నీకు నేనున్నా 15 - అచ్చంగా తెలుగు
నీకు నేనున్నా – 14
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com
angulurianjanidevi.com


(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు మనోహర్. అతని అక్క కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. మధురిమకు పెళ్ళైపోయిందని అబద్ధమాడి, అతని అక్క కూతురైన పద్మతో అతని వివాహం జరిపిస్తుంది అతని తల్లి. అనుకోకుండా మళ్ళీ కలిసిన మనోహర్, మధురిమ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మళ్ళి వస్తానని చెప్పి వెళ్లి, అనుకోకుండా మనోహర్ కి ఆక్సిడెంట్ అయి కోమాలో ఉండిపోతాడు. దానితో అనాధలైన మధురిమ, బాబులను తనతో తీసుకు వెళ్లి ఆశ్రయమిచ్చి, మధురిమకు ఉద్యోగం ఇప్పిస్తాడు దామోదర్ రెడ్డి. మధురిమతో లేడీస్ హాస్టల్ పెట్టిస్తారు చరణ్, విక్రం . హాస్టల్ లో చేరే ఆడపిల్లల విభిన్న మనస్తత్వాలతో కొత్త సవాళ్ళను ఎదుర్కుంటుంది మధురిమ . అందులో వర్ష అనే అమ్మాయి దూకుడుగా ప్రవర్తించి హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంది . తన కూతురు వర్ష ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతోందని తెలిసి, ఆమెను, తన భార్యను కొడతాడు హరి. ఆమెకు పెళ్లి చెయ్యాలని వెళ్ళిన ప్రయత్నంలో అనుకోకుండా మనోహర్ ను కలుస్తాడు. హరి వల్ల మధురిమ, మనోహర్ లు కలుస్తారు. ఇక చదవండి.)

‘మధురిమ ఒల్దేజ్ హోం’ ప్రారంభోత్సవం అతిఘనంగా ప్రారంభమైంది.
కాలం ప్రవాహంలా సాగుతోంది. ప్రవాహంలా సాగే కాలం నుంచి న్యాయనిర్దేత. అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. అన్ని దారుల్ని కలుపుతుంది.
అపుడే కారుదిగి 'మధురిమ ఓల్టేజ్ హోం’ లోకి  ప్రవేశించాడు మనోహర్.
మధురిమ గొంతుఫోన్లో విన్నవెంటనే మధురిమను చూడాలను కున్నాడు మనోహర్. అనివార్య కారణాల వల్ల వీలుకాలేదు. మధురిమను చూడటానికి వీలు కాలేదన్న బాధ ఒకవైపు, చూడాలన్న తపన ఇంకోవైపు రాత్రంతా మనోహర్ తో అడుకొంది. మధురిమను చూడటం వీలుకాకపోయినా, రాత్రంతా మధురిమతో ఫోన్లో మాట్లాడుతూ గడిపాడు మనోహర్.
ఎంట్రన్స్ లో నిలబడి అందర్నీ రిసీవ్ చేసుకుంటున్న మధురిమను చూశాడు మనోహర్.
క్రీం కలర్ బెంగాలీ కాటన్ శారీలో మంచులో తడిసిన నందివర్ధనంలా వుంది మధురిమ.
మధురిమను చూడగానే మనోహర్ హృదయం ఊహించని అలజడితో,ఉప్పొంగిన జలతరంగిణిలా అయింది. ఎన్నో రకాల అనుభూతుల అలల దాటికి తట్టుకోలేక తలమునకలయ్యాడు. ఇంతకాలానికి మధురిమను చూడగలిగానన్నఆనందం అతని హృదయానికి గొప్ప విందయింది. మధురిమ దగ్గరకెళ్లి ప్రేమగా పలకరించాడు మనోహర్, ఆ పలకరింపులో చెక్కుచెదరని గాఢమైన  అనురాగం వుంది. ఎంతోకాలంగా గూడు కట్టుకొని వున్న లాలిత్యం వుంది. ఆ లాలిత్యానికి పులకరించిన మధురిమ హృదయం పురివిప్పిన నెమలిలా మౌనంగా నాట్యం చేసింది. మౌనమే భాషగా మారిన ఆమె మూగ మనసు మనోహర్ ని ప్రేమగా తడిమింది.
ఎంతో హుందాగా మధురిమ ప్రక్కన నిలబడివున్న మనోహర్నిచూస్తుంటే, మధురిమ జీవిత కాన్వాసు మీద కాలం అనే చిత్రకారుడు మంచి ఋతు చిత్రాన్ని గీసినట్లు అన్పిస్తున్నాడు. కాలానికి ఒక రూపం లేకపోయినా ఊహించనలవికాని స్పర్శ వుందని అర్థమైంది మధురిమకు. మనోహర్ దూరమయ్యాక ఒంటరిగా కూర్చుని కాలం గురించి ఆలోచించేది. కాలం గడిచేకొద్ది భయపడేది. ఇప్పడు అదేకాలం మనోహర్ని తెచ్చి ఆమె ప్రక్కన నిలబెట్టి జీవితానికి పరిపూర్ణమైన అర్ధాన్ని చూపించింది.
తల్లి ప్రక్కనే నిలబడివున్న రాహుల్ తండ్రిని చూడగానే గట్టిగా కౌగిలించుకున్నాడు. రాహుల్ స్పర్శ తగలగానే మనోహర్ గుండె పితృ వాత్సల్యంతో నిండిపోయింది.
ఆ ప్రారంభోత్సవానికి ఈకువ వృద్ధులే వచ్చారు. కొంతమంది ప్రముఖులు పిలవగానే వచ్చి తమవంతు బాధ్యతగా ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
కొందరు వృద్ధులు ఒక ప్రక్కగా కూర్చొని మధురిమ చేస్తున్న పని గురించి చర్చిస్తున్నారు. మధురిమ ఆ ‘ఓల్డ్ ఏజ్ హోమ్’ ని ఏ ఉద్దేశంతో పెట్టిందో అక్కడ అందరికి తెలిసేలా చెప్పుకుంటున్నారు. ఆమె చేస్తున్న ఆ పనివల్ల పండు ముసలివాళ్ల జీవితాలు ఎంత సజావుగా మారతాయో ఊహిస్తున్నారు. మాటలకంటే చేతలు.... ప్రగల్భాలకంటే పనులు శ్రేష్టమని అక్కడి వాతావరణం కళ్లకు కట్టినట్లు కన్పిస్తోంది.
ఆ బిల్డింగ్ లో ఎక్కడ చూసినా ఓల్డ్ ఏజ్ వాళ్లకి అనుకూలంగా ఉండేలా మార్పులు చేయించింది మధురిమ. శుభ్రమైన గాలి, స్వచ్చమైననీరు, సాత్విక భోజనం, పరిశుద్ద భావన కన్పిస్తున్నాయి. మంచి భోజనంతో శరీరాన్ని పోషించడమేకాక, ఆధ్యాత్మిక ఆహారంతో ఆత్మను పోషించటం కూడా ఏంతో అవసరంగాభావించింది మధురిమ. అందుకే ఈశాన్య భాగంలో విగ్రహాలని అమర్చింది. అక్కడముసలివాళ్లు కూర్చొని పూజ చేసుకోవచ్చు. ఆధ్యాతిక జ్ఞానం కాని,అనుభవాలు కాని అందరికి అందుబాటులోకి రావాలని ఆశిస్తూ పూజాగది ప్రక్కనే ఆధ్యాత్మిక బోధనలు చేయిస్తోంది.బక్కెట్ల కొద్ది సలహాలివ్వడం తప్ప ఒక్క చెంచా కూడా ఆచరించని మనుష్యులున్న ఈ ప్రపంచంలో మధురిమ ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా కన్పిస్తుంది.
అక్కడే ఎదురుగా ఖద్దరు దుస్తులు వేసుకొని పెద్ద దిక్కులా కూర్చుని ఉన్న దామోదర్ రెడ్డి దగ్గరి కెళ్ళి కొంతమంది పెన్షనర్లుకూర్చొన్నారు.
“దామోదర్ రెడ్డి గారు! మాకు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ బాగా నచ్చిందయ్యా.మేము ఇందులోనే ఉండాలనుకుంటున్నాము.మధురిమ వేసే ప్రేటి అడుగులో మీ గైడెన్స్ ఉందంటున్నారు కొందరు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టమని ఆమెకు మీరే సలహా ఇచ్చారా?” అంటూ అడిగారు పెన్షనర్లు.
"ఇందులో నా గైడెన్స్ కాని, సలహా కాని ఏమీ లేదయ్యా పట్టుదలతో, క్రమశిక్షణతో కష్టపడింది మధురిమ, ఆమె కృషికి తగిన ఫలితాలు వాటంతటవే లభించాయి. చాలామందికి ఫలితం మీద ఆసక్తి వుంటుంది కాని పనిమీద శ్రద్ధ వుండదు. మధురిమ అలాకాదు. ఎంతపనైనా సరే ఉత్సాహంగా చేస్తుంది. ఆ ఉత్సాహమే ఆమె బలం. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. హుందాగా సమర్ధిస్తుంది. నచ్చకపోతే ధృఢంగా వ్యతిరేకిస్తుంది. చేస్తున్నపనిలో అంతటి పర్ఫెక్షన్ వుండబట్టే విజయవంతంగా నడపగలుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెలో దాగివున్న అంతులేని శక్తికి సానబెట్టి సక్రమ మార్గంలో ఆ శక్తిని వినియోగించుకుంది. క్రమంగా ఎదిగి స్థిరంగా నిలబడింది" అంటూ గర్వంగా చెప్పాడు దామోదర్రెడ్డి.
దామోదర్రెడ్డి మాటలు వినగానే అక్కడున్న వాళ్లంతా మధురిమను పొగిడారు. అప్పటికప్పుడే వేళ్లు లేని పుట్టగొడుగుల్లా మధురిమపై ప్రశంసలు ఆ ఓల్టేజ్ హోమంతా విస్తరించాయి.
అక్కడే కూర్చుని వున్న మధురిమకు వాళ్ల మాటలు స్పష్టంగా విన్పిస్తున్నాయి. పొగడ్త అనే మూడుకాళ్ల కుర్చీపై విర్రవీగి కూర్చుంటే క్రింద పడ్తామని మధురిమకు తెలుసు. అందుకే ఆమె వింటున్న ఆ పొగడ్తల సుగంధాన్ని ప్రేమగా పీల్చి వదిలేస్తోంది.
మనోహర్కి ఒకవైపు మధురిమ ఇంకోవైపు రాహుల్ కూర్చుని వున్నారు. రాహుల్ తన కంపెనీ విషయాలను చెబుతుంటే ఆసక్తిగా వింటున్నాడు మనోహర్ రాహుల్ని అంతమంచి పొజిషన్లో చూస్తుంటే తృప్తిగా వుంది మనోహర్క్రి. మధురిమ పెంపకంలో ఎలాంటి లోపం కన్పించలేదు. ఒకవైపు తన కెరీర్ని కాపాడుకుంటూనే కొడుకునంత ప్రయోజకుడ్ని చేసినందుకు మధురిమనుమనసులోనే అప్రిషియేట్ చేశాడు మనోహర్.
మనోహర్ ప్రక్కన కూర్చుని వున్నా రాహుల్ తండ్రిని మించి కన్పిస్తుంటే సంతోషం నిండిన కళ్ళతో, దూరం నుండి వాళ్లనే చూస్తూ కూర్చునాడు దామోదర్ రెడ్డి.
చరణ్, విక్రమ్ అక్కడంతా యాక్టివ్గా తిరుగుతూ ఫోన్ల మీదనే అన్నిపనులు చేయిస్తున్నారు. వాళ్లిద్దర్ని మనోహర్కి పరిచయం చేసింది మధురిమ.
చరణ్ని చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్ తను చదువుతున్న రోజుల్లో ప్రతిరోజు తన దగ్గరకొచ్చి తనిచ్చిన చాక్లెట్స్ తింటూ ఆడుకున్న ఆ బాబేనా ఈ చరణ్ అని సంతోషించాడు. ఎంత ఎదిగినా ఒదిగివుండే నైజం చరణ్ది. అదిబాగా݂݂ నచ్చింది మనోహర్కి.
ఒక్కసారిగా వాళ్లందర్ని అలా చూడగానే మనోహర్ కళ్లు చెమర్చాయి. "కళ్ళు  తుడుచుకోండి డాడీ! మేమంతా బాగున్నాం కదా! బాధ పడున్నారెందుకు? అంటూ తండ్రి ముఖంలోకి చూశాడు రాహుల్.
రాహుల్ కన్పించినప్పటి నుండి రాహుల్ చేయి మనోహర్ చేతిలో వుంది. పోగొట్టుకున్న విలువైన వజ్రం దొరికినట్లు కొడుకు చేతిని అలాగే పట్టుకొని
కూర్చున్నాడు మనోహర్.
“ఇది బాధకాదు రాహుల్ ఆనందం. మీరు దూరమయ్యాక నా గుండెలో
చోటుచేసుకున్నభారమంతా కన్నీళ్లరూపంలో దిగిపోయింది" అంటూ తన కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకున్నాడు మనోహర్. సెంటిమెంట్స్ కి  కదిలిపోని మనిషి వుండడని మనోహర్ ని చూస్తుంటే అర్ధమైన రాహుల్ కళ్ళు కూడా కొంచెం చెమర్చాయి.
అక్కడ నుండి లేచివెళ్లి దామోదర్రెడ్డి ప్రక్కన కూర్చున్నాడు మనోహర్.
మధురిమను ఉప్పెనలా ముంచెత్తిన కష్టాల్లో పెద్దదిక్కులా నిలబడి అడుగడుగున
ఆదుకున్న దామోదర్రెడ్డికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు మనోహర్. మనోహర్ భుజంపై చేయివేసి వాత్సల్యపూరితంగా నిమిరాడు దామోదర్రెడ్డి.
డైనింగ్ హాల్లో కూర్చుని వృదులంతా భోజనాలు చేస్తున్నారు. వాళ్ళంతా ‘మధురిమ ఓల్డ్ ఏజ్ హోమ్ ‘ లో గంటక్రితం జాయినయినవాళ్లు. వేడివేడి అన్నం,నోరూరించే కూర, ఘుమఘుమలాడే సాంబారు, చిక్కటి పెరుగు వాళ్ల  పళ్ళెంలో ప్రేమగా వడ్డిస్తుంటే ఉల్లాసంగా చూస్తూ కడుపునిండా తింటున్నారు.
ఆ వృద్ధులందరితో చక్కగా మాట్లాడుతోంది మధురిమ. అందరికి తృప్తి కలిగేలా మాట్లాడుతోంది. ‘ మీకు నేనున్నానంటూ ధైర్యం చెబుతోంది. ‘నేను మీ మనిషిని’ అన్న ఫీలింగ్ కలిగేలా చేస్తోంది.
మధురిమను చూస్తున్నకొద్దీ ఆమెలోని హుందాతనం, తేజస్సుమన్మోహర్ మనసుకి హాయిని కల్గిస్తున్నాయి.
ఆ బిల్డింగ్ కి ఉత్తరభాగంలో వున్నా ఖాళీ స్థలంలో వృద్దులు ప్రశాంతంగా తిరగటం కోసం పార్క్ లాగ చేయించి అందులో తనకి నచ్చిన క్రోటాన్స్ని నాటించింది మధురిమ. అవిఇప్పడిప్పడే ఎదుగుతున్నాయి.
మనోహర్, చరణ్, విక్రమ్, రాహుల్, దామోదర్రెడ్డి కొద్దిసేపు ఆ పార్కును సందర్శించి, యోగాసనాలు వేసే గది దగ్గరకి వచ్చారు. అక్కడ నుండి కదిలి వృద్దులు చదువుకోవటం కోసం ఏర్పాటు చేసిన చిన్న లైబ్రరీ దగ్గరకి వచ్చి ఆగారు. అక్కడున్న ఆధ్మాత్మిక పుస్తకాలను పరిశీలించాడు మనోహర్ ఆ పుస్తకాలను మధురిమ పాండిచ్చేరి నుండి తెప్పించినట్లు దామోదర్రెడ్డి మనోహర్తో చెప్పాడు. ఆ పుస్తకాలు మనోహర్ హార్ట్ కి బాగా టచ్ అయ్యాయి.
ఓల్టేజ్ హోంలో అడుగు పెట్టిన క్షణం నుండి హరి ఆధ్మాత్మిక బోధనలు చేసే దగ్గర కూర్చుని కదలటం లేదు. ఆయన్ని డిస్టర్స్ చేసేవాళ్లు కూడా లేరక్కడ.
“తత్వశాస్త్రమంటే ఏమిటి స్వామీ?" అంటూ స్వామీజీని అడిగాడు హరి. ఎప్పటినుండో తత్వశాస్త్రం గురించి తెలుసుకోవాలని వుంది హరికి “
“తత్వశాస్త్రమంటే వివేకంపై వ్యామోహం నాయనా! విచక్షణా జ్ఞానం కూడా తత్వశాస్త్రం క్రిందకే వస్తుంది" అన్నాడు స్వామీజీ.
అర్థం కాలేదు హరికి, కొంత తెలిసీ, తెలియనట్లు అన్పించినా స్పష్టంగా
తెలియలేదు హరికి.
"తత్వశాస్త్రం అవసరమా స్వామీ?" అన్నాడు హరి.
హరి వేసిన ప్రశ్న వినగానే స్వామీజీ దీర్ఘంగా నిట్టూర్పు వదిలారు.
జవాబులు చెప్పే స్వామీజీ ముందున్నాడు కాబట్టి ఎన్నిరకాల ప్రశ్నలైనా అడగొచ్చనుకున్నాడు హరి. ఎన్నో తెలిసికోవాలనివున్న హరికి ఇన్ని రోజులు చెప్పేవాళ్లు దొరకలేదు. స్వామీజీ రూపంలో ఇప్పడా అవకాశం దొరికింది హరికి.
"ప్రతి దానిలోను మనం తెలిసికోవలసిన గూడార్ధం వుంది కాబట్టి, తత్వశాస్త్రం లేకుండా నీవేమీ చేయలేవు నాయనా! వదులుకోవడం, భరించటం లోనే తత్వశాస్త్రం ఇమిడివుంది" అన్నారు స్వామీజీ.
ఆ మాటలు వినగానే టక్కున నోరుమూసుకున్నాడు హరి.
“చూడు నాయనా! సందేహం రావటంలో తప్పులేదు. దాన్ని తీర్చుకోక పోవటంలోనే తప్పుంది. తప్పులు చెయ్యటం మానవ సహజ గుణం. అలాగని తప్పులు చెయ్యటమే పనిగా పెట్టుకోకూడదు. తప్పులు చేసిన మనుషులు స్వేచ్చగా తిరగలేరు. తెలియక చేసే తప్పుల్ని క్షమించాలి కానీ తెలిసి చేసే తప్పుల్ని శిక్షించాలి. ఈరోజు మనం నవ్వుతూ చేసిన తప్పుల్ని రేపు ఏడుస్తూ అనుభవించాలి. సమర్ధించుకోవటం వల్ల తప్పులు రెట్టింపు అవుతాయి. ఒక తప్పును సరిదిద్దుకోవటానికి రెండవ తప్పుచేయకూడదు. ఇతరుల తప్పుల్ని చూడగలిగినట్లే మన తప్పుల్ని మనం చూడగలగాలి. అంతేకాని మన కంట్లో వున్న దూలాన్ని వదిలేసి ఎదుటివాళ్లకంట్లో వున్న నలుసును చూడొద్దు. ఒక్కసారి కాస్త్ర దారితప్పితే అధఃపాతాళం మనకోసం కాచుకొని వుంటుంది”అంటూ హరివైపు చూశాడు స్వామీజీ. ఇంకేమైనా అడుగుతారా నాయనా అన్నట్లున్నాయి స్వామీజీ చూపులు.
జీవితమంటే ఏమిటి స్వామీజీ?" అంటూ స్వామీజీ వైపు చూశాడు హరి. ముందు జీవితం గురించి తెలుసుకోవాలని వుంది హరికి.
"ఇంత జీవితాన్ని చూశావు. ఇంకా జీవితం గురించి అడుగుతున్నావానాయనా” అన్నారు స్వామీజీ.
“చెప్పు స్వామీ! నాకేం అంతుపట్టటం లేదు" అంటూ అర్ధించాడు హరి.
జీవితమంటే బాధకాదు, సంతోషం కాదు. అదొక ఉన్నతమైన అంశం నాయనా! అందులోకి ప్రవేశించాలంటే సాహసం కావాలి ఆలోచన కావాలి.
అదొక అసాధారణ వ్యాపారం. ఆ వ్యాపారంలో లాభనష్టాలు అపారం. అందుకే ఎవరో ఒకరికి ఉపయోగపడేలా మీ జీవితాన్ని మలచుకోండి.
మీరు మీ జీవితాన్ని నిజంగా ప్రేమిస్తున్నట్లైతే కాలాన్ని వృధాచేయకండి! ఎందుకంటే ఆ కాలమే మీ జీవితం. జీవితం ఆశాశ్వతమైనది. పశ్చాత్తాపముతో అవసరం రాకుండా మీ పనుల్ని మీరు పూర్తి చేసుకోండి. ఈ బ్రతుకే ఒక మొసళ్ల మడుగు. వాటి నోటిలో పడకుండా ఈదుకుంటూ బ్రతకండి!" అన్నారు స్వామీజీ.
"మోసాలు చేస్తూ హాయిగా బ్రతుకుతుంటే మొసళ్లు మడుగు అంటారేమిటి స్వామీ?" అంటూ వెంటనే అన్నాడు హరి.
"మోసం అనేది చాలీచాలని దుప్పటిలాంటిది నాయనా! ముఖం కప్పకుందామంటే కాళ్లు కనబడతాయి. కాళ్లు కప్పకుందామంటే ముఖం కనబడుతుంది. అవినీతి దోమలు ఎక్కడ కన్పిస్తే అక్కడ కుడుతూనే వుంటాయి. ఆ బాధలో హాయి ఎక్కడ?? అంటూ గాల్లోకి చూశారు స్వామీజీ.
టక్కున స్వామీజీ కాళ్లమీద పడ్డాడు హరి.
స్వామీజీ కాళ్లదగ్గరే నిజమైన మోక్షమార్గం కన్పించింది హరికి.
(సశేషం)

No comments:

Post a Comment

Pages