నీకు నేనున్నా – 14
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com
(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టిస్తారు చరణ్, విక్రం . హాస్టల్ లో చేరే ఆడపిల్లల విభిన్న మనస్తత్వాలతో కొత్త సవాళ్ళను ఎదుర్కుంటుంది మధురిమ . అందులో వర్ష అనే అమ్మాయి దూకుడుగా ప్రవర్తించి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది . తన కూతురు వర్ష ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతోందని తెలిసి, ఆమెను, తన భార్యను కొడతాడు హరి. ఆమెకు పెళ్లి చెయ్యాలని వెళ్ళిన ప్రయత్నంలో అనుకోకుండా మనోహర్ ను కలుస్తాడు. ఇక చదవండి.)
వెంటనే హరి ముఖంలోకి చూశాడు మనోహర్.
పశ్చాత్తాపపడ్తూ జీవంలేని మనిషిలా అన్పిస్తున్న హరిని ఇంకేమీ అనదల్చుకోలేదు మనోహర్.
"గతం నీకింకా గుర్తుందా మనోహర్” అంటూ నెమ్మదిగా మనోహర్వైపు చూశాడు హరి.
నాది మరచిపోయే గతం కాదుగా హరీ! సాధ్యమైతే నాకు మళ్లీ నా గతాన్ని చూడాలని వుంది. అప్పడు నా గతంలో... అప్పుడే కళ్లాపిజల్లి, ఆ తడి ఎప్పడు ఆరిపోతుందా అని ముగ్గుడబ్బాతోతలుపుచాటున నిలుచుని ఎదురుచూసే మధురిమని చూడాలని వుంది. నేను రాసిన మొదటి ప్రేమలేఖను అందుకొని ఆర్తిగా అందులోని అక్షరాలను తడుముతూ, సిగ్గులమొగ్గైన మధురిమను చూడాలని వుంది..... అమ్మ నవుతున్నానని తెలిసి, ఆనందంగా కంటతడి పెట్టిన, నా భార్య మధురిమను చూడాలని వుంది. నేను ఏమయ్యానో తెలియక, గుండె చెరువై నాకోసం ఆశగా ఎదురుచూసే నా మధురిమను మనసారా చూడాలని వుంది.... ఇది సాధ్యమా హరీ?" అంటూ బాధపడ్డాడు మనోహర్.
"మధురిమను నువ్వు పెళ్లి చేసుకున్నావా మనోహర్?" అంటూ ఆశ్చర్యపోయాడు హరి. మధురిమ విషయంలో హరి అంతరాత్మ ఒక న్యాయమూర్తిలా నిలబడి శిక్షిస్తోంది.
"మధురిమను నేను సెకెండ్ మ్యారేజ్ చేసుకున్నాను హరీ! రాహుల్ పుట్టాడు. రాహుల్ టెన్త్ క్లాసు ఎగ్హామ్స్ రాస్తున్న టైంలోనాకు యాక్సిడెంట్ జరిగి నేను కోమాలోకి పోయాను. గాలి మార్పుకోసం పద్మ నన్ను కేరళ తీసికెళ్లింది. నేను ఎక్కడున్నానో తెలియక మధురిమ రాహుల్ని తీసుకొని ఎటో వెళ్లిపోయింది. నేను కోమాలోంచి బయటపడ్డాక వాళ్లకోసం వెతికి వెతికి అలసిపోయాను" అంటూ తన మనోవేదనంతా హరితో చెప్పాడు మనోహర్.
అయోమయంగా చూస్తున్న హరికి, మనోహర్ ఏం చెబుతున్నాడో అర్థం కాలేదు. మనోహర్ సెల్ కి మిస్డ్ కాల్ ఇచ్చాడు శంకర్.
“నా కారు రెడీ అయింది హరీ! ఇదిగో నా విజిటింగ్ కార్డ్ నువ్వు వరంగల్ నుండి హైదరాబాదు వచ్చినప్పుడు నన్ను కలుఉ. వీలైనపుడు ఫోన్ చేస్తుండు" అంటూ హరి దగ్గర సెలవు తీసుకొని కారు దగ్గరకెళ్లాడు మనోహర్.
మనోహర్ నే చూస్తూ నిలబడ్డాడు హరి.
*****
మనోహర్ కారు కదిలింది. శంకర్, హరి టాక్సీ ఎక్మారు. టాక్సీ కదిలింది.
"నా టాక్సీలో హైదరాబాదు నుండి ఒక ప్రొఫెసర్ని వరంగల్ తీసుకెళ్లాలి హరీ! నిన్ను మీ ఇంటిదగ్గర దింపి నేను వరంగల్ వెళ్తాను" అన్నాడు శంకర్.
"నాకు వరంగల్లో పని వుంది శంకర్! నేను కూడా నీతో వరంగల్ వస్తాను” అంటూ టాక్సీలో అలాగే కూర్చున్నాడు హరి. హరికి టాక్సీ దిగి ట్రైన్ ఎక్కే ఓపిక లేదు.
హైదరాబాదులో ఓ చోట టాక్సీ ఆపుకొని, ప్రొఫెసర్ని ఎక్కించుకొని వరంగల్ వెళ్లింది టాక్సీ. కాకతీయ యూనివర్సిటీ రాగానే ఆ ప్రొఫెసర్ టాక్సీ దిగాడు.
హరి అడ్రస్ చెబుతుంటే వర్ష వుండే హాస్టల్ దగ్గరకెళ్లి టాక్సీని ఆపాడు శంకర్.
శంకర్కి రోజా కూతురు వర్షను చూడాలని తొందరగా వుంది. కానీ హరి ఒక్కడే లోపలకెళ్లాడు.
హరి లోపలకెళ్లినంత వేగంగా, వర్ష లగేజితో బాటు వర్షను కూడా తీసుకొచ్చి టాక్సీలో ఎక్కాడు హరి. వర్షను చూడగానే శంకర్ కళ్లు విబ్రాంతితో విచ్చుకున్నాయి.
అచ్చు తన పోలికల్లో వున్న వర్షను చూడగానే శంకర్ హృదయం తనకి నచ్చిన రాగాలతో పాటలు పాడుకుంది మౌనంగా.
సాత్విక్ మేనమామగా శంకర్ని వర్షకి పరిచయం చేశాడు హరి. టాక్సీలో హరి పక్కన కూర్చుంది వర్ష.
“మీరొస్తున్నట్లు సాత్విక్ ఇపుడే ఫోన్ చేసి చెప్పాడు అంకుల్!” అంది శంకర్ వైపు చూసూ వర్ష.
“అవునా" అన్నట్లు వర్ష వైపు చూసి, తిరిగి ఓ నవ్వు నవ్వి మళ్లీ స్టీరింగ్ వైపు తిరిగాడు శంకర్.
“సాత్విక్లో మీ పోలికలు చాలా వున్నాయి అంకుల్!” అంది వర్ష.“బ్లేడ్ రిలేషన్ కాదమ్మా! ఆ పోలికలు అలాగే వుంటాయి. అది ప్రకృతి ధర్మం" అన్నాడు వర్ష వైపు ప్రశాంతంగా చూస్తూ శంకర్. ప్రపంచంలో ఉండే తృప్తి అంటా శంకర్ ముఖంలో కన్పించింది వర్షకి.
“టాక్సీని హైదరాబాదు పోనివ్వనా హరీ!” అంటూ హరివైపు చూశాడు శంకర్.
“వద్దు శంకర్ వర్షను వేరే హాస్టల్లో జాయిన్ చేసి వెళదాం. ఈ హాస్టల్ మాకు నచ్చలేదు" అన్నాడు హరి.
"మరి ఎక్కడ కెళ్లాలో అడ్రస్ చెప్పండి వెళదాం" అన్నాడు శంకర్. వర్షను చూసినప్పటి నుండి శంకర్ మనసు చాలా ఉత్సాహంగా వుంది.
“ఇక్కడికి దగ్గర్లోనే హంటర్ రోడ్డులో 'మధురిమ గర్స్ హాస్టల్ వుంది. అక్కడికి పోనివ్వు శంకర్! వర్షను అక్కడ జాయిన్చేసి వెళ్దాం" అన్నాడు నిశ్చింతగా హరి.
"ఆ హాస్టల్ బావుంటుందా? అన్నాడు శంకర్.
“ఇంతకుముందు వర్ష ఆహాస్టల్లోనే వుండేది శంకర్ చాలా బావుంటుంది. ఆ హాస్టల్ ఫ్రెండెవరో చెప్పారని అనవసరంగా ఈ హాస్టల్కి వచ్చింది. ఇదో పేరులేని హాస్టల్. మేడమ్ రాక్షసి" అంటూ రాణా గురించి దాచిపెడుతూ మేడమ్ ని దుయ్యబట్టాడు హరి.
హరి చెప్పేది వింటూ "మధురిమ హాస్టల్” ముందుకి టాక్సీని తీసికెళ్లి ఆపాడు శంకర్.
వర్షను తీసుకొని నేరుగా పైకెళ్ళాడు హరి.
శంకర్ టాక్సీలో కూర్చొన్నాడు.
పైకెళ్లి మధురిమ ఆఫీస్ రూమ్ లో కూర్చొన్నాడు హరి,వర్ష. అక్కడింకా నలుగురు పేరెంట్స్ మధురిమ కోసం వెయిట్ చేస్తున్నారు. మధురిమ గురించి అక్కడ కూర్చున్నవాళ్లను అడిగాడు హరి.
మేడమ్ లేరండి! మడికొండ వెళ్లారు. ఇంకో పది నిముషాల్లో వస్తారు. ఇప్పడే ఫోన్ చేశారు. మేం కూడా మేడమ్ కోసమే వెయిట్ చేస్తున్నాం" అంటూ హరితో చెప్పారు అక్కడ కూర్చుని వున్న పేరెంట్స్ వాళ్లు మాట్లాడే విధానంలో మేడం పట్ల ఎనలేని గౌరవం కన్పిస్తోంది.
వర్ష హరి దగ్గర ఎక్కువసేపు కూర్చోకుండా, అంతకుముందు తను వున్న బ్లాక్ లోకి వెళ్లింది. తనకి తెలిసిన అమ్మాయిలకి హాయ్ చెప్పింది. మళ్లీ తను హాస్టల్కి వస్తున్నట్లు చెప్పింది. వర్ష వేష, భాషల్లో వచ్చిన మంచి మార్పు చూసి ఆశ్చర్యపోతూ సంతోషించారు అమ్మాయిలంతా.
మేడమ్ నిన్ను చూస్తే చాలా మెచ్చుకుంటుంది వర్షా! అంత మార్పు వచ్చింది నీలో అన్నారు కొంతమంది అమ్మాయిలు. నవ్వింది వర్ష.
ఆఫీసు రూంలో పేరెంట్స్ చెప్పుకునే మాటలు వింటూ కూర్చున్న హరి ఎదురుగా క-బోర్డ్లో వున్న మధురిమ, మనోహర్ల స్టాండింగ్ ఫోటోని చూశాడు.
ఆ ఫోటోని చూడగానే హరి దిగ్ర్భాంతికి గురయ్యాడు.
ఇదెలా సాధ్యం? మధురిమ మళ్లీ ఎలా బ్రతికింది?
హాస్టల్ నడిపేది ఆ ఫోటోలో వున్న ఆవిడేనా అని వెంటనే అక్కడున్న పేరెంట్స్ ని అడిగాడు హరి, వాళ్లు అవునని చెప్పారు. హరిలో జీవకళ వచ్చింది. మధురిమను చంపానన్న చింతను అప్పటికప్పుడే ఎవరో చేత్తో తీసేసినట్లని పెంచింది.
వెంటనే చకచక మెట్లదిగి శంకర్ దగ్గరకి వెళ్లాడు హరి.
హరి మెట్లు దిగుతున్న విధానం చూసి బిత్తరపోయాడు శంకర్.
శంకర్! నేను చంపాననుకున్న మధురిమ బ్రతికే వుంది. నేను హంతకుడ్నికాను" అంటూ సంతోషంగా టాక్సీలో వున్న శంకర్ భుజాలు పట్టుకొని ఊపాడు హరి.
మధురిమను అప్పుడెప్పుడో కర్నూల్ లో కత్తితో పొడిచి చంపి, రక్తం కారుతున్న కత్తితోనే తన కార్లో ఎక్కి ఇప్పుడు నేను హంతకుడిని కాను అంటున్న హరివైపు పిచ్చివాడ్ని చూసినట్లు చూశాడు శంకర్.
“ఈ వయసులో కూడా జోక్స్ బాగానే వేస్తున్నావు హరీ!” అంటూ నవ్వాడు శంకర్.
నవ్వాడు శంకర్ జోక్స్కాదు శంకర్! పైన మధురిమ ఫోటో వుంది" అంటూ వూహించని నిధి దొరికినంత సంబరంగా తన చేత్తో మధురిమ ఆఫీసు రూంని చూపించాడు.
శంకర్ నమ్మలేదు. లోలోపల ముసిముసిగా నవ్వుకున్నాడు.
“పైన ఫోటో వుందా? ఇంకా నయం మనిషి వుందనలేదు. చూడు హరీ! ఈ హాస్టల్ మధురిమవాళ్ల బంధువులదై వుంటుంది. మధురిమపై అభిమానంతో ఫోటో పెట్టుకొని వుంటారు" అన్నాడు శంకర్.
"అక్కడున్న పేరెంట్స్ని అడిగాను శంకర్! ఆఫోటోలో ఉండే ఆవిడదేఈ హాస్టలట. ప్రస్తుతం మడికొండ వెళ్లిందట. ఇప్పుడొస్తుంది. ముందుగా నేనే చూడాలి. ఇక్కడే వుంటాను. పైకెళ్లను" అంటూ అక్కడే నిలబడ్డాడు హరి.
వెంటనే మనోహర్ గురొచ్చాడు హరికి పర్స్ లోంచి మనోహర్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ని బయటకు తీశాడు. ఆత్రుత ఎక్కువై చెమట్ల పోస్తున్నాయి హరికి.
“ముందు మధురిమ ఇక్కడున్నట్లు మనోహర్కి ఫోన్ చెయ్యాలి శంకర్! నా సెల్లో బ్యాలెన్స్ లేదు. ఒకసారి నీ సెల్ ఇవ్వు, మనోహర్కి ఫోన్ చేస్తాను" అంటూ శంకర్ సెల్ఫోన్ తీసుకొని మనోహర్కి కాల్ చేశాడు హరి.
"మీరు కాల్ చేస్తున్న సబ్సైబర్ ప్రస్తుతం అందుబాటులో లేరు"అంది ఆపరేటర్ మాటలు వినగానే నీరసం వచ్చింది హరికి.
అయ్యో! ఇదేంటి మనోహర్ సెల్ కలవట్లేదు" అని పైకే అంటూ మళ్లీ అదే నెంబర్కి డయల్ చేశాడు హరి. మళ్లీ అలాగే చెప్పింది ఆపరేటర్.
“మళ్ళీ అలాగేచెప్తుందే." అనుకుంటున్న హరిగుండెలో రాయి పడ్డట్లు అయింది.
విపరీతమైన టెన్షన్ ఫీలవుతున్న హరిని టాక్సీ అద్దాల్లోంచి గమనిస్తున్నాడు శంకర్. రోడ్డుమీదకెళ్లి నిలబడ్డాడు హరి.ఆ బిల్డింగ్ వైపు చూసి ఆశ్చర్యపోతూ గుండెలపై చేయివేసుకున్నాడు.
"వామ్మో! నాతో చదువుకున్న ఆ మధురిమ, ఇంతపెద్ద బిల్డింగ్లో హాస్టల్ నడుపుతుందా?" అనుకున్నాడు మనసులో హరి. మనసులోనే కాదు పైకే అంటుంటే శంకర్కి విన్పించాయి ఆ మాటలు.
ఇదంతా చూస్తున్న శంకర్కి, హరికి హై బి.పి. వున్నట్లు అర్థమైంది. హై బి.పి. వుంటేనే మనిషికి అంత ఆవేశం వుంటుందని వాళ్ల బామ్మ చెప్తుండేది శంకర్కి, రిలాక్స్గా తన డైవింగ్ సీట్లో కూర్చునివున్న శంకర్ హరివైపు చూస్తూ నుదుటిమీద తన చేత్తో కొట్టుకున్నాడు.
అప్పడే ఖరీదైన కారొకటొచ్చి అక్కడ ఆగింది. అందులోంచి చరణ్, మధురిమ దిగి చకచక పైకెళ్లారు. వాళ్లు దిగాక మెల్లగా కారు దిగాడు దామోదర్ రెడ్డి. చరణ్, మధురిమను చూస్తుంటే వాళ్లేదో చాలా ముఖ్యమైన పనిమీద తిరుగుతున్నట్లు అర్థమవుతోంది.
హరి పలకరించేలోపలే దామోదర్రెడ్డి కూడా పైకెళ్లి ఆఫీస్ రూములో కూర్చున్నాడు. హరిని గమనించలేదు దామోదర్రెడ్డి
ఆయాసంగా అన్పించినా, ఆగకుండా గబగబ మెట్టెక్కి పైకెళ్లాడు హరి. ఇదంతా చూస్తూ టాక్సీలోనే కూర్చున్నాడు శంకర్.
చరణ్ - మధురిమ అక్కయ్య కొడుకని అక్కడెవరో అనుకుంటుంటే విన్నాడు హరి. చదువుకునే రోజుల్లో మధురిమ ఎత్తుకుని తిరుగుతుండే ఆ చిన్నబాబు గురొచ్చి ఔరా అనుకున్నాడు హరి, ఆ బిల్డింగ్లో అడుగుపెట్టిన క్షణం నుండి అంటా వింతగానే వుంది హరికి.
అక్కడున్న పేరెంట్స్ తో తొందర, తొందరగా మాట్లాడి పంపించేసింది మధురిమ, హరి వెళ్లి మధురిమకు ఎదురుగా కూర్చున్నాడు. హరి గుండె దడదడ కొట్టుకుంటోంది.
“చూడు నాయనా! ఏదైనా పని వుంటే మేడమ్ని రేపు కలవండి! ఇపుడు వాళ్ళు అర్జెంట్ గా బయటకెళ్తున్నారు. రేపు ఓల్టేజ్ హెం ఓపెన్ చేసే హడావిడిలో వున్నారు మేడమ్! ప్లీజ్ అర్థం చేసుకోండి!" అన్నాడు హరిని ఉద్దేశించి దామోదర్రెడ్డి.
మధురిమ ఏవో పేపర్స్ సర్దుకుంటూ త్వరగా బయటకెళ్లే ప్రయత్నంలో వుంది.
"దామోదర్ రెడ్డి గారు! నేను హరిణి. అలా చెప్తే మీరు గుర్తుపడతారో లేదో. నేను మనోహర్ ఫ్రెండ్ ని. ఇంతకుముందే నేను మనోహర్ని చూశాను? అంటూ మనోహర్ని గుర్తుచేస్తే తనని పట్టించుకుంటారన్న స్వార్ధంతో మనోహర్ని
చూశానని చెప్పాడు హరి.
మనోహర్ పేరు వినగానే చేస్తున్నపని ఆపేసి బొమ్మలా నిలబడి పోయిందిమధురిమ.చరణ్, దామోదర్రెడ్డిల పరిస్థితి కూడా అలాగే వుంది.
“నువ్వు చెప్పేది నిజమా నాయనా? మనోహర్ నీకెక్కడ కలిశాడు?అతన్ని మాకు చూపించగలవా? అంటూ ఆత్రంగా, ఆనందంగా అడిగాడుదామోదర్ రెడ్డి.
మనోహర్ కారు ట్రబులిచ్చి ఓచోట ఆపుకొని వుంటే నేనే వెళ్లి
కలిశానండీ! ఆయన ప్రస్తుతం హైదరాబాదులోనే ప్రాజెక్ట్ డైరెక్టర్గా వున్నారు. కొంతకాలం హైదరాబాదులో లేరట. రెస్ట్ తీసుకోవటం కోసం కేరళ వెళ్లారట. ఇదిగోండి ఆయన విజిటింగ్ కార్డ్." అంటూ దామోదర్రెడ్డి చేతికి మనోహరిచ్చిన విజిటింగ్ కార్ద్ యిచ్చాడు హరి.
ఆ విజిటింగ్ కార్డు చూడగానే మధురిమ కళ్లు ఆనందసాగరాలయ్యాయి.
విజిటింగ్ కార్డు ఆయనదే బాబాయ్! ఇప్పడే ఆయనకి కాల్ చేద్దాం" అంటూ తన సెల్ఫోన్ లోంచి సంతోషంగా మనోహర్ నెంబర్కి కాల్ చేసింది మధురిమ, ఆమె డయల్ చేస్తున్న టైంలో, మనోహర్ నెంబర్ని తన సెల్స్టోన్లో సేవ్ చేసుకున్నాడు చరణ్.
మధురిమకి మనోహర్ ఫోన్ కలవలేదు. నిరాశగా దామోదర్ రెడ్డి వైపుచూసింది మధురిమ. చరణ్ కూడా మనోహర్ నంబర్ కి ట్రై చేస్తున్నాడు.
నెంబరు దొరికిందిగా! కలుస్తుంది లేమ్మా! ఎందుకంత బాధపడ్డావ్ మళ్లీ టై చేద్దాం" అంటూ తన సెల్లోంచి టైచేస్తూ కూర్చున్నాడు దామోదర్రెడ్డి
హరి మధురిమ వైపు చూశాడు.
మేడమ్! నేను వర్ష తండ్రిని. వర్షను మీ హాస్టల్లో మళ్లీ జాయిన్ చేద్దామని వచ్చాను. నేనిలా మీదగ్గరకి వస్తున్న టైంలోనే దారిలో మనోహర్ కలిశాడు" అన్నాడు హరి. "వర్షంటే బి.టెక్ చేస్తోంది ఆ అమ్మాయేనా?” అంటూ క్యాజువల్గా అడిగింది మధురిమ.
“అవును మేడమ్! అన్నాడు హరి. ఓక్షణం హరిముఖంలోకి చూసింది మధురిమ,
శత్రువుల్ని మరచిపోయి క్షమిస్తే మనశ్శాంతిగా వుంటుందని హరినెప్పడో
మరచిపోయింది మధురిమ, సాక్షాత్తూ ఆ హరే వచ్చి ముందు కూర్చునివున్నా మధురిమకు ఆ హరి చేసిన పనులేవీగుర్తుకు రావటం లేదు.
మీ వర్షను మెయిన్టెయిన్ చెయ్యటం నావల్ల కాదు హరిగారు! అనుక్షణం నేను సఫరవుతూ మీ అమ్మాయిని నా హాస్టల్లో వుంచుకోవలసిన అవసరం నాకు లేదు. ఇకమీరు వెల్గొచ్చు” అంది మధురిమ,
"మా అమ్మాయి వల్ల మీకెలాంటి ప్రాబ్లమ్స్ రావని నేను హామీ యిస్తున్నాను మేడమ్ వర్ష ఇప్పుడు చాలా మారిపోయింది. చూస్తే మీకే తెలుస్తుంది" అన్నాడు హరి.
మీరు ఎన్నైనా చెప్పండి వర్ష విషయంలో నా మనసు మారదు" అంది నిర్మొహమాటంగా మధురిమ.
“దామోదర్ రెడ్డి గారు మీరైనా నచ్చచెప్పండి సార్! పెద్దవారు. అన్నీ తెలిసినవారు. కాస్త్ర మా పట్ల దయచూపండి!” అంటూ దామోదర్రెడ్డి వైపు చూశాడు హరి.
ట్రై చెయ్యగా. చెయ్యగా మనోహర్ నెంబరు కలవటంతో మనోహర్తో మాట్లాడుతున్నాడు దామోదర్ రెడ్డి. ఈ నెంబరు ఇప్పడే కలవాలా అని లోలోపల విసుక్కున్నాడు హరి.
“నీ నెంబరు ఇప్పడే హరి ఇచ్చాడు మనోహర్. ఇదిగో మధురిమ నా పక్కనే వుంది. నిన్నూ మధురిమను కలిపిన ఘనత హరిదేనయ్యా, మీ ఇద్దరు బంగారు పూలతో పూజ చేసినా హరి ఋణం తీర్చుకోలేరు" అంటూ మనోహర్తో దామోదర్రెడ్డి ఫోన్లో చెబుతుంటే కృతజ్ఞతగా హరివైపు చూసింది మధురిమ, ఆమె కళ్లలో సన్నటి నీటిపొర కదిలినట్లు హరి కళ్లకి కన్పించింది.
ఆశ్చర్యం ఎక్కువై హరి కళ్ళూ, నోరు ఆవులించాయి.
యాదృచ్చికంగా మనోహర్ ని చూసిన తను, వాళ్ళ దృష్టిలో ఇంత మంచివాడు కావడం హరికి థ్రిల్లింగ్ గా వుంది. మంచి పనులు మనుషుల్ని ఇంతగా కదిలిస్తాయని హరికి తొలిసారిగా అనుభవం లోకి వచ్చింది.
“వర్షను నేను జాయిన్ చేసుకుంటాను. తీసుకురండి హరిగారు! వర్షను జాయిన్ చేసుకున్నాకే నేను బయటకు వెళ్తాను. అన్నట్లూ! నేను ‘ఒల్దేజ్ హోం’ పెడుతున్నాను. రేపే దాని ప్రారంభోత్సవం. ఫోన్లో మావారితో చెప్పాను. ఆయన ఇప్పుడే బయలుదేరి వరంగల్ వస్తున్నారు. ఆయన నెంబర్ ఇచ్చి మిమ్మల్ని ఇలా కలిపినందుకు ఆయన తరపున, నా తరపున కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను. రేపు జరగబోయే నా ‘మధురిమ ఒల్దేజ్ హోమ్’ ప్రారంభోత్సవానికి మీరు తప్పకుండా రండి హరిగారు!” అంటూ మనస్ఫూర్తిగా హరిణి ఆహ్వానించింది మధురిమ.
ఆమె తనని అంతగా గుర్తించి, ఆహ్వానించినందుకు హరి ఎంతగానో ఉబ్బితబ్బిబ్బు అయ్యాడు. కల్మషాన్ని వదిలిపెట్టిన అతని హృదయానికి తొలిసారిగా నిజమైన ఆనందం దొరికింది.
“తప్పకుండా వస్తాను మేడమ్!” అంటూ సంతోషంగా చెప్పాడు హరి.
వర్షను తన హాస్టల్ లో జాయిన్ చేసుకుంది మధురిమ. రాణా వర్షను ఇంకేమీ చెయ్యాలేడన్న ధైర్యం వచ్చింది హరికి.
******
No comments:
Post a Comment