దైవం మానుష రూపేణా….
ఓరుగంటి శ్రీలక్ష్మి నరసింహ శర్మ
గడిచిన పదేళ్ళ నుంచి వెళ్ళనట్లే ఈసారి కూడా సంక్రాంతి పండగకు కాకినాడకు వెళ్ళే ఉద్ధేశ్యం అసలు ఏమాత్రంలేని నేను, నా కరణేషు మంత్రి మాట మాత్రంగా కూడా చెప్పకుండా మూడునెలల క్రితమే చేయించిన కన్ఫర్మ్ టిక్కెట్ల వల్ల కొంత.... అలాగే ఈసారి కలిసొచ్చిన వారాంతపు శెలవల వల్ల కొంత… వెరసి మొత్తం మీద బెంగళూరు నుంచి మాప్రయాణం పండగకు ఓరెండు రోజుల ముందే మొదలయ్యింది. మనకి ఇష్టం లేనప్పుడే అన్నీ కలిసొస్తాయి అన్నట్లు శేషాద్రి ఎక్స్ ప్రెస్ సరిగ్గా సమయానికే చేరుకుంది ఆరోజు. ష్టేషను నుంచి బయటకు రాగానే ఊబర్, ఓలా మొదలైన వాటికోసం వెతుకుతూ ఈకాకినాడ ఇంకెప్పుడు డెవలప్ అవుతుందో అని అలోచిస్తున్నంతలోనే నాశ్రీమతి మేము వెళ్ళవలసిన చోటుకి కేవలం వంద రూపాయల కిరాయితో ఆటో మాట్లాడటం, ఆ ఆటోవాడు నాప్రమేయం లేకుండానే నాచేతిలోని బేగ్ తీసుకుని అందులోకి ఎక్కించటం క్షణాలలో జరిగిపోయాయి. ఆటో కుళాయి చెఱువు ఎదురుకుండా ఉన్న వీధిలో ఆఇంటి వైపు తిరగగానే వద్దు వద్దు అంటున్నా వినకుండా కనులు మూతపడి మనసు బాల్యాన్ని తడిమింది.
***
అమ్మా అకలేస్తోందే అని పావుగంటనుండి అడుగుతూనే ఉన్నా రెండున్నర గదులున్న ఆఇంట్లో మాచిన్ని కడుపులు నింపడానికి ఏచిరుతిల్లు తనదగ్గర లేకపోవడంతో ఓగంట ఆగు నాయనా అన్నం వండేస్తాను తినేద్దువుగాని అని అంటోదేకాని ఏంపెట్టే సూచనలు కనబడకపోవటంతో... నాకన్నా పదేళ్ళు పెద్దదైన మాపెద్దక్క నన్ను తీసుకుని ఇంటి బయట మామిడి చెట్టుకింద ఉన్న నులక మంచం మీద కూర్చోబెట్టి నన్నూరుకోపెడుతున్న వేళ ఆఎదురింట్లో మానాన్నగారు గుమాస్తాగా పనిజేసే… అందరూ అబ్బాయిగారని పిలిచే గొల్లపూడి శంకరంగారి తల్లి, నా సహపాఠీ ఐన వెంకటేషువాళ్ళ అబ్బాయమ్మగారు ఏరా పిల్లలు ఇలా రండర్రా అని పిలవడమే తరువాయి ఇరవై అడుగుల దూరాన్ని మాముగ్గురక్కయ్యలు నేను ఒక్క అంగలో దాటినట్లు దాటేసి ఆమె ముందు వాలిపోయాం. మేము వెళ్ళేసరికే ఆమె నాలుగు ప్లేటుల నిండుగా జంతికలు, సున్నుండలు, కజ్జికాయలు లాంటివి తీసుకొచ్చి మాకిచ్చి ఇక్కడే తినేసి వెళ్ళండి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తే మీ అమ్మ తిడుతుందేమో అనేలోపులోనే మొత్తం ఖాళీ చేసేసరికి, అంత ఆకలిగా ఉన్నప్పుడు ముందే రావచ్చు కదర్రా అని ఇంకొన్ని తెచ్చివ్వగా… సగం నిండిన బేరం వల్ల మొహమాట పడుతుంటే తనే స్వయంగా మాఅందరికి తినిపించారు. అందరికి అలా కడుపు నిండేలా పెట్టడం ఆమెకు ఓతృప్తి ఐతే, ఆవిడ మాత్రం ప్రతీరోజూ సూర్యనారాయణుడిని చూడందే ఉత్తి గంగ తప్ప ఇంకేమి ముట్టుకునేవారు కాదని కొంచెం ఊహ వచ్చిన తర్వాతే తెలిసింది. చిన్నప్పటి నుంచి మాఇంట్లో చెప్పుకునేదానిబట్టి శంకరంగారి తాతగారు రామచంద్రం గారు వారిది పిఠాపురం దాటిన తర్వాత వచ్చే గొల్లప్రోలు. భార్యను తీసుకుని కాకినాడకు వచ్చినప్పుడు అతని దగ్గరున్నవి ఏడంటె ఏడు రూపాయలతోపాటు ఎదగాలనే కోరిక మాత్రమే. జగన్నాధపురం దగ్గర చేపలవేటకు వచ్చేపోయే జనాలకు ఇడ్లీలు అమ్మటంతో మొదలైన ఆయన వ్యాపారం, చేతికి అందొచ్చిన కొడుకు గొల్లపూడి వేంకటేశంగారు సున్నంతో కట్టుకునే ఇళ్ళు తక్కువైపోయి రానున్న రోజులలో జనాలు సిమెంటుతోనే ఇళ్ళు కట్టుకుంటారని చేసిన ఆలోచన నిజమవ్వడం, తర్వాత మొదలుపెట్టిన ఇనుప వ్యాపారం బంగారంలా కలిసిరావడంతో ఆతండ్రీ కొడుకులు ఇంక వెనుతిరిగి చూసుకునే అవసరం లేక మొదటిసారి మాకాకినాడలో వాళ్ళ మేడమీద కోటిరూపాయల సంపాదనకు గుర్తుగా పడగనెత్తిన తాచు బొమ్మను ప్రతిష్టించారు. ఎంత సంపాదించినా సరే తమ సంపాదనలో పావుభాగాన్ని దానధర్మాలు చెయ్యాలనే నియమాన్నిఆ తండ్రీ కొడుకులిద్దరూ ఏనాడూ మరువలేదు. రామచంద్రంగారు కాలంచేసినా వేంకటేశంగారు తన దక్షతతో వ్యాపారాన్ని ఏయేటికాఏడు విస్తరించుకుంటూ వెళ్ళటంతో పదికాలాలపాటు కూర్చుని తిన్నా తరగని సంపదకు గురుతుగా ప్రస్తుతానికి పది పడగలున్నాయి వారి ఇంటిపైన.
అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని తాత-తండ్రులు ఇద్దరిని మించిపోయారు శంకరంగారు దానధర్మాలలో. నలుగురికి పెట్టడం వల్ల వచ్చే పుణ్యమే మనతో ఉంటుంది తల్లి చెప్పిన మాటతో దేహీ అంటూ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉత్తిచేతులతో వెళ్ళటం ఆఇల్లు చూసిన దాఖలాలు లేవంటే నమ్మండి. పుణ్యం మీదతప్ప వ్యాపారం మీద తగినంత దృష్టి పెట్టకపోవడంతో మేము పదో తరగతికి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి పూర్తిగా తలకిందులవ్వడం.... మానాన్నగారు అప్పుడప్పుడే మొదలవ్వుతున్న రియల్ ఎస్టేటులో ఏజెంటుగా నిలదొక్కుకునేసరికి మేము ఆపాత రెండున్నర గదుల ఇంటిలోనుండి అచ్యుతరామయ్య వీధిలో బాలా త్రిపుర సుందరి గుడిదగ్గర కట్టుకున్న రెండస్తుల కొత్తింటిలోకి మారిపోవటం కాలం గమనిస్తోనే ఉంది.
***
వచ్చిన నాలుగురాళ్ళు నిలవాలంటే నలుగురికి దూరంగానే ఉండాలనే మానాన్నగారి ఆలోచనలు నాపై చూపిన ప్రభావం వల్ల…. తనకిష్టమైనట్టే పరుగులు పెట్టే కాలంతో పాటు నేనూ నాకిష్టమైనట్టు పరుగులుపెట్టి ఇదిగో ఇప్పుడు బెంగళూరులో పాతిక కోట్ల సాఫ్ట్వేర్ కంపెనీకి యజమాని అయ్యాను. ఆరోజు రాత్రి భోజనాల దగ్గర మా చిన్నప్పుడు శంకరంగారి ఇంటిపైన ఉండే పడగలను గుర్తుచేస్తూ... అంటే ఇప్పుడు మన ఇంటిపైన పాతిక పడగలు నిలబెట్టాలా అంటే మా అమ్మ నరునిదృష్టికి నల్లరాళ్ళు బద్దలవుతాయి మనమేమిటీఅనేది బయటకు ఎప్పుడు చెప్పుకోకూడదు అని మందలించింది.
***
భోగి ముందురోజు సాయంత్రం ఓసారి అలా కాకినాడను చుట్టపెట్టి వద్దామని బయలుదేరి దేవాలయం వీధిని-తిలక్ వీధిని కలిపే ఆచోటు దగ్గరికి వచ్చేసరికి అక్కడ తోపుడుబండి దగ్గర ఓచెత్తో జనాలకు ఇడ్లీలు, దోశెలు అందిస్తూ ఇంకో చేత్తో వాళ్ళు తిన్నతర్వాత ఇచ్చే డబ్బులను కళ్ళతోనే లెఖ్ఖపెట్టుకుంటున్న వెంకటేషుగాడిని చూడగానే ఆగి వాడి దగ్గరకు వెళ్తే మొదట ఎవరో కష్టమర్నేమో అనుకుని ఏం ఇవ్వమంటారు సార్ ఇడ్లీ, దోశె రెండూ వేడి వేడిగా ఉన్నాయి అంటూ... పరీక్షగా చూసి గుర్తుపట్టి నన్ను గట్టిగా హత్తుకుంటుంటే ఎక్కడ వాడి చేతులు తగిలి నా చొక్కా మరకలు పడిపోతుందేమోనని నేను పడుతున్న ఇబ్బందిని ఏమాత్రం పట్టించుకోకుండా వేడి వేడిగా ఓనాలుగు ఇడ్లీలనిండా వెన్నవేసి తినమని ఇవ్వడంతో మళ్ళీ ఇంకోసారి అబ్బాయమ్మగారు గుర్తుకొచ్చేశారు. వాడు నాపై చూపిన అభిమానంతో మనసుమూలలో ఎక్కడో తడిగా అనిపించటంతో అక్కడే ఉన్న ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుని వాడితో ఆమాటా ఈమాటా మాట్లాడుతూ కొంచెం సేపు కాలక్షేపం చేసి వెళ్ళొస్తానురా అని నేను తిన్న దానికి డబ్బులు ఇవ్వబోతుంటే నాకు డబ్బులిచ్చేంత వాడివయ్యావురా అంటూనే పదరా నేనూ వస్తాను నిన్ను చూడక, నీతో మాట్లాడక ఎన్నో ఏళ్ళయ్యాయి అని వ్యాపారాన్ని తన భార్యకు, గల్లాపెట్టెను కూతురికి అప్పజెప్పి నాతోపాటు వాడూ నడక మొదలెట్టేసరికి… ఇడ్లీల వేడికి కరుగుతున్న వెన్నలా ఏనాడు మనుషులను వారి దగ్గరున్న డబ్బులతో తప్ప మనసులతో కొలవని నామనసు కరుగుతూ కొంచెం సేపు ఏమాటలు లేకుండా సాగటంతో ఎరా బంగారు పళ్ళెంలొ భోజనం చేసేవాడివి ఇలా మిగిలిపోయావు బాదేంలేదురా అంటే.... ఓసారి నావంక చూసి అదేంట్రా అలా అనేసావ్అంటూనే, నువ్వన్నది నిజమే ఐన మాఇంట్లో చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పేవారు... మనం ధనవంతులమే ఐన బంగారం తినము, అందరిలా అన్నమే తింటాము, మనం తినేదే నలుగురితో పంచుకుంటే వచ్చే పుణ్యమే మనకు మిగులు, మిగిలినదంతా తరుగేనని. నేను పుట్టినప్పుడున్న ఆస్థులలో ఏవీ ఇప్పుడు లేకపోయిన మానాన్నగారివల్ల ఎదిగిన వాళ్ళల్లో చాలామందికి అబ్బాయిగారి కొడుకుననే అభిమానం మాత్రం ఇంకా అలానే ఉందిరా. నువ్వు చూసావు కదా అదే నావ్యాపారం ఉదయం నాలుగు గంటలు సాయంత్రం ఇంకో నాలుగు గంటలు కష్టపడితే మొత్తం మీద పన్నెండు నుంచి పదమూడు వేల వ్యాపారంలో ఖర్చులన్నీపోను రోజుకి ఐదారువేలు మిగులుతాయి. ఖర్చులు బాగా పెరిగిపొయాయి కదరా అందుకే నెలకు సంపాదించిన రూపాయిలో తాత-ముత్తాతల కాలంలోలా పావలా ఇస్తే సరిపోదు, నాన్నగారిలా మొత్తం రూపాయి ఇవ్వలేను కాబట్టి మధ్యస్తంగా ఇప్పుడు ఏభై పైసలే ఇవ్వగలుగుతున్నాను. ఐనా పెద్దోళ్ళు చెప్పినట్లు మనం నలుగురికి చేసే సాయమే మనల్ని కాపాడుతుంది కదరా అని వాడుచెప్పేసరికి షాక్ కొట్టినట్లు అయ్యింది నా పరిస్థితి. కనీసం కాకికి కూడా ఎంగిలి మెతుతులు వేయని నేనెక్కడ? కళ్ళముందే కోట్ల ఆస్తి కర్పూరంలా కరిగిపోయినా ఇప్పటికీ తన కష్టంలో సగానికి సగం సేవకు ఖర్చు చేస్తున్న వాడెక్కడ అనే ఆలోచన నన్ను నిలవనీయలేదు.
***
ఆ భోగినాటి మంటలలో నేను, నా అనుకున్న అహాన్ని కాల్చేసుకుని ఎలాగైనా వాడికి సాయం చెయ్యాలని రాత్రి వాడు చెప్పిన గుర్తులను పట్టుకుని వాడింటికి వెళ్ళి వాడి చేతిలో ముప్పై లక్షల చెక్కు పెట్టేసరికి అది చూసి నన్ను గట్టిగా హత్తుకుని సమయానికి దేవుడిలా వచ్చావురా అంటూ తన పక్కనే కూర్చున్న పెద్దాయనను పరిచయం చేస్తూ నీకు గుర్తున్నారా మన చిన్నప్పటి తెలుగు మాష్టారు. వీరి అమ్మాయికి గుండెల్లో కన్నమంట... ఆపరేషనుకి పాతిక పైనే ఖర్చవుతుందని ఇల్లు అమ్మేస్తాను అంటున్నారు ఇంతలో నువ్వొచ్చాసావు దేవుడిలా అంటూ నేనిచ్చిన చెక్కును వెంటనే ఆయన చేతిలో పెట్టి మాష్టారు ఇక మీరు ఏఇబ్బంది పడనవసరం లేదు, మీ అమ్మాయి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటుందని ఆశీర్వదిస్తున్న వాడిలో దైవం మానుష రూపేణా అన్న నిజం, నిలువెత్తున కనబడుతుంటే వాడిని మనసారా హత్తుకున్నాను.
***
No comments:
Post a Comment