దైవమా వో దైవమా (అర్థ తాత్పర్య విశేషాలు) - అచ్చంగా తెలుగు

దైవమా వో దైవమా (అర్థ తాత్పర్య విశేషాలు)

Share This
దైవమా వో దైవమా (అర్థ తాత్పర్య విశేషాలు)
తాళ్లపాక అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
వివరణ : డా. తాడేపల్లి పతంజలి 


రేకు: 230-4 సంపుటము: 3-171
అవతారిక
అంతలోనే స్వామిని వెర్రివాడివంటాడు. ఇంతలోనే నన్ను దయ చూడమంటాడు. “అన్నమయ్యా.. అ వెర్రివాడు ఎలా దయ చూస్తాడయ్యా ..”. అని ఎవరన్నా అంటారేమోనని తనకు తానే ప్రశ్న వేసుకొని ..మూడడుగులు వేసి విశ్వమంతా ఆక్రమించిన
వాడిని..ఒక వైపు పొగుడుతూ మరొక వైపు మూడు చరణాల్లో మనందరి తరపున అడగాలిసినదేదో అడిగేసాడు. అమ్మను
ప్రశ్నించి , ప్రశ్నించి అలసట వచ్చి , ఆ తల్లి చీర కుచ్చెళ్ళలో తలదాచుకొని గారాలు పోయే చిన్నపిల్లవాడిలా- అన్నమయ్య
ఈ కీర్తనలో మనకు మధుర భక్తి నయగారాలు చూపించాడు..
****
దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా
నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా ॥పల్లవి॥
1.చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను
భువిఁ దొల్లే నోచితి పుట్టేనంటాను
యివల గడుపులోన హేయమౌతాఁ గూడవుతా
నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా ॥దైవ॥
2.మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను
వెగటు లంపటమైతే వేసరుకొందు
వగపును నగవును పడి నొక్క మొకమందే
తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా ॥దైవ॥
3.మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని
సతులంటా సుతులంటా సంసారినైతి
గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలోనే
యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేను ॥దైవ॥
తాత్పర్య విశేషాలు
దైవమా వో దైవమా నన్ను దయఁజూడఁ దగదా
నే వెఱ్ఱివాఁడనైతే నీవు వెఱ్ఱివా ॥పల్లవి॥
విశేషాలు
నేను వెఱ్ఱివాడనైతే నీవు వెఱ్ఱివా! అనుటలో అర్థాలు ఇవి
1. నేను వెఱ్ఱివాడిని కాను. నేను జ్ఞానం తెలిసిన నీభక్తుడను .
2.భక్తుడు తనకు ఇష్టమైన వారినే కొలుస్తాడు.వెర్రి వాడు వెర్రివాడినే కొలుస్తాడు. నేను వెఱ్ఱివాడనైతే నీవు వెఱ్ఱివి కావలసిన ప్రమాదం వస్తుంది కనుక నేను వెఱ్ఱివాడిని కాను. నువ్వు వెఱ్ఱివి కావు.
3. పిచ్చి వాడయితే దయచూపించని దైవాన్ని పదే పదే కొలుస్తాడు. నువ్వు దయ చూపించాలి . దయ చూపకపోతే నువ్వు వెఱ్ఱివి అవుతావు. నేను వెఱ్ఱి వాడిని అవుతాను. కనుక నాపై దయను చూపించుమని ప్రార్థన.

1వ చరణం
1.చవిగొంటి నెత్తురెల్లా చన్నుఁబాలనుచు నేను
భువిఁ దొల్లే నోచితి పుట్టేనంటాను
యివల గడుపులోన హేయమౌతాఁ గూడవుతా
నివిరి నన్నెరఁగను నిన్నెరిఁగేనా ॥దైవ॥
తాత్పర్య విశేషాలు
నా తల్లి దగ్గరినుంచి చన్నుపాల రూపంలొ ఆవిడ నెత్తురు మొత్తం పీల్చాను.
ఇలా నేను పుట్టటానికి ఇదివరకటి జన్మలో నేను నోచిన – చేసిన పాపపుణ్యాల ఫలితమే కారణమంటాను.
ఇవతల – (బాల్యావస్థ దాటినపిదప )ఏదో విధముగా వెళ్లబుచ్చుతూ అసహ్యమౌతున్నాను. అసహ్యజీవిని అవుతున్నాను.
నేను చనిపోయిన పిదప - నా ఎముకల బూడిద పొలాల్లో కలిసి పంటలలో కలిసి ప్రజలకు కూడుగా- ఆహారముగా
అవుతున్నాను.
నన్ను ఇలా జన్మలలో ముంచుతూ – ప్రేమగా నిమురుతున్నావు. (నివిరి)
నన్ను నేను ఎరగను. పూర్వజన్మ తెలియదు. రాబోవు జన్మ తెలియదు.

నాగురించి నాకే తెలియని వాడిని , నీ గురించి ఏమి తెలుసుకొంటాను!? (ఏమి తెలియదని భావం)
దైవమా! ఓ వేంకటేశ దైవమా ! నన్ను దయచూడటం - నా మీద దయ చూపించటం- నీకు తగదా?
నీ భక్తుడిని స్వామీ ! దయ చూపించు. ఈ జన్మలెత్తే ఓపిక లేదు. మోక్షమిచ్చి దయ చూపించు.
2వ చరణము
మొగిఁ జావుకు వెరతు ముందర గాన నేను
వెగటు లంపటమైతే వేసరుకొందు
వగపును నగవును పడి నొక్క మొకమందే
తగులైనవాఁడ నీపై తలఁపు నాకున్నదా ॥దైవ॥
తాత్పర్య విశేషాలు
దైవమా! ఓ వేంకటేశ దైవమా ! మిగతా విషయాల కంటె ముందుగా ఈ లోకంలో నేను చావుకు బాగా భయపడతాను.
అసహ్యము బంధమయితే దుఃఖిస్తాను. (వేసరుకొందు)
శోకము, నవ్వు(సుఖము) ఒకదిక్కులోనే – ఒకచోటే కలుపుకొని – చిక్కుకొని ఉన్నవాడను. (తగులైనవాఁడ)
ఈ చిక్కులలో ఉన్న నాకు నీపై ఆలోచన-భక్తి ఎక్కడుందయ్యా !
దైవమా! ఓ వేంకటేశ దైవమా ! నన్ను దయచూడటం - నా మీద దయ చూపించటం- నీకు తగదా?
3వ చరణం
మతి భ్రమసితిఁ గొంత మన్ను నాకు రాజ్యమని
సతులంటా సుతులంటా సంసారినైతి
గతియై శ్రీవేంకటేశ కాచితి వింతటిలో
యితరుఁడ నింతే నీకు నేమి బాఁతి నేనునే ॥దైవ॥
ఈ కొంత అధికారపు మన్ను(శూన్యము) నాకు రాజ్యమని , నేనే గొప్పవాడినై అని భ్రమిసాను.
భార్యలంటూ కుమారులంటూ జన్మచక్రాలలొ సంసారినై విలపిస్తున్నాను.
ఇంతలో ఈ జన్మలో నా అదృష్టమేమిటో- నాకు కనిపించి- నాకు దిక్కై – నన్ను రక్షించావు.
అంతలొనే దూరం చేస్తున్నావు.
అవునులేవయ్యా !

నేను ఇతరమైనవాడిని- పరాయివాడిని.
నీకు నేను ఏమన్నా అధికమైన వాడినా? ప్రేమకలిగినవాడినా?( బాతినే)
స్వామి ఏదో అంటుంటాను. పట్టించుకోకు.
దైవమా! ఓ వేంకటేశ దైవమా ! నన్ను దయచూడటం - నా మీద దయ చూపించటం- నీకు తగదా?
దయ చూపించు స్వామీ !

***

No comments:

Post a Comment

Pages