సామ్రాజ్ఞి – 14
భావరాజు పద్మిని
(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. తమతో అనవసరంగా వైరం పెట్టుకున్న కుంతల రాజు విజయవర్మతో మల్లయుద్దంలో గెలిచి, అతని రాజ్యం అతని రాణులకు, కుమారులకు అప్పగించి, అతడిని బందీగా తమ రాజ్యానికి తీసుకువస్తుంది ప్రమీల. రాజ నియమాల ప్రకారం అతను విలాసపురుషుడిగా మార్చబడతాడు. పరిణామ, వ్యాఘ్ర సరోవరాలలో మునిగిన యాగాశ్వం పులిగా మారిపోవడంతో, దిక్కుతోచక శ్రీకృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటాడు అర్జునుడు. కృష్ణుడు ప్రత్యక్షమై యాగాశ్వానికి పూర్వపు రూపును తెప్పించి, ఆర్జునుడిని దీవించి, మాయమౌతాడు. పంపా నదీ తీరాన సీమంతినీ నగరాన్ని కావలి కాస్తున్న వారికి దొరుకుతుంది ధర్మరాజు యాగాశ్వం. దాన్ని సామ్రాజ్ఞి తన అశ్వశాలలో కట్టేయించి, యాగాశ్వం కావాలంటే తనతో యుద్ధం చేసి, విడిపించుకోమని, తన దండనాయకి వీరవల్లితో అర్జునుడికి లేఖ పంపుతుంది. తమ రాజ్యంలోని వివిధ బలాబలాలను గురించి అర్జునుడి సర్వసేనానియైన ప్రతాపరుద్రుడితో చెబుతూ ఉంటుంది వీరవల్లి. ఈలోపు విదూషకుడు చతురుడు అక్కడికి వచ్చి, వారికి వినోదాన్ని కల్పిస్తాడు. సంధిచర్చలకు సీమంతిని నగరానికి రావాలన్న కోరికతో వీరవల్లి ద్వారా సామ్రాజ్ఞికి ఒక లేఖను పంపుతాడు అర్జునుడు. ఆమె ఆహ్వానంపై అర్జున సేన స్ర్తీ సామ్రాజ్యం చేరుకొని, అక్కడి అద్భుత నిర్మాణ వైశిష్ట్యానికి, వన శోభకు ఆశ్చర్యపోతారు . అనివార్యమైన ప్రమీలార్జునుల యుద్ధానికి రంగం సిద్ధమవసాగింది. ఈలోగా శాస్త్రాస్త్రాల గురించి తన పరివారానికి చెప్పసాగాడు అర్జునుడు. ఇక చదవండి...)
శస్త్రాలు అంటే పదునైన ఆయుధాలు, వీటిని ఉపయోగించి శత్రువులను గాయపరచచ్చు, మట్టుపెట్టవచ్చు. సాధారణంగా యుద్ధాలలో ఈ శస్త్రాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో మళ్ళీ రకాలుంటాయి.
ఆముక్త – విసరలేని శస్త్రాలు.
ముక్త – విసరగలిగిన శాస్త్రాలు. ఇవి మళ్ళీ పాణి ముక్త, అంటే చేతులతో విసిరేవి (భిందిపాలము), యంత్ర ముక్త అంటే యంత్రాల సహాయంతో విసిరేవి అని రెండు రకాలు.
ముక్తాముక్త – విసిరి కాని, లేక విసరకుండా కాని రెండు విధాలుగా వాడగల శాస్త్రాలు.
ముక్త సంనివృత్తి – విసిరాకా మళ్ళీ వెనక్కు తీసుకోగల శాస్త్రాలు. శక్తి ఆయుధం ఈ జాతికి చెందుతుంది.
శక్తి(రెండు చేతులతో విసిరేంత బరువైనది), తోమరము, పాశము, రుష్టి, గద, ముద్గరము, చక్రము, వజ్ర, కులిశము, అశనము, త్రిశూలము, శూలము, అసి, వశీ అనబడే ఖడ్గములు, చంద్రహాసము, పరశు, ముసలము, ధనుస్సు, పరిఘ, భిందిపాలము, శంఖము, పట్టిశము, వంటివి కొన్ని శస్త్రాలు.
అస్త్ర నాళిక వంటి శాస్త్రాలు యాంత్రిక ఉపాయంతో ప్రయోగించబడతాయి. అస్త్ర నాళికలో అనేక రకాల అస్త్రాలు ఉంటాయి. అగ్ని, వాయువు, విద్యుత్ శక్తి సహాయంతో ఈ అస్త్రాలు విసరబడతాయి. ఇందుకోసం దేవీ దేవతల అవసరం ఉండదు. ఇవి భయంకరమైనవి, అధికంగా ప్రాణహాని కలిగించే శక్తి ఉన్నవి. కురుక్షేత్ర సంగ్రామంలో వీటి ప్రయోగం జరిగింది.
అస్త్రాలూ శస్త్రాలు ఆత్మరక్షణకు తప్పనిసరే అయినా, సర్వ మానవ సంక్షే మానికి నిజంగా ఉపకరించేవి వివేకమూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం మాత్రమే అని చరిత్ర చెప్తున్నది. దీన్ని ఎన్నటికీ మనం మరువకూడదు.
అస్త్రాలు మంత్రోచ్చారణతో దేవతల్ని బాణాల పైకి ఆవాహన చేసి, ప్రయోగించేవి కనుక, వాటిని అవసరాన్ని బట్టి వినియోగించవచ్చు. ఆయుధాలు ఏమీ అందుబాటులో లేకపోతే చిన్న గడ్డిపరక మీదైనా మంత్రాన్ని ఆవాహన చేసి విసిరితే, అది మహోత్పాతం సృష్టిస్తుంది.
“గడ్డిపరక అస్త్రంగా మారుతుందా?” ఆశ్చర్యంగా అంతా ఒక్కసారి అన్నారు.
“నిశ్చయంగా! మీకొక ఉదాహరణ చెబుతాను వినండి.” అంటూ ఇలా చెప్పసాగాడు అర్జునుడు.
కురుక్షేత్ర సంగ్రామం ముగియవచ్చింది. ఒక్క సుయోధనుడు తప్ప కౌరవ సైన్యం అంతా సర్వ నాశనం అయింది. పాండవ పక్షాన రెండు వేల రథములు, ఏడు వందల ఏనుగులు, అయిదు వందల హయములు, పది వేల కాల్బలం మిగిలారు. భీముడు సుయోధనుడితో గధాయుద్ధం చేసి అతడి తొడలు విరిచాడు. అతడు తొడలు విరుగకొట్టబడి చావుబ్రతుకుల మధ్య కటిక నేల మీద పడి ఉన్నాడు.
పాండవశిబిరాలలో విజయోత్సాహంతో సంబరాలు వెల్లివిరిస్తున్నాయి. ఇదంతా ఓర్వలేని అశ్వత్థామ, ధర్మం తప్పి, అర్ధరాత్రి శిబిరాల్లో నిద్రిస్తున్న పాంచాలురు, వారి సేనలు, మిగిలిన పాండవ సేనలు, ప్రభద్రకులు, ద్రౌపదీ కుమారులు, అందరినీ దారుణంగా నరికేసాడు.
తన పుత్రుల మరణాన్ని తట్టుకోలేని ద్రౌపది అశ్వత్థామను చంపేందుకు భీముడిని ఉసిగొల్పింది. భీముడి పరాక్రమం క్రూరుడు, దుష్టుడైన అశ్వత్థామను ఎదిరించేందుకు సరిపోదని, వెనుకే కృష్ణుడి ఆజ్ఞపై మేమూ బయలుదేరాము.
వ్యాసాశ్రమంలో ఒంటినిండా విభూది పూసుకుని నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న అశ్వత్థామ, భీముడి గర్జనలు విని, ప్రక్కనే ఉన్న నన్ను చూసి, నా శస్త్రసంపద తెలుసు కనుక, ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ సమయంలో అతనివద్ద ఏ ఆయుధాలూ లేవు. అందుకని పక్కన ఉన్న రెల్లుగడ్డిని తీసుకుని అభిమంత్రించి, తన తండ్రి ఇచ్చిన బ్రహ్మశిరోనామును దాని మీద ఆవహింప చేసి " అపాండవ మగుకాక " అని సంకల్పించి భీమార్జునుల మీదకు ప్రయోగించాడు. గర్భస్థ శిశువులతో సహా, ఒక వంశాన్ని సమూలంగా నాశనం చెయ్యగల శక్తివంతమైన అస్త్రమది. ఆ దివ్యాస్త్రం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. పెద్ద విస్పోటం జరిగింది.
వెంటనే కృష్ణుడు నన్ను చూసి " అర్జునా ! ఇది బ్రహ్మశిరోనామాస్త్రం. ఇది అత్యంత భయంకర మైంది. దీనికి సాటి మరియొకటి లేదు. దీనిని మరే అస్త్రం నిరోధించ లేదు. నీవు కూడా నీకు ద్రోణాచార్యుడు ప్రసాదించిన బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకో ! " అని తొందర పెట్టాడు. నేను రధము దిగి నా గురువు ద్రోణాచార్యుని మనసులో తలచి గాండీవమును తీసుకుని, బ్రహ్మశిరోనామాస్త్రమును ఎక్కు పెట్టాను.
నేను నాలోనే " ఈ మహాస్త్రమును నేను అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమును నిరోధించుటకు మాత్రమే ప్రయోగిస్తున్నాను. ఈ అస్త్రము వలన నాకు కాని, నా సోదరులకు కాని, గురుపుత్రుడు అశ్వత్థామకు కాని హాని కలుగకుండు గాక " అని ప్రార్ధించి అస్త్రప్రయోగం చేసాను. అర్జునుడు ప్రయోగించిన అస్త్రం అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నిరోధించ ప్రయత్నించింది. రెండు అస్త్రాలు ఒక దానిని ఒకటి ఢీ కొట్టడంతో సముద్రాలు పొంగాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలాయి, భూమి కంపించింది, సూర్యుడు కాంతిని కోల్పోయాడు, ఆకాశం నుండి పిడుగులు పడ్డాయి, రాళ్ళ వర్షం పడుతుంది. ఈ ఉత్పాతాలు చూసి జనం భయంతో కంపించి పోతూ అటూ ఇటూ పరుగులెత్త సాగారు. ప్రజల ముఖాలలో ఆశ్చర్యాందోళనలు, భయం భీతి కనిపిస్తున్నాయి.
వెంటనే ‘ఇది ప్రయోగించిన దేశంలో పన్నెండేళ్ళు అనావృష్టి సంభవిస్తుంది కనుక, మా అస్త్రాలను ఉపసంహరించమని’ నారదుడు, వ్యాసుడు మమ్మల్ని కోరారు. నేను నా అస్త్రాన్ని ఉపసంహరించాను. కాని బ్రహ్మశిరోనామాస్త్రం ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియని అశ్వత్థామ, ఆ అస్త్రం పాండవ సంతానముల వలన కలిగిన గర్భములన్నింటినీ విచ్ఛితి చేసి శాంతి పొందుతుందని అన్నాడు. కాని కృష్ణుడి దయ వలన ఉత్తరా గర్భంలోని పరీక్షిత్తు మాత్రం రక్షింపబడ్డాడు. కృష్ణుడి శాపానికి గురైన అశ్వత్థామ అడవుల పాలయ్యాడు.”
ఇదీ నాకు తెలిసిన కొన్ని శాస్త్రాస్త్రాల వివరాలు. ఇక కాలవిలంబన కాకుండా మనమంతా శయనిద్దాము. అంటూ విశ్రాంతికి బయలుదేరాడు అర్జునుడు. ఆ మహాయోధుడినే కాసేపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయిన పరివారం “రేపు ఏమౌతుందా?” అన్న ఉత్సుకతతో నెమ్మదిగా లేచి, తమ తమ శయనాగారాల వైపు బయలుదేరారు.
(సశేషం)
No comments:
Post a Comment