నాకు నచ్చిన నా కధ(ఇది నా కధే!) -బామ్మమాట బంగారుబాట
శారదాప్రసాద్
బామ్మల,మేనత్తల ప్రేమాభిమానాలు పూర్తిగా పొందిన ఆఖరి తరానికి చెందిన భాగ్యశాలిని నేను.ఆ రోజుల్లో వారికి వేరే లోకం తెలిసేది కాదు.ఎప్పుడూ మనవళ్ళు, మనవరాళ్ళ మంచి చెడులు చూడటమే వారి పని.పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంతవరకు మనవళ్ళతోటే వారి కాలక్షేపం. యాత్రలు చేద్దామనే ఆశే ఉండేది కాదు.ఆర్ధిక అవసరాలు అసలు ఉండేవి కావు.జీవితాన్ని మొత్తం కుటుంబానికే ధారపోసిన త్యాగమూర్తులు వారు.ఎంతటిలో ఎంత మార్పు! ఆనాటి పరిస్థితికి నేటి పరిస్థితికి పోలికే లేదు.బామ్మలు అలా ఉండలేకపోతున్నారు.అసలు,'బామ్మ' అనే మాటనే అవమానంగా భావించే వారు కూడా ఉన్నారు.చాలా మంది'మామ్మ' అని పిలిపించుకుంటున్నారు.ఈ లోపానికి కారణం అత్తా,కోడళ్ళు,కొడుకులు కావచ్చు. ఆ తీపిరోజులు గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు ఎటో వెళ్ళిపోతుంది.అప్పుడు నా వయసు నాలుగు,అయిదు సంవత్సరాలు ఉంటుందేమో!నాకు బామ్మ సంగతులన్నీ గుర్తుండిపోయాయి.అవి నా మనసులో బాగా
నాటుకొనిపోవటం వల్ల కావచ్చు,కొన్ని మా అమ్మ గుర్తుచేసి ఉండటం వల్ల కావచ్చు! మా బామ్మకు నేను ముద్దుల మనవణ్ణి.బహుశ: నాకు మా తాతగారి పేరు పెట్టటం వల్లనేమో,నన్ను పేరు పెట్టి పిలిచేది కాదు బామ్మ!అమ్మ దగ్గర కన్నా బామ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ.నేను చేసే అల్లరి భరించలేక అమ్మ ఎప్పుడైనా మందలిస్తే,బామ్మ చాటున దాక్కునే వాణ్ణి .బామ్మ నన్నే సమర్ధించేది.వెంటనే కొండంత ధైర్యంతో పాటు,విజయ గర్వం కూడా వచ్చేది.మా బామ్మ పుణ్యమా అని నేను ఆడింది ఆట,పాడింది పాట!రెండు రోజులు జ్వరం వస్తే,చిక్కిపోయానని,కాలికి ఏదో వెంట్రుకలతాడు కట్టించేది.అది దురద పెట్టుతూ,చాలా ఇబ్బందికరంగా ఉండేది.పైగా బడిలో అందరూ ఏమిటదని అడిగే వారు.వాళ్లకు దానిని గురించి బోలెడు కట్టు కథలు చెప్పే వాడిని."ఇది కట్టుకుంటే చాలా ధైర్యం వస్తుంది. దయ్యాలు,భూతాలూ కలలోకి రావని" ఏవేవో చెప్పే వాడిని. అలా చిన్నతనం నుండే కథలు చెప్పటం అలవాటయ్యింది అన్నమాట! నాకు అక్షరాభ్యాసం జరిగింది మా స్వగ్రామం అయిన మాచవరంలోనే.నాకు అక్షరబిక్షను పెట్టిన వారు శ్రీ చిట్టోజి అచ్చయాచారి గారు.వారు దాదాపుగా 90 ఏళ్లకుపైగా జీవించి,ఒక ఆరు ఏళ్ళ క్రితమే స్వర్గస్తులయ్యారు.వారి కుమారుడు కూడా ఆంధ్రాబ్యాంకులోనే నా సహోద్యోగిగా పనిచేసి,గుంటూరులోనే విశ్రాంత జీవనం గడుపుతున్నారు.అతనిని నేను
'గురుపుత్రుడి' గా భావిస్తూ నా సహాయ సహకారాలు అందిస్తుంటాను.మళ్ళీ మా బామ్మ దగ్గరకు వస్తాను.అవి నేను గురజాలలో చదువు వెలగపెడుతున్న రోజులు.అప్పుడప్పుడు బడికి వెళ్ళిన ఒక గంటకే,మా బామ్మ నన్ను చూడటానికి వచ్చేది.వచ్చేటప్పుడు తినటానికి ఏదో ఒకటి తెచ్చేది.అలా బామ్మకు నేను ప్రాణం అయ్యాను.ప్రతిరోజూ ఉప్పు,మిరపకాయలు నిప్పులమీద వేసి దిష్టి తీసేది.ఆ ఘాటైన వాసన వల్ల అందరికీ ఇబ్బందిగా ఉండేది.కానీ ఎవరికీ మాట్లాడే ధైర్యం ఉండేది కాదు.ఆ తీపిగుర్తులు గుర్తుకు వచ్చినప్పుడల్లా మా బామ్మ గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లుతుంటాయి. బయట పిల్లలు ఎవరైనా నన్ను కొట్టినా,తిట్టినా--వాళ్ళకు,వాళ్ళ తల్లి తండ్రులకు నోరెత్తకుండా హెచ్చరికలు జారీ చేసేది బామ్మ. బామ్మ పుణ్యమా అని నన్ను అందరూ ఒక చిన్నరౌడీగా చూసేవారు.అందరూ నన్ను చూసి భయ పడుతుంటే నాకు చాలా గర్వంగా ఉండేది.ఈ గారాబం బాగా ఎక్కువ కావటం వల్ల,నాకు చదువు మీద శ్రద్ధ తక్కువయింది.ఇంటి దగ్గర చదుకునే వాడిని కాదు."చదువుకుంటాడులే!,వాడి పేరులోనే 'బ్రహ్మ' ఉన్నాడు.వాడికి చదువురాక పోవటం ఏమిటి ?" అని బామ్మ అంటుండేది.మా బామ్మతో గుడికి వెళ్ళే వాడిని.గుడిలో పూజారికి,నా పేరు చెప్పి ఏవో పూజలు చేయిస్తుండేది.నాకు చదువు నిజంగా రాదేమోనని బామ్మకు కూడా భయం పట్టుకుందని నాకు అనిపించింది. నేనేమి చేసేది,బడికి పోవటం అంటే నాకు చెడ్డ చిరాకు.నా దృష్టిలో-- ఈ ప్రపంచంలో పంతుళ్ళు లేకపోతే,పిల్లలు ఎంత హాయిగా ఉండేవారో అనిపించేది.నెమ్మదిగా బడి ఎగకొట్టటం మొదలు పెట్టాను.బడి మొదలయ్యే సమయానికి,ఇంట్లో బయలు దేరి ఆంజనేయస్వామి గుడిలో బడికిపోని,చదువుకోని
పిల్లలతో కలసి ఆడుకునే వాడిని.నా సావాసగాళ్ళను చూస్తుంటే నాకు అసూయగా ఉండేది.వీళ్ళు బడికి వెళ్ళకుండా ఎంత హాయిగా ఉన్నారోననిపించేది.వాళ్ళ పట్ల వారి తల్లి తండ్రులు కూడా చాలా ప్రేమగా ఉంటారనిపించేది.బడి వదిలిపెట్టే సమయానికి,నెమ్మదిగా ఆపసోపాలు పడుతూ ఇంటికి వచ్చేవాడిని.అయితే,ఈ నాటకం ఎక్కువ రోజులు సాగలేదు.ఎందుకంటే బామ్మకు బడికి వచ్చి నన్ను--మధ్యలో చూడటం అలవాటు.నా గుట్టు బయట పడింది.బామ్మ నన్ను మొదటిసారి కోప్పడటమే కాకుండా వంటి మీద ఒక దెబ్బ వేసినట్లు (తీపి)గుర్తు!బామ్మ దగ్గర కూడా నేను రక్షణ కోల్పోతానేమోనని భయం వేసి,బామ్మను బ్రతిమిలాడుకున్నాను -- ఇకనుంచి బాగా చదువుకుంటానని.ఆ మాటలకు ఆవిడ మురిసిపోయి,అనవసరంగా దెబ్బ వేస్తుంటే వద్దని వారించలేదని అమ్మా,
నాన్నలను మందలించింది.మళ్ళీ విజయం నాదే!ఇలా సాగుతుతుంది నా బాల్యం.ఆ రోజుల్లో జానపద సినిమాలంటే పిల్లలకు ఇష్టం.కథానాయకుడు గుర్రం పైన
స్వారీ చేస్తూ,మరో చేతిలో కత్తిపట్టుకొని దుర్మార్గులను చంపుతుంటే,ఆ దృశ్యాలను మైమరచి చూసేవాడిని.సినిమా చూసి ఇంటికి తిరిగి రాగానే,నిలుచుండబెట్టిన నవారు మంచం మీద కూర్చొని,ఒక కోడుకు తాడుకట్టి,దానిని కళ్ళెంలాగా భావిస్తూ,మరోచేతిలో ఒక కర్రను కత్తిలా తిప్పుతూ వీరోచిత విన్యాసాలు చేసేవాడిని. అయితే నాకు ప్రేక్షకురాలు బామ్మ ఒక్కతే!నాకు నిజమైన గుర్రం ఎక్కాలని కోరిక బాగా ఉండేది.నా అదృష్టం పండింది.నా కోరిక తీరే సమయం రానే వచ్చింది.మా ఊరికి సర్కస్ వాళ్ళు వచ్చారు.ఊరంతా మైకులో ప్రచారం చేస్తున్నారు.హైస్కూల్ ఆటస్థలంలో గుడారాలు వేస్తున్నారు.అక్కడ కొన్ని గుర్రాలను కట్టి ఉంచారు.నేను ధైర్యంగా వెళ్లి అక్కడవున్న అతనిని నన్ను గుర్రం ఎక్కించమని ప్రాధేయ పడ్డాను.ఒక రూపాయి తెచ్చుకో,ఎక్కిస్తానని వాడు మాట ఇచ్చాడు.ఆ రోజుల్లో ఒక
రూపాయంటే మాటలా!బామ్మను అడిగితే,లక్షా తొంభై ప్రశ్నలు వేస్తుంది.ఏమి చెయ్యాలో తోచక నిద్ర పట్టటంలేదు.మనసులో తప్పుడు ఆలోచనలు బయలుదేరితే మనిషికి నిద్రరాదని ఇప్పటికి తెలిసింది!అప్పుడు నా కోరిక తీర్చుకోవటమే నాకు ముఖ్యమనిపించింది.మొదటిసారిగా,చివరిసారిగా దొంగతనం చేసాను.బామ్మ కొంగున ఉన్న డబ్బులను కాజేసాను.బామ్మ అకారణంగా బట్టలు ఉతికే చాకలిని నానా మాటలు అన్నది.అవన్నీ నన్ను అన్నట్లే అనిపించింది.సర్కస్ వాడికి డబ్బులిచ్చి గుర్రం ఎక్కాను.కళ్ళెం సరిగా పట్టుకోలేదేమో,అది ఒక సకిలింపు చేసి ముందర కాళ్ళు పైకి ఎత్తింది.నాకు భయం వేసింది.ఆ భయంలో కిందపడ్డాను. నెమ్మదిగా ఇంటికి వచ్చాను.చెయ్యి కొద్దిగా నొప్పిగా ఉంది.ఆ బాధ ఎవరితో చెప్పుకునేది కాదు.అలానే భరించాను.మరుసటిరోజు నొప్పి ఎక్కువ అయింది. నిద్రలోనో, ఆటల్లోనో బెణికిందేమోననుకొని బామ్మ మునగాకుతో కట్టుకట్టి సపర్యలు మొదలుపెట్టింది.సరే రోజూ మాదిరిగానే బట్టలు ఉతికే చాకలి వచ్చింది.స్కూల్ పక్కనే ఉన్న రేవులోనే వాళ్ళు బట్టలు ఉతికేది.చాకలి, నేను గుర్రంఎక్కటం చూసిందేమో! గుర్రం ఎక్కటం,కింద పడటం అన్నీ పొల్లుపోకుండా బామ్మకు చెప్పింది. అనవసరంగా చాకలిని అనుమానించినందుకు బామ్మ మనసు చివుక్కుమంది.బామ్మకు దిగులు పట్టుకుంది,నన్నుఎలా దోవలోకి తేవాలోనని.బామ్మకు అకస్మాత్తుగా సుస్తిచేసి మంచంలో ఒక నెలరోజులు ఉంది.రోజూ,మంచం మీద కూర్చొని బామ్మకు బాగా చదువుకుంటానని మాట ఇచ్చేవాడిని.
"ధనం వస్తుంది పోతుంది.కానీ,విద్యకు రావటమే కాని పోవటం తెలియదు.విద్య అనేది తరిగిపోని ధనం.దానినే సంపాదించుకో!" అనే బంగారం లాంటి మాటను చెప్పింది బామ్మ.అలా రోజూ ఒక బంగారంలాంటి మాట చెప్పి,బామ్మ తృప్తిగా నిద్రపోయేది.అలా ఒకరోజున తృప్తిగా దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోయింది బామ్మ!బామ్మ ఎక్కడికి వెళ్లిందో అర్ధం కాని వయసు.బామ్మ లేకపోవటంతో నాకు ప్రపంచమంతా శూన్యమయినట్లు ఉంది.అంతమందిలో ఒంటరితనం అనుభవించాను చాలా కాలం!
మా బామ్మ మాటే నాకు బంగారు బాట!ఆమె దీవెనలే నాకు శ్రీ రామరక్ష.మా బామ్మ మా ఇంట్లో,నాతోటే ఉందనిపిస్తుంది ఇప్పటికీ!
***
Nice...from partially enjoyed generation.. Narasimha
ReplyDeleteThank you for your response.
Deleteచాలా బాగుందండీ!అభినందనలు!
ReplyDeleteExcellent Narration
ReplyDelete