కాలచక్రం - అచ్చంగా తెలుగు
కాలచక్రం
-పోడూరి శ్రీనివాసరావు


గిర గిర తిరిగే ఏ చక్రమైనా,
రంగులరాట్నమైనా మరేదైనా 
తిరిగే శక్తి ఆగగానే, వేగం తగ్గగానే,
ఆగిపోతుంది.... అలసిసొలసి పోతుంది.
రోజులతరబడి, సంవత్సరాల తరబడి,
ఆగిపోని... అలసిపోనిది....
ఒకే ఒక్క చక్రం! అదే కాలచక్రం!!

భగవంతుడు సృష్టించిన 
ఈ కాలచక్రం – ప్రతీ జీవి జీవితంలో 
మనిషి జీవితంలో,ప్రాణి జీవితంలో 
ముఖ్యమైనది. ప్రధానమైనది.
కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది....
ప్రకృతిలో-ఋతువులూ,కాలాలూ,
వాతావరణాలూమారుతూనే ఉంటాయి 
కాలచక్రం కదలికలో ఎన్నెన్నో 
వసంతాలూ,గ్రీష్మాలూ,శిశిరాలూ... 
గడచిపోతూనే ఉంటాయి.
తమ ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి.

కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది....
గర్భస్థ శిశువు రూపు దిద్దుకోవడం,
పిండం పెరిగి, పెద్దదవడం, 
భూమ్మీద పడడం, వివిధ శైశవదశలు దాటి,
బాల్య, యవ్వనకౌమారలనధిగమించి, 
విద్యాబుద్ధులు నేర్చి, వివాహమాడి,
దినదినాభివృద్ధి నొంది, మరల వంశాంకురాన్ని పొంది,
వాళ్ల అభివృద్ధిని కనులారాకాంచి, సంతసించి,
అవసానదశలో, పడరాని పాట్లు పడి,
లేని రోగాలు కొని తెచ్చుకుని,కైవల్యాన్ని కాంక్షించి,
మరణదేవత పిలుపుకై ఎదురు చూస్తాం! 

అయినా... నీ జీవితం....
వివిధ దశలను దర్శించినా...
అనుభవించినా... చరమాకం చేరినా...
కాలచక్రం ఆగదు ...
కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది.
నీ జీవన పోరాటంలో విజయాన్ని సాధించినా..
అలసి సొలసి వీరమరణాన్ని పొందినా!!
కాలచక్రం అలసిపోదు – ఆగదు – తిరుగుతూనే ఉంటుంది!!!

ఋతువులు వాటి ప్రకృతి ధర్మాన్ని 
పాటించక పోయినా...
అస్తవ్యస్తంగా కాలాలూ మారిపోయినా ...
కరువుకాటకాలతో జనఘోషలు పిక్కటిల్లినా ...
వరద భీభాత్సాలు విలయతాండవం చేసినా...
తుఫానులు, హరికేన్ లు కకావికలం చేసినా....
భూకంపాలతో భూమి దద్దరిల్లినా...
హాహాకారాలతో ప్రజలు 
శిథిలాల క్రింద సమాధులవుతున్నా...
విమాన, రైలు ప్రమాదాలతో జనాభా తగ్గిపోతున్నా...
రహదారులు రక్తసిక్తాలై....
కేవలం అరుణవర్ణరంగవల్లులద్దుతున్నా...
కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది....
ఆశ్చర్యంతో... ఉత్సుకతతో... వేదనతో....
క్షణకాలమైనా – ఆగుదామని కూడా ఆలోచించదు.

నిర్విరామంగా తిరిగే యంత్రాలు సైతం 
షిఫ్ట్ లంటూ కొన్నిగంటలు విశ్రాంతి తీసుకుంటాయి.
రిపేర్ లంటూ వస్తే కొన్నిరోజులు ఊపిరి తీసుకుంటాయి.

కాలచాక్రానికి అటువంటివేమీరావు.
అమృతం తాగిన అసురునిలా...
పనిరాక్షసుడిలా... ఆగకుండా...
అలవకుండా... తనపనిచేసుకుపోతూనే ఉంటుంది.

ఇటువంటి మహత్తర యంత్రాన్ని
సృష్టించిన భగవంతుని కౌశలానికి
కైమోడ్పదించకుండా ఉండగలమా?
ఆ మహనీయుని అర్చించకుండాఉండగలమా??

శాస్త్రవేత్తలెన్ని ప్రయోగాలు చేసినా...
కాలచక్రాన్ని క్షణకాలం పాటు 
ఆపుచేద్దామని ప్రయత్నించినా.... 
గడియారపు ముల్లులా, తిరిగి
కాలచక్రాన్ని వెనుకకు తిప్పుదామని....
ప్రయత్నించినా....
శుష్క ప్రయోజనమే!

ఏటికి ఎదురీదగలవేమోగానీ
కాల చక్రానికి ఎదురీదలేవు....
ప్రవాహంలో కొట్టుకుపోవడమే –
కాలచక్రవేగానికి వంగి, తలవంచి
నమస్కరించడమే – నీ కర్తవ్యం 
కర్తవ్య విముఖుడవు కాకు!

ఎదురించి,ఆపుచేసి, గతి మార్చడానికి 
మనమేమీ‘బాహుబలు‘లం కాదుగా!!!
 ***

No comments:

Post a Comment

Pages