శివం -33 - అచ్చంగా తెలుగు
శివం -33
శివమ్మ కధ -9
రాజ కార్తీక్ 

(శివమ్మ భక్తికి శివయ్య కరిగి ఆమె ఇంటికి కొడుకు లాగా వస్తాడు ,సాధారణమైన మనిషి లాగా  ఆమెతో ఉంటాడు. నంది శివయ్య తనకి పాయసం ఇవ్వలేదు అని అలుగుతాడు ,నంది అలిగాడని మహాదేవుడు పాయసం కోసం పిలుస్తాడు ,నందికి, నాగారాజుకి, భ్రుంగికి పాయసం ఇస్తాడు మహాదేవుడు. ఇక శివయ్య కోసం భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది శివమ్మ.)
శివమ్మ "ఎందుకు శివయ్య తినవు ? "అనడిగింది.
నంది కి భృంగి కి నాగరాజు కి ఏంటో అర్ధం కావట్లేదు ...అటు చూస్తే విష్ణు దేవుడు కి బ్రహ్మ కి , మతలకు కూడా అర్ధం కావట్లేదు.
నేను "పో అమ్మ, ఎప్పుడూ నేనే తింటా కదా! ఈసారికి నువ్వు నాకు గోరు ముద్దలు పెట్టు "అన్నాను.
శివమ్మ "అంతకన్నానా శివయ్య,  కోరిన వరం అడగకుండా ఇచ్చే వాడివి, నువ్వడిగితే కాదంటానా?  " అంది ఆనందంగా.
నేను "అమ్మ, నాకు అన్నం పెట్టు అమ్మా. నాకు వేరేవారి దిష్టి తగలకుండా చూడు " అన్నాను.
నంది కి భృంగి కి నాగరాజుకి కోపం వచ్చింది.
నంది "ఏంటి స్వామి మేము ఎందుకు దిష్టి పెడతాం ..." అనడిగాడు కోపంగా.
నేను "ఏమో....అమ్మా, అమ్మ వీళ్ళు ఇక్కడే చూస్తారు కానీ ..పై నుండి మరి కొంత మంది చూస్తున్నారు , వారి దిష్టి తగలదూ, వామ్మో .. " అన్నాను సరదాగా. 
ఇక చూడండి విష్ణు దేవుడు ఐతే నోటి వెంట మాట రాలేదు. బ్రహ్మ దేవుడికి  ఏ తల తిప్పుకోవలో అర్ధం కావట్లేదు. లక్ష్మి మాత మాత్రం, నవ్వుతోంది. పార్వతి మాత చిరు కోపం తో చిర్రుబుర్రులాడుతోంది.
లక్ష్మి మాత "మహాదేవుల వారు భలే వినోదమైన పనులు చేస్తారు "అంది.
పార్వతి  మాత " చూడు సోదరా, మనం దిష్టి పెట్టే వారమట " అని షికాయతు చేడింది.
విష్ణు దేవుడు "మహాదేవుడు మహా తుంటరి సుమీ " అన్నాడు.
నేను "అమ్మా, ఇప్పుడే పాయసం‌ తాగాననుకొని ఆకలి లేదు అనుకుంటున్నా వేమో, తొందరగా తీసుకురా." అన్నాను.
శివమ్మ "అలాగే శివయ్య, వెంటనే తెస్తా "అంది.
శివమ్మ అటు వెళ్తూ వెళ్తూ ఒకసారి శివయ్య నవ్వుని చూసింది.
శివయ్య మాత్రం ఆకలి అంటూ పొట్ట వైపు చిన్నపిల్లలు వలె సైగ చేసాడు. 
నేను "అమ్మా,  అసలు రుచి  కరమైన భోజనం చేసి చాలారోజులు అయ్యింది." అన్నాడు.
పార్వతి మాత ఐతే ఇంకా కోపంలో ఉంది.
పార్వతి మాత "చూడు సోదరా ! ఎక్కడ ఉన్నా వెతికి వెతికి స్మశానంలో ఉన్నా సరే, పట్టుకుని వండి వడ్డించి నందుకు  చూడు ఎలా అంటున్నారో మహాదేవుడు " అంది బుంగమూతి పెట్టి.
శివమ్మ "శివయ్యా, దిష్టి పెట్టే వారని ఎవర్ని అన్నావు నువ్వు " అనడిగింది.
నంది "ఇంకెవర్ని అమ్మా,  మాతని "అన్నాడు. 
శివమ్మ "శివయ్య ఏంటయ్యా అలా అంటావ్ ? మా మాత లేకపోతే ఎలా ? ఆమె కాదు అన్నపూర్ణేశ్వరి. ఆమె ప్రసాదమే కదా  అంతా. ఎన్ని చెప్పినా నువ్వు మాత్రం మాత ని వెక్కిరించకు  శివయ్య " అంది.
నేను "అంతేలే పోవమ్మ,  నువ్వు కూడా  మీ పార్వతి మాత తరుపున మాట్లాడతావ్ ,నా తరుపు వారు ఎవరు లేరు "అన్నాను.
పార్వతి మాత మొహం వెలిగిపోతోంది. ఆమె తిరిగి నవ్వుతోంది.
శివయ్య తక్కువ వాడా, ఆమె నవ్వును చూసి మురిసిపోతున్నాడు.
వంట సిద్దం చేసిన శివమ్మ వంట గదిలో కి వెళ్లి, శివయ్య కు అన్నం పెట్టటానికి చూస్తోంది.
కానీ శివమ్మ దగ్గర ఒక కంచం మాత్రమే ఉంది.  అది తనది. నైవేద్యం పెట్టే కంచం చాలా చిన్నది. ఎలా అని సంకటంలో పడింది.
నేను "అమ్మా ఆకలిగా ఉంది. నీ కంచంలో పెడితేనే నేను తింటా, సరేనా " అన్నాను బిగ్గరగా.
అందరూ ఒకటే నవ్వసాగారు.
శివమ్మ అన్నం కలిపి నెయ్యి వేసింది.అబ్బ, ఆ వాసనకి అందరూ పరవశులయ్యారు.
విష్ణు దేవుడు "అబ్బ ఆ పాయసం, కన్నా ఈ వంట ఇంకా బాగుంటుంది .ఎలా తినాలి .." అన్నాడు.
పార్వతి  మాత "సోదరా నేను చేసి పెడతాగా.." అంది.
విష్ణు దేవుడు "తమరు చేసింది అద్భుతం సోదరి..కాని " అని ఆగాడు.
పార్వతి , లక్ష్మి  మాతలు "తమరు కూడా మహాదేవుడు అంతటివారు. తమరికి కూడా ఆ గోరు ముద్దలే కావాలి కదూ" అన్నారు ఉడికిస్తూ.
శివమ్మ ఆనందం అంతా ఇంతా కాదు.
నేను ఒక ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్నా.
నేను "ఆకలి అమ్మా "అన్నాను మరోసారి.

నేను "అయ్యయ్యో బుజ్జమ్మ, ఇన్నిసార్లు ఆకలి అనలా, త్వరగా పెట్టవా" అన్నాను.
శివమ్మ ఊయల దగ్గరకు వచ్చి నించుంది.
వెనక్కి  ముందుకి ఊయలలో ఉగుతున్న నేను వెంటనే నోరు తెరిచా,  ముద్ద పెట్టమని.
శివమ్మ తను ముద్ద కలిపి సిద్దం చేసింది.
ఇక శివయ్య తిండమే ఆలస్యం.
విష్ణువు, బ్రహ్మ,  మాతలు ,దేవతలు అందరికి, నందికి ,భృంగికి ,నాగరాజుకి ఒకటే మాట తోస్తోంది.
"ఇది కదా మహా నివేదన అంటే" 
అందరు నాకు  నమస్కారం చేస్తున్నారు.

నేను నవ్వుతూ అందర్నీ ఆశీర్వదించాను. 
శివమ్మ వెంటనే శివయ్య నోటిలో పెట్టింది ఒక కమ్మని ముద్ద.
నేను "అమ్మ ఏంటి ...?"అన్నాను.
.....(సశేషం ) 

1 comment:

Pages