ప్రేమతో నీ ఋషి – 31
- యనమండ్ర
శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల
క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని
సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు
మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్
ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక
విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో
రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ
చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా
దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ
తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు,
ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత
గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు
మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన
మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు
అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు
స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి
తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని
అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు
కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు
జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి
మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో
కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని,
అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ మృణాల్ శవం కనిపిస్తుంది. మృణాల్ నకిలీ
పెయింటింగ్స్ తయారుచేసే వర్క్ షాప్ ను ఎక్కడ ఏర్పరిచాడో ఋషి పరిశోధిస్తూ, తన
మిత్రుడైన ఫోరెన్సిక్ డాక్టర్ వశిష్ట ఆచార్య చేసిచ్చిన మహేంద్ర వేలిముద్రల నకలుతో
ఆ రహస్య గదిని తెరుస్తాడు. స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు
తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను
కలిసేందుకు బయలుదేరతాడు. ఇక చదవండి...)
ఋషి అప్సర ఇంటికి వెళ్ళసాగాడు. జరిగిన వాటిని గురించి తనకున్న
సందేహాలను నేరుగా అప్సరనే అడుగుదామని ముందతను అనుకున్నాడు, కాని మహేంద్ర ఇచ్చిన
వార్నింగ్ ను దృష్టిలో పెట్టుకుని, మరిన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో
చిక్కుకోకూడదని అతను ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించే
ముందు ఆమె ఇంటి బాల్కనీ నుంచి తొంగి చూడాలని అతను అనుకున్నాడు.
ఆమె ఇంటికి కొన్ని గజాల దూరంలో అతను కార్ ను పార్క్ చేసి, ఆ భవనం వైపు
నడిచాడు. వెనుక నుంచి నేరుగా ఆమె అపార్ట్ మెంట్ దిశగా కదిలాడు. అతనికి ఏదైనా
ప్రమాదం జరిగే అవకాశం ఉందని అతనికి తెలుసు. కాని, ఇప్పుడు అతను ఎటువంటి
అపాయాలనయినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
మరికొద్ది క్షణాల్లో అతను బాల్కనీ కి ఆనుకుని ఉన్న పైప్ లైన్ ను
పట్టుకుని, పైకెక్కసాగాడు. అతను ఆమె అపార్ట్ మెంట్ ను చేరుకోగానే బాల్కనీ లోకి
దూకాడు. అతనున్న చోటు నుంచి ఆమె బెడ్ రూమ్ స్పష్టంగా కనిపించసాగింది.
***
అప్సర ఒక ఆకుపచ్చ చీరను కట్టుకుంది, ఆమె మామూలు
పద్ధతికి భిన్నంగా చాలా తక్కువ మేక్ అప్ చేసుకుంది. అయినా ఆమె ముఖం చాలా తెల్లగా
ఉంది. ఆకుపచ్చ బహుశా ఆమెకు నప్పే రంగు కావచ్చు. తన ఆలోచనలకు ఋషికి నవ్వొచ్చింది,
తన కోసం స్నిగ్ధ వేచి ఉంది, అప్సరకు నప్పే రంగును గురించి ఆలోచించేందుకు ఇది తగిన
సమయం కాదేమో!
గతంలో ఋషి మీద పడడానికి ప్రయత్నించినప్పుడు ఆమె
పెదవులు, కళ్ళలో కనిపించిన అదే దాహం ఇప్పుడూ కనిపిస్తోంది. ఆమె బెడ్ పై వేరెవరో
పురుషుడు కూర్చున్నాడు. అతను అటువైపు తిరిగి ఉండి, ఆమెనే చూస్తుండడంతో ఋషికి అతని
మొహం స్పష్టంగా కనిపించట్లేదు.
“ఏం చూస్తున్నావు?” అప్సర అతన్ని కవ్విస్తూ
అడిగింది.
ఆమె ప్రశ్నను పూర్తిచేసే లోపే, అతను కుర్చీలోంచి
లేచి, అప్సరను తన కౌగిట్లో బంధించాడు. ఆమె నడుంపై చెయ్యి బిగించి, దగ్గరగా
లాక్కున్నాడు. ఆమె చెవి వెనుక ఉన్న కురులను తడుముతూ, “నీలాగే కాస్త ఓవర్ టైం పని
చేస్తున్నా ప్రియా,” అని నెమ్మదిగా అన్నాడు.
అప్సర బదులిచ్చే లోపే అతని పెదవులు ఆమె మెడను
తడమసాగాయి. మరికొద్ది క్షణాల్లో వారిరువురూ బెడ్ పై వాలారు. ఋషి సంకటంలో పడ్డాడు,
అతను అక్కడి నుంచి పారిపోలేడు, అతని సంస్కారం ఇతరుల ఏకాంతంలో చొరబడేందుకు
ఒప్పుకోదు. అందుకే కళ్ళు మూసుకున్నాడు. కాని, గదిలో లైట్లు ఆపెయ్యడంతో అతను ఊపిరి
పీల్చుకున్నాడు.
కాసేపటికి ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు. అతను
ముందు మాట్లాడాడు.
“నువ్వు నిజంగా ఒక అద్భుతానివి. నీ సౌందర్యం
ఋషిని మోహింపచెయ్యలేక పోయిందంటే నేను నమ్మలేక పోతున్నాను. “ అంటూ అతను సిగరెట్
తీసి వెలిగించాడు.
“అంటే, పనిచెయ్యకపోవడం కాదు, సమయం సరిగ్గా
కుదరలేదు, దురదృష్టవశాత్తూ అదే సమయంలో స్నిగ్ధ అక్కడికి రావడంతో పరిస్థితి
విషాదంగా మారిపోతుంది. నీకు స్నిగ్ధ సంగతి
తెలుసు కదా, ఆమె ఇంకా చాలా ఎదగాల్సి ఉంది,” అంది. ఆ వ్యక్తి అంగీకార సూచకంగా
తలూపాడు.
ఋషి వారు మాట్లాడుకున్న అంశం గురించి ఋషికి అర్ధం
కావడంతో మౌనంగా ఉన్నాడు.
“అవును, ఈ రకంగా చూస్తే స్నిగ్ధ ఇంకా చిన్న
పిల్లే,” నవ్వుతూ అంటూ, అతను తన చోటి నుంచి లేచాడు. అతను బెడ్ లైట్ వేసి, కిటికీ
వైపు తిరగగానే ఋషి అతన్ని గుర్తు పట్టాడు. అతను మృణాల్...
ఋషి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అంటే, అప్సర,
మృణాల్ ఇద్దరూ కలిసి స్నిగ్దను ఉచ్చులో బిగించేందుకు ప్రయత్నించారా? అతను వెంటనే
ఒక అభిప్రాయానికి రాలేకపోయాడు.
“నేను హత్య చేయబడ్డానన్న భ్రమలో ఆమె
బెదిరిపోయింది. ఆమె ఇంకా షాక్ లో ఉంటుంది,” అన్నాడు మృణాల్.
“ఆ ఇటాలియన్ పెయింటర్ వివరాలను స్నిగ్ధ ఋషికి
చెబుతుండగా నువ్వు వినడం మంచిదయ్యింది. నేనిప్పుడు ఋషిని ఎలా మేనేజ్ చెయ్యాలో
చూడాలి. ఎందుకంటే, మనం నకిలీ పెయింటింగ్ ను సృష్టించి, మ్యుజియం కు అమ్మబోయామని
తెలిస్తే, మహేంద్ర మనల్ని ఒదిలిపెట్టడు.” అప్సర మృణాల్ కు చెప్పింది.
“అవును, అది చాలా ముఖ్యం. నాకూ దీన్ని వీలైనంత
త్వరలో ముగించాలని ఉంది. ఓ 30 -40 కోట్లు సంపాదించడం తప్ప నీకు పెద్దగా ఆశలు లేవు.
అప్పుడు మనం ఆనందంగా సెటిల్ అవ్వచ్చు. ఋషి ఆ పెయింటింగ్ వెంట ఎందుకు పడుతున్నాడో
నాకు తెలియట్లేదు. ఋషికి ఆ పెయింటింగ్ చూపే ముందు నువ్వు మరికొంత సమయం
తీసుకోవాల్సింది. “ అప్సరకు కారణాలు చెప్పేందుకు మృణాల్ ప్రయత్నించాడు.
“కాస్త ఆలోచించాకా, నాకూ అదే అనిపిస్తోంది.
ఏమైనా, ఇప్పుడు మనం స్టాక్ ను త్వరగా మార్చేసి, మన డబ్బును త్వరగా బదిలీ చేసుకోవాలి. ఇదంతా ముగించి కొత్త
జీవితాన్ని ఆరంభించాలని నాకూ ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది, అంతవరకూ నువ్వు
నీ కదలికల్లో జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్ళు బయట కనిపించకూడదు. నేను ఋషిని కలవగానే
నీకు తెలియజేస్తాను. అప్పుడు మనం తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాము. “ అప్సర మాటలు
ముగించి, లేచింది. ఆమె బాల్కనీ తలుపు వద్దకు చేరుకుంది. ఋషి దాక్కోడానికి
ప్రయత్నించాడు, కాని ఆ చోటు చాలా చిన్నది కావడంతో అది కుదరలేదు. అతను బాల్కనీ
నుంచి క్రిందికి దిగాలని ఆలోచించే లోపే, అప్సర బాల్కనీ తలుపు తెరిచింది.
“ఋషీ !” అంటూ భయంతో అరిచింది. మృణాల్
పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. ఒక్క క్షణం పాటు, ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు, అక్కడ
మౌనం అలముకుంది. ఋషి మొదట స్పందించాడు.
“అప్సరా, మృణాల్ మీరిద్దరూ ఇక ఈ ఆటను
ముగించాల్సిన సమయం వచ్చింది. మీరు అందరికీ అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.”కాస్త
గట్ట్టిగా అన్నాడు ఋషి. ఇటువంటి మోసకారులను ఎలా ఎదుర్కోవాలో అతనికి స్పష్టంగా
తెలియలేదు.
మృణాల్ కోపంగా ఋషివైపు వచ్చాడు. ఒక పిడిగుద్దుతో
ఋషిని క్రింద పడేసాడు. ఋషి కూడా అంటే వేగంతో అతన్ని తిరిగి కొట్టాడు, గొడవ వల్ల
అక్కడ అలజడి చెలరేగింది.
అప్సర ఇంకా షాక్ లోనే ఉంది. కాని క్షణాల్లో,
జరుగుతున్నది తెలుసుకుంది. వారిద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించింది. కాని, ఆమె
వల్ల కాలేదు. హఠాత్తుగా అనుకోని మరో సంఘటన జరిగింది.
(సశేషం)
No comments:
Post a Comment