కనువిప్పు
పొన్నాడ లక్ష్మి
“అత్తయ్యా! గబ గబా తెమలండి. ఆటో వాడు వచ్చేసాడు . శారదా! నువ్వు అలా కూర్చోకపోతే అత్తయ్యకి కొంచెం సాయం చెయ్యకూడదే” అంటూ అత్తగారిని, ఆడపడుచుని తొందర పెట్టింది లక్ష్మి.
అందరికన్నా చిన్నది, ఆఖరిది అయిన శారద అంటే లక్ష్మికి చనువుతో కూడిన అధికారం. మేనరికమేమో ఆడబడుచు, వదినగారు అన్న బేధం లేకుండా అభిమానంగా ఉంటారు.
లక్ష్మి భర్త రమణ భువనేశ్వర్లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం. మరిది ప్రకాష్ కి కూడా అక్కడే బ్యాంకులో ఉద్యోగం. ఇద్దరు కొడుకులూ అక్కడే ఉండడం వలన తండ్రి పోయిన తరువాత తల్లి కాంతమ్మ ఆ కొడుకు దగ్గర, ఈ కొడుకు దగ్గర ఉంటూ ఉంటుంది.
శారద హైదరబాదు లో ఉంది. తల్లిని చూడ్డానికి వచ్చి పెద్దన్నగారింట్లో
రెండు రోజులుండి చిన్నన్నదగ్గరకి బయల్దేరింది. కూతురున్న రెండు రోజులూ
కలసి ఉండొచ్చని తాపత్రయంతో కాంతమ్మ కూడా చిన్న కొడుకింటికి బయల్దేరింది.
ఆటోవాడు హారన్ మోగిస్తున్నాడు. ఈ ఆటోవాళ్ళు మరీ తొందర పెట్టేస్తారు.
వాళ్ళడిగిన సొమ్ము ఇచ్చినా కూడా నిమిషం నిలబడరు. అని లక్ష్మి సణుక్కుంటూ అత్తగారి బ్యాగు పట్టుకుని కిందికి వచ్చి ఆటోలో బ్యాగు పెట్టింది.
కాంతమ్మ, శారద నెమ్మదిగా వచ్చి ఆటో ఎక్కారు. ప్రకాష్ ఇంటికి రమణ ఇంటికి నాలుగైదు కిలోమీటర్లు దూరముంటుంది. అక్కడికి చేరాక శారద కాంతమ్మని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా లోనికి తీసుకెళ్ళింది. లక్ష్మి ఆటోవాడికి డబ్బులిచ్చి వెనకాలే తనూ వెళ్ళింది. తోటికోడలుతో, మరిది పిల్లలతో కాసేపు కాలక్షేపం చేసి లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చేసింది.
“ఏమోయ్ కాస్త కాఫీ ఇస్తావా? తలబద్దలైపోతూంది, అంటూ రమణ ఆఫీసు నుండివచ్చి సోఫాలో కూలబడ్డాడు. గబ గబా కాఫీ కలిపి భర్తకిచ్చి పక్కన కూర్చొని కబుర్లు చెప్తూంది. “అవునూ ! మా అమ్మ, శారద మా తమ్ముడు ఇంటికి వెళ్ళారా?” అని అడిగాడు రమణ.
“ఆ నేనే వెళ్లి ఆటోలో దిగబెట్టి వచ్చాను” అంది లక్ష్మి.
కాసేపు పిచ్చాపాటి అయ్యాక లక్ష్మి వంటింట్లోకి వెళ్ళింది. భోజనాలయ్యేక ఓ
గంట టి.వి. చూసి నిద్రకుపక్రమించేరు భార్యాభర్తలు.
రాత్రి పది గంటలకి లక్ష్మి తోటికోడలు భాను ఫోన్ చేసింది. “అత్తయ్యగారి
బ్యాగు అక్కడ ఉందా? మందులు వేసుకుందామని చూస్తే లేదు”. అని అడిగింది.
లక్ష్మికి గుండె గుభేల్మంది. “ఇక్కడ లేదమ్మా. శారద గాని లోపల పెట్టిందోమో
చూడు”. అని చెప్పి ఫోను పెట్టేసింది. ఆ బ్యాగు తనే పట్టుకుని ఆటోలో
పెట్టింది. అక్కడ దిగి వాళ్ళింట్లోకి వెళ్ళినప్పుడు బ్యాగు ఆటోలో మర్చిపోయింది. “ఏమిటి సంగతి? ఎక్కడినుంచి ఫోను?” అని రమణ అడిగేడు నిద్రమత్తులో. విషయం చెప్పగానే నిద్రంతా ఎగిరిపోయింది. “ఏమిటీ? ఆటోలో బ్యాగు మర్చిపోయావా? ఆటో దిగి సినిమాకి వెళ్ళినట్లు చేతులూపుకుంటూ లోపలి కి వెళ్ళిపోయావా? అంత పెద్ద బ్యాగు ఎలా మర్చిపోయావు?” అని భార్యమీద విరుచుకుపడ్డాడు.
నేను మర్చిపోయాను సరే; మీ చేల్లెలికైనా గుర్తుండాలి కదా? అన్నింటికీ నా మీదఅరుస్తారు” అంది లక్ష్మి కోపంగా.
“చేసిన వెధవ పనికి ఇంకా సమర్ధింపు కూడాను”. అని రమణ విసుక్కున్నాడు.
“సరే పొద్దున్న ఏదో ఆలోచిద్దాంలే. వచ్చిపడుకో” అన్నాడు రమణ పక్కమీద వాలుతూ.
ఆ బ్యాగులో కాంతమ్మ మంచి బట్టలు, అయిదారువేల దాకా డబ్బు, ముఖ్యంగా పెన్షన్ పుస్తకము ఉన్నాయనీ, పెన్హన్ పుస్తకం కోసం చాలా తంటాలు పడాలి అని ప్రకాష్ కూడా విసుక్కున్నాడుట. మా తోటికోడలు చిన్నబుచ్చుకుని చెప్పింది.
అసలు నాకు మొదటినుంచీ మతిమరుపే. నా అజాగ్రత్తకి, నిర్లక్ష్యానికి నన్ను
నేనే తిట్టుకున్నాను. ఏమనుకున్నా ఎంతబాధపడ్డా పోయునవస్తువు
తిరిగివస్తుందా? అని లక్ష్మి అన్యమస్కంగా ఉంది.
రెండు రోజులు గడిచాయి. ఆరోజు సాయంత్రం శారద తిరుగు ప్రయాణం. ఆదివారం అవడం మూలాన రమణ ఇంట్లోనే వున్నాడు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. భోజనానికి కూర్చోబోతుంటే కాలింగ్ బెల్ మ్రోగింది. ఈ ఎండలో ఎవరా అని తలుపు తీసింది లక్ష్మి. గుమ్మంలో వున్న ఆటో వాడిని చూసి ఆశ్చర్యపోయింది. “అమ్మా. ఆ రోజు ఈ బ్యాగు నా ఆటోలో మర్చిపోయారు. మీ తర్వాత ఎందరో ఆటో ఎక్కి దిగారు.
బ్యాగు ఎవరిదో తెలియలేదు. ఈ రెండు రోజులు ఆలోచించి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆ రోజు మీరు ఏదో చిరాకు పడుతూ ఈ బ్యాగు ఆటో వెనక సీట్లో పెట్టడం, ఆ వెనక మామ్మగారు, ఇంకో అమ్మగారు నెమ్మదిగా వచ్చి కూర్చోవడం, మిమ్మల్ని సత్యనగర్ లో దించడం జ్ఞాపకం వచ్చాయి. ఈ బ్యాగు పోయిందని మీరెంత కంగారు పడుతున్నారో అని వెంటనే వచ్చాను.” అని బ్యాగు చేతిలో పెట్టాడు. లక్ష్మికి నోటమాట రాలేదు.
“మరి నాకు సెలవు ఇప్పించండమ్మా. మా అబ్బాయికి రెండు రోజులుగా చాలా జ్వరంగా వుంది. డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి.” అన్నాడు. శారద బ్యాగు లోపలి తీసుకువెళ్ళి జిప్పు తెరచి చూసింది. అన్నీ ఎలా పెట్టినవి అలాగే వున్నాయి. అందరం ఎంతో సంతోషించారు. రమణ సంతోషం కొద్దీ అయిదువందల రూపాయలు ఇస్తే అతను తీసుకోలేదు.
‘మీ బ్యాగు మీకు అప్పగించగలిగాను. అది నా బాధ్యత’ అని
నిరాకరించాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి పిల్లలకి ఏమైనా కొనిపెట్టు. ఆ
బ్యాగులో విలువైనవి చాలా వున్నాయి. పోతే చాలా ఇబ్బంది పడివుందుము. అని బలవంతంగా సొమ్ము అతని చేతిలో పెట్టారు. ‘వస్తానమ్మా’ అని అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఆటో వాళ్ళమీద చిన్న చూపుతో ఎన్నోసార్లు విసుక్కున్న లక్ష్మి అతని ఉన్నతమయిన వ్యక్తిత్వం ముందు సిగ్గుతో తలదించుకుంది. తను ఆటోవాళ్ళ గురించి ఎంత తప్పుగా ఆలోచించింది అనుకుంటూ కనువిప్పు కలిగిన లక్ష్మి మౌనంగా లోపలికి దారితీసింది.
(యదార్ధ సంఘటనకి ఆధారంగా రాసిన కధ).
No comments:
Post a Comment