ఆంజనేయ రక్ష ! - అచ్చంగా తెలుగు
మా బాపట్ల కధలు -20 
ఆంజనేయ రక్ష !
భావరాజు పద్మిని 

‘శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష , ఆంజనేయ రక్ష అఖిల లోక రక్ష !’
‘పిల్లలూ !ఒక్క ఆంజనేయుడిని నమ్ముకుంటే చాలర్రా , పదునాల్గు లోకాలలో మీరు ఎక్కడున్నా మిమ్మల్ని రక్షిస్తాడు.  హనుమంతుడిని నమ్ముకున్న వాడికిక జీవితంలో ఢోకా లేదు. బుద్ధిబలం,కీర్తి , మనోధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చురుగ్గా ఉండడం, చక్కటి మాటతీరు, హనుమత్ భక్తులకు సిద్ధిస్తాయి. జీవితంలో ఎటువంటి స్థితిగతులు వచ్చినా, హనుమంతుడే దిక్కని నమ్మి పూజిస్తే, ఆయన మనల్ని అన్నివిధాలా రక్షిస్తారు.‘
చిన్నప్పుడు బడిపంతులైన తన తండ్రి పిల్లలతో చెప్పిన మాటలు బాగా మనసులో ముద్రించుకు పోయాయి వేదవతికి. అప్పటినుంచి హనుమంతుడే ఆమెకు సర్వస్వం! రోజూ తమలపాకుల మాల మీద సింధూరంతో ‘శ్రీరామ’ అని రాసి, ఆ మాలను హనుమంతుడి గుళ్ళో ఇచ్చి వచ్చేది. గుడికి సంబంధించిన పనుల్లో సాయం చేసేది. హనుమాన్ చాలీసా పారాయణ, సుందరకాండ పారాయణ, అన్నీ చిన్న వయసులోనే అలవర్చుకుంది.
ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్ల ప్రకారం చిన్న వయసులోనే ఆమె వివాహం బాపట్ల భీమా వారి పాలెంలో ఉండే సోమయాజులు గారితో జరిగిపోయింది. ఒక్కసారిగా పెద్ద కుటుంబంలోకి రావడంతో నెమ్మదిగా అన్నీ గమనించసాగింది  ఆమె. బాపట్లలో ఆవిడకి అతి విచిత్రంగా అనిపించిన అంశం... తమ ఇంట్లోనూ, మాయాబజార్ లో చిన్నత్తగారి ఇంట్లోనూ, అంతెందుకు ఊళ్ళో ఏ బావిలోంచైనా చేద అవసరం లేకుండా, కేవలం బిందెతో ముంచుకునేన్ని నీళ్ళు ఉండడం. సరదాగా బావిలో చెయ్యి ముంచి నీళ్ళను అల్లల్లాడిస్తూ కూర్చుంది ఆమె.
“హాసి పిల్లా ! ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను కదూ” అంటూ వచ్చింది తోడికోడలు రమాదేవి. అత్తగారు పోయాకా ఆడదిక్కు లేని పెద్ద సంసారాన్ని ఒంటిచేత్తో నడిపిస్తోంది ఆవిడ. వేదవతి గారు చేస్తున్న పని చూసి నవ్వుతూ,
“వానాకాలం మా బాపట్లలో బావుల్లో నీటి ఊట ఇలాగే ఊరుతుంది. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఆడుకున్నట్టే, పిల్లా పాపా పడవలు వదులుతూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు జల్లుకుంటూ సరదాగా ఆడుతూ ఉంటారు. కాని, మనింట్లో  ఉన్న బావి నీళ్ళు ఉప్పగా ఉంటాయే పిల్లా. అందుకే నా పెళ్ళైనప్పటి నుంచి  దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళో మంచినీళ్ళు మడిగా తెచ్చుకోడం అలవాటే. గుళ్ళో నీళ్ళు కొబ్బరి నీళ్ళల్లా తియ్యగా ఉంటాయే అమ్మడూ. ఇంద, ఈ బిందె తీసుకో, నీళ్ళు తెచ్చుకుందాం.” ప్రేమగా చూస్తూ అన్నారు ఆవిడ.
“ఇక్కడ ఆంజనేయ స్వామి గుడుందా ? బాపట్లలో భావన్నారాయణ స్వామి గుడి ఉందని చెప్పారు కాని, ఆంజనేయుడి గుడి కూడా ఉందా? ” చారెడంత కళ్ళను మరింత విశాలం చేస్తూ ఆశ్చర్యం, ఆనందం కలగలిపిన స్వరంలో బిందె తీసుకు బయలుదేరుతూ, అంది వేదవతి.
“అయ్యో అమ్మణ్ణీ ! ఆంజనేయుడి గుడి లేని ఊరు ఉంటుందే? ఎక్కడైనా విష్ణుమూర్తి ఎదురుగా గరుడుడి విగ్రహం ఉండడం పరిపాటి. కాని, మా భావన్నారాయణుడి గుడి ఎదురుగా చిట్టాంజనేయుడి గుడి ఉంది. మా ఊరి వాళ్లకు స్వామి పట్ల ఎంత గురో తెలుసా? ఏదైనా అనుకుంటే అయ్యి తీరుతుందే. ముఖ్యంగా తమలపాకులతో సహస్ర నామార్చన విశేషం ఇక్కడ ” ఆవిడ చెబుతూ ఉండగానే స్వామి గుడికి చేరుకున్నారు ఇద్దరూ.
“శ్రీసువర్చలా సహిత ప్రపత్యాంజనేయ స్వామి దేవాలయం” ఆలయం పైన ఉన్న పేరు చదువుతూ, అక్కడ ఛత్రం క్రింద కూర్చున్న సువర్చల, ఆంజనేయ స్వామి వార్ల చక్కటి ప్రతిమను చూస్తూ, “అక్కా, మరి ‘చిట్టాంజనేయ స్వామి’ అన్నారు...” అడిగింది వేదవతి.
“ఆంజనేయ ప్రతిమ చిన్నగా ఉంటుందని, ఆ పేరు పెట్టారులే వేదా, ఇదిగో ఈ మొదట్లో ఉన్న నాగేంద్ర స్వామి వారికి, గుడి వెనుక ఉన్న రావి చెట్టుకి కూడా రోజూ ప్రదక్షిణాలు చేసుకో. చాలా మంచిది.” చెబుతూ బావిలో బిందె ముంచి వేదవతినీ నీళ్ళు ముంచుకోమని సైగ చేసిందావిడ.
క్రమంగా ఆ ఊరు, పరిసరాలకు అలవాటు పడింది వేదవతి. రోజూ నీళ్ళ వంకతో ఆంజనేయుడి దర్శనం చేసుకునే అదృష్టం లభించడం ఆమెకు చాలా ఆనందాన్ని కలిగించింది. మళ్ళీ స్వామికి తమలపాకుల మాల సమర్పించడం ఆరంభించింది. కాని, మరోప్రక్క భర్త వైఖరి మాత్రం ఆమెకు అంతుబట్టలేదు. సోమయాజులు గారు ప్రభుత్వ ఉద్యోగి. విచిత్రమైన మనిషి. ఆయనకు ఏ విషయంలోనూ కుదురు ఉండేది కాదు. ఉన్నట్టుండి చెప్పా పెట్టకుండా, కనీసం ఉద్యోగానికి సెలవైనా పెట్టకుండా మూడు నాలుగు రోజులు ఎక్కడికో వెళ్ళిపోయేవారు. తనకు ఇష్టమున్నప్పుడు ఇంటికి తిరిగి వచ్చేవారు. దానితో ఆఫీస్ లో మాటొచ్చేది. ఒక్కోసారి ఉద్యోగం నుండి తీసేస్తామని హెచ్చరికలు కూడా ఇచ్చేవారు. బెత్తెడు జీతంతో నడిచే గంపెడు సంసారాలు, ఈ కాస్త ఆధారం కూడా లేకపోతే ఎలాగా అని బెంగపడింది వేదవతి.
“ముందు నుంచి ఇదే పద్ధతే అమ్మాయ్. చుట్టుపక్కల ఊళ్లలో స్నేహితులు ఎక్కువ. ఎవరు గుర్తొచ్చినా ఇలా వెళ్ళిపోయేవాడు. కనీసం పెళ్లి చేస్తేనైనా కుదురుగా పడి ఉంటాడని అనుకున్నాము. కాని, ఇప్పటికీ పధ్ధతి మారలేదు. చెప్పద్దూ, ఈ స్నేహితుల పిచ్చి తప్ప, మరే దురలవాట్లు లేవు. నువ్వే ఎలాగైనా కొంగున ముడేసుకోవాలి.” ఓ రోజున వేదవతికి జడ వేస్తూ అసలు గుట్టు చెప్పింది రమాదేవి గారు.
చూస్తుండగానే శ్రీరామనవమి నవరాత్రులు వచ్చాయి. ఊరంతా పందిళ్ళు, విసనకర్రలు, పానకాలు మహా సందడిగా ఉంది. తన భర్త నడవడికలో మార్పు కోసం హనుమంతుడికి సహస్రనామార్చన మొక్కుకుని, డబ్బు కట్టింది వేదవతి.
“ఇహ ఈ రోజున వంట చేసే పన్లేదే చెల్లాయ్. మన చిట్టాంజనేయ స్వామి గుళ్ళో సహస్రం చేసేందుకు డబ్బు కట్టామంటే, ఇవాల్టికే కాదు, రేపటి భోజనం కూడా వచ్చేసినట్టే. ఎంతమంది పూజకు డబ్బు కట్టినా, సామూహిక సంకల్పాలు కాకుండా ఒక్కొక్కరికీ విడివిడిగా గోత్రనామాలతో పూజ చేస్తారు. బిందెడు పానకం, వడపప్పు, వడమాల, అప్పాలు, బుట్టెడు పులిహోర, తట్టెడు చక్కరపొంగలి, పళ్ళు, అన్నీ ఘనంగా నైవేద్యం పట్టి ఇస్తారు. మా హనుమంతుడికి పూజ చేయిస్తున్నావుగా. ఇక నీ కష్టాలు సగం తీరినట్టే. “ హాయిగా నాపరాతి నేల మీద తలవాలుస్తూ అంది రమాదేవి గారు.
ఆశ్చర్యంగా వింది వేదవతి. ఆ సాయంత్రం పూజ వైభవంగా జరిగింది. మర్నాడు మళ్ళీ చెప్పా పెట్టకుండా ఏదో ఊరు వెళ్ళిన సోమయాజులు గారు, అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కున్నారు. తన అలవాట్లకు, తను చేసే చెడ్డ పనులకు కారణం సోమయాజులు గారి సావాసమేనని ఇంట్లో చెప్పాడట ఆయన స్నేహితుడు. దానితో ఆ ఇంటివారు ఈయన్ను నానా మాటలూ అని, అవమానించి పంపేసరికి, ఆ బాధ తట్టుకోలేక ఇక ఏ స్నేహితుల ఇళ్ళకూ వెళ్ళకూడదని ఒట్టేసుకున్నారు. ఇక ఆయన తిరుగుళ్ళు తగ్గిపోయాయి.
కొన్నాళ్ళకు వేదవతి నెలతప్పింది. రమాదేవి గారు సొంత చెల్లెల్ని చూసుకున్నట్టు అపురూపంగా చూసుకోసాగారు. నెలలు నిండిన వేదవతికి బిడ్డ అడ్డం తిరిగి కానుపు కష్టమయ్యింది. తెల్లారి దాకా చూసి ఆపరేషన్ చేద్దామన్నారు. ఆసుపత్రిలో పురిటి నొప్పులు పడీ పడీ నీరసంతో హనుమంతుడినే తలచుకుంటూ మాగన్నుగా కన్నుమూసింది ఆమె. ఒక్కసారిగా హనుమంతుడు వచ్చి, పొట్ట నొక్కిన అనుభూతి కలిగి ఉలిక్కిపడి లేచింది. అంతే, ఆమెకు పది నిముషాల్లో కానుపు అయ్యి, పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇటువంటి విచిత్రం తమ జీవితంలో చూడలేదని, డాక్టర్లు ఆశ్చర్యపోయారు.
ఈలోగా బ్యాంకు ఉద్యోగం చేసే రమాదేవి భర్త గారికి మచిలీపట్నం బదిలీ అవడంతో, తప్పనిసరై వాళ్ళూ కదిలారు. వెళ్తూ వెళ్తూ వేదవతి చేతిలో ఒక ఆంజనేయుడి వెండి విగ్రహాన్ని పెడుతూ, “అమ్మాయి, నేను వెళ్తున్నందుకు బాధ పడకు. ఇదిగో, నువ్వు భక్తిగా కొలిచే ఆంజనేయుడిని నీకు ఇచ్చి వెళ్తున్నాను. ఇకపై ఈయనే నీకు తోడూ, నీడా! పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండు, ” అంటూ నిండు మనసుతో వేదవతిని దీవించి వెళ్ళిపోయింది ఆవిడ. భారమైన మనసుతో అక్కకు వీడ్కోలు పలికి, ఒంటిచేత్తో సంసారం నడపసాగింది. ఏడాదికి మరో ఆడబిడ్డ పుట్టింది. మొదట్లో ఎక్కువగా వచ్చిపోతుండే రమాదేవి గారు, భర్తకు పొరుగు రాష్ట్రం బదిలీ అవడంతో రాకపోకలు తగ్గించారు. పిల్లలు ఇద్దరినీ కంటికి రెప్పలా చూసుకుంటూ వాళ్లకు జ్వరాలు వచ్చినా, దెబ్బలు తగిలినా ఆంజనేయుడినే వేడుకుంటూ ఉండేది ఆవిడ. ఆవిడకు అడుగడుగునా తోడు ఆంజనేయుడే. అణువణువునా కనిపించేది ఆంజనేయుడే.
ఇలా ఉండగా ఒకసారి ఒక విచిత్రం జరిగింది. ఒక రోజు ఉదయం ఏదో పరధ్యానంలో హనుమంతుడికి కట్టిన తమలపాకు మాలపై సింధూరంతో ‘శ్రీరామ’ అని రాయకుండానే నివేదించి, పూజారి గారు పిలిచేలోపే వెళ్ళిపోయింది ఆవిడ. సాయంత్రానికి ఆలయం తీసే సమయానికి ఒక కోతి వచ్చి గర్భగుడి ముందు కూర్చుంది. ఎవరు అదిలించినా ఎంతకీ కదలలేదు, ఏం పెట్టినా తినలేదు. చివరికి వేదవతి గారికి కబురు పెట్టి, ఆవిడ చేత్తో రామనామం రాసిన మరో తమలపాకు మాల వెయ్యగానే, ఆనందంగా చప్పట్లు కొట్టి, అరటిపండు తిని ఎటో వెళ్ళిపోయింది. దానితో వేదవతి గారి భక్తి ప్రభావం అందరికీ తెలిసి వచ్చింది.
కాలం మారింది. సామూహిక సంకల్పాల సహస్రాలు చిట్టాంజనేయ స్వామి గుళ్ళోకీ ప్రవేశించాయి. ప్రసాదాలు ప్రమాణం తగ్గి బక్క చిక్కిపోయాయి. ఈలోగా అనుకోకుండా రమాదేవి గారు కాలం చెయ్యడం, ఆమె కుమారులు పంపకాల కోసం గొడవ పెట్టడంతో పాత ఇంటిని రెండు భాగాలు చేసి, వాళ్లకు ఇచ్చారు. ఇక వీళ్ళ వాటాకొచ్చిన పాత ఇల్లు పడగొట్టి, కొత్తది కట్టుకోక తప్పని పరిస్థితి! ఎదిగే పిల్లలు, కొత్త ఇంటి ఖర్చులు, ఎలాగా అని దిక్కుతోచని వేదవతి గారు,  మూడు కోట్ల సార్లు రామనామ జపం చేసారు. అనుకోకుండా ఆవిడ పుట్టింటి వైపు ఆస్తి తాలూకు డబ్బు అంది, చక్కటి డాబా ఇల్లు ఏర్పడింది. పై వాటాలో వీళ్ళు ఉంటూ క్రింది భాగం అద్దెకు ఇచ్చారు. ఎన్ని సదుపాయాలొచ్చినా, గుళ్ళోంచి నీళ్ళు తెచ్చుకోవడం మానలేదు ఆవిడ. ఆమెకు అవే ప్రాణాధారమైన, ప్రాణప్రదమైన అమృత జలాలు.
కొడుక్కి ఇంజనీరింగ్ సీట్ రావాలని మండలం రోజులు నియమంగా గుడి వసారాలో సుందరకాండ పారాయణ చేసింది. అతడు మంచి కాలేజీలో చేరి, కాంపస్ ఇంటర్వ్యూ లలో మంచి ఉద్యోగం తెచ్చుకున్నాడు. కూతురికి మంచి సంబంధం రావాలని, లక్ష విష్ణు సహస్ర నామార్చన చేయించింది. వెంటనే గొప్ప సంబంధం కుదిరి, ఊహించనంత త్వరగా ఆమె వివాహం జరిగిపోయింది.
ఈ సంతోషంలో తమ కులదైవమైన తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకునేందుకు వెళ్ళింది వాళ్ళ కుటుంబం. తిరిగి వచ్చే దారిలో వాళ్ళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి, ఇల్లు కాలిందని, క్రింది వాటాలో అద్దెకున్న వాళ్ళనుంచి  ఫోన్ వచ్చింది. ఈ వార్త విన్న వేదవతి గారి గుండె గుభేలు మంది.  పిల్ల పెళ్లి కోసం వేదవతి గారు వాడుతున్న సిలిండర్ తో పాటు మరో రెండు ఫుల్ సిలిండర్లు వేయించి పెట్టుకుంది. అవన్నీ వంటింట్లోనే ఉన్నాయి. అవి పేలి ఉంటాయా? అసలు ఏమై ఉంటుంది?
ఎందుకైనా మంచిదని,  ఎలెక్ట్రిషియన్ బాషా కు ఫోన్ చేసి, రమ్మని చెప్పింది. వీళ్ళు వచ్చే వేళకు పరిస్థితి చూసేందుకు అతనొచ్చి సిద్ధంగా ఉన్నాడు.  ఆదరా బాదరాగా వచ్చి, ఆత్రంగా తాళాలు తీసిన వాళ్లకు అక్కడ అనూహ్యమైన పరిస్థితి చూసి, నోట మాట రాలేదు.
హాల్ లో ఇన్వర్టర్ నుంచి చెలరేగిన మంటలకు హాల్ గోడలు, ఫ్యాన్ నల్లగా మాడిపోయాయని చెప్పాడు బాషా. ఆ మంట పక్కనున్న వంటింట్లోకి వ్యాపించి అక్కడ గట్టు మీదున్న డబ్బాలు సైతం నల్లగా మాడిపోయాయి. స్టవ్ , దానికున్న ట్యూబ్ కాలి బొగ్గైపోయింది. కాని, మంట సిలిండర్ల దాకా వెళ్ళలేదు.  ఇదెలా జరిగింది? ట్యూబ్ దాకా పాకిన మంట సరిగ్గా సిలిండర్ వద్ద ఎలా ఆగిపోయింది? కనీసం రెగ్యులేటర్ అన్నా ఆపలేదే ! ఈ మూడు సిలిండర్లకు కనుక నిప్పు అంటుకుని ఉంటే, మొత్తం ఇల్లే పేలిపోయేది. కాని, అలా అవలేదు.
“అసలు పూజగది ఎలా ఉందో?” ఆలోచన వచ్చిందే తడవుగా కంగారుగా అటు పరిగెత్తింది ఆవిడ.
ఆశ్చర్యం ! పూజ గదికి ఆవల ఉన్న బెడ్ రూమ్ లలో మంట వ్యాపించలేదు. అంటే, మంట స్టవ్ ట్యూబ్ దగ్గరే ఆగిపోయింది. ఇదొక నమ్మరాని అద్భుతం ! ఆశ్చర్యంతో తాను పూజించే ఆంజనేయుడి ముందు మోకరిల్లింది ఆవిడ.
వెళ్లేముందు ఆంజనేయుడి ముందు వెలిగించిన అఖండ దీపం ఇంకా వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో మెరిసిపోతున్న ఆంజనేయుడి వెండి ప్రతిమనే చూస్తూ, మహత్తరమైన ఆయన మహిమకు సాష్టాంగనమస్కారం చేస్తూ ఉండగా, మరోమారు తన తండ్రి స్వరం ఆమె చెవుల్లో మారుమ్రోగింది.
“ఆంజనేయ రక్ష , అఖిలలోక రక్ష!”

(ఒక మహా భక్తురాలి వాస్తవిక గాధ. బాపట్ల ఆంజనేయ స్వామికి ఆపాదించి రాయడం జరిగింది.)

1 comment:

  1. హనుమంతుడు చిరంజీవి అందుకే శ్రద్ధాభక్తులతో పూజలతో నిష్కల మనస్సు కకలిగినవారి కీ నిస్సహాయులకూ ఎప్పుడూ తోడుగా ఉంటారు

    ReplyDelete

Pages