అలనాటి మేటి దర్శకులు "ఈరంకి శర్మ" గారితో ముఖాముఖి - అచ్చంగా తెలుగు

అలనాటి మేటి దర్శకులు "ఈరంకి శర్మ" గారితో ముఖాముఖి

Share This
అలనాటి మేటి దర్శకులు "ఈరంకి శర్మ" గారితో ముఖాముఖి 
భావరాజు పద్మిని 


రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, జయచిత్ర, సుజాత, జయప్రద వంటి కొత్త నటుల్ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. వంటి కధే సినిమాకు హీరోగా వచ్చి, ప్రేక్షకుల మనసులో కలకాలం నిలిచిపోయే సందేశాత్మకమైన చిత్రాలు అప్పట్లో వచ్చాయి. అటువంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అలనాటి మేటి దర్శకులు ఈరంకి శర్మ గారితో ముఖాముఖి ఈ నెల ప్రత్యేకించి మీకోసం...
నమస్కారమండి, సినిమాల పట్ల మీకు చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదా?
నమస్కారమామ్మా.  మా స్వగ్రామం మచిలీపట్నం. మా నాన్నగారు అక్కడ పోర్ట్రైట్ ఆర్టిస్ట్. అక్కడ ఆంధ్ర జాతీయ కళాశాలలో ఆయన పోర్ట్రైట్ ఆర్టిస్ట్ గా ఉండేవారు. ఆయనకు నేను రెండో కుమారుడిని. అక్కడే  చదువుకుని, పెరుగుతూ ఉండగా, హఠాత్తుగా మా నాన్నగారు చనిపోవడంతో, పరిస్థితుల ప్రభావం వల్ల మద్రాస్ వచ్చేసాము. అప్పుడు మా నాన్నగారి శిష్యులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి వచ్చెయ్యమన్నారు. అప్పటినుంచి ఇక్కడే ఉంటున్నాము. మా అన్నయ్య కూడా నాన్నగారి లాగే ఆర్టిస్ట్. ఇక్కడ ఆర్ట్ స్టూడియోస్ చూస్తూ, చాలా సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా ఉండేవారు. ఆయన సొంతంగా సినిమా నిర్మించేటప్పుడు, ఆయన తన సినిమాకు నన్ను పనిచెయ్యమని చెప్పి, 1951 లో నన్ను సినిమా రంగానికి తీసుకు వచ్చారు. ‘చిన్నమ్మ కధ’ అనే సినిమా అది. కస్తూరి శివరావు గారు అప్పుడు టాప్ కమెడియన్. ఆయన హీరో, కృష్ణవేణి హీరోయిన్. అనుకోకుండా అలా డైరెక్టర్ అయిన మా అన్నయ్యకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. అదే మొదలు. ఎడిటింగ్ వైపు కూడా పనిచేసాను. అలా ఎడిటింగ్ లో కొనసాగుతూ, ఆ తర్వాత వేదాంతం రాఘవయ్య గారితో 3,4 ఏళ్ళు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచెయ్యడం జరిగింది.
కె. బాలచందర్ గారితో మీరు పనిచేసారట?
ఎడిటర్ గా ఉంటూ ఉండగా, ఆ తర్వాత కె.బాలచందర్ గారితో స్టూడియో అసోసియేట్ గా జెమినీ స్టూడియో లో పనిచేసే అవకాశం వచ్చింది. అలా ఆయనతో దాదాపు 20 సినిమాలకు అసోసియేట్ గా పనిచేసా. 1976 లో జోగయ్య గారని పశ్చిమ గోదావరి ఎం.ఎల్.ఏ గారొకరు నాకు డైరెక్షన్ కు అవకాశం ఇచ్చారు. అప్పట్లో నాదికాని, బాలచందర్ గారిది కాని, మా పధ్ధతి ఏమిటంటే అందరూ కొత్త ఆర్టిస్ట్ లతోనే సినిమాలు తీసేవాళ్ళం. పాత ఆర్టిస్ట్ లు ఉండరు. ఒక్కొక్క సినిమాకి, ఆ పాత్రను బట్టి, కొత్త ముఖాలను ఎన్నుకుని, సినిమాలు తీసేవాళ్ళం. అలా అరంగేట్రం, మన్మధ లీల, అంతులేని కధ, అపూర్వాంగళ్ ఇటువంటి సినిమాలన్నీ తీసాము. వీటిలో జయప్రద, జయచిత్ర, జయసుధ, సుజాత, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారిని ఎందరినో పరిచయం చేసాము.
మీరు డైరెక్టర్ గా చేసిన మొదటి సినిమా ఏది?
 కొత్త మొహాలతో తియ్యడం అలవాటయ్యాకా మొదట నేను ఒక కధ అనుకుని, ‘చిలకమ్మ చెప్పింది’ అన్న సినిమా తీశాను. అప్పుడు రజనీకాంత్, శ్రీప్రియ తెలుగుకి కొత్త, మాతో తమిళ సినిమాల్లో వీరు పని చేసారు. పి.ఎల్.నారాయణ అనే స్టేజి ఆర్టిస్ట్ ని కూడా పరిచయం చేస్తూ 1977 లో ఈ సినిమా తీశాను. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, బంగారు నందిని గెల్చుకుంది.
అలాగే అదే ఏడాది ‘మాలాగా ఎందరో’ అని అదీ కొత్త మొహాలతోనే తీశాను. రూప, పల్లవి, హేమసుందర్, నారాయణ రావు వంటివారితో తీశాను. మధ్యతరగతి ఆడవాళ్ళ నేపధ్యంలో తీసిన సినిమా ఇది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు పడే అవస్థను చాలా రహస్యంగా ఇందులో చెప్పాను. యుక్తవయసులో పెళ్ళిళ్ళు కాకపొతే పరిస్థితులు ఎలా ఉంటాయో అందులో చూపించాను. 78 లో రిలీస్ అయిన ఈ సినిమా కూడా బంగారు నందిని గెల్చుకుంది.
ఆ తర్వాత చిరంజీవి, మాధవి లతో ‘కుక్కకాటుకి చెప్పుదెబ్బ’ అన్న సినిమా, అగ్నిపుష్పం, సీతాదేవి వంటి సినిమాలు తీసుకుంటూ వెళ్లాను.
ఇతర భాషల్లో సినిమాలు తియ్యడం ఎలా సంభవించింది?
బాలచందర్ గారితో 20 సినిమాలూ తమిళం లోనే పని చేసాను. ఆయనతో నేను పనిచేసిన రెండు తెలుగు సినిమాలు అంతులేని కధ, మరోచరిత్ర ఇవే. అప్పుడు కన్నడలో నాకు ఆఫర్ వచ్చింది.
భాష మీకు ఇబ్బంది అవలేదా?
భాషంటే ఇప్పుడు ఒకటండి. కధ, పాత్ర వీటికి భావం ముఖ్యం. మంచి రచయతను దగ్గర పెట్టుకుని, సీన్ చెప్పి, చేస్తాము. మొదటి సినిమాకు అవస్థ పడ్డా, తర్వాత అలవాటు అయింది. కన్నడంలో 7,8 సినిమాలు చేసాను. మలయాళం ఎడిటర్ గా చాలా సినిమా చేసాను. గత 50 ఏళ్ళుగా చెన్నై లోనే ఉంటున్నాను. నాకిక్కడ కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, భాషలు తెలుసు. అన్ని భాషల్లోనూ దాదాపు వంద సినిమాలకు పని చేసాను. ఆ తర్వాత సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారినా నేను అక్కడికి వెళ్ళలేదు.
అప్పట్లో డైరెక్టర్లకు విలువ ఎలా ఉండేది?
అప్పట్లో డైరెక్టర్ అంటే మామూలు కాదు. అన్నీ డైరెక్టర్ చూసుకునేవారు. ఒకప్పుడు హీరో డైరెక్టర్ ఎదుట చేతులు కట్టుకు నిల్చునేవాడే తప్ప కూర్చునేవాడు కాదు. అప్పట్లో ఆ గౌరవం, విలువ ఉండేవి. కధ అంటే మేము ఎన్నో ఆలోచించేవాళ్ళం. జనం కోసం, జనానికి నచ్చే కాన్సెప్ట్ తో, వాళ్లకు ఒక సందేశాన్ని ఇచ్చే, ఉపయోగపడే కధల్ని ఎంచుకుని, ప్రజలకు ఇచ్చేవాళ్ళం. అప్పట్లో రిలీస్ పోస్టర్ల లో కూడా డైరెక్టర్ ఫోటో, సినిమా టైటిల్ మాత్రమే ఉండేవి. రెండో వారం, మూడో వారం ఆ ఆర్టిస్ట్ కి పేరొచ్చిన తర్వాత ఆ ఆర్టిస్ట్ బొమ్మ వేసేవాళ్ళం. అలా పాపులారిటీ తీసుకు వచ్చాము.
చిరంజీవి, రజనీకాంత్ వంటి కొత్త నటులకు నటన అంటే తెలిసేది కాదు. ఇన్స్టిట్యూట్ లో ఓ ఏడాది ఆక్టింగ్ కోర్స్ చేసి వచ్చారు. మేము వీళ్ళని ఎంపిక చేసుకున్నాకా, పాత్రకు తగ్గ నటన రాబట్టుకుని, తీసుకున్నాం.
అప్పట్లో రిహార్సల్ చేసి, చేసి, రోజుకు రెండు సీన్ లు తీసేవాళ్ళం.
హమ్మో, అయితే ఒక సినిమా తీసేందుకు అప్పట్లో ఎన్ని రోజులు పట్టేదండి?
మూడు నెలల్లో సినిమా తీసి, మూడు నెలలు ఎడిటింగ్ చేస్తే, ఆరు నెలల్లో సినిమా రిలీస్ అయ్యేదమ్మా.
ఇన్నాళ్ళ మీ సినీ జీవితంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్తారా?
నేను వచ్చిన కొత్తల్లో బాలచందర్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ అయ్యారు. నాకు తెలుగులో ఆయనంత పేరూ వచ్చింది.  బాలచందర్ గారితో 20 సినిమాలు చేసాను కాబట్టి, పూర్తిగా ఆయన ప్రభావం నాపై నిలిచిపోయింది.ఇండస్ట్రీ లో నా జీవితం ఒక ఎదురీతగా సాగింది. బాలచందర్ గారితో తీసిన సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా, అవుట్ స్టాండింగ్ గా ఉన్న సబ్జక్ట్స్. మీరు గమనించారో లేదో కాని, ప్రతి సినిమా వైవిధ్యమైన అంశాలే డేరింగ్ గా అందించినవే. అన్నింటినీ ప్రజలు ఆదరించారు. అన్నీ కొత్త మొహాలతోనే తీసాము. కేవలం సుబ్జక్టే హీరో. ఇటువంటి సాహసోపేతమైన అనుభవాలతో కూడిన ప్రయాణం నాది.
అప్పట్లో కలకాలం నిలిచిపోయే సినిమాలు తీసారు కదా. వాటి గురించి చెప్తారా?
అంటే, ఆ సినిమాలు తీసి 30, 40 ఏళ్ళు అయ్యినా, ఇంకా అవి అందరికీ జ్ఞాపకం ఉన్నాయి. ఆ సినిమాల ప్రభావం అలాంటిది. ఈ తరానికి నేను తెలుసో లేదో. కన్నడ కి వెళ్ళాకా తెలుగు సినిమాలు తగ్గాయి. ఆ తర్వాత పత్రికల్లో నా పేరు గత 15 – 20 ఏళ్ళుగా రాలేదు. ఊరికే ఇంటర్వ్యూ లు వేసినా, ఫంక్షన్ లలో చిరంజీవి, రజనీకాంత్ నా గురించి చెప్తూ ఉన్నా, ఈ తరానికి నాగురించి తెలీదు.
మరి సినీ పరిశ్రమలో డైరెక్టర్ బేస్డ్ సినిమాల నుంచి హీరో బేస్డ్ సినిమాలు రావడం ఎప్పటినుంచి మొదలయ్యింది?
ఎన్.టి.రామారావు గారు వచ్చి, ఫ్లాష్ పధ్ధతి పెట్టాకా, కొత్త వాళ్లకి థియేటర్ లు దొరికేవి కాదు. డైరెక్టర్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి హీరో ఓరియెంటెడ్ సినిమాలు రావడం మొదలయ్యాయి. సినిమాకు హీరోనే ప్రధానమయ్యాడు. అలా క్రేజ్ ఉన్న హీరోల సినిమాలనే డిస్ట్రిబ్యూషన్ వారు కొనుక్కోవడం జరిగేది. కనుక, ప్రసిద్ధమైన హీరోలను తీసుకుని సినిమాలు తియ్యసాగారు. హీరో డామినేషన్ మొదలయ్యాకా, ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అందరినీ ఎంపిక చెయ్యడం వలన హీరోను బట్టే కధ, సినిమా, ప్రొడ్యూసర్లు, హీరోయిన్ల ఎంపిక జరిగింది. సబ్జెక్టు బేస్డ్ సినిమాలు రావడం తగ్గిపోయింది. హీరోకు నచ్చిందే కధ. ఇప్పటికీ కొత్త మొహాలను పెట్టి సినిమాలు తీస్తే, వ్యాపారం లేక, సినిమా రిలీస్ అవక, థియేటర్లు దొరక్క బాధ పడుతున్నారు.
వచ్చే నిర్మాతలు కూడా కుర్రాళ్ళు, డబ్బు తప్ప వాళ్లకు వేరే ఏమీ తెలీదు. ఇదివరకు నిర్మాతలకు అన్నీ తెలిసేవి. అందుకని హీరో వెనుక వెళ్ళడం, వాళ్లకు డబ్బిచ్చి బుక్ చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇదివరకు బళ్ళు కట్టుకుని, కార్లు వేసుకుని, కుటుంబ సమేతంగా సినిమాలకు వచ్చేవారు. థియేటర్లు నిండిపోయేవి. ఇప్పుడా పరిస్థితి ఎక్కడుంది? కుటుంబ సమేతంగా చిత్రాలు ఎక్కడ చూస్తున్నారు? అదంతా పోయింది. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితిలో ఉంది ఇండస్ట్రీ.
కొత్తవారిని ఎందరినో ఇండస్ట్రీ కి పరిచయం చేసారు కదా ! వారి గురించి చెబుతారా?
కొత్త ఆర్టిస్ట్ లను వాళ్ళను తీసుకోవడం, వాళ్లకు నటన నేర్పడం, అనుకున్నది వారి నుంచి వచ్చే దాకా చేయించడం, ఇలా శ్రమ తీసుకుని సినిమాలు చేసేవాళ్ళం. ఇప్పుడింత శ్రమ ఎవరూ తీసుకోరు. అందుకనే వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద స్టార్స్ అయిపోయారు.
రజనీకాంత్ ను అపూర్వాంగళ్ లో మొదట పరిచయం చేసింది మేమే. అలాగే కమల్ హాసన్ ను అరంగేట్రం అన్న సినిమాతో పరిచయం చేసాము. కమలహాసన్ అరంగేట్రం లో పరిచయం చేసాకా మాతో రెండు సినిమాలు చేసాడు. అలాగే రజనీకాంత్, చిరంజీవి, ప్రమీల, జయచిత్ర, సుజాత (తమిళ అంతులేని కధ), ఆ తర్వాత జయప్రదను తెలుగు అంతులేని కధ సినిమాలో పరిచయం చేసాము. జయప్రద వాళ్ళ నాన్న శ్రీరాం పామ్ గ్రోవ్ హోటల్ లో ఉండి, నా గురించి తిరిగి, తిరిగి, ఒక వేషం అడిగితే నేను అంతులేని కధ సినిమాలో ఒక వేషం వేయించాను. కాని ఆ అమ్మాయి ఎందుకో ఎక్కడా చెప్పదు. అందులో చెల్లెలి పాత్ర లక్కీ గా వెయ్యడం జరిగింది. వీళ్ళు నాలుగైదు సినిమాలు మాతో వరుసగా చేసేవారు. ఓపిక ఉండాలి, వర్క్ తీసుకోవాలి, పాత్రకు న్యాయం జరిగేలా చెయ్యాలి అనే పట్టుదలతో తీసేవాళ్ళం, సక్సెస్ అయ్యేవాళ్ళం. ఆర్టిస్ట్ లు కూడా మాకా విలువిచ్చి కష్టపడేవారు కాబట్టి ఈరోజున గొప్ప స్టార్స్ అయిపోయారు.
షూటింగ్ సమయంలో ఎప్పుడైనా మర్చిపోలేని సంఘటనలు జరిగాయా?
అప్పట్లో నా సినిమాలన్నీ ఆంధ్రా, హైదరాబాద్ లోనే చేశా. ఎక్కడ సినిమాలు తీసినా ఆ ఊర్లలో జనం బాగా సాయపడేవారు. అదీకాక, హరనాధ జోగయ్య గారు ఎం.ఎల్.ఏ కనుక ఇంకా సాయం చేసారు.  పెద్ద చెప్పుకోదగ్గవి అంటే, తెలుగు, తమిళ్ లలో ఒక సినిమా చేసాను. తెలుగులో కృష్ణ గారు చేసారు, మరో పది రోజుల షూట్ ఉందనగా ప్రొడ్యూసర్లు ఎందుకో వెనక్కు తగ్గారు, పూర్తవలేదు. తెలుగు రిలీస్ అవలేదనుకోండి. ‘దిక్కు తెరియద కాటిల్’ – అంటే దిక్కు తెలియని అడవి అని అర్ధం. జయలలిత, ముత్తురామన్ అందులో హీరో హీరొయిన్లు. సబ్జెక్టు ఏమిటంటే, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక కుటుంబం మధ్యన అడవిలో జరిగే సంఘటనలు ఈ సినిమా నేపధ్యం. అది దట్టమైన బందీపూర్ అడవుల్లో చేసాము. అక్కడ భయంకరమైన ఏనుగులు, కొండచిలువలు కళ్ళ ముందే ఎన్నో ఉండేవి. మూన్నెల్లు షూట్ చేసాం. ఈ మధ్యలో ఓ పది సార్లు నేను చావు తప్పించుకున్నా. ఉన్నట్టుండి, చెట్టు మీంచి ఒక పాము దూకి, కరిస్తే... దానికి మందే లేదు. అలాగే కొండ చిలువలు రోడ్డు మీద అలా పోతుండేవి. మసలపూడి అని బందీపూర్ అవతల దట్టమైన అడవులవి. ప్రాణాలు పోవాల్సిన రిస్క్ చేసాము. అప్పుడే నా ఆయుష్షు అయిపోవాల్సింది, ఎలాగో తప్పించుకున్నాను. మా యూనిట్ లో ఒక ప్రొడక్షన్ మేనేజర్ పోయాడు పాపం. ఇలా ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
మీరు మర్చిపోలేని ప్రశంస కాని , అవార్డుకాని ఏమైనా ఉన్నాయా?
బాలచందర్ గారితో నా అనుబంధం ఎలా ఉండేదంటే, ప్రతి సినిమాలో నాకు నచ్చని సీన్ ఏమైనా ఉంటే సెట్లో ఆయనతో పోట్లాడే వాడిని, పోట్లాడి మార్పించే వాడిని. కొన్ని ఒప్పుకోకుండా నన్ను ఇగ్నోర్ చేసి తీసినవి జనంలోకి వెళ్ళాకా ఫెయిల్ అయ్యి, జనం నుంచి అవే రిపోర్ట్స్ వచ్చి, ఇటువంటివి జరిగాకా ఆయన తన తప్పు తెలుసుకుని, నా మీద ఎక్కువ నమ్మకం పెంచుకున్నారు. సబ్జెక్టు విషంలో కాని, సీన్ విషయంలో కాని ఆయనతో ఆయన రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడిని.  ఆయన కూడా మేధావి కాబట్టి, నన్ను డామినేట్ చేస్తున్నాడేమో అన్న ఇగో తో నా సలహా తోసిపుచ్చి, తర్వాత తెల్సుకుని, నాపై గొప్ప నమ్మకం పెట్టుకున్నారు. ఆయన మూడు కన్నడ సినిమాలు చేసారు. అంతులేని కధ కన్నడ లో సుహాసినితో మొదలుపెట్టాకా, ఆ సినిమా నాకు వదిలేసి వచ్చేసారు. అంటే నా మీద ఎంత నమ్మకమో ఊహించవచ్చు. 200 రోజుల పైన ఆడింది. సరిత తో కలక్టర్ జానకి సినిమా కన్నడంలో చేసాను. అదీ నాకే వదిలేసారు కాని, పేరు ఆయనదే ఉండేది. అంత నమ్మకం నా మీద. తద్వారా నాకు విడిగా సినిమాలు రాసాగాయి. నేను విడిగా కధ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గా మూడు సినిమాలు చేసాను. మా అనుబంధం ఎలాంటిది అంటే, ఆయన అంత గొప్ప డైరెక్టర్ అయినా, నా మాటకు విలువ ఇచ్చేవారు. చాలా మంది స్టాఫ్ నాకు వ్యతిరేకంగా ఉండేవారు. చాడీలు చెప్పేవారు. అయినా నన్ను ఆయన వదలలేదు.
అవార్డు వచ్చినప్పుడు బాగా సంతోషించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఏదైనా కష్టపడి సినిమా తీసినప్పుడు, అది హిట్ అయినప్పుడు, అది నాకే కాక, జనానికి కూడా నచ్చి, మెచ్చినప్పుడు అది అవార్డు కంటే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
ఉదాహరణకు నాకు బంగారు నంది తెచ్చిపెట్టిన చిలకమ్మ చెప్పింది సినిమానే తీసుకుందాం. ఒక పనిమనిషి పట్నావాసంలో ఒక లక్షాధికారి ఇంట్లో పని చేసేందుకు వస్తుంది. అక్కడ అక్కా, తమ్ముడు ఉంటారు. ఆ పిల్ల పల్లెటూళ్ళో ఉండగానే చిలక జోస్యం చెప్పించుకుంటుంది. అప్పుడు చిలక ‘నీకు స్థలమార్పు జరుగుతుంది. మంచి యోగ్యుడు, సకల గుణ సంపన్నుడు నీకు భర్తగా వస్తాడు అని చిలక చెప్తుంది. ఆ మాటలు ఆ పిల్లకు మనసులో ముద్రించుకు పోతాయి. దానికి తగ్గట్టుగానే తను పట్నం వెళ్ళడం, అక్కడున్నప్పుడు చిలక చెప్పిన యోగ్యుడైన  లక్షాధికారి కుర్రాడు ఇతడేనా అన్న ధ్యాసలో ఆమె ఉండడం జరుగుతుంది. అలా ఉంటూ ఉండగానే ఆ కుర్రాడు వాళ్ళ అక్క లేనప్పుడు అమ్మాయిని అనుభవిస్తాడు. ఆమె గర్భవతి అవుతుంది, ఆ కుర్రాడు ఆమె గర్భానికి తనే కారణమని ఎవరికీ చెప్పద్దని ప్రమాణం చేయించుకున్నాడు. అక్క ఈ పనిమనిషిని బయటకు తరిమేస్తుంది. ఒక చెవిటి పనివాడు హీరొయిన్ కు ఆశ్రయమిచ్చి ఈమెను పోషిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఓ బిడ్డ పుట్టాకా, అక్కగారికి సత్యం తెలిసి, తల్లిని, బిడ్డని తెచ్చుకుందామని వెళ్తుంది. ఆ పిల్ల పనివాడినే కట్టుకుంటానని తిరస్కరిస్తుంది. ‘నా యవ్వనం చూసి ఆశపడే భర్త కాదు నాకు కావాల్సింది, నన్ను ప్రేమగా చూసుకునే ఈ చెవిటివాడే నా భర్త, ఇదే నా ఇల్లు’ అంటుంది. ఒక ఆడదానికి ఎటువంటి భర్త ఉంటే సుఖపడుతుందో చెప్తుంది. అలా నిర్ణయం తీసుకున్నప్పుడు జనం ఒప్పుకుంటేనే అది సక్సెస్ అవుతుంది. అలా జనం కన్విన్స్ అయ్యేలా చేస్తే, వాళ్ళు క్లైమాక్స్ కి చప్పట్లు కొట్టారు.
ఇలాంటి హెవీ రిస్క్ ఉన్న సినిమాలు చేసాను. నాలాగ ఎందరో కూడా ఇలాంటిదే. కుక్కకాటుకు చెప్పుదెబ్బ సినిమాలో బడిపంతులు కూతురుకు ఒక లక్షాధికారి సంబంధం వస్తుంది. వీళ్ళ ఇంటి ఎదురుగా ఉండే ఒక రిటైర్డ్ జడ్జి మనవడు ఈ అమ్మాయిని పాడు చేస్తాడు. వారం రోజుల్లో పెళ్లి ఉన్న అమ్మాయికి ఇలా జరిగినప్పుడు, ఆ జడ్జి గారు కోప్పడితే, మనవడు ‘నేను పెళ్ళిచేసుకుంటా’ అంటాడు. పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లను చెరిచి చేసుకోవాలా? వాడిని శిక్షించే పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో ఆ పిల్ల ‘ఆడదానికి శీలం ప్రాణంతో సమానం, నా ప్రాణంతో సమానం, నా ప్రాణం నువ్వు తీసుకున్నావు, నీ ప్రాణం నేను తీసుకుంటున్నా,’ అని అర్ధరాత్రి అతన్ని పొడిచేస్తుంది. ఇది 79 లో జనం ఒప్పుకోలేక పోయారు. నాకు మంచిపేరు వచ్చింది, సినిమా బానే ఆడింది. ఇలా సినిమాల్లో రిస్క్ తీస్కుని, ప్రజల చేత ఒప్పించి తీశాను. ఇటువంటి సినిమాలు తియ్యడం నాకు ఎంతో తృప్తిని కలిగించింది.

గతకాలపు సినీ వైభవం గురించి ఎన్నో మంచి మంచి సంగతులు చెప్పిన శర్మగారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటోంది – అచ్చంగా తెలుగు.


No comments:

Post a Comment

Pages