శ్రీరామకర్ణామృతం -25
సిద్ధకవి
డా.బల్లూరి ఉమాదేవి.
తృతీయాశ్వాసం.
21శ్లో.:రుచిర మణికిరీటం సుందరభ్రూలలాటం
కనక రుచిర చేలంకాశ సద్భోగ ఖేలమ్
విమల జలద నీలం కుండలోద్భాసికర్ణం
రఘుకులజ రత్నం సంతతం చింతయామి.
భావము:సుందరమగు మాణిక్య కిరీటము కలిగినట్టియు సొగసైన కనుబొమలు లలాటము కలిగినట్టియు బంగారుచే సొగసైన బట్ట కలిగినట్టియు శేషుని దేహమందు విహరించుచున్ఙట్టియు నిర్మల మేఘమువలె నల్లనైనట్టియు కుండలములచేయ ప్రకాశించునట్టి కర్ణములు కలిగినట్టియు రఘువంశ మనుష్యులలో శ్రేష్ఠుడైన రాముని ఎల్లపుడు సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
చ:సురుచి మణికిరీటు నతి సుందర భవ్య లలాటు గాంచన
స్ఫురిత విశాలచేలు ఫణి పుంగవ భోగవిభోగ ఖేలు గం
ధర నిభనీలు సన్మణి వితాన విరాజిత కుండల ద్వయున్
సరసిజ మిత్ర వంశమణి సంతతమెంతు హృదంతరంబునన్.
22శ్లో:శ్రీవత్సాంక ముదార కౌస్తుభ లసత్పీతాంబరాలంకృతం
నానారత్న విరాజమాన మకుటం నీలాంబుద శ్యామలమ్
కస్తూరీఘనసార చర్చిత తనుం మందార మాలాధరం
కందర్పాయుత సుందరంరఘుపతిం సీతాసమేతం భజే.
భావము:శ్రీవత్స చిహ్నము గలిగినట్టియు గొప్పకౌస్తుభముచే ప్రకాశించుచున్న పీతాంబరము చేత నలంకరించ బడినట్టియు బహురత్నములచే ప్రకాశించుచున్నట్టి కిరీటము కలిగినట్టియు నల్లని మేఘము వలె నల్లనైనట్టియు కస్తూరిచేతను కర్పూరము చేతను బూయబడిన దేహము గలిగినట్టియు మందారమాలికను ధరించినట్టియు బహుమన్మథులవలె సుందరుడైనట్టియు సీతతో గూడిన శ్రీరాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
మ:వనద శ్యామల దివ్యవిగ్రహుని శ్రీవత్సాంకు బీతాంబరున్
ఘనసారాంత మృగీఈ మదాంచితులసత్కందర్ప సౌందర్యు గాం
గన రత్నోజ్జ్వల సత్కిరీటు విబుధక్ష్మాజ స్రజున్ సంస్మితా
నను సీతాయుతు గౌస్తుభద్యుతి జగన్నాథున్ మదిన్ గొల్చెదన్.
23శ్లో:యన్నామైన సహస్రనామ సదృశం యన్నామ వేదైస్సమం
యన్నామాంకిత వాక్యమాసుర బల స్త్రీగర్భ విచ్ఛేదనమ్
యన్నామ శ్వపచార్య భేదరహితం ముక్తి ప్రదానోజ్జ్వలం
తన్నామాలఘు రామరామ రమణం శ్రీరామ నామామృతం.
భావము:ఏపేరు సహస్రనామములతో సమమో యేపేరు వేదములతో సమమో యేపేరుతో నలరించబడిన వాక్యము రాక్షస స్త్రీ గర్భములను ఛేదించునో యేపేరు చండాలురు యోగ్యులు నను భేదము లేనిదై ముక్తినిచ్చునో నట్టి ప్రసిద్ధమైన,గొప్పది యగునట్టి మిక్కిలి మనోహరమైన వానిలో సంతోషకరమైన రామనామామృతమును తలంతును.
.
తెలుగు అనువాదపద్యము:
ఉ:ఏ విభు పేరు వేదసమమెన్న సహస్ర సమాఖ్య సన్నిభం
బే విభునామ కీర్తన రహిన్ దనుజాంగన గర్భ భేదనం
బే విభునామ మెన్నగ మహిన్ శ్వపచార్య విభేద వర్జితం
బేవిభు పేరు ముక్తిదమదెంతు సుధాసమ రామనామమున్.
24శ్లో:రామం రాక్షస మర్దనం రఘువరం దైతేయ విధ్వంసినం
సుగ్రీవేప్సిత రాజ్యదం సురప తేర్భీత్యంతకం శారజ్ఙిణమ్
భక్తానామభయప్రదం భయహరం పాపౌఘ విధ్వంసినం
సామీరిస్తుత పాదపద్మ యుగళం సీతాసమేతం భజే.
భావము:రాక్షసులను మర్ధించునట్టియు రఘువంశ శ్రేష్ఠుడైనట్టియు దితిపుత్రులైన వివిధ రాక్షసులను నశింప జేయునట్టియు సుగ్రీవునకిష్టమైన రాజ్యము నిచ్చునట్టియు ఇంద్రుని భయము తొలగించినట్టియు శారజ్ఞ ధనుస్సు గలిగినట్టియు భక్తుల కభయమిచ్చునట్టియు భయమును హరించునట్టియు పాప సముదాయమును పోగొట్టునట్టిదియు ఆంజనేయునిచే స్తోత్రము చేయబడిన పాదపద్మ ద్వంద్వము కలిగినట్టియు సీతతో కూడిన రాముని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:రవిపుత్రేప్సిత రాజ్యదున్ రఘువరున్ రక్షఃకుల ధ్వంసకున్
దివిజాధీశ్వర భీతిసంహరు శ్రితార్తిఘ్నున్ మహాపాప వ
ర్గ వినాశున్ ధరణీసుతా సహితు శ్రీరామున్ బరంధామునిన్
బవమానాత్మజ సేవితాంఘ్రికములున్ భావింతురశార జ్ఞన్ హరిన్.
25శ్లో:రామం రక్తసరో రుహాక్ష మమలం లంకాధినాథాంతకం
కౌసల్యానయనోత్సుకం రఘువరం నాగేంద్ర తల్పస్థితం
వైదేహీ కుచకుంభ కుంకుమ రజోలంకారహారం హరిం
మాయామానుష విగ్రహం రఘుపతిం సీతాసమేతం భజే.
భావము:ఎఱ్ఱ తామరలవంటి నేత్రములు కలిగినట్టియు నిర్మలుడైనట్టియు రావణునికి యముడైనట్టియు కౌసల్యా దేవియొక్క నేత్రముల కానందకరుడైనట్టియు రఘువంశ శ్రేష్ఠుడైనట్టియు, శేషశయ్య యందున్నట్టియు సీత యొక్క కలశములవంటి స్తనముల యందలి కుంకుమ పరాగ మలంకారముగాగల హారములు గలిగినట్టియు విష్ణురూపుడైనట్టియు మాయా మనుష్య దేహము గలిగినట్టియు సీతతో గూడినట్టియు రఘునాథుని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
శా:కౌసల్యా నయనోత్సకున్ విమలు లంకానాథ విధ్వంసి సీ
తాసాధ్వీ కుచకుంకుమాంకిత లసద్వక్షున్ సరోజేక్షణున్
దాసస్తోత్రు భుజంగ తల్పు నరనాథ స్వామి శ్రీరామునిన్
నా సామిన్ రఘునాయకున్ దలచెదన్ మాయా మనుష్యాకృతిన్.
26శ్లో:రామం హేమ తటిత్ప్రభాంశుకధరం వీరాంసనే సంస్థితం
బాలం నీలమణిప్రభం మధురిపుం దైత్యేంద్రగర్వాపహమ్
విశ్వామిత్ర వశిష్ఠవానర వరైః సంసేవ్యమానం సదా
నిత్యం భాస్కరచంద్రకోటి సదృశం సీతా సమేతం భజే.
భావము:బంగారు వికారమైనట్టియు మెరుపు వంటి కాంతిగల వస్త్రమును ధరించినట్టియు వీరాసనమునందున్నట్టియు బాలుడైనట్టియు ఇంద్రనీలముల కాంతివంటి కాంతి కలిగినట్టియు మధువను అసురుని శత్రువైనట్టియు రాక్షసగర్వమును హరించినట్టియు విశ్వామిత్రునిచే వశిష్ఠునిచే వానరులచే నెల్లపుడు సేవించ బడునట్టియు బహు సూర్యచంద్రులతో తుల్యుడైనట్టియు సీతతో కూడిన రాముని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:వరవీరాసన సంస్థితున్ మధురిపున్ వైదేహి సంయుక్తు సుం
దర వుద్యుత్ప్రభు గాంచనాంబర ధరున్ దైత్యేంద్ర గర్వాపహున్
వరదున్ భాస్కర చంద్రకోటి నిభు విశ్వామిత్ర వైరించ వా
నర సంసేవితు బాలు నీల సదృశున్ రామప్రభున్ గొల్చెదన్.
27 శ్లో:శత్రుఘ్నోవ్యజనాంకితోపి భరతః పార్శద్వయే పశ్చిమే
ఛత్రం చామర సంయుతం కలితవాన్ యం సేవతే లక్ష్మణః
౹మూలే కల్పతరో ర్విమాన విలసన్మాణిక్య సింహాసనే
పద్మాస్యం మునిసేవితం రఘుపతిం సీతాసమేతం భజే.
భావము:కల్పవృక్షము మొదట ప్రకాశించుచున్న మణిపీఠమందున్న యే రాముని వింజామరలతో కూడిన శత్రుఘ్నుడును,భరతుడును రెండుప్రక్కలయందును ఆవింజామరలతో కూడిన గొడుగును లక్ష్మణుడు పూనిన వాడగుచు వెనుకకు వుండి సేవించుచున్నాడో అట్టి పద్మము వంటి ముఖము కలిగినట్టియు,ఋషులచే సేవించ బడుచున్నట్టియు సీతతో గూడిన రఘునాథుని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
శా:మందారాంతిక పుష్పకాంతి విలసన్మాణిక్య సింహాసనం
బందున్ జామరపుండరీక ధరులై సానందులై భ్రాత.లిం
పొందన్ గొల్వ మునుల్ భజింప జెలు వింపొందన్ బ్రకాశించు నా
నందబ్రహ్మము రామచంద్రు గొలుతున్ నాళీకవక్త్రున్ హరిన్.
28.శ్లో:వామాంకోపరి తప్తకాంచన నిభం సీతాసమాలోకితం.
హస్తాభ్యాం ధృతఛత్ర చామర మహాసౌమిత్రిణా సేవితమ్
నిత్యం పూజిత పాదపద్మ యుగళం దేవైః సుఏంద్రాదిభిః
సేవ్యం మానుష రాక్షసైః కపివరైః శ్రీరామ చంద్రం భజే.
భావము:ఎడమ తొడపై బుటము వేసిన బంగారముతో తుల్యురాలైన సీత చూచుచున్నట్టియు చేతులచే తాల్చబడిన ఛత్రచామరములు గల లక్ష్మణునిచే సేవింపబడినట్టియు నింద్రాది దేవతలచే నేల్లపుడు సేవింపబడిన పాదద్వంద్వము గలిగినట్టియు మనుష్యులచే,రాక్షసులచే వానరములచే సేవించ దగిన శ్రీరామ చంద్రుని సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:సతతంబున్ వ్యజనాఖత పత్రధరుడై సౌమిత్రి గొల్వంగ
సం
తత మింద్రాది సుపర్వు లంఘ్రికమల ద్వంద్వంబు బూజింప నా
శ్రిత దైతేయ కపీంద్ర మర్త్యతతి సంసేవింప వామాంక సం
స్థిత శృంగార ధరాకుమారి గను నా శ్రీరాము సేవించెదన్
29.శ్లో:కస్తూరీ తిలకం కపీంద్రహరణం కారుణ్యవారాం నిధిం
క్షీరాంభోధి సుతా ముఖాబ్జ మధుపం కల్యాణసంపన్నిధిమ్
కౌసల్యా నయనోత్సుకం కపివరత్రాణం మహాపౌరుషం
కౌమారప్రియ మర్కకోటి సదృశం సీతాసమేతం భజే.
భావము:కస్తూరిబొట్టు గలిగినట్టియు వాలిని సంహరించినట్టియు దయాసముద్రుడైనట్టియు లక్ష్మియొక్క ముఖ పద్మమునకు తుమ్మెద యైనట్టియు.శుభసంపదలకు నిధియైనట్టియు కౌసల్యాదేవియొక్క నేత్రములకు ల్లాసము చేయునట్టియు సుగ్రీవుని రక్షించి నట్టియు గొప్ప పరాక్రమము కలిగినట్టియు కౌమారావస్థచే సంతోషింప జేయునట్టియు సుగ్రీవుని రక్షించినట్టియు గొప్పపరాక్రమము కలిగినట్టియు కౌమారావస్థచే సంతోషింప జేయునట్టియు బహుసూర్యులతో తుల్యుడైనట్టియు సీతతో గూడిన రాముని సేవించుచున్నాను.
తెలుగు అనువాదపద్యము:
శా:కౌసల్యా నయనోత్సకున్ సరసిజాగారా ననాబ్జాళికై
లాసాధీశ్వర మిత్రునిన్ మృగమదాలంకార ఫాలస్థలున్
రాసూనున్ రవికోటి తుల్యు గపి వర్యత్రాణు భవ్యాత్ము సీ
తా సాధ్వీయుతు గాలభేది గొలుతున్ దాంతున్ మహా పౌరుషున్.
30శ్లో:విద్యుత్కోటి దివాకర ద్యుతి నిభం శ్రీకౌస్తుభాలంకృతం
యోగీంద్రైః సనకాదిభిః పరివృతం కైలాసనాథప్రియమ్
ముక్తారత్న కిరీట కుండల ధరం గ్రైవేయ హారాన్వితం
వైదేహీ కుచసన్నివాస మనిశం సీతాసమేతం భజే.
భావము:కోటి మెరుపుల యొక్క కాంతితో సమానుడైనట్టియు శోభాయుక్తమగు కౌస్తుభముచే నలంకరించ బడినట్టియు సనకాది యోగి శ్రేష్టులచే కూడినట్టియు,శివునికిష్ఠుడైనట్టియు ముత్యములు రత్నములు ప్రధానములుగాగల కిరీటము,కుండలములు ధరించినట్టియు,కంఠాలంకారములతో హారములతో గూడినట్టియు,సీత యొక్క కుచములందు నివాసము గలిగినట్టియు సీతతో కూడినట్టి రామునెల్లప్పుడూ సేవించుచున్నాను.
.
తెలుగు అనువాదపద్యము:
మ:ఇన సౌదామిని కోటి కోటి నిభు గౌరీశు ప్రియున్ రత్న కాం
చన గ్రైవేయ కిరీట కుండల విరాజత్కౌస్తుభాలంకృతున్
సనకాది ప్రకట ప్రభావ యతిసన్మాన్యున్ ధరాపుత్రిన్
స్తనకుంభాంచిత కుంకుమాంకితుని సీతారాము ప్రార్థించెదన్.
No comments:
Post a Comment