దత్తాత్రేయ మహర్షి - అచ్చంగా తెలుగు
దత్తాత్రేయ మహర్షి 
మంత్రాల పూర్ణచంద్రరావు 
 
పూర్వము కౌశికుడు అను బ్రాహ్మణుడు సూర్యోదయము అయిన వెంటనే మరణించును అని తెలిసుకొనిన ఆయన భార్య సూర్యోదయము కాకూడదు అని శాసించెను. ఆ మహా సాధ్వి శాసనమున సూర్యుడు ఉదయించలేదు.దానితో లోకములు అన్నీ అతలాకుతములు అగుటచే దేవతలు అత్రి మహర్షి ధర్మపత్ని అగు అనసూయను వేడుకొనెను. అప్పుడు అనసూయ కౌశికుని పత్నికి నచ్చచెప్పి తన శాసనమును విరమించుకొనునట్లు  చేయగా సూర్యోదయము అయ్యెను.అనసూయ తన పాతివ్రత్య మహిమతో కౌశికుని బ్రతికించెను.దేవతలు ఆమె పాతివ్రత్యమునకు సంతోషము చెందిరి. త్రిమూర్తులు అనసూయను మెచ్చి వరము కోరుకొనుము అని అడుగగా, మీరు ముగ్గురునూ నాకు పుత్రులుగా పుట్టుము అని కోరుకొనెను.అంతట త్రిమూర్తులు వరమిచ్చి వెడలిపోయెను.అప్పుడు అత్రి మహర్షి పుత్రుని కొరకు చేసిన తపము ఫలించి ఆతని వీర్యమున విష్ణుమూర్తి అంశ పవేశించగా పుట్టిన కుమారుడే ఈ దత్తాత్రేయ మహర్షి.
              అప్పుడు భూమి మీద ధర్మాధర్మ విచక్షణలు నశించి, బ్రాహ్మణ క్షత్రియులు యజ్ఞ యాగాదులు మాని యోగ శాస్త్రము కనుమరుగు అగుచుండెను.రాక్షసులు దేవతలను వేధించు చుండెను. అట్టి సమయముననే ఈ దత్తాత్రేయుడు ఉదయించెను. చిన్నతనమునుండీ ఆత్మానంద తత్వముతో పెరుగు చుండెను.దత్తాత్రేయుడు ఇంతటి వాడు అయినందు వలన మిగిలిన ముని కుమారులు ఎల్లప్పుడూ అతనితోనే ఉండ సాగిరి. వారు ఎల్లప్పుడూ తనతోనే ఉండి తన ఆత్మానందమునకు అవరోధము చేయుటవలన వారి నుండి తప్పించుకొనుటకు ఒక కొలనులో మునిగి ఉండెను. ముని పుత్రులు కూడా పట్టు వదలక ఆ కొలను గట్టునే కూర్చుని  అతని కొరకు  ఎదురు చూచుచుండెను. ఎంతకాలము అయినా వారు కదలక పోవుట చూచి లక్ష్మి దేవిని తలవగా ఆమె తన వెంట రాగా దత్తాత్రేయుడు కొలనునుండి బయటకు వచ్చెను. అంతట ముని కుమారులు అతనిని పరిపరి విధములుగా ప్రార్ధించుచూ అతనితోనే ఉండ సాగిరి. దత్తాత్రేయుని ఏకాంతమునకు భగ్నము కలుగుట వలన  వీరి నుండి తప్పించుకోన దలచి లక్ష్మీదేవితో కలసి మద్యపానముచేయుచూ ఆటలాడుచుండెను. అతని ప్రవర్తన నచ్చక మునికుమారులు అతని విడిచి వెళ్లి పోయెను. 
        అప్పటి నుండి దత్తాత్రేయుడు అంతరంగమున తపము చేయుచూ, బయటకు మాత్రము మద్యపాన ప్రియుడిగా, స్త్రీ లోలుడిగా కనపడుచుండెను.యోగులు మాత్రమే ఆతనిని తెలుసుకొనిరి.       
           కొంతకాలమునకు జంభుడు మొదలగు రాక్షసులు ఇంద్రుని పై దాడి చేసి దేవతలను ఓడించి అనేక బాధలు పెట్టుచుండెను.అందుకు ఇంద్రుడు మున్నగు వారు భయపడి తమ గురువు అయిన బృహస్పతిని కలిసి ఉపాయము చెప్పుము అని అడిగెను.అప్పుడు బృహస్పతి ఆలోచించి మీరు అందరూ కలిసి అత్రి మహర్షి కుమారుడగు దత్తాత్రేయుని శరణు జొచ్చి,భక్తితో సేవించిన యెడల ఆతను మీకు ఉపాయము చెప్పును అని చెప్పెను. వెంటనే ఇద్రాదులు గురువు కు నమస్కరించి ఆశీర్వాదము పొంది దత్తాత్రేయ ఆశ్రమమునకు వెళ్ళెను.అక్కడ దత్తాత్రేయుడు కిన్నెర గంధర్వులు, మరియు లక్ష్మి దేవితో కలిసి తేజోవంతంగా కనపడెను.దేవతలు అతనికి మొక్కగా అతని వికృత చేష్టలు చూపుచూ మద్యము తెమ్మని చెప్పగా వారు అట్లే చేసెను.అతడు మద్యము సేవిన్చుచూ లక్ష్మి దేవితో కలిసి పారిపోవుచుండగా ఇంద్రాదులు ఆతనిని పట్టుకొని భక్తీ శ్రద్ధలతో పూజించెను.అప్పుడు దత్తాత్రేయుడు మీరు నా వద్దకు ఎందుకు వచ్చిరి అని అడుగగా జంభాసుర వృత్తాంతము చెప్పి మమ్ము కాపాడుము అని వేడుకొనెను. నేను మధు పాన ప్రియుడను,స్త్రీ లోలుడను నేను ఆ రాక్షసులను చంపలేను, మీరు వెళ్ళిపొండి  అని దత్తాత్రేయుడు పలికెను మహాత్మా మీరు విష్ణుమూర్తి, ఆద్యుడవు,మీతో ఉన్న ఈమె సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే. మీకు నిషిద్ధమయినది ఏదియు లేదు.మమ్ము కాపాడుటకు మీకన్నా సమర్ధుడు ఎవ్వరునూ లేరు అని దేవతలు వేడుకొనిరి.అంత దత్తాత్రేయుడు కరుణించి నన్ను మీరు తెలిసికొనిరి, దేవతలను కాపాడుట కంటే నాకు వేరు పని ఏమున్నది, మీరు వెళ్లి ఆ రాక్షసులతో యుద్ధము చేయుచూ ఇచ్చటకు తీసుకు రండి,నేను వారిని సంహరించెదను అని పలికెను..దేవతలు వెళ్లి జంభాసురుని యుద్ధమునకు పిలుచుకొని దత్తాత్రేయుని ఆశ్రమము వద్దకు వచ్చెను.అక్కడ జంభాసురుడు లక్ష్మి దేవిని చూసి ఆమెను తలపై ఎక్కించుకొని పోవుచుండెను,అప్పుడు దత్తాత్రేయుడు లక్ష్మి దేవి వారి నెత్తిన ఎక్కినది కావున వారిని విడిచిపోవును. కావున మీరు వెళ్లి అ రాక్షసులను సంహరింపుము అని చెప్పగా దేవతలు సంతసించి ఒక్క క్షణముననే రాక్షసులను సంహరించెను. తిరిగి వచ్చి దత్తాత్రేయుని అనేక విధములుగా స్తుతించి వెడలిపోయెను. 
       ఆ సమయమునందు హైహయ వంశమునకు చెందిన కార్తవీర్యార్జునుడు అను రాజు తండ్రి మరణము తరువాత సింహాసనమును అధిష్టించెను. అతనికి సింహాసనము మీద కోరిక లేకపోవుటచే మంత్రులను పిలిచి వారితో ఈ పరిపాలన చేయుచూ, పరాయి దేశములను ఆక్రమిన్చుటకు ప్రజల వద్దనుండి పన్నులు తీసుకొనుట వంటి పనులు నాకు ఇష్టము లేదు.నేను ఆ పనులను చేయలేను,వనవాసమునకు పోయి తపము చేసుకొందును, అనగా అందులో ఒక మంత్రి అయ్యా దత్తాత్రేయ మహర్షి అను ఆయన మహా తపస్సంపంనుడు మీరు ఆయన వద్దకు వెళ్లి ఆశ్రయించిన  మీ కోర్కె తీరును అని చెప్పెను. వెంటనే కార్తవీర్యార్జునుడు అడవికి పోయి దత్తత్రేయిని వద్ద చేరి ఆయన పాదములు వత్తుతూ ఆయనకు కావలసిన మద్య మాంసాదులు అందించుచూ పూజించు చుండెను. ఒకనాడు పాదములు ఒత్తుచుండగా దత్తాత్రేయుని అపాన వాయువు విడుదల అయి ఆ శక్తికి ఆ రాజు చేతులు కాలి పోయెను.ఇంకా అనేక విధములుగా దత్తాత్రేయుడు రాజుని బాధించిననూ విడువక సేవ చేస్తూనే ఉండెను.అది చూసి దత్తాత్రేయుడు ఓరీ నేను స్త్రీలోలుడను,మద్య మంసాహారిని నన్ను ఎందుకు పూజింతువు అని అడిగెను. అందులకు రాజు స్వామీ మీరు అంతస్సుద్ధి కల మహా యోగులు, సాక్షాత్ విష్ణు స్వరూపులు ఆమె లక్ష్మీ దేవి అని నమస్కరించెను.దత్తాత్రేయుడు ఆతని భక్తికి మెచ్చి యేమి కావలెనో కోరుకొమ్మనెను.
అంతట కార్తవీర్యార్జునుడు స్వామీ నాకు వేయి చేతులూ, సమస్త భూమండలము పరిపాలించు శక్తి , సిరిసంపదలు, ధర్మ బుద్ధి,ఏ లోకమునకు అయినా పోగలిగే శక్తి ఇవ్వమని కోరెను. దత్తాత్రేయుడు వానికి ఆ వరములు ఇచ్చి ఓరీ నీవు రాజ్యము అంతయూ ధర్మమును ఆచరించి, బ్రాహ్మణులకు యజ్ఞ యాగాదులకు  సహాయము చేయుచూ,నా భక్తీ యోగమును అంతటనూ వివరింపుము.నీవు ఎప్పుడయితే ధర్మము తప్పి ప్రవర్తింతువో అప్పుడే నీకు మరణము కలుగును అని చెప్పి అంతర్ధానమయ్యెను.
          ఒకనాడు అలర్కుడు దత్తత్రేయునకు నమస్కరించి సుస్థిర జ్ఞానము ఉపదేసిమ్పుము అని కోరెను. దత్తాత్రేయుడు అహంకారము అను విత్తనముతో పుట్టి మమకారము అను మొదలు కలిగి గృహము, క్షేత్రము అను కొమ్మలను కలిగి పుత్రులు భార్య అనుపల్లవములను కలిగి ధనము, ధాన్యము అను పెద్ద ఆకులు వేసి పుణ్య పాపములు అను పుష్పములు పూచి సుఖ దుఃఖము లు అను పళ్ళు కాసి అజ్ఞానము అను కుదుళ్ళతో నిండి ముక్తి మార్గమును మూసి వేయుచున్న మమ  అను శబ్దమును విమల విద్య అను గొడ్డలితో నరికి వేసి తత్వ విధులు, సాదు జనులు తో కలిసి నడిచిన వారు ఎల్లప్పుడూ సంతోషముతో పునర్జన్మ లేకుండా యుందురు. అని ఉపదేశించెను.
           యోగికి ఆత్మను జయించుట ముఖ్యము. కావున ప్రాణాయామముతో దేహ దోషములను జయించ వలెను .కామ జములయిన కర్మములను జయించి శుద్దాత్ముడయి పరమాత్మలో ఇక్యమయి పోవును.
          దత్తాత్రేయ మహర్షి సంఘమును వదిలి పెట్టుటకు వివిధ వేషములు వేసెడి వాడు.విల్లంబులు ధరించి వేట కుక్కలను వెంట తీసుకొని చెంచువాని వలె ఒకసారి,అడవిలో కిరాతకుని వలె మద్య మాంసములు భుజించుచూ ఒకసారి ఇలా ఒక్కొక్క విధముగా సంచరించే వాడు. అయిననూ ఆయన మహా యోగీశ్వరుడు, విచిత్ర చరిత్ర కలిగిన వాడు.

        శ్లో : విభుర్నిత్యానంద  శ్శ్రుతిగణ శిరోవేద్యమహిమా 
              యతో   జన్మాద్యస్య  ప్రభవతి  స మాయాగుణవతః l
             సదాధార  స్సత్యో  జయతి  పురుషార్ధైక ఫలదః
             సదా దత్తత్రేయో  విహరతి  ముదా జ్ఞావల హరి ll
***

1 comment:

  1. చాలా బాగుంది బాబయ్యగారండి. చదువుతుంటే ఎన్నెనో విషయాలు తెలుస్తున్నాయండీ. ధన్యవాదాలు బాబయ్యగారండి.

    ReplyDelete

Pages