శ్రీమద్భగవద్గీత - 14 - అచ్చంగా తెలుగు

 శ్రీ మద్భగవద్గీత -14

ఆరవ అధ్యాయము
రెడ్లం రాజగోపాలరావు 

ఆత్మసంయమయోగము
ధ్యాన యోగము
యుక్తాహార విహారస్య
యుక్తచేష్టస్యకర్మసు
యుక్తస్వప్నావ బోధస్య
యోగోభవతి దుఃఖహా -17వ శ్లోకం
మితమైన ఆహారము మితమైన నిద్ర కర్మలందు మితమైన ప్రవర్తన గల మనుజునకు యోగాభ్యాసము దుఃఖమును పోగొట్టునదిగా యుగుచున్నది.మితముదప్పి ప్రవర్తించినచో ఆ యోగము జీవుని దుఃఖమును బోగొట్టజాలదని భావము.
గీతాచార్యుడు చెప్పిన ఈ శ్లోకము సాధకులకు సంజీవిని వంటిది.సాధారణంగా మనుజులు ఆహార విహారములందు క్రమశిక్షణ,యుక్తాయుక్త వివేకము ప్రదర్శించుటయందు అవగాహన పూర్ణముగా లేనివారైయుందురు.నిజంగా ఆహారవిహారాదుల యందు క్రమశిక్షణ గలిగిన వారు ధన్యులు. భగవంతుని సాక్షాత్కరింపజేసుకోవాలనుకోవాలనుకున్న జిజ్ఞాసువులకు యుక్తాహారవిహారములు ముఖ్య ప్రామాణికములు.కడుపు నిండుగా భుజించిన మనిషికి వెనువెంటనే నిద్రవస్తుంది.అప్పుడు శరీరము, ఇంద్రియములు మాటవినవు.జీర్ణాశయములో సగభాగము ఆహారముతోనింపి, పావు భాగము నీళ్ళతో నింపి పావుభాగము ఖాళీగా ఉంచవలెను.అనగా న్యాయార్జితమైన ద్రవ్యముతోకొనినదై శాకాహారముతో కూడినదై, త్వరగా జీర్ణమై శరీరానికి సాత్విక గుణము నిచ్చునదై, శుద్ధ సాత్వికపరుడగు పరమాత్మను దర్శింపజేయుటకు ఉపయుక్తమైనదైయుండవలెను.
ఒక పెద్ద కర్మాగారము చక్కగా పనిచేయవలెనన్న చిన్న చిన్న పరికరములు కూడా చక్కగా పనిచేయవలెను.చిన్న శీలలు వదులైనచో కర్మాగారమంతయు నిలిచిపోవును. మానవ శరీర కర్మాగారము చక్కగా పనిచేయవలెనన్నచో దానికి అవసరమైన,అనుకూలమైన ఆహార,విహారాదులు కలిగియుండవలెను.
మానవ పరిణామక్రమము అనాదిగా సృష్టిలోజరుగుతునేయున్నది. రాతి యుగపు ప్రారంభంలో జంతువులను వేటాడి మాంస భక్షణతో ఆకలి తీర్చుకునేవాడు.తరువాత నిప్పురగిలించి కాల్చి తినేవాడు. ప్రకృతితో మమేకమై పంటలు పండించటం నేర్చుకుని వాటిద్వారా ఆకలి తీర్చుకోవటానికి అలవాటు పడ్డాడు.
ధ్యానాదులు చక్కగా శీలించవలెనన్న మితమైన సాత్వికాహారము శ్రేయమైనది.మాంసాహార భక్షణ వలన తామసగుణము వృద్ధియగును. అందువలన యేగ ధ్యానాదులు శీలించుట కష్టమగును.ముందు తరాలలో యేగాభ్యాసపరులు వారంలో ఒకరోజు ఉపవాలదీక్షలోనుండేవారు. అందువల్ల శరీరంలోనున్న కర్బన శేషమంతా విసర్జితమయ్యేది.ఎట్టి ఆహారమో అట్టి భావన ఎట్టి భావనో అట్టి కర్మ, ఎట్టి కర్మయో అట్టి ఫలము. ప్రతి మానవుడు నేనెందుకు జన్మించాను? ఈ మానవజన్మకు పరమార్ధమేమిటి? ఈ జన్మలో భగవంతుని చేరుకొనుటకు చేయవలసిన సాధనాక్రమమెద్ది? అట్టి సాధన చేయుటకు కావలసిన పనిముట్లేవి? అని తీవ్రంగా పరిశీలించినచో అప్పుడు తెలియజేసిన విషయములన్నియు అర్ధముకాగలవు.గీతాచార్యుడు ఇక్కడ తెలియజేసిన విషయములన్నియు ఎందరో మహానుభావులు పాటించి,తద్వారా బ్రహ్మానుభవముపొంది లోకములో మానవాళికి తమ దివ్యసందేశము తెలియజేసినారు. యదార్ధానికి ఆహారము శరీర యంత్రము నడుచుటకు ఇంధనముగా ఉపకరిస్తుంది. ఊపిరి ద్వారా తీసుకొనే ప్రాణవాయువే ప్రత్యగాత్మ.ఆహారము లేకున్న కొంత సమయమైననూ బ్రతకవచ్చు,ఊపిరి లేకుండా క్షణమైనను బ్రతుకలేము.
జీవితమును ఆహారము,నిద్రయనుచోరులు దొంగిలించుచున్నారు.వీటిలో మితమును పాటించి తద్వారా
సాధన అభివృద్ధి పరుచుకొని మనస్వస్థానమగు పరమాత్మవద్దకు చేరవలెను.అధిక భోజనము వలన శరీరము బరువుతో మత్తెక్కియుండుటచే ధ్యానమందు నిలకడ సాధ్యముకాదు.ధ్యానమందు దేహమునుదాటి,ఇంద్రియములను దాటి,మనస్సును దాటి ఆవలనున్న ఆత్మ దర్శనము పొందుగోరు వారు దేహస్పురణచే దేహము దగ్గరనే నిలిచిపోవుదురు.
యదావినియతం చిత్త
మాత్మన్యేవావతిష్ఠతే
నిస్పృహస్సర్వకామేభ్యో
యుక్తఇత్యుచ్యతేతదా - 18వ శ్లోకం
ఎప్పుడు మనస్సు బాగా నిగ్రహించబడినదై ఆత్మయందే స్థిరముగానుండునో, ఎపుడు యోగి సమస్త కోరికల నుండి నివృత్తుడగునో అప్పుడే అతడు యోగసిద్ధిని పొందినవాడని చెప్పబడును.
మోక్షముమునకు కాలనియమేదియునులేదు.పైనదెలిపిన మూడు లక్షణములు కలిగియున్న సాధకుడు మోక్షభాగియై యొప్పగలడు.మనోనిగ్రహము,వాసనాక్షయము,తత్వజ్ఞానము అను మూడు లక్షణములు మోక్షమునకు అర్హతలు.
యధాదీపోనివాతస్థో
నేఙ్ఞతే సోపమాస్మృతా
యేగినోయతచిత్తస్య
యుఞ్ఙతోయోగమాత్మనః - 19 వ శ్లోకం
గాలి వీచనిచోటనున్న దీపమేప్రకారముగా కదలక నిశ్చలముగానుండునో,ఆత్మధ్యాన పారాయణుడగు యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమున్ను నిశ్చలముగనుండును.స్వయంతేజోమూర్తియగునాత్మ ఇంద్రియములు, మనస్సు, చిత్తములందు ప్రవేశించిననే వాటికి చలనము.నిజానికి అవి జడములు. ఆత్మ ప్రవేశించినతోడనే అవి చైతన్యవంతములై ప్రకాశించును.విద్యచ్ఛక్తి ప్రవేశించినతోడనే బల్బులు, ఫ్రిజ్ లు , టీవీలు,మోటార్లు మొదలగు వస్తువులు పనిచేయులాగున ఆత్మ ప్రవేశముతో ఆయా విషయములన్నియు చైతన్యవంతములగుచున్నవి.
యోగి శబ్దాది విషయములను లోనికి చొరనీయక తదేకధారణ,ధ్యానాదులచే ఆత్మపై మనసును నిలిపిన నిశ్చల దీపమువలె ప్రకాశించుచు ఆత్మానందము పొందును. అదియే మోక్షము.

No comments:

Post a Comment

Pages