విరియని మధురిమలు - కుసుమించుట తెలియని జీవనలతలు
వారణాసి రామబ్రహ్మం
మొన్న మొన్నటి వరకు సాంప్రదాయ కుటుంబాల్లో ఈడొచ్చిన ఆడపిల్ల గదిలో ఒంటరిగా పడుకుంటే తండ్రి, సోదరులు కూడా ఆ గదిలో ప్రవేశించడం చాలా వరకు జరిగేది కాదు. దీనికి కారణం చాలా స్పష్టం.
స్త్రీ పురుషుల ఆకర్షణ పునరుత్పత్తికై ప్రకృతి నియమం. పెళ్ళిళ్ళు, శోభనాలు లేని అనాగరిక, ఆటవిక జీవనాల్లో వావి, వరస ప్రసక్తి లేదు. తెలియదు కూడా. ఇప్పటి జంతు జీవనాల వలే ఆనాటి మనుషుల జీవితాలు ఉండేవి. అందుకనే నాగరికత నేర్చిన కొత్తల్లో వావి, వరసల దృష్టి వచ్చింది.
స్త్రీని శృంగార దృష్టితో చూడని వారు తండ్రి, సోదరుడు, కొడుకు అని నమ్మకం. మిగతా ఏ మగవాడైనా, ఏ వరస వాడైనా స్త్రీ ని శృంగార దృష్టితో చూసి తీరుతారు. తరువాత సంయమించుకుంటారు అనేది వేరే విషయం. తండ్రీ, సోదరుల విషయంలో విపరీతాలు జరిగినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి.
ఇది వాస్తవం అయినప్పుడు ఒంటరిగా బాయ్ ఫ్రెండ్ తోనో, పెళ్లి చేసుకుంటానన్నవాడితోనో ఒంటరిగా మిగలడం ఎంత ఇంగితం?
మగవాని బుద్ధి ప్రకృతి నియమించినది. దానిని గ్రహించి, అనుగుణంగా మసలడం శ్రేయస్కరం. పోలీసులు గాని, ప్రభుత్వాలు కాని పూర్తి రక్షణ కల్పించలేవు. మన ఇంగితం ఉపయోగించుకొని మనం మసలాలి.
మగవాళ్ళ దుర్బుద్ధిని, మృగతత్త్వాన్ని ఎండగట్టడం వల్ల, వాళ్ళని తీవ్రంగా దులిపెయ్యడం వల్ల ఫలితం శూన్యం. ఫ్రాయిడ్ మగవాని మస్తిష్కంలో ఎల్లప్పుడూ స్త్రీ మెదులుతూనే ఉంటుంది అన్నాడు.
వాస్తవం ఇదయినప్పుడు మన నాగరికత ఎంత "ఎదిగినా" మగవాని ప్రకృతి ప్రకృతి నియమించిన ధోరణిలోనే సాగుతుంది. ఒంటరి మగాళ్ళకే ఈనాడు రక్షణ లేదు. హంతకులు, దొంగలు, దోపిడిదారులు, మృగాళ్లు, రాక్షస సదృశులు విచ్చలవిడిగా సంచరించే నిశా సమయంలో స్త్రీలకే కాదు ఏ మనిషికీ రక్షణ లేదు. నిర్భయ సంఘటనకు నిలువెత్తున లేచిన దేశం తరువాత అంతకు మించిన ఘోరాలు జరిగినా మిన్నకుంది. అలా జరిగిన ఎన్నో సంఘటనలలో బాధితుల నిర్లక్ష్యం కూడా తోడైంది.
ఆటవిక జీవనాల రోజుల నుంచి మనుషులు, ముఖ్యంగా మగవారు ఏమీ మారలేదు. ఇది జంతుధర్మం. వాదములకు ఇక్కడ తావు లేదు. అందరినీ తిట్టిపోస్తూ వీధులకెక్కడం కంఠశోష.
ఈ నిజాన్ని గ్రహించక ఇలా రాసిన రచయితలను మేధావులు దుయ్యబట్టడం ప్రస్తుత నాగరికత, సంస్కృతి.
మన ప్రస్తుత విద్యా విధానం, ఇప్పటి పాశ్చాత్య, అప్రాచ్య సంస్కృతి విచ్చలవిడితనానికి ఓటు వేసి
ఎన్నో భ్రమలు, భ్రాంతులు కలిగిస్తున్నాయి. ఇంగితం తల్లిదండ్రులు నేర్పడం లేదు. పాఠశాలల్లోనూ నేర్పడం లేదు. పంచతంత్ర కథలు, హితోపదేశం కథలు, జాతక కథలు, రామాయణ, మహాభారత, మహా భాగవతముల లోని ఇంగితమూ ఎవరూ చదవడం లేదు.
వెట్టి జంతువుల లా, విద్యా గంధము లేని పశు సదృశుల్లా బతుకుతున్నాము. మన జీవితాల్లో ఈ దుష్ట శక్తుల విశృంఖలత్వంలో సుఖసంతోషాలు, మధురిమలు ఎలా విరుస్తాయి? జీవితాల్లోకి వసంతం ఎలా తొంగి చూస్తుంది?
***
No comments:
Post a Comment