చెప్పినట్లు చేస్తారా!?. - అచ్చంగా తెలుగు

చెప్పినట్లు చేస్తారా!?.

Share This
 చెప్పినట్లు చేస్తారా!?.
ఆదూరి హైమవతి 

' ఏర- కుమీక- సుగా–  యాలు,  -   దూర -కుమీబం-ధుజ-నులదో-సము- సుమమ్మీ  పార– కుమీర -ణమం- దున ,-   మీర - కుమీగు– రువునా - జ్జమే - దిని సు -మతీ!—అంటూ చదువుతున్న అరవింద్ ను తల్లి తారక"ఏరా! అరవింద్ !ఏంటా చదవడం?ఏర–కుమీక -సుగాయాలేంట్రా ! సరిగా చదూ"అని అరిచింది. 
"ఏమో ! మమ్మీ!ఈ పొయం చెప్పిన రోజు నేను స్కూల్ కెళ్లలేదు కదా! మధ్యలో ఇలా టెల్ గూ మీడియానికి ఛేంజ్ చేశారు.ఎలా చదవాలో, అర్ధ మేంటో కూడా నాకు తెలీదు.నే నసలే తెలుగులో పూర్ కదా! రేపు స్కూల్లో ఛాంట్  చేయాలి,అందుకే చదువుతున్నా,"అన్నాడు.
" ఒరే! అరవింద్! అర్ధంలేని చదువు వ్యర్ధంరా!అర్ధం చేసుకునే చదవాలి,చదివిందిపాటించాలి. లేకపోతే చదువు వృధా, వేస్ట్  తెల్సా!""అలాగైతే  మమ్మీ !నీవు వచ్చి ఎలా చదవాలో ,మీనింగూ కూడా చెప్పు మరి" " సరే విను. పద్యమిలా చదవాలి. చిన్నతనంలో మా టీచర్ ఇలాచెప్పారు.” అంటూ పద్యం చక్కగా  చదివింది తారక. 
"దీని అర్ధం ఏంటంటే - చిన్న పిందె కాయలను, క్రింద మట్టిలో రాలినవాటినీ తినకూడదు.కోయడం అసలే చేయకూడదు.ఎందుకంటే అవి పెరిగి చాలా పెద్దవవుతాయి.చిన్నరోజామొగ్గను కోసేస్తే అది పెద్దఅందమైన రోజాపువ్వు ఎలాఅవుతుంది? అలాగే చిన్నమామిడి పిందెను కోస్తే అది పెద్ద పండు ఎలా అవుతుంది? అలాగే బంధువులను.."
"బంధువులు అంటే ఎవరు మమ్మీ!ఐ యాంపూర్ ఇన్ టెల్ గూ కదా!"" 
"ఊరికే పూర్ పూర్ అనకు , కృషి చేస్తే అంతా వచ్చేస్తుంది. కృషి ఉంటే ఋషి అవుతారు తెల్సా! సరేపొయ్య దగ్గరికిరా! రెలెటివ్స్అంటే డాడీ సిస్టర్స్ ,బ్రదర్స్,మా సిస్టర్స్ ,బ్రదర్స్ ,బామ్మ, తాతా,అమ్మమ్మా వారినెవ్వరినీ మనం తిట్టకూడదు, ద్వేషించ కూడదు.అది చాలా పెద్ద తప్పు, వారంతా మన రక్త సంబంధీకులూ. మన మంచి కోరేవారన్నమాట. మనల్ని బ్లెస్ చేస్తారు. అలాంటి వారిని ద్వేషించడంవారి మీద చాడీమాటలు, మాట్లాడటం చాలా తప్పు. అంటే బ్యాక్ బైట్ చేయకూడదు. 
“"మమ్మీ! అంటే మన రెలెటివ్స్ ను మనం ఇన్వైట్ చేసి బాగా ట్రీట్ చేయాలి అంతేనా మమ్మీ!”
"ఎస్ అంతే! ఇహ పూర్వం రాజులకూ మధ్య యుధ్ధాలు జరిగేవి, అప్పుడు ఎంతోమంది సైనికులు యుధ్ధంలో పాల్గొనేవారు..."
" మమ్మీ ! మొన్న నీవు తీసుకెళ్లావూ –‘ బాహుబలి  ’దాన్లో ఫైట్ జరిగితే సైనికులంతా కత్తులు అవేవో న్యూ వెపన్స్ అన్నీ పట్టుకుని ఫైట్ చేసుకున్నారే  !-అలాగేనా?"
" ఎస్ అలాగే .అలా యుధ్ధం చేస్తూ మధ్యలో పారి పోకూడదు.అది వీరునికి తగని పని. పిరికితనం . తాము జీతం తీసుకుంటూ పనిచేసే రాజులను మోసంచేయడం.ఎవరిదగ్గరైతేమనం డబ్బు తీసుకునిపనిచేస్తామో వారిని అంటిపెట్టుకుని ఉండాలి, వారు అప్పగించిన పని చేయాలి.  అంతేకానీ మధ్యలో వదిలేసిపోగూడదు.  “
“ఆగాగు మమ్మీ! పిరికితనం అంటే ఏంటి  మమ్మీ?"
"అంటే టిమిడిటీ. మనం చదువు మొదలెట్టాక ఏదైనా అర్ధంకాక పోతే ఆచదువు మధ్యలో మానేయ కూడదు.తెలిసిన వారిచేత చెప్పించుకుని తెల్సుకుని చదివి పాస్ కావాలి కానీ మధ్యలో మానేయడం పిరికితనం, చేతకాని తనం అన్నమాట. వారిని వేస్ట్ ఫెలో అంటారు."-అడిగింది తల్లి తారక .
" ఓ మార్వలెస్ మమ్మీ!బాగాఅర్ధమైంది మమ్మీ!ఎంతబాగా చెప్పావు మమ్మీ! ఇపుడు చూడూ పద్యమెంతబాగాచదువు తానో!!రేపు మాటీచర్ గారికి పద్యం మీనింగ్ తోసహా చెప్పేస్తాను. వైకాంట్ యూ కం టూ స్కూలండ్ ఎక్స్ ప్లైన్ టు ఆల్  మమ్మీ"అంటూ మమ్మీని మెచ్చుకుంటూ కూర్చుని , పద్యం బట్టీయం వేయసాగాడు అరవింద్.
**** 
అదోపెద్ద భవంతి.అరవింద్ తాతగారు తహసీల్దార్ గాపనిచేసేప్పుడు కట్టించారు. వెనుక పెరటివైపు చాలా పెద్ద స్థలం పెరటి తోట కోసం ఉంచారు. ముందు మంచిపూలతోట ,చుట్టూతా అనేక పండ్ల మొక్కలు, ఇల్లంతా చల్లని గాలివీస్తూ హాయిగా, చల్లగా ఉంటుంది.ఏసీలే అవసరంలేదు.  అరవింద్ ఇంట్లో పనిచేసే పార్వతి  వెనుక  కూరపాదులూ,మొక్కలూ,ముందున్న పూలమొక్కలు అన్నీ జాగ్రత్తగా నీరుపెట్టి ఎరువువేసి పోషిస్తుంటుంది. అందుకే ఎప్పుడూ వాళ్ళింట్లో అన్నీ పెరటి తోటలోని ఆర్గానిక్ కూరలే వండుకుని తింటుంటారు.రోజూ ఉదయాన్నే ఫ్రష్ గా ఆపూటకు కావల్సిన కూరగాయలు కోసుకుంటారు.
"అత్తయ్యగారూ! పెరట్లో కూరలుకోస్తున్నాను, ఈ రోజు ఏమి వండుకుందామో చెప్తారా!"అత్తగార్ని పిలిచింది తారక.
"ఏమున్నాయేమిటీ పెరట్లో !లేతగా ఉంటే మెత్తమెత్తగా బెండకాయలు వండుకుందాం. ఉన్నాయేమో చూద్దామా!" అంటూ పెరట్లోకివచ్చింది తారక అత్తగారు చంద్రమ్మ. ఇద్దరూకల్సి బెండకాయలు కోయసాగారు.
”జానెడు పెరిగినా ఎంతలేతగా ఉన్నాయో చూడుతారకా!భలేవిత్తనాలు వేసింది  పార్వతి .ఎంతైనా దానిచేయి చాలామంచిదమ్మా!" అందిచంద్రమ్మ. " నేలమనది, తోటమనది, నీరు మనవి.దాని చెయ్యేంటి? మనం వేసినా ఇలాగే పెరుగుతాయిలెండి.దానిగొప్పెంటి?"                                                          "అలా అనకు తారకా! ఒక్కో మంచిమనసున్న చేత్తో వేస్తే ఇలాగే పెరుగుతాయి " ఇద్దరూ కల్సికోయసాగారు.. 
"సరిసరి. మీ పిచ్చిమీది కానీ ,అత్తయ్యగారూ! ఇంకో పదుంటే  బావుండు, బాండీలో వేయగానే గుప్పెడైపోతాయి ముక్కలు ,కూరఅందరికీ చాలకపోవచ్చు అనిపిస్తోంది. మరోపది పన్నెండు ఉంటేచూడండి, ఆకులచాటున ఉండవచ్చు."అంటూ తారక వెతకసాగింది.
చంద్రమ్మ "అయ్యో! అన్నీ చిన్న పిందెలేనే తారకా! మరో వారమైతే గానీ పెరగవు."అంది.
"పోనీలే అత్తయ్యగారూ మనందరికీ చాలవు. కోసేయండి ఇంకో ఇరవయ్యన్నా!"అంటూ కోయబోగా, " తారకా ! మరీ చిన్నవమ్మా! చేతులు రావట్లేదు ఆకసుగాయల్నికోయను. పోన్లేవేమ్మా! వచ్చినంతే వస్తుందిలే."
"ఇంకోకూరెక్కడ చేస్తాం అత్తయ్యగారూ! కోసేయండి ఫరవాలేదు"
“నాకు చేతులు రావట్లేదమ్మా!కసుగాయలనుకోయను.మరీ పసికూనల్లా ఉన్నాయే తారకా!" 
"నేను కోస్తాగానీ మీరు వంకాయలున్నాయేమోచూడండి, సాంబార్ లో వేసుకోను." 
" తారకా ఇవీ కూడా ఇంకో నాలుగైదురోజులు పోవాలమ్మా!ఇవీ కసుగాయలే! పెద్దబత్తాయికాయలంత అవుతాయి ఈ వంకాయలు, ఇంత చిన్నవాటినెలా కోయనే! చేతులు రావట్లేదు."
"మీరుమరీనీ అత్తయ్యగారూ!అన్నీ అలా చేతులు రావట్లేదనుకుంటే లేతకాయలెలా తింటాం చెప్పండీ! విత్తనాలు పెట్టాక  రుచేమారిపోతుంది. పెరటితోటవేసుకుంది లేతలేత కాయలు తిననేకదా!పోనీ నేనేకోస్తాలెండి, మీరు ఆ సొరపాదుకు కాయలున్నాయేమో చూడండి. "అంటూ చిన్న వంకాయలు, బెండకాయలూ కోయసాగింది తారక.
"చాలానే ఉన్నాయి తారకా! సుమారుగా ఐదారున్నాయి." అని చంద్రమ్మ అంటుండగానే,"తారకమ్మ గారండీ ! ఆ సొరకాయ ముదరతా ఉందమ్మా!నేకోసుకెల్లానా! ఈరోజు ఇంటో కూరకేవీ లేదమ్మా! నెలాకరాయె కొందారంతే పైసలూ లేవు నాకాడ."అంటూ అడిగిందిపార్వతి.
ఆమే కూర పాదుల కంతారోజూ నీరూ పెట్టేది.ఆ తోటంతా ఆమే శ్రధ్ధగా పెంచేది.
" అయ్యో! ఈరోజు నేను సొరకాయ మజ్జిగపులుసు చేద్దామనుకుంటున్నానే పార్వతీ! ఇంకో మారి స్తా లేవే నీకు."
"పోనియ్యవే తారకా! పాపం అదేగా వేసింది, నీరుపెట్టి అనీ చూస్తున్నదీనూ ముదురుకాయ అంటున్నది, కోసుకు పోనీయవే , పైసలు లేవంటునంది, పేదరాలు" మెల్లిగా కోడలుకు మాత్రమే వినిపించేలా అంది చంద్రమ్మ.              "మీరుండండి అత్తయ్యగారూ ! అలా అలుసిస్తే ఇంకేమైనాఉందా!" అంటూ కూరగాయలన్నీ కోసుకో సాగింది తారక.  
" సర్లెండమ్మగారూ గంజిలో ఉప్పేసుకు తాగుతాం ఏం చేత్తాం, కూరానారా మాకెక్కడొస్తాయండమ్మా! పెట్టిపుట్టాలిగందా!"అనుకుంటూ వెళ్ళింది పాపం పార్వతి.అప్పుడే అక్కడికి వచ్చి వారిమాటలన్నీ విన్న అభినయ్ "మమ్మీ! నీవు నాకు ఇప్పుడేకదా చెప్పావు, పొయమూ దానీ  మీనింగూనూ, కసుగాయలు కోయటం పాపమనీ పెద్దవవుతాయనీ! మరెలా కోస్తున్నావ్ మమ్మీ! నేర్చుకున్నది  ఆచరించాలని కూడా చెప్పావుకదా! మరి నీవిప్పుడు కసుకాయలనెలా కోస్తున్నావూ? బామ్మనూ కోయమంటున్నావు?” తల్లిని నిలదీసినట్లే అడిగాడు.  
" ఓరి బడుధ్ధాయ్ ! పద్యానికి అర్ధం చెప్పాను గానీ అన్నిటికీ దాన్ని అనుసరించాలంటే కుదరదురా! అలా నేర్చుకున్నవన్నీ ఎలాచేయగలం!" 
" నీవేకదా మమ్మీ! మీ టీచర్ గారు చెప్పారని చెప్పావు? పాపమనీ అవి పెద్దవవుతాయనీ  చెప్పలేదూ!"
"చెప్పాను, ఐతే అన్నీ ఆచరించాలంటే కుదరవు. కొన్ని తెల్సుకుని వదిలేయాలి. అన్నీపాటించాలంటే ఎలా అవుతుందిరా! "  
"బావుంది మమ్మీ!నీవు చెప్పిందొకటీ ఇప్పుడు నేర్చుకున్నవన్నీ చేయలేమంటూన్నావ్!ఇదేంటీ!"  
"నోరు మూసుకుని వెళ్ళి చదుకోపో. విసిగించకు. తాతగారికి ,నాన్నగారికీ త్వరగా వంట చేసి భోజనం పెట్టాలి. వెళ్ళు"అంటూ కోప్పడి లోపలికెళ్ళింది తారక.
"ఏంటో మమ్మీ ఎప్పుడూ ఇంతే! ఒకటి చెప్పి నన్ను చేయమంటుంది, తానకేమోకుదరదంటుంది, ఏంటో అంతా కన్ఫ్యూషన్ "అయోమయంగా వెళ్ళి పుస్తకాలేసుకు కూర్చున్నాడు .
****
మధ్యాహ్నం అంతా భోజనాలు చేసి కూర్చునేసరికి ల్యాండ్ లైన్ మోగింది.తారక వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది.
"అలాగా ! సంతోషం.ఎప్పుడు వస్తున్నారు? రేపా?మంచిది రండి.ఉన్నారు ఇదోఇస్తున్నా, ఏమండీ మీ చెల్లాయ్ !"అంటూ ఫోన్ భర్త భరత్ కిచ్చింది. 
భరత్ ఫోన్ మాట్లాడి"అమ్మా! చెల్లాయ్ శిరీష వస్తున్నదే రేపు. వాళ్ళబ్బాయి వరుణ్ కు ఇక్కడ సీట్ వచ్చిందిట ఇంజనీరింగ్ లో .రేపు ఉదయాన్నే వస్తున్నారు,బావగారూ, చెల్లాయ్ వరుణ్,వాసవి, అంతా. నాన్నగారూ విన్నారుగా!చెల్లాయ్ వస్తున్నది."మహదానందంగా చెప్తున్న భర్త భరత్ వైపు ముభావంగా చూసింది తారక.
"సరే అమ్మా! నాన్నగారూ ! వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి.లేచాక షాపింగ్ కెళ్ళి చెల్లాయి కుటుంబానికంతా బట్టలుకొని తెద్దాం, చాలాకాలానికి వస్తున్నారు అంతానూ."అంటూ సంబరపడ్దాడు భరత్ .
మధ్యాహ్నం పడుకుని లేచి షాపింగ్ కెళూతూ పిలిచాడు భరత్ భార్యను," తారకా! వస్తావా షాపింగ్ కెళ్ళివద్దాం."అని.
ఎప్పుడ భరతే వెళ్ళి చెల్లికి కావల్సినవన్నీకొనడం అలవాటు. 
"మీరెళ్ళి రండి! మీ చెల్లాయికి ఎలాంటి రంగు లిష్టమో మీకు తెల్సుకదా! నేను కొద్దిగా రేపటికి కావాల్సినవి ఉన్నయో లేదో చూస్తాను. వదినగారికి ఇష్టమైనవి వండను ఐటంస్ చూసుకుంటాను."అంది తారక. 
"ఔను అదీ నిజమేకదా! సరేమేం వెళ్ళొస్తాం" అంటూ భరత్, అమ్మానాన్నలతో కారెక్కి వెళ్ళాడు. వారు వెళ్ళిన కొద్దిసేపటికే , వెనకింటి వెన్నెల వచ్చింది --" తారకగారూ !"అంటూ.                                                "ఉన్నారా! బయల్దేరి పోయాక, ఫోన్ చేయాల్సింది ముందుగా అనుకున్నాను. ఎలాగో ఉన్నారు ఇంట్లో . ఏంటండీ! శలవురోజు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అన్నయ్య గారేరీ! మీ అత్తగా రేరీ!" అంటూ ఆరాలు తీస్తూ, ప్రశ్నలు కురిపించింది, వారంతా వెళ్లడం మేడ మీంచీ చూసే వచ్చిన వెన్నెల.
"సెలవైతేనేం గాక, అంతా షాపింగ్ కెళ్ళార్లెండి. రేపు దిగితున్నారుగా మా ఆడపడుచూ పిల్లలూ అంతానూ. వారికంతా ఏవేవో గిఫ్ట్స్ కొనను వెళ్ళారు.ఆ చెల్లెలంటే మావారికి ప్రాణం లెండి." కాస్త వెటకారం జోడించి,చెప్పింది తారక.
"ఎందుకొస్తున్నట్లూ ఇంతకూ ఆడపడుచు? ఇప్పుడేం పండుగల్లేవే!" కూర్చుంటూ సాగదీసింది వెన్నెల. 
"లేకపోతేనేంలే వెన్నెలా! వాళ్ల చెల్లె లొస్తేచాలు  ఆయనకు పండుగ. వాళ్లబ్బాయికి ఈ నగరంలో ఇంజనీరింగ్లో సీటొచ్చిందిట అదీ వాళ్ల పండుగ. జాయిన్ చేయను ఈ ఆగమనం. "
"ఓ అలాగా! ఐతే ఇక్కడే ఉంచుతారేమోలే తారకా! అమ్మమ్మచేతి వంట కమ్మగా తింటూ , మామ ఇంట్లో హాయిగా  ఉంటాడేమోలే !నీ ఇంట్లో ఖాళీ బెడ్ రూం తలుపులు తెరచి నట్లుంటుందిగా! " అంది రెచ్చగొడుతూ వెన్నెల.
" ఔనుకదూ! నాకావిషయమే తోచలేదు. బాబోయ్!వీళ్లకంతా రోజూ ఎవరు వండి వార్చుతారమ్మా! నేను ఖచ్చితంగా చెప్పేస్తాను కుదరదని."
" ఏమోలే తారకా హాస్టల్లో వేస్తారేమోలే! కాలేజీకీ ఇక్కడికీ దూరం కావచ్చును, రోజూ వెళ్లాలంటే కుర్రాడికీ ఇబ్బందేమోలే!"
" ఊరికే అన్నీ వస్తుంటే వదులు కోను వాళ్ళేం తెలివి తక్కువ వారనుకున్నావా వెన్నెలా! మహా మేధావుల్లే!" 
"ఐనా వాళ్ళమ్మ ఊరు కుంటారా ! మనవడ్ని కళ్ళ ముందుంచు కోవాలనుకోరా ఏం?"
"ఏమో తల్లీ నా చావుకొచ్చి పడింది.ఆవిడ పిల్ల గాడికి ఈ ఊర్లోనే రావాలీ సీటు."
" ఉండు తారకా! కాబోయే అల్లుడ్ని ఇప్పటి నుంచే మంచిచేసుకో! "
"చాల్లే వాడికే ఇవ్వాలీ  నా బంగారు తల్లిని , ఎప్పటికీ కుదరదు. హాయిగా మంచి స్కూల్లో హాస్టల్లో ఉండిచదువుకుంటున్నది. ఈ సంత కంతా ఎవరు చేస్తారమ్మా జీవితాంతం!"
"నీవనుకుంటే ఐందీ!ఇక్కడేగా ఉన్నారు అమ్మమ్మా, తాతయ్యానూ ! వారూరు కుంటారా తారకా!"
"వెధవ సంత వెధవ సంతైతేనూ! నా ప్రాణాని కొచ్చింది. వాళ్ళ రెలెటివ్స్ అంటే నాకు మహామంట. ఏదో ఒకటి తీసుకెళ్ళనూ , సాయం కోసమే వస్తుంటారు. అసలుమా ఆయనకు ఇండియా అంటే ప్రాణం,వాళ్ళ రిలెటివ్స్ అంటే మాహా ప్రీతి.అంతెందుకూ  మొన్నా మధ్య  అమేరికా ఛాన్స్ వస్తే రానని చెప్పారు."
"తారకా!మీ అత్తగారూ మామగారూ నీతో బాగానే ఉంటారుకదా! ఇల్లు తోటలూ ఆస్థి అంతా మీకే రాసిచ్చారన్నావ్! నీకు చేదోడు వాదోడుగా ఉన్నారుకదా!”
"ఆ ఉన్నార్లే రేపు వాళ్ళుముసలాళ్ళయ్యాక నేనేకదా! చేయాల్సింది, అందుకే ఇప్పటినుంచే అలా బాగా ఉంటున్నారు."
"అంతేనంటావా! ఏమో తారకా అవన్నీ నాకేం తెలుస్తాయి ?అలా కూరగాయల కెళ్తూ వచ్చాను. వస్తానుమరి ." 
"అయ్యో మర్చే పోయాను వెన్నెలా! ఉదయమే కోశాను లేత సొరకాయలు, వంకాయలూ, కాకరకాయలూనూ .పట్టుకెళ్ళు"
" అయ్యోసొరకాయ మాఇంట్లో ఎవ్వరూ తినరు తారకా! కాకరకాయలూనూ, చేదని తాకనే తాకరు. మరేమనుకోకు. " 
"అయ్యో!అదేంటీ ఆవపెట్టి వండావంటే సొరకాయ అడిగడిగీ తినేస్తారు.నీకు కాస్తైనా ఉంచరు.ఇహ కాకరకాయ కారపుకాయ చెయ్యి.మిగిలితే అడుగూ! ఓమారు ప్రయత్నించిచూడు.వంకాయలు లేత దవ్వలు,ఇలా బాండీలో వేస్తే అలా మగ్గిపోతాయి."అంటూ బలవంతాన సంచీలో వేసి తెచ్చి, ఇచ్చింది  తారక. ' ఒద్దుఒద్దంటూనే' అన్నీ తీసుకెళ్ళింది వెన్నెల.   
వెన్నెల వెళ్లాక హాల్లోనే కూర్చుని హోంవర్క్ చేసుకుంటున్న అభినయ్ "మమ్మీ!ఉదయం మనింట్లో పనిచేసే పార్వతిపాపం బ్రతిమాలింది కదా, కూరలు కొనుక్కోను డబ్బుల్లేవమ్మగారూ! చాలా సొర కాయలున్నాయ్ ఒక్కటి కోసుకెళ్లనా!' అని అడిగితే 'లేదేనాక్కావాలి ఈరోజు వండాలనుకున్నాను. ఇంకోమారిస్తాలే 'అన్నావు,అదీ ముదిరి పోతున్నదని అడిగింది.ఆమేకదా తోటంతాచూసేది.ఇప్పుడేమో వద్దంటున్నా బ్రతిమాలి వెన్నెలాంటీ కిచ్చావు.పాపం పార్వతమ్మ సారోగా వెళ్ళింది. పైగా రేపు అత్త వస్తుంటే  ఎందు కంతయాంగ్రీగా ఉన్నావు!ఉదయం మన కున్నది లేనివారికి ఇవ్వాలన్నావు. రెలెటివ్స్ నుప్రేమించాలన్నావు.ఏదేదో చెప్పావు!ఇప్పుడేంటీ ఇలా!"ఆశ్చర్యంగా అడుగుతున్న అభినయ్ ను కోపంగా, ఉరిమి చూసింది తారక.
"ఒరే! నీ కన్నీ కావాలి. ఏదో పద్యానికి అర్ధం చెప్తే అవన్నీ చేస్తామా ఏం!. పోయి హోం వర్క్ చేసుకో పో. రేప్పొ ద్దున్నే అత్తవాళ్ళొస్తారు . అందరం వారికి సేవలు చేయాలి.నీ హోం వర్క్ కు కుదరదు." అంటూ లోనికెళ్ళింది తారక. 
‘ మమ్మీ కెందుకో అత్తంతే హేట్ ! ఒకటి చెప్తుందీ ఒకటి చేస్తుంది. బోత్ ఆర్ డిఫరెంట్ . ఏంటో ఈ చదువులూ, మీనింగ్లూ  ఐ కాంట్ అందర్ స్టాండ్. చదివే చదువు పాటించాలని చెప్పేమమ్మీనే ఏదీ ఫాలోచెయ్యదు. మీనింగ్ మాత్రం వెరీ నైస్ గా చెప్పింది. పూర్ పార్వతమ్మ కేమో ముదురు కాయైనా ఇవ్వలేదు. కొనగల రిచ్ వెన్నెలాంటీకేమో ఫోర్స్ గా ఇచ్చింది. బామ్మ తాతగార్లతో లవ్లీగా ఉంటుంది, మరి వెన్నెలాంటీతో ఏదేదో చెప్పింది. నాన్న గారేమో అమేరికా వెళ్ళనన్నారని కోపం. పాపం తాతా బామ్మా ఎలాఉంటారు లోన్లీగా ఇక్కడ !ఏంటో మమ్మీ అంతా డిఫరెంట్.అత్త ఎంత మంచిది! ఎప్పుడు వచ్చినా వాళ్ల తోటలో పండ్లూ కూరలూ తెస్తుంది. బోలెడన్ని స్వీట్స్ ఘీ తో చేసి మరీ తెస్తుంది. మమ్మీ అంటే ఎంతో లవ్ గా ఉంటుంది.మరి మమ్మీ ఏమో వెన్నెలాంటీతో ఏదేదో వేస్ట్ టాక్ చేస్తుంది . నా కేమో అది చేయి,ఇది చేయి అంటుంది. తానేమో ఇలాచేస్తుంది. మమ్మీ అసలు అర్ధంకాదు. ఐ కాంట్ అండర్ స్టాండ్ హెర్ .సో శాడ్.  "అను కుంటూ హోంవర్క్ లో పడ్డాడు అభినయ్.
 .************
మరునాటి ఉదయానికల్లా పెద్ద విమానమంత కార్లో శిరీష కుటుంబమంతా దిగింది వారి పల్లె మన్నేపల్లెనుంచీ. బోలెడన్ని గంపలూ, బుట్టలూ కూడా దిగాయి.ఎన్నెన్నోరకల కాయలూ,పండ్లూ,ఆమె స్వయంగా చేసితెచ్చిన స్వీట్లూ ఎన్నెన్నోతెచ్చారు. అమ్మకూ, నాన్నకూ నమస్కరించింది శిరీష కుటుంబమంతా. శిరీష భర్త వర్ధన్ అగ్రికల్చరల్ ఎమ్మేస్సీ రీసెర్చ్  చేశాడు. డాక్టరేట్ చేశాడు.ఐనా తన తాత తండ్రులున్న స్వగ్రామంలో తాను అగ్రికల్చర్ లో సంపాదించినఙ్ఞానంతో రకరకాల ఆర్గానిక్  పంటలు  పండిస్తూ అధిక లాభాలు సాధిస్తూ , ఊరికంతా ఆదర్శవంతమైన రైతుగా ఉంటూ అందరికీ సలహాలు ఇస్తూ, అందరి తలలో నాలుకలా ఉంటాడు.నిగర్వి.తానే స్వయంగా గంపలన్నీ మోసుకొచ్చి లోపల ఉంచాడు.అత్తా మామల పాదాలంటి నమస్కరించాడు.
"ఎందుకు వర్ధన్! ఇవన్నీ మోసుకొచ్చావు? ఇక్కడా మాకు ఆర్గానిక్ కూరగాయలు , పండ్లూ పండుతున్నాయిగా!"అన్న మామ గారితో,"అదేంటి మామయ్యగారూ! మీకు పండట్లేనది కాదు.మాకు పండినవి మీకూ చూపితే, మీ ఆశీస్సులు మరింతగా లభిస్తాయని మాస్వార్ధం. "అని నవ్వుతూ చెప్పాడు.
అంతా అల్పాహారం తిని కూర్చున్నాక ,శిరీష చెప్పింది" అన్నయ్యా! మేము భోజనాలు కాగానే బయల్దేరుతాంరా! హోటల్లో రూం తీసుకున్నాం,ఎందుకంటే మా ఆడపడుచు కొడుక్కూ ఇక్కడ సీట్ వచ్చింది. మావాడికి మంచి ర్యాంక్ రావటాన ఫ్రీసీట్. ఆ డబ్బు మా ఆడపడుచు కొడుక్కు కడుతున్నాం. మన వారంతా బావుంటే, సంతోషంగాఉంటే ,మనకూ మనస్సుకు హయిగా ఉంటుంది కదా! ఇద్దర్నీ హాస్టల్లో ఒకే రూంలో ఉంచదలచాం.ఒకరి కొకరుగా తోడుగా ఉంటారు.కలిసి చదువుకుంటారు.అప్పుడప్పుడూ మేమో వాళ్ళో వచ్చి చూస్తుంటాం. అమ్మనూ నాన్ననూ మీ అందరినీ చూసి చాలా కాలమైందనీ ,మాతోటల ఫలితం మీకూ కొద్దిగా చూపినట్లూ ఉంటుందనీ వచ్చాం.మధ్యాహ్నానికి వారూ వచ్చేస్తారు,నేరుగా హోటల్రూంకు. పిల్లల్ని హాస్టల్లో దిపేసి వెళ్ళిపోతాం. రేపు మళ్ళాస్కూళ్ళుకదా! "అంది. 
భరత్ " అదేంటే ఒక్క పూటైనా ఉండకుండా వెళాతానంటావ్ ! వదిన మీకోసంచాలా చేయాలనుకుంది.."
"లేదురా అన్నయ్యా! ఇంకాపొలంపనులు ఈయనకూ చాలా ఉన్నాయ్ ! అందరిని కలసి చూసి నట్లంటుందని వచ్చాం రా!వదిన వండినవన్నీ ఈపూటే తినేసి పోతాంలేరా! ఇంకోమాట అమ్మాన్నాన్నల్ని మా పల్లెకు తీసుకెళతాం రా!మాదగ్గరే ఉంటారు. మా అత్తామామా గార్లతో కలసి అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా పల్లెలోనూ మంచి వైద్యసదుపాయాలూ అవీ ఏర్పడ్డాయి. ఏవిధమైన భయాలూ అవసరంలేదు."
"అదేంటే మేం ముగ్గురం కొడుకుల ముంటే ఆడపిల్లవి నీదగ్గరేంటే ఉండటం!"   "ఏరా!మీకేనా వాళ్ళు అమ్మానాన్నలు, నాకు కాదా! పిచ్చిగా ఆలోచించకు.."
"అదికాదే .."
" ఏదికాదురా! కనీసం నాదగ్గర ఆరునెల్లైనా ఉండనీ, ఎటూ వాళ్ళిద్దరూ చాలా దూరంగా, ఢిల్లీ లోనూ, కలకత్తాలోనూ ఉంటున్నారు, నీవూ నేనే దగ్గరగా ఉన్నాం."అంటున్న కుమార్తెతో,"శిరీ! మానాన్న గారు ఇచ్చిన స్థలంలో నేను కట్టించిన ఇల్లమ్మా ఇది. దీనిమీద కొద్దిగా అభిమానం, రోజూ ఈచెట్లు పెద్దాడు పుట్టినప్పుడు నాటినవి,ఈచెట్లు చిన్నాడు పుట్టినప్పుడు నాటినవి, ఇది శిరి పుట్టినప్పటిది, అనుకుంటూ అలా రోజూ చూసుకుంటూ ఉంటానమ్మా! అంతే, నీకంత కోరికగా ఉంటే రానన్నామా!అలాగే వచ్చి పదిరోజులుండి వస్తాంలేమ్మా!"అని నాన్నగారన్నాక ,"అదిరా నాన్నంటే , మరీ పదిరోజులేంటి నాన్నా! కనైసం మూడు నెల్లైనా ఉంటే నాకు బావుంటుంది." అంటూ మురిసి పోయింది శిరీష.
"రా వదినా ! నేను వండుతాను .ఇవాళ నావంట అన్నా ,అమ్మా,నాన్నగారూ ,మీరంతా రుచి చూస్తారు."అంటూ వంట గదిలోకెళ్ళి చకచకా తానుతెచ్చిన కూరగాయలు తీసి తరిగి వంటచేసేసింది.
తారక చూస్తూ ఉండగానే వంటైపోయింది. గబగబా డైనింగ్ టేబుల్ సర్దేసి, అందరినీ పిలిచి వడ్డించింది.అంతాభోజనాలు చేశాక ,అందరినీకూర్చోబెట్టి వరుసగా పేరు పేరునా అందరికీ తాను తెచ్చిన బట్టలు ఇచ్చింది. అమ్మా,నాన్నలకూ ,అన్నకూ వదినకూ పదాభివందనాలు చేసింది, భర్తతోకలిసి. తారక తనకు శిరీష ఇచ్చిన పదివేలరూపాయల పట్టుచీరచూసి ఆశ్చర్య పడింది." ఏంటే ఇదంతా ! మా ఇంటికోస్తే మేము పెట్టాలిగాని.."అంటున్న అన్నతో,"అదేంట్రా అన్నా ! మీ ఇంటికొస్తే మేం పెట్టకూడదా! మేం వస్తే మాకు బట్టలు పెట్టాలనే రూలేమన్నా ఉందా!ఇది మాకు ఎంతో తృప్తిగా ఉంటుందిరా! " అంటూ అన్న పిల్లలను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంది.
"అత్తా! మాకిన్ని కూరలూ, పండ్లూ తెచ్చావే మీ తోటల్లో పనిచేసే వాళ్ళకు ఇవ్వచ్చుగా!"అంటున్న అభినయ్ తో  నవ్వుతూ చెప్పింది శిరీష . 
"అభీ! ముందువాళ్ళు కావల్సినన్ని కోసుకున్నాకే మేం కూరలూ, పండ్లూ కోయించేది. పనిచేసే వారు తృప్తిపడితేనే కామందుకు తృప్తి, లాభమూనూ. అందుకే ముందు వాళ్ళకే ఇస్తాం రా అభీ!" అంది.
"అత్తా! మీ ఇంటికి మీ రెలెటివ్స్ వస్తే నీకు హ్యాపీనా! యాంగ్రీనా?"
"అదేంట్రా! రెలెటివ్స్ వస్తే యాంగ్రీ ఎందుకురా! మనింటికి అంతా వచ్చిపోతుంటేనే మనకు హ్యాపీ కదా!ఇప్పుడు మేం వస్తే నీకు హ్యాపీగా లేదూ! యాంగ్రీగా ఉన్నావా మామీద!"
"లేదత్తా హ్యాపీనే!నీవు మీ రెలెటివ్స్ మీద  బ్యాక్ బైటింగ్ చేస్తావా!"
"ఛ అది చాలా తప్పురా! అసలివన్నీ ఎందుకోసం అడుగుతున్నావ్! చిత్రంగా ఉంది."          
"ఊరికే అత్తా! జస్ట్ ఫర్ ఇన్ ఫర్మేషన్ అంతే!ఏదైనా విన్నాక కన్ ఫాం చేసుకోవాలి కదా!అందుకే!"
"ఎక్కడ ఏం విన్నావురా అభీ!'అంటున్న శిరీషకేసి చూస్తూ," అభీ! ఏంట్రా అత్తనలా ఏవేవో అడుగుతున్నావ్!పోయి ఆడుకోపో."
"లేదు వదినా ! అభికేదో డౌట్స్ ఉన్నట్లున్నాయి. పోన్లే అడిగితే తప్పేముందీ!ఐపోయాయా నీ డవుట్స్ అభీ!సరే రా అన్నా మేం వస్తాం.లేటైతే మా ఆడపడుచూ వాళ్ళట్రన్ వస్తుంది, వాళ్ళను రీసీవ్ చేసుకుని  హోటల్ కు వెళ్తాం .ట్రైన్ టైం అయ్యేలోగా మేం వెళ్లాలి." అంటూ లేచిన శిరీషకూ భర్తకూ తాము తెచ్చిన బట్టలు పెట్టింది తారక.తనమనస్సులో మలినం శిరీష ప్రేమతో తుడుచుకు పోగా ఆమెను ఆలింగనం చేసుకుంది తారక. ఆమె కళ్ళలో ఆనంద భాష్పాలో, పశ్చాత్తప బిందువులో పటపటా రాలాయి.
"ఏంటి వదినా! పిచ్చా ఏంటి! "అంటూ శిరీష తారక కళ్ళు తుడిచింది. అంతావెళ్ళాక,వంటరిగా ఉన్నపుడు"ఆభీ! ఈరోజు నీమాటలతో నా తప్పు తెల్సుకున్నానురా! మరెప్పుడూ ఇలా చేయను. నీకు చెప్పినట్లే చేస్తానురా!"అంటూ కొడుకును ముద్దుపెట్టుకుంది తారక. తల్లిలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యంగా,ఆనందంగా  ఆమెకేసి చూశాడు అభినయ్.  
 ***


No comments:

Post a Comment

Pages