ప్రేమతో నీ ఋషి – 32
యనమండ్ర శ్రీనివాస్
( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు.
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి.... కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో తాము కొన్న పెయింటింగ్ నకిలీదని చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ మృణాల్ శవం కనిపిస్తుంది స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను ఇంటికి వెళ్లి, అక్కడ మృణాల్ బ్రతికే ఉన్న సంగతి తెలుసుకుంటాడు. అప్సర అతనితో సన్నిహితంగా ఉండడం చూస్తాడు. తమ బాల్కనీలో దాక్కున్న ఋషిని చూస్తుంది అప్సర. అప్పుడు జరుగుతుందొక అనుకోని సంఘటన. ఇక చదవండి...)
హఠాత్తుగా ఊహించని ఒక సంఘటన జరిగింది. గన్ పేలిన శబ్దం వినిపించింది, ఏమైందో ఋషి తెలుసుకునే లోపే మృణాల్ నేలపై పడి మరణించాడు. అతని వెన్నులో బులెట్ దిగింది. రక్తం ఏరులై పారసాగింది. క్షణాల్లో అతని దేహం స్పందించడం మానేసి, అతను చనిపోయినట్లు కనిపించసాగింది.
అప్సర భయంతో గట్టిగా అరిచింది, ఋషి ఇంకా మృణాల్ ను పట్టుకునే ఉన్నాడు. మరికొన్ని సెకండ్లలో మరొక గన్ షాట్ వినిపించింది, అది నేరుగా అప్సర గుండెలో దిగబడి, ఆమె కూడా కుప్పకూలింది.
ఋషి మృణాల్ ను పక్కకు పెట్టి, అప్సర వైపు పరుగెత్తాడు. తన కళ్ళముందే ఆమె కూడా చనిపోయిందన్న విషయాన్ని అతను నమ్మలేకపోయాడు. అతను ఆమె నాడి, శ్వాస పరీక్షించి, ఆమె కూడా చనిపోయిందని తెలుసుకున్నాడు. ఋషి చుట్టూ చూసాడు, కాని నేరస్థుడు ఎవరో తెలీలేదు.
ఒక్కసారిగా ఋషి భయంతో నీరసించిపోయాడు. అంటే, తనను కూడా ఇందులో ఇరికిస్తున్నారా? అతని మనసు అతడిని హెచ్చరిస్తూ ఉండగా, వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోవాలని అతడు నిశ్చయించుకున్నాడు.
మరో ఆలోచన లేకుండా, వచ్చిన దారిలోనే అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఐదు నిముషాల్లో తన కార్ వద్దకు వచ్చి, మరో అరగంటలో స్నిగ్ధ వద్దకు తిరిగి వెళ్ళాడు.
***
ఋషి, స్నిగ్ధ ఆమె ఇంట్లో ఉన్నారు. అతను వచ్చే వేళకు స్నిగ్ధ డిన్నర్ సిద్ధం చేసింది. అప్సర ఇంట్లో జరిగిన విషయాలు ఋషి స్నిగ్ధకు చెప్పాడు. మృణాల్ ఇంకా బ్రతికే ఉన్నాడన్న షాక్ నుంచి స్నిగ్ధ బయటపడలేకపోయింది.
ఆమెకు రెండు విషయాలు తెలుసుకోవాలని ఉంది – తన పక్కనే కూర్చుని, మృణాల్ అంత పెద్ద మోసం ఎలా చేయ్యగాలిగాడు? కేవలం పెయింటింగ్ నే కాక, అవి అసలైనవే అని కొనుగోలు చేసేవారిని నమ్మించే ప్రమాణ పత్రాలను కూడా అతను ఎలా తయారుచెయ్యగలిగాడు?
“అందుకే తాము దాచుకున్న నల్ల ధనంతో పెయింటింగ్స్ కొనేవారి అవసరం అతనికి ఏర్పడింది. నకిలీ పెయింటింగ్స్ కొనేందుకు వారే సులువుగా వలలో పడేవారు, డబ్బిచ్చి, నకిలీ పెయింటింగ్ కొనుక్కునే వారు. ఒకవేళ పెయింటింగ్ నకిలీదని తెలిసినా, వారు ఇతనిపై ఎటువంటి చర్యా తీసుకోలేరు, ఎందుకంటే అలా చెయ్యడం వల్ల వారు దొంగతనంగా దాచుకున్న డబ్బు సంగతి బహిర్గతమౌతుందని భయం కదా.
స్నిగ్ధ జరిగిన వాటిని వెంటనే అర్ధం చేసుకోలేక పోయింది. కాని, గత కొద్ది నెలలుగా జరిగినవాటిని అన్నింటినీ మళ్ళీ సమీక్షించుకుంటే, నెమ్మదిగా అన్నీ ఆమెకు అర్ధం కాసాగాయి.
మృణాల్ ఆమెను ఎటువంటి పరిస్థితిలోకి నెట్టాడంటే, చివరికి మృణాల్ మృతికి అందరూ తననే వేలెత్తి చూపేలా చేసాడని, ఆమెకు అర్ధమయ్యింది. ఆ ఆలోచనకే ఆమె ఒణికిపోయింది, ఆమె చెక్కిళ్ళ వెంట కన్నీరు కారసాగింది.
కొంతసేపు అక్కడ మౌనం అలముకుంది, ఋషికి ఆమెను వారించడం ఇష్టం లేదు. గుండెలో ఉన్న ఒత్తిడిని దించుకోడానికి కన్నీరు కార్చడం అనేదే సహజమైన మార్గమని అతడి నమ్మకం.
అతను నెమ్మదిగా స్నిగ్ధ వద్దకు వెళ్లి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, సుతారంగా నొక్కాడు. ఆమెకు ధైర్యం ఇచ్చేందుకు ఆమె భుజం తట్టాడు. స్నిగ్ధ నెమ్మదిగా కోలుకుంది. ఋషి ఆమె కుడి చేతిని పట్టుకుని, బొటన వేలుకి, చూపుడు వేలుకి మధ్య ఉన్న ప్రాంతాన్ని నెమ్మదిగా రాయసాగాడు. మొదట దీన్ని స్నిగ్ధ గుర్తించకపోయినా, నెమ్మదిగా గమనించి “ఏం చేస్తున్నావు?” అని అతడిని అడిగింది.
“హోకు ప్రెషర్ పాయింట్ ను నొక్కడం ద్వారా నీ ఒత్తిడిని తగ్గించాలని అనుకుంటున్నాను” అన్నాడు ఋషి.
“హోకు ప్రెషర్ పాయింట్ ?” కన్నీళ్ళ మధ్యలోనే ఆశ్చర్యంగా అడిగింది స్నిగ్ధ. ఆమె అటువంటి పదాన్ని మొదటిసారి వింటోంది.
“అవును. నీ బొటనవేలుకి, చూపుడు వేలుకి మధ్య ఉండే కండరాన్ని హోకు ప్రెషర్ పాయింట్ అంటారు. నీకు ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు, ఆ భాగాన్ని 20-30 సెకండ్లు మసాజ్ చేస్తే నీకు వెంటనే ఊరట కలుగుతుంది. అంటూ, ఋషి నెమ్మదిగా మసాజ్ చెయ్యసాగాడు.
దేహం పైభాగంలో ఉండే ఒత్తిడిని తగ్గించేందుకు హోకు ప్రెషర్ పాయింట్ విశ్వవ్యాప్తంగా పనిచేస్తుందని ఫిజికల్ థెరపిస్టులు అంటారు. మనం టీవీ చూస్తున్నా, పని చేస్తున్నా, మీటింగ్ లో ఉన్నా, ఈ ట్రిక్ ను ఎక్కడైనా పరీక్షించి చూడవచ్చు.
స్నిగ్ధ ఆలోచనలన్నీ పూర్తిగా మటుమాయం కాకపోయినా, ఆమె కాస్త కోలుకుంది. ఆమె టీవీ పెట్టి, ఋషి పక్కన కూర్చుంది.
“నువ్వు చెప్పింది నిజమేనని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉంది. అయితే నువ్వు మంచి స్ట్రెస్ మానేజర్ వి కూడా అన్నమాట !” స్నిగ్ధ ఒక జీవం లేని నవ్వు నవ్వింది. కానే ఆమె తన ఆతృతలను అధిగమించే ప్రయత్నం చేస్తోంది.
“నువ్వు మంచి మూడ్ లో ఉండుంటే, నేను ఒత్తిడి తగ్గించే ఇతర పద్ధతుల్ని వాడే వాడిని. నిజానికి ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శృంగారం కంటే మంచి మందు లేదు తెలుసా” ఋషి మామూలుగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసాడు. “నిజానికి ఒక బహిరంగ ప్రసంగం ముందు శృంగారం జంకు, తడబాటు అన్నవి లేకుండా చేస్తుంది. ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వలన ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాక, రోగనిరోధక శక్తిని పెంచే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ కూడా అదే సమయంలో విడుదల అవుతుంది. ఈ రెండు హార్మోన్ లు కలిసి ప్రశాంతతను పెంచుతాయి. గట్టిగా శ్వాస తీసుకోవడం, స్పర్శించడం, శారీరక పని, సాంఘిక మద్దతు, వంటి ఇతర స్ట్రెస్ మానేజ్మెంట్ పద్ధతుల లాగానే శృంగారం కూడా కావలసిన ఫలితాలను ఇస్తుంది. “
టీవిలో డా విన్సీ కోడ్ అనే సినిమా తీసిన విధానం గురించి చెబుతున్నారు. ఆ కార్యక్రమంలో ఆ సినిమా నిర్మాణానికి సంబంధించిన అనేక సాంకేతిక అంశాలను గురించి చెబుతున్నారు.
ఋషి నెమ్మదిగా తన వేళ్ళను స్నిగ్ధ మెడపైకి పాకించి నొక్కసాగాడు. స్నిగ్ధ అభ్యంతర పెట్టలేదు. అతనికి మరింత దగ్గరగా జరిగి కళ్ళు మూసుకుంది.
మెడ పైనుంచి నెమ్మదిగా తన చేతులను క్రిందికి జరిపి ఆమె నుంచి స్పందన కోసం ఎదురు చూసాడు. ఆమె అతని షర్టు కాలర్ పట్టుకుని, అతన్ని దగ్గరగా లాక్కుని కౌగిలించుకుంది. జరిగిన బాధాకరమైన సంఘటనలకు అతీతంగా అలా ఒకరి కౌగిట్లో మరొకరు ఒదిగిపోయారు. ఋషి కౌగిలిలో స్నిగ్ధకు అపరిమితమైన భద్రతా భావం కలిగింది. అతను తనను అలా పట్టుకుంటే, అన్నీ చక్కబడతాయన్న ధైర్యం ఆమెకు వచ్చింది. తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది స్నిగ్ధకు. పరిస్థితులు నిజంగా చక్కబడతాయా? ఏమో, కాని దానికి చాలా సమయం పడుతుందేమో !
(సశేషం)
No comments:
Post a Comment