నాట్యావధాని ధారా రామనాధశాస్త్రి గారు
అంబడిపూడి శ్యామసుందర రావు
శ్రీ ధారా రామనాధశాస్త్రిగారి గురించి తెలుసుకోవాలి అంటే ముందు నాట్యావధానము అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఎందుకంటే నాట్యావధానము అనే ప్రక్రియను రంగస్థలం మీద ప్రవేశ పెట్టినది ఆయనే . మన సాహిత్యములో అష్టావదానాలు,శతావధానాలు,నేత్రావధానాల గురించి వింటూనే వుంటాము , సాహితి సభలు సమావేశాలలో కవి పండితుల అష్టావధానాలను శతావధానాలను చూసి సాహితి అభిమానులు కవిత్వాలలోని రసజ్ఞతను అనుభవించే వుంటారు. సాధారణముగా నాట్యావధానము అనగానే ఇదేదో నాట్యానికి సంబంధించినదిగా ఆనుకుంటాము కానీ నాట్యానికి నాట్యావధానికి సంబంధము లేదు. ఈ ప్రక్రియ నాటకరంగానికి సంబంధించింది..
నాటకము లో సంభాషణ లను ఒక రచయిత రచిస్తాడు ఒక దర్శకుడు నటులకు ఎలా నటించాలో చెపుతాడు పాత్రకు తగ్గట్టుగా మేకప్ మాన్ మేకప్ చేస్తాడు ఇలా రంగస్థలముమీద నాటకప్రదర్శన సమిష్టి జరుగుతుంది కానీ నాట్యావధానములో రచయిత దర్శకుడు మేకప్ మాన్ నటుడు అన్ని ఒకడే అవసరాన్ని బట్టి మరో పాత్ర ఉంటుంది.
ఈ నాట్యావధానములో నాట్యావధానికి కొంతమంది పృచ్ఛకులు ఒక నాటకీయ సన్నివేశాన్ని ప్రశ్నగా ఇస్తారు ఉదాహరణకు కన్యాశుల్కములోని గిరీశము,చిలకమర్తివారి గణపతిని కలిస్తే ఇద్దరి మధ్య సంభాషణలు ఎలా ఉంటాయి అని అడిగితె నాట్యావధాని అయన సహాయకుడు, గిరీశమూ, గణపతి పాత్రలకు మేకప్ చేసుకొని పాత్రల ఔచిత్యము దెబ్బతినకుండా అంటే గిరీశము టక్కరిగాను,గణపతి తిండిపోతు,అమాయకుడిగాను ప్రేక్షకులముందు సన్నివేశాన్ని ప్రదర్శిస్తారు.
ఈ రకమైన ప్రక్రియ అంతకుముందు తెలుగు నాటక రంగములో లేదు దీని సృష్టికర్త ధారా రామనాధ శాస్త్రిగారు. అయన మాటల్లోనే చెప్పాలంటే ఇటువంటి కొత్త కళను ప్రారంభించాలని అనుకోలేదు,కానీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అరవై సంవత్సరాల క్రితము మద్రాసు బీచ్ లో కూర్చుని ఉండగా ఆయనకు వచ్చిన ఆలోచన ,
నటన,మేకప్,రచన అన్ని తానె మేళవించుకొని అప్పటికప్పుడు వృచ్ఛకుల కోరిక మేరకు ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనకు ప్రతి రూపమే ఈ కొత్త కళా ప్రక్రియ నాట్యావధానము. అప్పటికే ఆంధ్రములో బాగా ప్రచలితమవుతున్న సాహిత్యావధానాల ప్రభావము ,కర్ణాకర్ణిగా విన్న స్టాన్ స్లవ్ స్కీ వంటి నాట్య ద్రష్టల ప్రభావంతో ఈ నాట్యావధాన్ని రూపొందించారు. నాట్యశాస్త్రములో దాదాపు అధ్యాయము చివర ,"ఏవం నాట్యప్రయోగే బహు బహు విదితం కర్మశాస్త్ర ప్రణీతం నాప్రోక్తం యచ్చ లోకాదనుకృతి కరణం తచ్చ కార్యం విధిజ్ఞి"(నాట్య శాస్త్ర ప్రయోగములో అనేక రకాలుగా అంగీకరింపబడి,కర్మశాస్త్రముచే సంస్కరింపబడి,ఏ కార్యము చెప్పబడలేదో ఆ కార్యము లోకముననుసరించి కర్మలచే చేయతగినది) అన్న అనుశాసనము కూడా ఈ నాట్యావధానికి ప్రేరణ కావచ్చు.
వీరు నటుల కుటుంబంలోనుండి వచ్చినవారు కాబట్టి నటన వీరికి కొత్తకాదు .వీరి తాత గారు ధారా వెంకట సుబ్బయ్య గారు టంగుటూరి ప్రకాశము పంతులుగారితో నాటకాలు వేశారు వీరి ప్రస్తావన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు రచించిన నటరత్నాలు అనే గ్రంధము లో ఉంది. ఒకసారి ప్రకాశము పంతులుగారు
హిరణ్యకశిపుని గాను ధారా వెంకట సుబ్బయ్యగారు నరసింహాస్వామిగాను నాటకములో నటిస్తున్నారట నటనలో పూర్తిగా లీనమైన ధారావేంకట సుబ్బయ్య గారు హిరణ్యకశిపుని పాత్రధారి ప్రకాశముగారి పై లంఘిస్తే ప్రాణాలు
కాపాడుకోవటానికి ప్రకాశము గారు స్టేజి మీదనుంచి క్రిందకు దూకి పరిగెత్తి బావిలో దూకారుట. అంతగా పాత్రలో లీనమై నటించే నటుడు ధారా వెంకట సుబ్బయ్యగారు. వీరి తండ్రి ధారా వెంకటేశ్వర శాస్త్రిగారు ఈయన ప్రముఖ
రంగస్థల, సినిమా నటుడు సి.ఎస్. ఆర్ తో కలిసి నాటకాలు వేసేవారు. వీరి సోదరులు ధారా రాధాకృష్ణమూర్తి,ధారా సత్యనారాయణ శర్మ గార్లు అన్న గారితో పాటు నాట్యావధానము లలో చురుకుగా పాల్గొనేవారు.వీరి కుమారుడు వాశిష్ఠ అల్లుడు లీలాకృష్ణ కూడా నాట్యావధానులే. ధారా సోదరులు భారత దేశము లోను అమెరికాలోను గత అరవై ఏళ్లుగా నాట్యావధాన ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది మేధావుల ప్రశంసలు పొందారు.కొత్త రంగస్థల ప్రక్రియ కనుక,ఆమోదయోగ్యముగా ఉంది కనుక,సహృదయ వర్గాలు, సంస్థలు ఆదరించాయి డాక్టరు ఝాన్సీ అనే ఆవిడ
నాట్యావధానముపై పరిశోధనా గ్రంధాన్ని రచించారు..స్వయముగా శాస్త్రిగారే "అజోవిభో ఫౌండేషన్" సహకారంతో నాట్యావధానము అనే గ్రంధాన్ని రచించారు. అంతే కాకుండా తన అరవై ఏళ్ల నాట్యావధానాన్ని సమీక్షిస్తూ, నాట్యావధాన విద్యాసాధన చేసే యువకులకు మార్గదర్శకముగా ఉండేందుకు కొన్ని సన్నివేశాలను ఎన్నుకొని
"నాట్యావధాన స్మృతి పీఠము" అనే గ్రంధాన్ని కూడా రచించారు.
వీరి జీవిత విశేషాలకొస్తే వీరు 1932, జూన్ పదకొండున వెంకటేశ్వర శాస్త్రి, సత్యవతి దంపతులకు ప్రధమ కుమారుడుగా జన్మించారు.వీరి విద్యాభాసము గుంటూరు,మద్రాసులలో జరిగింది తరువాత ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందారు. 1953 నుండి 1992 వరకు ఒంగోలు శర్మ కాలేజీలో తెలుగు అధ్యాపకులుగా
పనిచేశారు. అంతేకాకుండా ఆంధ్ర వాజ్ఞయము,కృష్ణ కదా,సిద్ధాంత గ్రంధము భారత కథాలహరి వంటి వచన గ్రంధాలను,రామలహరి,కృష్ణలహరి , కాహాళి, మక్త్యసస్య వంటి కవితలు ,ఆధ్యాత్మిక, సాహిత్య ప్రసంగాలు రేడియో టీవీలలో ఇచ్చారు భువన విజయము వంటి సాహితి రూపకాలలో విరివిగా పాల్గొన్నారు ఎర్రన పీఠము,
నాట్యావధాన కళాపీఠము,వర్ధమాన సమితి వంటి సంస్థలకు అధ్యక్షుడిగా ఉండి సాంస్కృతిక సేవలు అందించారు.వీరు ఎక్కిరాల కృష్ణమాచార్యులు వారి ముఖ్య శిష్యులు వీరు ఆగస్టు, 6వ తేదీ 2016లో పరమపదించారు.
ప్రముఖుల ప్రశంసల విషయానికి వస్తే అందరు ఈ కళను ఈ నాట్యావధానిని పొగిడినవారే. కొన్ని ప్రశంసలను పాఠకుల సౌకర్యార్ధము పొందుపరుస్తున్నాను.
1. అసలు అవధాన ప్రక్రియ ఆంధ్రుల సొత్తు అందులో నాట్యావధానము అనేది ఒక విన్నూత్నమైన తపస్సు ,తనువు తానూ కాదని తలపోసి చూపరులకు గూడా అదే తన్మాయత్వాన్ని కలుగజేయు అభినయ సంవిధానము తపస్సుకు తీసిపోదు అలాంటి తపస్సు సద్యస్ఫూర్తితో ఆపాతమధురంగా నాయన మనోహరముగా అనాయాసముగా రూపొందించడం సామాన్యులకు సాధ్యముకాదు అలాంటి ప్రక్రియలో ఆరితేరి ఒకశతాబ్దములో నాలుగోవంతు కళాస్రవంతిని ప్రసరింపజేసిన రామనాధశాస్త్రిగారికి ఆంధ్రులు ఏంతొ ఋణపడిఉన్నారు --డాక్టరు ఇలపావులూరి పాండురంగారావు గారు.
2. భారతదేశములో ఎక్కడాలేని నూతన ప్రక్రియను భావితరాల కళాకారులకు గౌరవము రామనాధ శాస్త్రిగారికి దక్కుతుంది. - శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
.
3. లక్ష్య లక్షణ సృష్టికి విదాతలై నాట్యావధాన కళను పాతికేళ్లుగా అఖిలభారత స్థాయిలో ప్రదర్శిస్తున్న శాస్త్రిగారి ప్రతిభ అప్రతిమానం ,రూపం రాగం శబ్దం భావం చతుర్ముఖముగా భాసించే రామనాధశాస్త్రి ప్రజ్ఞాపారమ్యం
సాహిత్యనాట్యయోగ విద్యా చేతనులైన శాస్త్రిగారి ఉత్తమ సంస్కారానికి అభినందనలు - ఆచార్య సి.నారాయణ రెడ్డి.
4.పిఎల్ దేశ్ పాండే కళాస్వరూపము కంటే నాట్యావధానము భిన్నమైనది. సద్యస్ఫూర్తి, అశువు ఇందులోని ప్రధానాంశాలు మహారాష్ట్ర రంగస్థలముపై ఒక నాట్యావధాని జన్మించగలడని ఆశించవచ్చునా? - మహారాష్ట్ర టైమ్స్ పత్రిక.
5.నేను కలుసుకున్న మొదటి నాట్యావధాని ధారా రామనాధశాస్త్రి ప్రపంచములో ఆయనొక్కడే నాట్యావధాని కావటము వల్ల ఆశ్చర్యము కాదు. - సండే స్టాండర్డ్ -ఇంగ్లిష్ దినపత్రిక
6. జగత్తుయొక్క విద్వద్రసిక బృందమునకు ఆంద్రుడొసగిన అప్రతిమమైన కానుక నాట్యావధానము - సంయుక్త కర్ణాటక -కన్నడ పత్రిక
ఇంకా జమ్మలమడక మాధవరాయ శర్మ గారు, సత్యనారాయణ శాస్త్రిగారు,డాక్టర్ దాశరధి గారు,నాగభైరవ కోటేశ్వర రావు గారు,డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు,విశ్వనాధ సత్యనారాయణగారు,వంటి పండితులుకూడా నాట్యావధాన ప్రక్రియను రామనాథశాస్త్రి గారిని దీవించారు, ప్రశంసించారు. వీరి నాట్యావధానాన్ని చూసిన ప్రముఖ హాస్యనటుడు శ్రీ రేలంగి గారు "ధారా సోదరులు మాకన్న గొప్పవారు ఎందుచేతనంటే మేము సినిమాలలో రచయిత వ్రాసిన సంభాషణలను బాగా ప్రాక్టీస్ చేసి దర్శకుడు చెప్పినట్లుగా చాలా టేకులు తీసుకొని నటిస్తాము. సినిమా చూసిన ప్రేక్షకులు మేము సరిగా నటించలేదని విమర్శించిన సందర్భాలు అనేకము ఉన్నాయి కానీ వీరు సమస్య అడిగినవెంటనే స్వయముగా మేకప్ చేసుకొని వారి సంభాషణలు వారే కూర్చుకొని రంగస్థలం మీద నటించి ప్రేక్షకులను అందులో పండితులను మెప్పిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయము", అని ప్రశంసించారు.
***
No comments:
Post a Comment