మల్లెల గుబాళింపులు - అచ్చంగా తెలుగు

మల్లెల గుబాళింపులు

Share This
డా. వారణాసి రామబ్రహ్మం 

మల్లియల తలుచుకోగానే మనసులో చల్లదనం 
"వల్లె వల్లె" యని తనువున వెచ్చదనం 
సింగారి సిగలో వెన్నెల రుచిమయ దరహాసం 
శృంగార భావనలతో హృది అంతా రస సంతోషం.

వేసంగిని గుబాళించు పుష్ప రాజములు  
నాసికకు పరిమళ భోజనములు 
రత్యోద్దీపకము పక్కల పక్కన రమణుల కలకలముల
కలకాలము గుబాళించు ఆనందానుభవ దాయకము.

యోగిపుంగవుల మనముల వలె  స్వచ్ఛము 
తెల్లదనము; కోమలుల మేని స్పర్శ వలె మృదులము 

విరిసీ విరియని మొగ్గల వలె సగము ముకుళించి 
సగము విరిసిన కన్నెల మనసుల బోలు తెల్లని పూలు .

మల్లెలే కవుల మానసములకు ప్రేరకములు 
ప్రణయినీ మధుర స్మృతుల గుర్తుకు తెచ్చు 
సుగంధ గాత్ర యుతములు; రస రాత్ర రంజకములు 
మల్లెలే ప్రణయిని  రస ప్రసారణములు; రతి సుఖ ఖనులు .

మల్లెలు లేని వేసంగి వలపు లేని బ్రతుకు; చంద్రుడు లేని పున్నమి 
పూర్ణ చంద్రబింబ కౌముదుల ప్రసరించు 
మల్లియలు మనకు ప్రకృతి వరములు 
మల్లియల మాలలు ప్రణయినీ పరిష్వంగ అల్లికలు.

మళ్ళీ మళ్ళీ అలరించే మధుమాసపు ముత్యాల సరాలు 
మల్లెల వంటి మనసు అటువంటి సొగసు కల తరుణ రమణీ 
స్నేహము సాంగత్యము సంగము సంగమము ధరణిని స్వర్గము 
ఆనందార్ణవ తరణము రసాంబర విహరణము రమ్య సుఖాభరణము 
మల్లెల గుబాళింపులే మన మనసుల బ్రతుకుల మందహాసములు.

1 comment:

Pages