ప్రేమతో నీ ఋషి – 33 - అచ్చంగా తెలుగు
 ప్రేమతో నీ ఋషి33
-      యనమండ్ర శ్రీనివాస్

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది.  ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో తాము కొన్న పెయింటింగ్ నకిలీదని  చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. మృణాల్ నకిలీ గిల్సీ పెయింటింగ్ ను కొన్నాడని తెలుసుకుని, అది నిర్ధారించేందుకు ఆఫీస్ కు వెళ్లిన స్నిగ్ధకు అక్కడ  మృణాల్ శవం కనిపిస్తుంది  స్నిగ్ధ ఆఫీస్ భూగర్భ గదిలో పెయింటింగ్స్ నకళ్ళు తయారుచేసే కర్మాగారం ఉందని తెలుసుకున్న ఋషి, మరిన్ని వివరాల కోసం అప్సరను ఇంటికి వెళ్లి, అక్కడ మృణాల్, అప్సరను ఎవరో కాల్చి చంపడం చూస్తాడు ఋషి. తమ చుట్టూ ఎవరో ఉచ్చు బిగిస్తున్నారని తెలుసుకున్న ఋషి, అప్సర ఏం తోచక, ఒకరి కౌగిలిలో మరొకరు సాంత్వన పొందుతూ టీవీ చూస్తుంటారు. ఇక చదవండి...)
“టీవీ లో వస్తున్నప్రోగ్రాం కూడా ప్రేమ గురించే అనుకుంటాను కదూ?” స్నిగ్ధ కళ్ళు తెరవకుండానే ఋషిని అడిగింది.
“కాదు అది ‘లవ్ మ్యుజియం’ గురించి, ఋషి టీవీ వంక చూడకుండానే చెప్పాడు. అతను ‘డా విన్సి కోడ్’ సినిమాలో వాడిన మ్యుజియం గురించి వ్యాఖ్యాత ఇచ్చే వివరణను వింటున్నాడు.
“పారిస్ లోని ‘లొవెర్ మ్యుజియం’ప్రపంచంలో అతి పెద్దది, విశ్వవ్యాప్తంగా ఉన్న సందర్శకులను ఆకట్టుకునేది. ఇందులో 3,80,000 కంటే ఎక్కువ చిత్రాలున్నా, కేవలం  35,000 చిత్రాలనే ప్రదర్శనకు ఉంచారు. వీటిని అత్యంత జాగ్రత్తగా భద్ర పరిచారు. ఈ మ్యుజియం లోపల  ‘డా విన్సి కోడ్’ అనే సినిమాను తీసేందుకు అనుమతిని ఇవ్వకపోవడంతో ఈ చిత్రాలు అన్నింటినీ తిరిగి గీయించాల్సి వచ్చింది. “వ్యాఖ్యాత చెప్పుకుంటూ పోతున్నాడు.
‘డా విన్సి కోడ్’ ను గురించిన సమాచారం హఠాత్తుగా వారిద్దరినీ స్పృహలోకి తెచ్చింది. వారిద్దరూ ఈ విపత్తు నుంచి బయట పడాలంటే ఇంకా చెయ్యల్సింది చాలా ఉందని గుర్తుకొచ్చి బెడ్ దమీంచి దూకారు.
ఈలోగా టీవీ లోని వ్యాఖ్యాత ఆ సినిమా తియ్యడంలోని డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీని గురించి చెప్పసాగాడు.  తాజా సాంకేతికతను ఉపయోగించి, ఎన్నో చిత్రాలను సృష్టించి, ఈ సినమా కోసం కొత్త మ్యుజియంను నిర్మించారు. నిజానికి, దీని ద్వారా చెప్పేది ఏమిటంటే, డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఒక పూర్తి నకిలీ మ్యుజియంను సృష్టించారట.
“ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం కూడా భవిష్యత్తులో ఇటువంటి నకిలీ మ్యుజియం అవ్వబోతోందా?” ఈ ప్రశ్న ఋషి, స్నిగ్ధ ఇద్దరి మనస్సులో ఉదయించింది. మరికొద్ది క్షణాల్లో వారి ఆలోచనలు క్రమంగా నమ్మకంగా మారసాగాయి.
***
“ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా చేసిన పెద్ద మోసం. ఈ కార్య నిర్వహణ గురించి ఎవరూ ప్రశ్నించలేరు. మామూలు మార్గంలోనే చిత్రాలు కొనబడతాయి, డబ్బు కూడా సాధారణ మార్గాల్లోనే కట్టబడుతుంది. మొదట ప్రభుత్వం ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం కు డబ్బు కడుతుంది, ఆ తర్వాత మ్యుజియం వారు చిత్రాలు తమకు అమ్మినవారికి డబ్బు కడతారు. కాని, ఆ పెయింటింగ్ ను మ్యుజియం కోసం పంపే ముందు డిజిటల్ మార్గాల ద్వారా ఒక నకిలీ కాపి తయారు చెయ్యబడుతుంది. అప్పుడు అసలు పెయింటింగ్ ను ఆర్ట్ సేకరణ దారులకు రహస్య మార్గాల ద్వారా అమ్ముతారు. ఆ డబ్బు వివిధ స్విస్ బ్యాంకు అకౌంట్ లకు బదిలీ చెయ్యబడుతుంది. ఈ లావాదేవీలు కూడా అధికారికమైనవే, ఎందుకంటే అసలు పెయింటింగ్ ను కొనుగోలు దారుడికి అధికారిక పత్రాలతో సహా అమ్ముతారు కనుక. కాని, చివరికి, మ్యుజియం కోసం ఇండియా కు పంపే పెయింటింగ్ మాత్రం అసలు చిత్రం తాలూకు డిజిటల్ పెయింటింగ్ అయ్యి ఉంటుంది. ఒక విధంగా, కొత్త కళాఖండాల సేకరణ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది, కాని ఆ డబ్బు ఇండియా బయట నివసించే ఆర్ట్ సేకరణదారుల స్విస్ బ్యాంకు అకౌంట్లకు చేరుతోంది. ఈ ప్రక్రియలో హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ అంతా నకిలీ ప్రాజెక్ట్ గా తయారౌతోంది.”

ఋషి మొత్తం కుట్రనంతా క్లుప్తంగా మిష్టర్ శర్మ కు చెప్పాడు. ఆయన ఉదయాన్నే మహేంద్ర అభ్యర్ధనపై మాంచెస్టర్ కు వచ్చారు. ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం కి సంబంధించిన మాంచెస్టర్ లోని రికార్డులు అన్నింటినీ పరిశీలించే బాధ్యత, ఎకౌంట్లు అన్నీ సరిచూసే బాధ్యతను ఆయనకు అప్పగించారు.
కొన్ని రోజులుగా తాము సేకరించిన సమాచారాన్ని బట్టి, ఋషి, స్నిగ్ధ జరిగిన సంఘటనలను కలుపుతూ వివరించసాగారు. మొదట, వారు జరిగినవన్నీ నేరుగా మహేంద్ర కే చెప్దామని వారు భావించారు. కాని, సగం సమాచారంతో నేరుగా రంగంలోకి దూకడం వారికి ఇష్టం లేదు. మ్యుజియం లెక్కలను చూసేందుకు మిష్టర్ శర్మ నమ్మకంగా పంపబడ్డారు కనుక, ఆయనకే మొత్తం వాస్తవాలను తెలుపడం మంచిదని వారు భావించారు.
“హమ్...” అంటూ నిట్టూర్చి, తీవ్ర ఆలోచనలో మునిగిపోయారు ఆయన. హైదరాబాద్ నుంచి ముంబైకి, ముంబై నుంచి లండన్ కి, లండన్ నుంచి మాంచెస్టర్ కి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేసారు. నిజానికి, ఆయనకు జెట్ లాగ్ వస్తుందని ఆయన అనుకున్నారు. కాని, ఋషి, స్నిగ్ధ వెంటనే కలవాలని ఒత్తిడి చెయ్యడంతో ఆయన బ్రేక్ఫాస్ట్ ముగియగానే వారిని కలిసారు.
“ఈ ప్రాజెక్ట్ లో మీరిద్దరూ పెట్టిన ప్రయాసకు నేను మిమ్మల్ని అభినందించి తీరాలి. మహేంద్ర కూడా మెచ్చుకుంటారు. అయితే ఒక విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాజకీయ మూలాల్ని కదిపే శక్తి ఈ స్కాం కు ఉందంటారా?” ఆయన తన సహజ స్వభావం ప్రకారం నెమ్మదిగా అడిగారు.
“స్నిగ్ధ, కాసేపు బయటకు వెళ్ళగలవా?” ఆయన మర్యాదగా అభ్యర్ధించారు. ఎందుకో తెలియకపోయినా, ఆయన విన్నపం త్రోసిపుచ్చలేక, స్నిగ్ధ బయటకు వెళ్ళిపోయింది.
శర్మ గారు ఋషి వంక తిరిగి, “ఋషి,  ఈ మోసానికి సంబంధించి మీరు చెప్పిందంతా అత్యంత నమ్మదగిన వివరణ అని, ఇదే నిజమవ్వచ్చని నేను భావిస్తున్నాను.” అన్నారు.  ఋషి అంగీకార సూచకంగా తలూపాడు. ఈ విషయం గురించి శర్మ గారు వెంటనే స్పందించి, మహేంద్రను కలవాలని అతడు కోరుకుంటున్నాడు.
“ఇదంతా నిజమే అని నమ్ముదాం, అయితే, మృణాల్, అప్సర ఆ డబ్బంతా సొమ్ము చేసుకుని ఉంటే, అదంతా వాళ్ళంతట వాళ్ళే చేసి ఉంటారంటావా ? వేరెవరూ సాయం చేసి ఉండరంటావా ?” అని శర్మ గారు అడిగారు.
ఋషికి ఆయన మాటల్లో ఏదో తేడా కనిపించింది. అంటే శర్మ గారికి కూడా ఇందులో భాగం ఉందా? ఆయన ప్రశ్న ఏం సూచించిందో వెంటనే ఋషికి అర్ధం కాలేదు. ఈ కుట్ర తాలూకు రహస్యాన్ని ఛేదించామని, గత రాత్రి స్నిగ్ధ, అతను పొందిన ఆనందమంతా క్షణాల్లో ఆవిరైపోయింది, అప్సర, మృణాల్ ల చావుల వెనుక ఉన్న రహస్యం ఇంకా తెలియకపోయినా, కాస్తైనా అర్ధమయ్యిందని అతను భావించాడు.
“ఋషి, ఒక్క క్షణం రిలాక్స్ అయ్యి, తెలివిగా ఆలోచించు. ఇటువంటి కుట్ర ఎవరైనా దీన్ని ప్రతి అడుగు ప్లాన్ చేస్తే తప్ప చెయ్యడం కుదరదు. అవునా కాదా? ఉదాహరణకు, పర్యాటక మంత్రాంగానికి రూ.500 కోట్ల మోసం జరుగుతున్నట్టు, నిధులు పక్కదారి పడుతున్నాయని, తెలీదంటావా? ఇవన్నీ పర్యాటక మంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయని నువ్వు భావిస్తున్నావా?” అడిగారు శర్మ గారు.
“ నాకేమీ అర్ధం కావట్లేదు శర్మ గారు. నాకు మీరు చెప్పదల్చుకున్నది మరింత సూటిగా చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.” ఋషి శర్మ గారితో అన్నాడు. శర్మ గారి మాటలు అతడిని గందరగోళానికి గురి చేసాయి. ఆయన తమ పక్షాన మాట్లాడుతున్నారో, లేక మృణాల్, అప్సరలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారో అతనికి తెలియట్లేదు.
“ఋషి, నీకు మొత్తం కధను చెప్తా విను. ఇది హైదరాబాద్ రాజకీయాల్లో చాలా సంక్లిష్టమైన అంశం. పర్యాటక మంత్రి రాష్ట్ర ఆర్ధిక మంత్రికి బాగా దగ్గరవాడు. బల్ల క్రింద నుంచి ఆర్ధిక మంత్రి నడిపిన వ్యవహారాలన్నీ పర్యాటక మంత్రి ద్వారానే జరిగాయి. ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం నెలకొల్పాలన్న ఆలోచనే పర్యాటక మంత్రిదని నువ్విక్కడ గుర్తు పెట్టుకోవాలి. ఇంకా స్పష్టంగా నీకు చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం వారి డబ్బును స్విస్ బ్యాంకు ఖాతాల లోకి మార్చాలనేదే !” శర్మగారి స్వరం తీవ్రంగా ఉంది. ఋషికి కొత్త విషయాలు తెలిసాయి, వాటినింకా అతను జీర్ణం చేసుకోలేక పోతున్నాడు.
“కాని నిర్వాణ ప్లస్, మహేంద్ర లకు వీటన్నిటితో ఏం సంబంధం?” ఉత్సుకతతో అడిగాడు ఋషి.
“నువ్వు నిర్వాణ ప్లస్ ప్రగతిని చూసినట్లయితే, గత కొన్నేళ్లుగా అది అనూహ్యంగా ఎదిగింది. ఇదంతా మహేంద్రకు ఉన్న రాజకీయ పరపతి వల్లనే జరిగింది. నిర్వాణ ప్లస్ ప్రాజెక్టులు అన్నీ ప్రభుత్వం నుంచి వచ్చినవే – అవి కంపెనీ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ప్రాజెక్టులైనా, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులైనా సరే! ప్రభుత్వంలో అత్యున్నత వర్గాలతో లావాదేవీలు జరిపితే తప్ప, ఇటువంటివి చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఇంతకు ముందు ఇటువంటి వ్యవహారాలకు ఇచ్చే కానుకలు రియల్ ఎస్టేట్ రూపంలో ఉండేవి, దీన్ని నిర్వాణ ప్లస్ తన అనుబంధ సంస్థ ద్వారా మానేజ్ చెయ్యగలిగింది. కాని, రియల్ ఎస్టేట్ అనూహ్యంగా పడిపోవడంతో ఈ మంత్రులంతా నేరుగా డబ్బునే డిమాండ్ చేసారు, ఈ డబ్బును ఎటువంటి ప్రశ్నలూ వెయ్యకుండా ఇచ్చి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో నిర్వాణ ప్లస్ కూడా కొన్ని వివాదాలను ఎదుర్కుంటున్నందువల్ల పరిస్థితి విషమంగా తయారయ్యింది. ఒకవేళ తీర్పులు కంపెనీ కి విరుద్ధంగా వస్తే, వారి వ్యాపారానికి, దానిపై ఆధారపడి ఉన్న సంఘానికి కూడా అది పెద్ద దెబ్బ అవుతుంది. ఇక మిగిలున్న ఒకేఒక్క ఆశ – స్థానిక ప్రభుత్వాల సాయంతో మహేంద్ర అంతర్జాతీయ స్థానాల్లో అరెస్ట్ కాకుండా చూడడం. అందుకే ఈ కోరికలన్నీ నేరవేరాలి. చూడు, ఇదంతా లావాదేవీల  సంక్లిష్ట వలయం లాంటిది. “ అన్నారు శర్మ గారు.
(సశేషం)


No comments:

Post a Comment

Pages