్నో కూడా ఇంత పూసుకుంది !
బాబ్జీ అందరినీ రిక్షాల్లో ఎక్కించి రామా టాకీసు కి ఉదయం ఆటకి తీసికెళ్ళేడు , హాలు బయట సోడాలమ్ముకునే రావెల కొండబాబు గాడు 'క్లాసు బొమ్మకి ఉదయం ఆటకి ఇంతమంది మాసు జనాలేంటి .. ఈ పెపంచం ఎక్కడికి పోతూందని ' ఆశ్చర్యపడ్డాడు . ఇంతలో బాబ్జీ గాడు 'ఒరే ..అందరికీ సోడాలు కొట్రా ' అని కేకేస్తే కొండబాబు గాడు తెగ ఆనందపడిపోయి గబా గబా సోడాలు కొట్టడం మొదలెట్టాడు .
మెల్లగా సినిమా మొదలైంది . 'టైటిల్సు లో నీ పేరు కనపడలేదేంట్రా ' అని వెంకన్నగాడడిగితే 'కొత్తోడ్ని కదా .. మొదటి సినిమాకే అన్నీ వేసేస్తారేంటీ ' అని కసురుకున్నాడు బాబ్జీ .
ఓ రెండు పాటలైన తర్వాత కూడా బాబ్జీ గాడు తెర మీద దర్శనమివ్వలేదు . 'మీ ఆయనగోరు ఇంకా రాలేదేంటండీ ' అని కళావతిని కటకం అమ్మాజీ అడిగితే 'ఎదవ ఆత్రం పనికి రాదు .. రామాయణం మొదలవుతూనే హనుమంతుడొచ్చేస్తాడా ఏంటీ ' అని కసురుకుంది .
రావు గోపాల్రావు తెర మీద కనపడగానే , 'నా సీనోచ్చింది ..చూడండి ' అని గట్టిగా అరిచేడు బాబ్జీ .. ..
తెర మీద రావుగోపాల్రావు డైలాగు చెబుతూ నిమ్మళంగా కారు వేపు నడుచుకుంటా వస్తున్నాడు., సెక్రట్రీ డిక్కీ పైకెత్తేడు ,
మొహం అటుపక్కకి తిప్పి డిక్కీ లో ఉన్న నారాయుడ్ని చూడగానే 'అదిగ్గో .. మా ఆయన గారు ' అని అరిచింది కళావతి !
***
చాలా సరదాగా ఉంది. పిఠాపురం కథలన్నీ బాగున్నాయి.అభినందనలు.
ReplyDelete