శ్రీ దేవి దశమహావిద్యలు - 6
5. శ్రీ భైరవి దేవి.
శ్రీరామభట్ల ఆదిత్య
భైరవి దేవి శ్రీ దేవి దశమహావిద్యలలో ఐదవ మహావిద్య. ఈమెకే మహాత్రిపురభైరవి అనే పేరు కూడా ఉంది. క్షయమయమైన ఈ సృష్టికి అధిపతి కాలభైరవుడు. ఆయన శక్తియే భైరవి దేవి. లలితా దేవి లేదా మహాత్రిపురసుందరి యొక్క రథవాహిని కూడా ఈమెయే. బ్రహ్మాండ పురాణంలో గుప్త యోగినుల అధిష్టాన దేవిగా భైరవిదేవి గురించి చెప్పబడివుంది.
మత్స్య పురాణంలో భైరవిదేవి యొక్క ఐదు ముఖ్యరూపాల గురించి చెప్పబడివుంది. అవే
1) త్రిపుర భైరవి
2) కోలేశ భైరవి
3) రుద్ర భైరవి
4) చైతన్య భైరవి
5) నిత్య భైరవి
6) సిద్ధి భైరవి
7) కమలేశ్వరి భైరవి
8) కామేశ్వరి భైరవి
9) షట్కూటా భైరవి
10) భువనేశ్వరి భైరవి
ఈ రూపాలనే దశమహా భైరవి స్వరూపాలంటారు. ఇంద్రియ నిగ్రహం కొఱకు ఈ రూపాల ఉపాసన తప్పనిసరి.
దుర్గా సప్తశతి యొక్క మూడవ అధ్యాయములోని మహిషాసురవధ ఘట్టంలో అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. ముండమాలాధారిణి అయిన అమ్మవారు అరుణ వర్ణంలో, ఎర్రటి చీరతో, చేత జపమాల, పుస్తకము మరియు అభయముద్రలతో, కమలాసనయై మనకు దర్శనమిస్తుంది. రుద్రయామల మరియు భైరవీకులసర్వస్వమనే తంత్ర గ్రంథాల్లో అమ్మవారి ఉపాసన పద్ధతి చెప్పబడి ఉంది.
అమ్మవారి మెడలోని ముండమాలయే వర్ణమాల, అమ్మవారి రజోగుణమే సృష్టి ప్రక్రియకు ప్రతీక. అమ్మవారే ప్రణవం. వర్ణమాలలో 'అ' నుండి 'విసర్గ' వరకు భైరవుడైతే, 'క' నుండి 'క్ష' వరకు భైరవీ స్వరూపం.
దశమహా భైరవీ స్వరూపాలలో
1)సిద్ధి భైరవి ఉత్తరామ్నయ పీఠానికి అధిదేవత.
2)నిత్య భైరవి పశ్చమామ్నాయ పీఠానికి అధిదేవత.
పై రెండు పీఠాల అధిదేవతా ఉపాసకుడు స్వయంగా పరమశివుడే కావడం గమనార్హం.
3)రుద్ర భైరవి దక్షిణామ్నాయ పీఠానికి అధిదేవత.
పై పీఠ అధిదేవతా ఉపాసకుడు శ్రీమన్నారాయణుడు.
ప్రపంచంలోని ప్రతిక్షణమూ జరిగే మార్పులకు కారణము భైరవీదేవియే. ఎందుకంటే ప్రతిమార్పు కూడా ఆకర్షణ వికర్షణల సంయోగమే కాబట్టి.
***
No comments:
Post a Comment