అద్భుత చిత్రకారిణి - ఆర్టిస్ట్ ఉషారేఖ పుట్టాచారి - అచ్చంగా తెలుగు

అద్భుత చిత్రకారిణి - ఆర్టిస్ట్ ఉషారేఖ పుట్టాచారి

Share This
అద్భుత చిత్రకారిణి - ఆర్టిస్ట్ ఉషారేఖ పుట్టాచారి 
భావరాజు పద్మిని  


వారసత్వంగా అందిన చిత్రకళనే ఊపిరిగా మలచుకుని, దేశ, విదేశాలలో అనేక అవార్డులు గెల్చుకుని, మన తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు చాటారు - ఆర్టిస్ట్  శ్రీమతి ఉషారేఖ గారు. వారి గురించిన ప్రత్యేక పరిచయం ఈ నెల తెలుగు బొమ్మలో మీకోసం.

స్వపరిచయం:
నా పేరు :ఉషారేఖ
తండ్రి : ఆర్. పుట్టాచారి (విశ్రాంతి డ్రాయింగ్ టీచర్,కేంద్రీయ విద్యాలయ,సంఘటన్)
తల్లి :రత్నాపుట్టాచారి (గృహిణి)
తమ్ముళ్లు : ఇద్దరు తమ్ముళ్లు 
పెద్దతమ్ముడు -సత్యప్రకాష్ (యాక్స్ సరీ డిజైనర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిఫ్ట్-హైదరాబాద్)
చిన్నతమ్ముడు -రాకేష్ (ఫ్యాషన్ డిజైనర్,స్వంతకంపెనీ, మరియు అనేక ప్రముఖ కంపెనీలకు లీవైజ్,స్కాట్స్,పీటర్ ఇంగ్లాడ్ వాటికి డిజైనర్ గా  చేస్తుంటాడు.) 
జన్మస్థలం :కృష్ణాజిల్లాలోని ‘చీమలపాడు’ అనే పల్లెటూరు లో (అమ్మమ్మగారి ఊరు)
పెరిగింది   :ఎయిర్ ఫోర్స్ అకాడమీ,దుండిగల్(హైదరాబాద్). 1984 నుండి గుంటూరులో 
విద్యాభ్యాసం : 10 వతరగతి వరకూ, కేంద్రీయ విద్యాలయంలో,ఇంటర్మీడియట్ ‘వికాస్’ జూనియర్ కాలేజి,గుంటూరు. ఆ తరువాత ‘ఎన్.వి.ది. అహ్మదాబాదులో ‘B.F.A ‘కర్ణాటకలో పూర్తి చేశాను.
వివాహం :1997 లో,యు.పి కి చెందిన సుదీర్ కుమార్ శర్మతో (ప్రోడక్ట్ డిజైనర్,N.I.D ,అహ్మదాబాదు.)
పిల్లలు : ఒక బాబుశివం కుమార్ శర్మ , ఒక పాప రసజ్ఞ శర్మ  

మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. 
మాకు స్వంతంగా (ప్రోడక్ట్ డిజైన్ సంస్థ వుంది. S.K.M డిజైన్ సంస్థ)
ఫరీదాబాదులో వుంది.ఆ సంస్థకు  నేను, మా వారు డైరెక్టర్లగా  పని చేస్తున్నాము. 
నా లక్ష్యం V.N.R స్కూల్ ఆఫ్ డిజైన్ అనే సంస్థను స్థాపించి తద్వారా ఇక్కడివాళ్ళకి డిజైనింగ్ అంటే ఏమిటో, డిజైనింగ్ లో ఏమేమి కోర్సులు ఉన్నాయో, డిజైనింగ్ కోర్సులను చదవడం ద్వారా, ఎలాంటి ఉద్యోగాలు, వ్యాపారాలను నిర్వర్తించు కుంటూ జీవనోపాధిని ఎలా పొందవచ్చునో తెలియజేయాలని.

మీ ఇంట్లో ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా ?
మాది సహజంగానే చిత్రకళా నేపథ్యం ఉన్న కుటుంబం. నాన్నగారు ఆర్.పుట్టాచారిగారు ప్రముఖ చిత్రకారులు. నాన్నగారి తండ్రి,తాత ముత్తాతలు అందరూ తరతరాలుగా చిత్రకళ, శిల్పకళలో ప్రవేశం ఉన్నవారు. ఆ వృత్తులనే జీవనోపాధిగా జీవించారు.
మా తాతముత్తాతలందరూ ఆంధ్రప్రదేశ్ లోనూ, కర్ణాటకలోనూ ఎన్నో దేవాలయాలకు శిల్పాలను చెక్కి ఎన్నో దేవస్థానాలను స్థాపించారు. వారంతా ఆంధ్రా నుండి వలస వెళ్లి కర్ణాటకలో కోలార్ లో స్థిరపడ్డారు.
అలా నాకు జన్మతః చిత్రకళా వారసత్వం అబ్బింది. చిన్నప్పటినుండి ఇంట్లో నాన్నగారు పెయింటింగ్స్ వేస్తూ ఉంటే ఆశక్తిగా గమనించేదాన్ని. నేను కూడా వేస్తూ ఉండేదాన్ని. నాన్నగారు పెద్దగా శిక్షణ ఏమీ ఇచ్చేవారు కాదు. నా అంతట నేనే సొంతంగా వేస్తూ ఉండేదాన్ని.
నాన్నగారిలా నేను కూడా పెద్ద ఆర్టిస్టుని కావాలని,పేరు తెచ్చుకోవాలని ఉండేది. ఇంట్లో ఎప్పుడూ చిత్రకళా వాతావరణం ఉండేది. అలా నేను కూడా చిన్నతనం నుండీ, చిత్రకళను అభ్యసించాను.

చిన్నప్పటి నుంచే బొమ్మలు వేసేవారా ? చిత్రకళ పట్ల మక్కువ ఎలా కలిగింది ?
తరతరాలుగా, మా వంశంలో మా తాత ముత్తాతలు, మా తండ్రిగారు అందరూ శిల్పులూ, చిత్రకారులూ కావటంతో నేను కూడా, పుట్టుకతోనే చిత్రకళా
మూలాలతో జన్మించాను. ఎలాంటి శిక్షణ లేకపోయినా నా అంతటా నేనే బొమ్మలు వేస్తుండేదాన్ని.

మీ గురువులు, అభిమానించే చిత్రకారులు ఎవరు ?
నా గురువు మా నాన్నాగారే. 
నేను అభిమానించే ప్రముఖ చిత్రకారులు ఎవరంటే:
రెంబ్రాంట్
విన్సెంట్ వాన్ గాగ్
లియోవార్దోడావిన్నో
ఇక తెలుగు వారిలో ‘బాపుగారు’ నా అభిమాన చిత్రకారులు.

మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలయ్యింది ?
చిన్నప్పటినుండి ఇంట్లో చిత్రాలు వేసేదాన్ని. పాఠశాల విద్యార్ధులందరితో పాటు, డ్రాయింగ్ టీచర్ (నాన్నగారు) ప్రోత్సాహంతో, అనేక దేశ,విదేశాలలో
నిర్వహించిన అనేక జాతీయ, అంతర్జాతీయ, చిత్రకళా పోటీలలో పాల్గొని ఎన్నో పతకాలు ప్రశంసా పత్రాలను పొందాను.

ఈ రంగాన్ని ఎంచుకున్నాకా మీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కున్నారు ?
ఇంట్లో అందరూ చిత్రకారులు కావటంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండానే ఈ కళలో ప్రావీణ్యం సంపాదించాను.

మీరు వేసిన వాటిలో బాగా పాపులర్ అయిన బొమ్మ గురించి చెప్పండి.

నేను వేసిన మా ఆధ్యాత్మిక గురువుగారైన ‘యు.జి.కృష్ణమూర్తి గారి ఆయిల్ పెయింటింగ్.
ఆ పెయింటింగ్ బెంగుళూరులోని,యు.జి. కృష్ణమూర్తిగారి శిష్యుల ఇంటిలో వుంది. ఆ పెయింటింగ్ కు, ప్రముఖ హిందీ సినిమా దర్శకులు ‘మహేష్ భట్ గారి నుండి, మరియు దేశవిదేశాలలో ఉన్న ‘యు.జి.’ శిష్యుల నుండి, అభిమానుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నాను.
ఆ పెయింటింగ్ కాక, నేను వేసిన ఎనోతైలవర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, వాటర్ కలర్ పెయింటింగ్స్,స్టెంపింగ్వర్క్స్ ఎన్నో ప్రశంసలను అందుకున్నాయి.

మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రశంసల గురించి చెప్పండి.
నేను పొందిన అవార్డులలో అత్యంత ప్రముఖమైన అవార్డు: “సోవియట్ లాండ్
నెహ్రూ అవార్డ్” (1988)
11 సంవత్సరాల వయసులో 6 వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడే నేను ఆ అవార్డు అందుకున్నాను. ఆ అవార్డుతో పాటు బంగారు పతకం, ప్రశంసా పత్రం మరియూ అప్పటి ‘సోవియట్ యూనియన్’ లోని ఉక్రెయిన్ బ్లాక్ సీ కోస్ట్ (నల్ల సముద్రం ఒడ్డున) ఉన్న ‘ఆర్టేక్’ క్యాంపులో రష్యా బాలలతో కలసినెలరోజులు గడపటం అనేది, నిజంగా మరచిపోలేని అనుభూతి. ఇంకా, దక్షిణ కొరియా నుండి ‘కాంస్య పతకం’మరియూ జపాన్, ఇంకా అనేక దేశవిదేశాలనుండి, ఎన్నో పతకాలు ప్రశంసా పత్రాలు అందుకున్నాను.

మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉంటుంది ?
నేను చిత్రకళలో ఇంతగా రాణించటానికి మా కుటుంబసభ్యుల ప్రోత్సాహం
చాలా వుంది. అమ్మా, నాన్న మరియూ తమ్ముళ్లు ఎంతో ప్రోత్సహించి వారి సహాయ సహకారాలను అందించారు.
ఆ తరువాత పెళ్ళైన తరువాత, నా భర్త సుదీర్ కుమార్ కూడా ఎంతో ప్రోత్సహించారు. మా పిల్లలు శివం, రసజ్ఞులు కూడా నన్నెంతో ప్రోత్సహిస్తుంటారు.

భావి చిత్రకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
నా సందేశం ఏమిటంటే: క్రమశిక్షణాయుతంగా జీవించటం కష్టపడి పనిచేయటం, ఏ పని చేసినా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేయటం. తల్లితండ్రులూ,పెద్దలూ,గురువులను గౌరవిస్తూ వారు చెప్పే మంచి సలహాలను పాటిస్తూ మంచి మార్గంలో నడుచుకుంటే, ఏ రంగంలో నైనా తప్పకుండా విజయాలు సాధిస్తారు.


శ్రీమతి ఉషారేఖ గారు మరిన్ని విజయాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటోంది -'అచ్చంగా తెలుగు'.

No comments:

Post a Comment

Pages