నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే!) ​ - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే!) ​

Share This
నాకు నచ్చిన నా కధ(ఇదీ నా కధే!) ​
తిరిగి రాని బాల్యం 
 ​శారదాప్రసాద్ 


అలా అకస్మాతుగా బామ్మ చనిపోవటంతో నా భోగం ​చాలావరకు తగ్గింది.అన్ని విషయాలను జానపద కథలు,సినిమాలలోని సంఘటనలతో పోల్చుకోవటం నాకు అలవాటు.'మృత్యువు' అనే శత్రురాజు బామ్మ పైకి దొంగచాటుగా దండెత్తి ఆమెను సంహరించి,నన్ను మాత్రం బంధించి జైలులో పెట్టినట్లు ఊహించుకునే వాడిని.


​ ఆట, పాటలతో హాయిగా గడపవలసిన రోజుల్లో, పిల్లలను కట్టడిచేసి రోజు మొత్తం 'చదువు' అనే వ్యాపకంతో బంధించటం నాకు ఇష్టముండేది కాదు.అలా చదువుకున్న నా మిత్రుల్లో చాలా మంది చదువును సరిగా పూర్తిచేయలేకపోయారు సరికదా​, కనీసం జీవితంలో కూడా సరిగా స్థిరపడలేకపోయారు. బహు​శ :బామ్మ నాన్నకు నా గురించి చెప్పి,హామీ తీసుకొని వెళ్ళిందేమో,నాన్న కూడా నాకు పూర్తి స్వేచ్ఛ ​ఇచ్చారు.చదువు మీద ఉత్సాహం దానంతట అదే కలిగితే,వాడంతటవాడే చదువుకుంటాడని నాన్న భావన అయి ఉండవచ్చు.మా పెదనాన్న గారికి చాలా కాలం వరకూ మగ సంతానం లేదు.సెలవులు వస్తే ​ఆయన ​నన్ను మా ​ఊరు మాచవరం తీసుకొని  వెళ్ళే వారు.


​మాచవరం వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ​ఊళ్ళో అందరూ నన్ను 'తాతగారు' అని పిలిచేవారు.

​నాకు ​మా తాతయ్య​ గారి పేరు పెట్టారు కదా,అందుకని! 
మండు రాములు అనే ఒక పద్మసాలి కులానికి చెందిన వ్యక్తి నన్ను అమిత ప్రేమగా చూసేవాడు. ఆ రోజుల్లో పల్లె​ల్లో కులమత బేధాలు లేనే లేవు.అందరూ ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకునే వారు.పీర్ల పండగ వచ్చిందంటే,హిందువులు పీర్లకు నైవేద్యం పెట్టేవారు.బతకమ్మ పండగ అందరూ చేసుకునే వారు.మండు రాములు యొక్క కులాన్ని ​ఎందుకు చెప్పానంటే,అతని వృత్తి, బట్టలు నేయటం.నూలు కొని రకరకాల రంగులు వేసి ,దానితో బట్టలు నేసేవాడు.మగ్గం ​నేయటం చాలా కష్టం.
​ ​
కాళ్ళు,చేతులు ఒకే సారి ఆడిస్తూ,ఆసులో కండె అటూ,ఇటూ తిరుగుతూ ​ఉంటే,నేను ఆశ్చర్యంగా చూసేవాడిని. కొంతవరకు ఆ విద్య నేనూ నేర్చుకున్నాను.వాళ్ళు శా​కాహారులే.వాళ్ళ ఇంట్లోనే నేను అప్పుడప్పుడు అన్నం తినేవాడిని. పెదనాన్నగారు ​ఏమనేవారు కాదు. మాచవరం ఆ చుట్టుపక్కల చాలా పల్లెలకు కేంద్రం.నేడు మండల కేంద్రం. మా ​ఊరి ప్రత్యేక ఆకర్షణ టూరింగ్ సినిమా హాల్.మా నాన్నగారి పినతండ్రిగారి కుమారుడు,అంటే మా బాబాయి గారు ఆ ​ఊళ్ళో టీచ​ర్ మరియూ పోస్ట్ మాస్టర్.చాలా సరదా అయిన వ్యక్తి.సినిమా చూడటానికి మాకు ఫ్రీ!సినిమా రాత్రి 8 గంటలకు మొదలు పెట్టి ఒంటి గంటకు వదిలే వారు.మా బాబాయి గారికి సినిమా పిచ్చి.వచ్చిన ప్రతి సినిమాను తప్పక చూసే వాడు.నన్ను కూడా తీసుకొని వెళ్ళే వాడు.నాకు నిద్ర వస్తే,పడుకునేందుకు ఇంటినుండే ఒక మంచం తెప్పించి హాల్ వారి వద్ద ​ఉంచేవారు.టూరింగ్ హాల్ లో నేను మొదటిసారి చూసిన సినిమా దేవదాసు.దేవదాసు తండ్రి పాత్ర వేసిన SVR గారు,పార్వతిని పెళ్ళిచేసుకున్న CSR గారు..ఇలా ఆ సినిమాలో ధనవంతుల పాత్రలు ఎక్కువగానే ​ఉన్నాయి.అయితే సినిమాలో వారంతా చినిగి,కుట్లుపడ్డ కోట్లు వేసుకునే వారు.నేను అంతకు మునుపే ఆ సినిమాను గురజాలలో చూశాను.అప్పుడు వారందరూ మంచి కోట్లే వేసుకున్నారు.ఇప్పుడేమో​ ఇలాగా ​ఉంది?ఏమిటబ్బా,అని ఆలోచించి సమాధానం దొరకక,మా బాబాయి గారినే వివరణ కోరాను. అందుకు ఆయన నవ్వుతూ,'తెర చినిగితే,దానికి అతుకేసి కుట్టారు,ఆ అతుకు వారి కోట్ల మీద పడి అలా కనపడుతుంది' అని వివరంగా చెప్పారు.అలా కూడా అజరామరమైన 'దేవదాసు' సినిమా నా మనస్సులో నిలిచిపోయింది.


​ఆ సినిమాను ​దాదాపు ఇప్పటికి ఒక 50 సార్లన్నా చూసి ​ఉంటాను. స్వర్గీయ రేలంగి గారిని ​ఎవరో 'మీరు చూసిన మరపురాని సినిమా ఏది?'అని ప్రశ్నిస్తే,అందుకు ఆయన తడుముకోకుండా,'మంత్రదండం' అని చెప్పారట!దానికి వారు,'ఆ సినిమా అంత గొప్పగా ​ఉందా?'అని తిరిగి అడిగితే,దానికి రేలంగి గారు,'గొప్పా ​?​ నా బొందా! ఆ సినిమా చూసేటప్పుడు, టూరింగ్ టాకీసు తగలబడింది.'అని సమాదానం చెప్పారట! అలా కొన్ని విషయాలు మనకు గుర్తుండిపోవటానికి గమ్మత్తైన కారణాలు ​ఉంటాయి.అలా నన్ను మా పెదనాన్న గారు ఎక్కువగా మాచవరం తీసుకొని వెళ్ళేవారు అనటం కన్నా,నేనే వారి వెంటపడి వెళ్ళే వాడిని అని అనటం సబబు.మా అమ్మకు దిగులు.నన్ను పక్కకు పిలిచి ఇంక మాచవరం పోవద్దు,ఈ విషయం కూడా ఎవరికీ చెప్పవద్దు, అని నా చేత ఒట్టు వేయించుకున్నారు.

మా పెదనాన్నగారు నన్ను ఎక్కడ 'దత్తు' తీసుకుంటారోనని ఆమె భయం. ఆ భయం ఆయనకి మగ సంతానం కలిగిన దాకా మా అమ్మకు ​ఉండేది. నెమ్మదిగా ఫస్ట్ ఫారంలోకి వచ్చాను.ఆ రోజుల్లో గురజాలలో మేము లచ్చరాజు గారి ఇంట్లో ఉండేవారం.లచ్చరాజు గారి అల్లుడే ప్రఖ్యాత రంగస్థల నటుడు శ్రీ వేమూరి రామయ్య గారు.వీరు శ్రీ గగ్గయ్య గారి కుమారులు.శ్రీ రామయ్య గారు మంచి రూపసి,చక్కని నటనా చాతుర్యం కలిగి రంగస్థలం పైన ఒక వెలుగు వెలిగిన వారే. వారు ఈ మధ్యనే స్వర్గస్తులయ్యారు. వారి అబ్బాయి పేరు గగ్గయ్య.అతను నా కన్నా రెండు సంవత్సరాలు చిన్న.ఇప్పటికీ అతనితో నా స్నేహం కొనసాగుతూనే ​ఉంది.అతను కూడా ఆంధ్రాబ్యాంకులోనే అధికారిగా ​పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు .నాకన్నా చిన్నఅయినప్పటికీ చదువులో ​అప్పుడు ​నా కన్నా పెద్ద.ఒక సందర్భంలో కొంత అవమానాన్ని ఎదుర్కొన్నాను.దానిని ఒక సవాల్ గా తీసుకొని ప్రతిదీ ఒకటి ​,​రెండు సార్లు చదువుతున్నాను.నాలోని ఈ మార్పుఇంట్లో అందరికీ ఆశ్చర్యం కలిగించింది.అలా ​1వ  ఫారం కూడా అక్కడే పూర్తిచేశాను. ​సెకండ్  ఫారం నుండి సత్తెనపల్లిలోని  శ్రీ శరభయ్య గుప్త హై స్కూల్ లో చేరాను​.  చదువు మీద ఉత్సాహం నాకు తెలియకుండానే మొద​లయింది. దీనికి కారణం పోటీ తత్వమే అయి ఉండొచ్చు! అక్కడే SSLC వరకు చదివి ,మంచి మార్కులతో పాసయ్యాను.​

సత్తెనపల్లిలో నా చదువు ఆటపాటలతో నిరాటంకంగా సాగింది.అవి మరపురాని రోజులు!
ఆ స్కూల్ అంటే నాకు విపరీతమైన ప్రేమాభిమానాలు ​​ఇప్పటికీ ఉన్నాయి. కారణం-నాకు మానసిక వికాసం కలగటం ఆ స్కూల్ లోనే ప్రారంభం అయింది.ఆనాటి స్నేహితులందరితోనూ నేటికీ నాకు సత్సంబంధాలు ఉన్నాయి.ఈ మధ్యనే ,మేము SSLC పూర్తి చేసుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో 'స్వర్ణోత్సవ  సమ్మేళనం' జరుపుకున్నాం. 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్న మేము ఒక్కసారి బాల్యాన్ని గుర్తు చేసుకొని ఒకరినొకరం అభినందించుకున్నాం.ప్రస్తుతం ఆ స్కూల్ పరిస్థితి దయనీయంగా ఉంది.విద్యార్థులకు చదువుకోవటానికి తగిన వసతులు కూడా లేవు.అది చూసిన మేమందరమూ చలించాం!మేమే  విరాళాలు వేసుకొని విద్యార్థులకు డిజిటల్ ల్యాబ్,  సైన్స్ ల్యాబ్ ... ఏర్పాటు చేసాం.ఆ సందర్భంలో మళ్ళీ అందరమూ కలుసుకున్నాం.మా స్నేహం అపూర్వమైనది. నా బలం ,బలహీనత స్నేహితులే!స్నేహం అంటే నాకు ప్రాణం.ఇప్పటి స్నేహాలు చాలావరకు ఆర్ధిక పరమైనవే!ఉపయోగమున్నంత కాలమే స్నేహాన్ని(?) కొనసాగిస్తారు.లేకపోతే ,ముఖం చాటేస్తారు. బాల్య స్నేహాలకు ఎటువంటి భేషజాలు ఉండవు.అవతలి వాడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా,ఒకరినొకరు అరే,ఒరే అని పిలుచుకుంటారు ఎప్పటికీ!నా బాల్య స్నేహితులందరినీ గురించి ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క పేజీ వ్రాయొచ్చు!ప్రతివాడిలో ఒక విశిష్టత ఉంది. అలా నా బాల్యం సత్తెనపల్లిలోనే ఎక్కువ కాలం గడిచింది.బాల్యం మంచులాగా కరిగిపోతుంది రోజురోజుకి.కానీ ఆ మంచు ముత్యాలు మనసులో పదిలంగా నేటికీ ఉన్నాయి. ఇప్పటి విద్యార్థులు బాల్యాన్ని అనుభవించలేకపోవటాన్ని చూస్తే జాలి కలుగుతుంది!దీనికి కారణం నేటి విద్యా విధానం,తల్లి తండ్రుల ఆత్రుత!మా బాల్యంలో మేము ఎక్కువగా ఆటపాటలతో గడిపేవాళ్ళం.కానీ నేటి బాలురకు వినోదాన్ని ఇస్తుంది,టీవీలు,టాబ్స్ ....ఆటపాటలతో కలిగే మానసిక, శారీరక వికాసం మిగిలిన వినోదాల వలన కలుగవు!కోట్లు సంపాదించవచ్చు,కానీ తిరిగిరాని బాల్యాన్ని సంపాదించటం అసాధ్యం.సత్తెనపల్లిలోని  మిత్రులతో ,ఉపాధ్యాయులతో నా అనుబంధాన్ని మరోసారి పంచుకుంటాను!
***

4 comments:

  1. Very interesting to read your short stories,which are excellently narrated.

    ReplyDelete
  2. బాల్యం యొక్క తీయదనాన్ని బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. చిన్నప్పటి రోజులు తలుచుకున్న కొద్దీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఇప్పటి తరాల బాల్యం చూస్తోంటే అంత బాధగాను ఉంటుంది. మనిషికి జ్ఞాపకశక్తి ఎప్పుడూ ఒక వరమే. దాన్ని తీపి సంఘటనలు గుర్తుచేసుకోడానికి వాడుకుంటే ఆనందంగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరమైన ఆయుష్షు కూడా పెరుగుతుంది.

    కాంతారావు

    ReplyDelete

Pages