దేవీ దశమహావిద్యలు - 3 - అచ్చంగా తెలుగు

దేవీ దశమహావిద్యలు - 3

Share This
దేవీ దశమహావిద్యలు - 3
శ్రీరామభట్ల ఆదిత్య



దేవీ దశమహావిద్యలు :
3. షోడశి దేవి ( లలితా దేవి )

దేవీ దశమహావిద్యలలో షోడశి మాత రూపం మూడవది. శ్రీ షోడశి మాతకే, లలితాదేవి, మహా త్రిపురసుందరి అని చాలా పేర్లున్నాయి. భండాసుర వధకోసం అమ్మ అవతారం ఎత్తింది. అమ్మవారు చాలా ప్రశాంతంగా, చిరు మందహాసంతో వీరాసనంలో కనిపిస్తుంది. చేత పుష్పబాణములు, చెఱుకు విల్లుతో రమాదేవి ఇంకా వాణీదేవి వింజామరలు వీస్తుండగా శివ కామేశ్వరుడితో పాటుగా, తన సంతానమైన బాలాత్రిపురసుందరి మరియు గణపతి ఇరువైపులా ఉండగా, బ్రహ్మ, నారాయణుడు, రుద్రుడు, షణ్ముఖుడు ఇలా పరివార దేవతలతో దర్శనమిస్తుంది అమ్మ. 

సతీ వియోగంతో బాధపడుతున్న శివుడు తీవ్రమైన తపస్సులోకి వెళ్ళాడు. తారకాసుర వధకోసం దేవతల కోరిక పై ఆదిశక్తి మళ్ళీ హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టింది. ఒకనాడు పార్వతి దేవి శివపూజ చేస్తున్న సమయంలో మన్మథుడు స్వామిపై తన పూల బాణాలు వేయగా రుద్రుడు ఆగ్రహించి మన్మథుడిపై తన మూడో కంటిని తెరిచాడు. వెంటనే మన్మథుడు భస్మమైపోయాడు. శివుడి తమోగుణ శక్తి వలన ఇలా అయింది కాబట్టి ఆ బూడిద కుప్పలో నుండి భండాసురుడనే రాక్షసుడు జన్మించాడు.  

భండాసురుడు తీవ్ర శక్తిమంతుడై సకలలోకాలను బాధించసాగాడు. వాడిని సంహరించడానికి ఆ దేవి లలితా త్రిపురసుందరీ దేవిగా, శివుడు మహాకామేశ్వరుడుగా అవతారమెత్తారు. అప్పుడు అమ్మ తిరిగి స్కందుడిని, మహాగణపతిని, తన వేళ్ళ నఖముల నుండి నారాయణుడి దశావతారాలను, రాజశ్యామలాదేవిని, వారాహిదేవిని, బాలాత్రిపురసుందరి దేవిని మొదలైన వారిని సృజించింది. వీరందరి ద్వారా భండుడిని అతని కుమారులైన విషంగుడిని, విశుక్రుడిని అతని రాక్షస సైన్యాన్ని సంహరించి లోకాలను కాపాడింది.

బ్రహండ పురాణంలోని అగస్త్య మహర్షి మరియు హయగ్రీవస్వామి సంవాదంలోని అమ్మవారి వేయి నామాలే 'శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం'గా ప్రసిద్ధి చెందాయి. శాక్తేయుల తాంత్రిక పరంపరలోని 'శ్రీ విద్య'కు ఈమె అధిదేవత. శ్రీ పురము ఈమె నివాసం. వివిధ రకాల లోహాలతో చేయబడిన 25 పురములతో మహాద్భుతముగా ఉంటుంది శ్రీ పురము.

No comments:

Post a Comment

Pages