పుష్యమిత్ర - 21
- టేకుమళ్ళ వెంకటప్పయ్య
జరిగిన కధ: "ఇండియన్ గ్లోబల్ ఐ" అనే అతిశక్తివంతమైన రాడార్ ను నిర్మాణ సమయంలో హిమాలయాలపైన బయటపడ్డ ఓ కాలనాళికను తెరచి చూడగా అందులో నుండి వచ్చిన వ్యక్తి తను పుష్యమిత్రుడినని చెప్పి గతంలోకి వెళ్తాడు. పుష్యమిత్రుడు అగ్నిమిత్రునికి రాజ్యం కట్టబెట్టి హిమాలయాలలో జ్ఞాన సమాధిలో ఉన్నప్పుడు బాబాజీ ద్వారా తను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద సంచరించాలని ఆదేశించడంతో ఆశ్చర్యపోతాడు. శ్రీహరికోట(షార్) పై భారత అధికారులు ధృవపరచగా పాక్ అధ్యక్షుడు దాన్ని ఖండిస్తాడు. పుష్యమిత్రుడు భరతఖండంపైకి వెళ్ళవలసిన తరుణం ఆసన్నమౌతోందని బాబాజి చెప్తాడు. పాక్ ప్రెసిడెంటు తగిన అమెరికా అద్యక్షునితో మాట్లాడగా..భారత్ కు తగిన సాక్ష్యాధారాలు లేకుండా తొందరపడవద్దని సలహా ఇస్తాడు. (ఇక చదవండి)
హిమాలయాలలో తపస్సమాధిలో ఉన్న పుష్యమిత్రుడు ఏదో అలికిడి జరిగినట్టు ఒక్కసారి కళ్ళు విప్పి చూసాడు. పర్వతంపై ఏదో అలజడి. అర్ధం కాలేదు. ప్రశాంతంగా ఉంది వాతావరణం. మంచు దట్టంగా కప్పి ఉంది. తుఫాను ముందు నిశ్శబ్దంలా. కొంత మంది వ్యక్తులు హడావుడిగా మూటా ముల్లె సర్దుకుని ఎక్కడికో వెళ్తున్నారు. ఏమీ అర్ధం కావడంలేదు పుష్యమిత్రునికి. ఒక్కసారి గుహలోనుండి బయటికి వచ్చి చూశాడు. ఆకాశం సురాపానం చేసిన వాడి నేత్రాల వర్ణంలో ఉంది.
"ఓ సామీ! ఇక్కడెక్కడుంటావు? కొండలు దిగు త్వరగా..." అని అరుస్తూ వెళ్తున్న ఒక సాధువు.
"ఒరే సామాన్లు మీరూ కొన్ని మొయ్యండర్రా! జబ్బలు పడిపోతున్నాయి" అంటూ ఒకడు.
కుక్కల బండ్లలో, తొడేలు బండ్లలో ఏదో వలసపోతున్నట్లు వెళ్తున్న జనవాహిని ప్రవాహంలా ఉంది. నీరసంగా నడుచుకుంటూ వెళ్తున్న ఒక సాధువును గుహ పక్కకు పిలిచాడు పుష్యమిత్రుడు.
" ఏమైంది? అందరూ ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగాడు.
సాధువు దాహం అన్నట్టుగా సైగ చేశాడు. దాహార్తి చల్లారాక పక్కన ఉన్న బండపై కూర్చుని పుష్యమిత్రుడిని కూర్చోమని సైగ చేశాడు. కూర్చున్నాక చెప్పడం ఆరంభించాడు.
"మీరెవరో నాకు తెలీదు. బ్రాహ్మణునిలా ఉన్నారు. ఈ పర్వతాలలో వంద రెండు వందల ఏళ్ళకు ఒకసారి పెద్ద మంచు తుఫాను వస్తూ ఉంటుందట. పర్వతాల అడుగున జరిగే మార్పుల వల్ల ఇలా వస్తుందని పెద్దలు చెప్పారు. మంచు చెరియలు అన్నీ విరిగి పడతాయి. అందువల్ల ఇక్కడ ఉండడం క్షేమం కాదని జనం వెళ్తున్నారు అని నిట్టూర్పు విడిచాడు. “ ఇవన్నీ ఎలా తెలిశాయి మీకు ముందుగానే?” అన్న పుష్యమిత్రుని ప్రశ్నకు ఒక చిరునవ్వు నవ్వి ఇలా చెప్పసాగాడు.
“ హిమాలయ పర్వతం ధైర్యానికి ప్రతీక. ఎన్ని తుఫానులు, భూకంపాలు, వర్షాలు, ప్రళయాలు ముంచెత్తినప్పటికీ చలించకుండా ధీరత్వంతో నిలదొక్కుకున్న యుగాలనాటి చరిత్ర హిమాలయాలకు ఉంది. అది ఇక్కడి మానవాళికి ధైర్యాన్నిస్తుంది. హిమాలయ శ్రేణిలోని గౌరీశంకర పర్వత పరిసరాలను సైతం మంచు తుపానులు ముంచెత్తడం ఇంక కొద్ది రోజుల్లో జరుగుతుంది” అంటూ.... “ అన్నట్టు...గౌరీ శంకర పర్వతం వద్ద ఒక పెద్ద మహాశివలింగం ఉంది. దాని ముందు ఉన్న నంది నోటిలో నుండి 24 గంటలూ నీటిజల వస్తూనే ఉంటుంది ప్రవాహంలా. కానీ నిన్న రాత్రి అది ఆగిపోయింది. “ఆ విషయం నీదాకా వచ్చిందా?” అన్న ప్రశ్నకు లేదన్నట్టు తలవూపాడు. " ఈ మధ్య పర్వతాలో రాత్రివేళల్లో ఒక విధమైన ధ్వని వస్తోంది అదైనా గమనించావా? అని అడిగాడు. లేదన్నట్టు తల అడ్డంగా వూపాడు పుష్యమిత్రుడు. ఆయన నవ్వి "కొండలు పగులుతున్న ధ్వని కూడా వినలేనంత ధ్యానంలో ఉన్నావా?" అని నవ్వి "నీరు ప్రవాహంలా లోయల్లోకి వెళ్ళిపోతోంది గమనించావా రెండు రోజులనుండి". ఇవన్నీ భయంకర మంచు తుఫానుకు నాంది పలుకుతున్నాయి. మా తాతలు కొడుకులకు వారు వారి పిల్లలకు.. వారు వారి పిల్లలకు ఇలా కొన్ని తరాలుగా చెప్పుకుంటూ వస్తున్న విషయం ప్రకారం, ఈ సంకేతాలు భయంకర మంచు తుఫానుకు దారితీస్తాయని చెప్పుకుంటారు. ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదం వస్తుందని ముందుగా తెలిస్తే, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా” అంటూ మళ్ళీ మంచినీరు తాగి లేచాడు.
పుష్యమిత్రుడు విచార వదనంతో మళ్ళీ గుహలోకి వెళ్ళాడు. ఒక గంట ధ్యానంలో గడిపాడు. కొంతసేపు ఆలోచించిన ఈ హిమాలయాలను ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ వదిలే ప్రసక్తే లేదు అన్న నిర్ణయానికి వచ్చాడు. ఒక విధంగా దేవుడు తనకు మేలే చేశాడు. ఈ జీవితం ఎలా అంతమౌతుందో తెలీక సతమతమౌతున్న తనకు ఈ విధంగా దారి దొరికింది అని కొంత శాంతించాడు. మళ్ళీ ఒక సారి గుహ బయటికి వచ్చి చూశాడు.
బయట హడావిడి అంతకంతకూ పెచ్చు పెరుగుతోంది. వాతావరణం కూడా ప్రతి గంటకూ మారుతూనే ఉంది. అంతలో ఒక ముదుసలి సాధువు గుహ ముందు నిలబడ్డాడు. చేతిలో త్రిశూలం. అతడిని లోనికి తీసుకుని వచ్చి కందమూలాలు కొన్ని ఇచ్చి దాహం కూడా ఇచ్చిన పిదప, కొంత సమయం గడిచాక మెల్లిగా అడిగాడు.
"స్వామీ ఎవరు మీరు? ఏమి కావాలి?"
"నాయనా పుష్యమిత్రా! జరిగే హడావుడి కనిపించడంలేదా? క్రిందకు వెళ్ళాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది. సర్దుకో అన్నీ! నడవలేను అందుకే నీ సాయం కోసం వచ్చాను. నీతో నన్నూ తీసుకొని వెళ్ళు"
"స్వామీ మీరెవరో మహానుభావులు దైవాంశ సంభూతులు లాగున్నారు. నన్ను పేరుతో పిలిచారంటేనే మీ దివ్య శక్తి నా కర్ధమయింది. నాకు మీరు సహాయం చెయగలరు తప్ప నేను మీకు ఏమి సాయం చేయగలను"
"లేదు పుష్యమిత్రా! నీవు నడివయసులో ఉన్నావు. నేను పండు ముదుసలిని. నన్ను క్రిందికి చేర్చే భారం నీమీదనే పెడుతున్నాను"
"క్షమించండి. నేను క్రిందకు వెళ్ళడంలేదు"
"నీకేమైనా పిచ్చెక్కిందా?. ఇంక కొన్ని గంటలలో భయంకరమైన మంచు తుఫాను ఈ శిఖరాన్ని కప్పివేయబోతోంది. మనం ఈ ఈదురు గాలులకే గడ్డకట్టుకుని పోతున్నాం. బయల్దేరు త్వరగా! నిన్ను నమ్ముకుని వచ్చాను"
"దైవ స్వరూపా! నేను ఈ భూమి మీదకు వచ్చి అరవై సంవత్సరాలు గడిచింది. అందులో ఇరవై సంవత్సరాలు సమాధిలో ఉండడం వల్ల మీరు నన్ను యువకుడుగా భావిస్తున్నారు. నేను ఇరవై సంవత్సరాలు భరతఖండాన్ని ఏలి తర్వాత జీవితంపై రోసి తపస్సమాధిలో ఉన్నాను. ఎలాగూ తనువు చాలించాలనుకుంటున్న వాడిని. ఈవిధంగానైనా నా కోరిక తీరబోతోంది"
"చావు పుటకలు నీ చేతిలో లేవు. అంతా ఈశ్వరేఛ్చ ప్రకారమే జరుగుతుంది. కానీ ఇలా బలవన్మరణం ఎందుకు? ధ్యాన్నంలో, వానప్రస్థంలో జీవితాన్ని ముగించు"
"లేదు స్వామీ! నా చావు ఎలా రాసిపెట్టి ఉందో అలా జరుగుతుంది. దయచేసి మీరు నిదానంగా ఎవరి సాయమైనా తీసుకుని వెళ్ళండి"
అంతలోనే ఒక దివ్య వెలుగులు ఆ గుహలో పరుచుకున్నాయి. ముదుసలి వ్యక్తి అంతర్ధానమయ్యాడు. ఎఱ్ఱని రంగులో ఒక త్రిశూలం నీడ ఒకటి ఆ గుహ గోడపై పడి నిల్చింది. ఆ నీడలో జటాఝూటధారి ఆకారం. ఒక అశరీరవాణి పలుకులు ఇలా వినబడ్డాయి ఆ నీడనుండి.
"పుష్యమిత్రా! నీ కోరిక సమంజసమైనదే! కానీ నీవలన జరుగవలసిన కొన్ని కార్యాలు భరతఖండంలో ఉన్నవి. అవి జరిగేంతవరకూ నీకు మరణంలేదు. నీకప్పగించిన కార్యం నెరవేర్చిన తరువాత నీకు స్వఛ్చంద మరణం నేనే ప్రసాదిస్తాను. అంతవరకూ..నీకు కోరుకున్న విధంగా మరణం సంభవించదు. కొన్ని వేల వందల సంవత్సరాలు, నా ఆజ్ఞ అయే వరకూ నువ్వు జీవసమాధిలో ఉండవలసి వస్తుంది." అని చెప్పిన తర్వాత నీడ క్రమంగా కనుమరుగయింది.
* * *
కొన్ని ఘంటలు గడిచాయి. బయట భయంకరమైన శబ్దాలు. మనుష్య సంచారం లేదు. పక్షులు కిలకిలారావాలు కూడా సనంగిల్లాయి. ధ్యాన నిమజ్ఞుడైన పుష్యమిత్రుని నుదిటిపై ఒక దివ్య జ్యోతి కనిపించింది. ఆ జ్యోతి క్రమంగా బయటకు వచ్చి బాబాజీ గా నిలబడింది.
"పుష్యమిత్రా! లే!"
పిలుపు వినగానే కళ్ళు తెరచి చూశాడు. బాబాజీ కాళ్ళపై మోకరిల్లాడు.
"లే నాయనా! లే! ఈ శిఖరం రేపు ఉదయంలోగా రూపురేఖలు మార్చుకుంటుంది. మనం ఇక త్వరపడాలి"
"మీ మాటలు నాకు అర్ధం కావడంలేదు బాబాజీ! ఇప్పుడొక ముదుసలి సాధువు వచ్చి వెళ్ళాడు" అని జరిగినదంతా చెప్పాడు.
"ఇందులో అర్ధం అయేందుకు ఏమీ లేదు పుష్యమిత్రా! నీకు దైవ కృప ఉంది. కనుకనే బ్రాహ్మణుడవైన నీవు ఈ భరతఖండాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలగలిగావు. నీవు ప్రస్తుతం పొందినది పరమేశ్వర దర్శనం.
పుష్యమిత్రుడు హర్షపులకిత నయనాలతో అలా ఉండిపోయాడు.
“ నీవు కొద్ది సంవత్సరాలు జీవసమాధిలో ఉండవలసి ఉంది. అవి వందల యేళ్ళా? వేల యేళ్ళా? అనేది ప్రస్తుతం ఈశ్వరాజ్ఞ కానిదే చెప్పడం కష్టం."
"కప్ప లాంటి జీవులకు జీవసమాధి సాధ్యం కానీ మానవులకు సాధ్యమవుతుందా! బాబాజీ!"
"కాదు! కానీ నాకు ఈశ్వరుడు ప్రసాదించిన శక్తి వల్ల సాధ్యం అవబోతోంది"
"రేపు ఉదయం కలుద్దాం. ఈ గుహలోనే ఉండు. బయటకు రాకు. నేను గుహబయట ఏమీ అవకుండా నీ ప్రాణాలకు రక్షగా దిగ్బంధం చేస్తాను. నీకు వలసిన ప్రాణవాయువు లభిస్తుంది" అంటూ గుహాంతర్భాగంలో ఒక క్రొత్త లోకాన్ని సృష్టించాడు. గుహ మొత్తం స్వర్గలోకంలా తయారయింది. బయటి శబ్దాలు కానీ ఇంక ఏమీ వినపడడంలేదు. కోరుకున్న పదార్ధాలు క్షణాల్లో లభిస్తున్నాయి. వింజామరలు వీచిన విధంగా చల్లని గాలి. మళ్ళీ ప్రశాంతంగా ధ్యాన ముద్రలోకి జారుకున్నాడు పుష్యమిత్రుడు (సశేషం)
-0o0-
No comments:
Post a Comment