తెనాలిరామకృష్ణ విరచిత పాండురంగ మహాత్మ్యం
బాలాంత్రపు రమణ
కవిప్రశంస
సాధారణంగా కవులకూ, రచయితలకూ తమ రచనలద్వారా కీర్తీ ప్రతిష్ఠలు వస్తాయి. మనుచరిత్రము ద్వారా ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనామాత్యునికి ఎనలేని కీర్తి లభించింది. కానీ, వారి రచనల గురించి పామరజనానికి తెలియకపోయినా అత్యంత ప్రసిద్ధిని పొందిన వారు మహాకవి కాళిదాసు మరియు తెనాలి రామకృష్ణుఁడు.
కాళిదాసు మహాకవి రచించిన కావ్యాలన్నీ సంస్కృతంలోనే ఉండబట్టి ఈ కాలంలొ అవి సంస్కృతపండితులకి మాత్రమే అర్థమౌతాయి. పామరులకి కాళిదాసు రచించిన కుమారసంభవం, మేఘసందేశం, రఘువంశం, అభిజ్ఞానశాకుంతలం మొదలైన మహాకావ్యాలు అవగతం కాకపోయినా, తను కూర్చున్న కొమ్మను నరుక్కున్న వెఱ్రి గొల్లడిగా, మంత్రికుతంత్రం వల్ల రాజకుమర్తెని పెళ్ళి చెసుకొని, ఆమె ప్రోద్బలం వల్ల కాళికాదేవి కటాక్షం సంపాదించి మహాకవిగా ఆవిర్భవించడం వగైరా కథలన్నీ యావద్భారతదేశంలో బహుళ ప్రచారాలు.
ఆదే విధంగా మన తెనాలి రామకృష్ణుఁడు. ఆయన రచనలేమిటో, ఆయన ఎంతటి మహాకవో తెలియని అసంఖ్యాకులకి, తరతరాలుగా ఆయన వికటకవిగా హాస్యకథల హీరోగా సుపరిచితుడు. అతని పేరు చెబితేనే ఫక్కుమని నవ్వు వచ్చేటంతటి ఆంధ్రుల అభిమాన హాస్యరస చక్రవర్తి మన తెనాలి రామలింగడు. ఒక్క తెలుగునాటనేకాక, యావద్దక్షిణ భారతదేశంలోకూడా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా, హాస్యచతురుడిగా, సరసుడైన వికటకవిగా, సమస్యాపూరణంలో దిట్టగా, ఎటువంటి జటిలమైన సమస్యనైనా చిటికలో సమర్థవంతంగా పరిష్కరించే మేధావిగా ఆయన ఖ్యాతి చెందారు. ఆయన పేరిట తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సాహిత్యాల్లో కూడా ఎన్నో హాస్యకథలు ప్రాచుర్యానికి వచ్చాయి.
అయితే, కవిత్వం దగ్గఱకొచ్చేసరికి, తెలుగు పండితులకీ తెలుగు భాషావేత్తలకీ మాత్రమే ఆయనయొక్క ఉద్దండ పాండిత్యమూ, భాషా పటిమా, పదగుంఫనమూ, భావగంభీర్యమూ, వగైరాలు తెలుస్తాయి. గ్రంథరచన దగ్గఱ కొచ్చేసరికి ఆయన వికటకవిత్వ తత్త్వం మాయమౌతుంది. ఆయన వ్రాసిన పాండురంగ మాహత్మ్యం తెలుగు పంచమహా కావ్యాల్లో ఒకటిగా పండితులచే పరిగణించబడుతోంది.
ముక్కు తిమ్మనగారి “పారిజాతాపహరణము”
అల్లసాని వారి “మనుసంభవము”
శ్రీకృష్ణదేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”
తెనాలి రామకృష్ణుఁని “పాండురంగ మాహత్మ్యము”
రామరాజభూషణుని “వసుచరిత్రము”
ఈ ఐదు గ్రంథాల్నీ తెలుగులో పంచమహాకావ్యాలుగా పండితులు నిర్ధారించారు. (ఈ ఐదు గ్రంథాలలో ఒకదాని బదులు శ్రీనాథవిరచిత “శృంగారనైషధం” పంచమహాకావ్యాలలో ఒకటిగా చెబుతారు.) ఈ ఐదు గ్రంథాల్నీ క్షుణ్ణంగా పారాయణం చేసి అర్థం చేసుకొంటే తెలుగు భాష సంపూర్ణంగా వచ్చేస్తుంది అని పెద్దల ఉవాచ.
తెనాలి రామకృష్ణుఁడిగా ప్రసిద్ధికెక్క్కిన ఈ మహాకవి యొక్క అసలు పేరు : గార్లపాటి రామలింగయ్య. జననం క్రీ.శ. 1495. ఊరు తెనాలి. గుంటురు జిల్లా, తెనాలిసమీపంలోని గార్లపాడు వీరి పూర్వీకుల నివాసం. ఎప్పుడో వచ్చితెనాలిలో స్థిరపడ్డారు. ప్రథమశాఖ నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతన్ని కన్న ధన్యజీవులు: తల్లి లక్కమాంబ, తండ్రి రామయ్య.
ఈయన తొలిదశలో శైవుడు. గురువు పాలగుమ్మి ఏలేశ్వరుడు. అతిపిన్న వయసులోనే సంస్కృతాంధ్ర కావ్యాలూ, నాటకాలూ చదివి, అలంకారాలూ, వ్యాకరణం, ఛందస్సు, ఆసుకవిత్వంలో నిష్ణాతుడయ్యాడు. అప్పట్లోనే అతనికి "కుమారభారతి" అనే బిరుదు కూడా వుండేది. శివకవిగా “ఉధ్భటారాధ్య చరిత్రము” అనే శైవకావ్యాని వ్రాశాడు.
బ్రతుకుతెరువుకోసం, రాజాదరణ సంపాదించడానికి తెనాలి నుండి ముందుగా కొండవీటి ఆస్థానానికి, అక్కడినుంచి హంపీలోని రాయలవారి భువనవిజయానికీ చేరుకున్న రామలింగకవి, వైఖాసన సాంప్రదాయ వైష్ణవమతావలంబియై, రామకృష్ణుఁడిగా అవతరించాడు. అతనికి వైష్ణవ దీక్షనొసగిన గురువు శ్రీ భట్టరు చిక్కాచార్యులవారు. అక్కడ “కందర్పకేతు విలాసం" "హరిలీలా విలాసం” మొదలైన కావ్యాలు వ్రాశాడు.
"ప్రౌఢకవి"గా “పాండురంగమాహత్మ్యం” అనే బృహత్కావ్యాన్ని, అవసానదశలో “శ్రీ ఘటికా చలమాహత్మ్యము” అనే మహాకావ్యాన్నీ రచించాడు. ఈ ఆఖరిగ్రంధానికి అవతారిక వ్రాయకుండానే - అంటే దాన్ని ఎవరికీ అంకితమివ్వకుండానే - 95 ఏళ్ళ సుధీర్గ జీవన యానం తరువాత, పరమ పద సోపానాన్నధిరోహించాడు. ఆయన్ని తీసుకెళ్ళడానికి పరమశివుని ప్రమధగణాలూ, శ్రీమహావిష్ణువు యొక్క దూతలూ చెరో దివ్య విమానాన్నీ తీసుకువచ్చి వాదులాడుకొని ఉంటారు !
తెనాలి రామలింగని గురించి బహుళ ప్రచారంలో ఉన్న హాస్యకథల జోలికిగానీ, భువనవిజయానికి వచ్చిన వివిధ పండితుల్ని ఆయన తన తెలివితేటలతోనో, కుతంత్రంతోనో (ఉదాహరణకి: తిలకాష్టమహిషబంధనము, మేక-తోక పద్యం వగైరాలు) తికమకపెట్టేసి భువనవిజయం యొక్క పరువు నిలబెట్టిన ఉదంతాలగురించిగానీ నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కేవలం ఈ మహాకవియొక్క సాహితీ ప్రజ్ఞాపాటవం గురించి ముచ్చటించడమే నా ఉద్దేశం.
అల్లసానివారి అల్లికజిగిబిగి
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాడురంగవిజయు పద గుంఫనంబును - అన్నారు పండితులు.
కాబట్టి “పాండురంగమాహత్మ్యం” కథాసంగ్రహాన్నీ, మచ్చుకు కొన్ని పద్యరత్నాల్నీ జ్ఞాపకం చేసుకుందాం.
ఈ మహాకవి రచనలలో మూడు గ్రంథాలు మాత్రమే ఇప్పుడు లభ్యాలు. అవి - 1) ఉద్భటారధ్యచరిత్రము, 2) పాండురంగ మాహత్మ్యము, 3) ఘటికాచలమాహత్మ్యము.
మన తెలుఁగు పంచమహాకావ్యాల్లో ఒకటిగా పరిగణించబడిన పాండురంగ మాహత్మ్యం అనే మహాకావ్యాన్ని తెనాలి రామకృష్ణకవీంద్రుడు విరూరి వేదాద్రి మంత్రికి అంకితమిచ్చి అతడ్ని అమరుణ్ణి చేశాడు. ఈ వేదాద్రి మంత్రి పొత్తపినాటి చోడ ప్రభువైన పెద్ద సంగభూపాలుని వద్ద వ్రాయసకాడు.
ఈ చిగురాకు నీప్రసవ మీపువుఁ దేనియ యెంత యొప్పెడిన్
జూచితిరే యటంచుఁ దనచుట్టు శుకాదులుఁ గొల్వగాఁ గప
ర్థాంచిత చంద్ర గాంగజలమైన శివాహ్వయకల్పశాఖ వే
దాచల మంత్రికీర్తి కలశాబ్దిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్
శివుడు తన కృతిభర్తను పాలించు గాక యన్న యాశీర్వచనము. శివుడు కల్పవృక్షము. శుకమహర్షి మొదలైనవారీ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారు. శివుని జుత్తు - జడముడి - చివురాకు. చంద్రుడు పువ్వు. గంగ తేనియ.
ఉదయం బస్త నగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టి రా
విదితంబైన మహిన్ మహాంధ్ర కవితా విద్యానల ప్రౌఢి నీ
కెదురేరీ? సరసార్థ బొధఘటనాహేల పరిష్కార శా
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా! సాంద్ర కీర్తీశ్వరా !
తూర్పు కొండలు, పడమటి కొండలు, దక్షిణసముద్రము, ఉత్తరాన హిమాలయపర్వతం - ఈ నాలుగు ఎల్లల మధ్య గల యావద్భారత దేశంలో మహాంధ్ర కవితా విద్యలో, ఓ రామకృష్ణకవీంద్రా, నీ అంతటి మహాకవి వేరొకరు ఎవరు? ఎవరూ లేరు. సరసమైన అర్థబోధ ఘటించెడి ఒయ్యరపు నగలు గల సరస్వతీ దేవి నీ రూపము! అని విరూరి వేదాద్రి మంత్రి అన్నాడని పాండురంగమాహత్మ్యము అవతారికలో రామకృష్ణకవీంద్రుడు వ్రాసాడు.
పలుకుం దొయ్యలి మోవి కాంతి కెనయౌ బాగాలు నయ్యింతి చె
క్కులఁ బోలుం దెలనాకులయ్యువిద పల్కుల్వంటి కప్రంపుఁ బ
ల్కులతోఁ గూడిన వీడియంబొసఁగు నాకుం బద్మనాభార్చనా
కలనా పావన హస్తకంకణ ఝణత్కారంబు తోరంబుగన్
కృతి స్వీకరించే సందర్భంలో వేదాద్రి మంత్రి మహాకవికి తాంబూలం ఇచ్చాడు. కవి ఆ తాంబూలాన్ని ఈ రమణీయమైన పద్యంలో వర్ణిస్తున్నాడు.
పలుకుల తొయ్యలి - సరస్వతీదేవి - పెదవుల (మోవి) కాంతికి సమానమైన (ఎనయౌ) పోకచెక్కలు (బాగాలు) (“మౌళి” కాంతి కెనయౌ - అనే పాఠాంతరం కూడా ఉంది. సర్వశుక్లాం సరస్వతీ అన్నారు; ఆవిడ ఆపాదమస్తకం తెలుపేనట!) ఆ ఇంతి చెక్కులను పోలే పండుతమలపాకులు (తెలనాకులు) (తమలపాకుల్లో కవటాకులెంత భోగమో పండుటాకులు అంతకంటే భోగమట). ఆ యువతి పలుకులవంటి పచ్చకర్పురపు పలుకులతో కూడిన తాంబూలాన్ని ఇచ్చాడు. ఏ చేతులతో అయితే పద్మనాభస్వామిని నిత్యం అర్చిస్తాడో ఆ చేతులతో - కంకణాలు ఝణఝణ ధ్వనులు చేస్తున ఆ హస్తాలతో ఈయనకి తాంబూలం అందించాడట. బంగారపు పళ్ళెరంలో నిండా కాసులు పోసి మధ్యలో తాంబూలం పెట్టి ఇచ్చి ఉంటాడు.
(వచ్చేనెల తరువాయి భాగం)
No comments:
Post a Comment