సుబ్బుమామయ్య కబుర్లు!
పొదుపు
పిల్లలూ!
మీ అమ్మానాన్నలో, ఇంటికొచ్చిన పెద్దవాళ్లో మీమీద ప్రేమతో మీకిచ్చే డబ్బు ఏం చేస్తారు? అప్పటికప్పుడు మీక్కావలసింది కొనేసుకుంటారా? లేక డబ్బాలో దాచుకుంటారా? డబ్బు చేతిలో పడంగానే తినేవాటినుంచి, ఆడుకునే బొమ్మలదాకా అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. కదూ! అది తప్పుకాదర్రా! కాని, కొంత డబ్బుతో కావలసింది కొనుక్కుని, కొంత దాచుకోవాలి. ఎందుకంటే ముందు ముందు ఎప్పుడన్నా మనకి కావలసింది కనిపిస్తే కొనుక్కోవచ్చు. అవసరాలకి వాడుకోవచ్చు. దీనినే పొదుపు అంటారర్రా!
నా చిన్నప్పుడు మట్టి ముంతలో, కిడ్డీ బ్యాంకులో డబ్బు దాచుకునేవాళ్లం. ఇప్పుడేమో పోస్టాఫీసులు, బ్యాంకులు పిల్లల కోసం ఖాతాలు నిర్వహిస్తున్నాయి. మీరెంచక్కా పెద్దవాళ్లతో వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీచేతిలోకి డబ్బు వచ్చినప్పుడు, అకౌంట్లో జమ చేసుకోవచ్చు. మీరు కష్టపడి దాచుకున్నది కదా! పాస్ బుక్ లో మీ పేరున ఉన్న డబ్బును చూడంగానే ఎంత ఆనందం కలుగుతుందో! మీకు అవసరం వచ్చినప్పుడు, డ్రా చేసుకుని కర్చు కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరు చిన్నప్పట్నించి చేస్తే మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. అన్నట్టు మీరు ఇలా కర్చు పెట్టే ప్రతి పైసా పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకుంటే..మీరు డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నట్టు. నిజంగా అవసరాలకి ఇఅర్చు పెడుతున్నారా? లేక దుబారా చేస్తున్నారా? అన్నది స్పష్టంగా తెలుస్తుంది. చిన్నప్పుడే తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఇది.
మరి నేను చెప్పినవి ఆచరిస్తారుగా!
ఉంటాను మరి.
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
No comments:
Post a Comment