అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల)
('ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్' ఇంగ్లీషు నవలకు)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
( ముందుమాట : నాన్సీ డ్రూ కౌమారం(టీనేజ్)లో ఉన్న అమెరికన్ అమ్మాయి. తండ్రి కార్సన్ డ్రూ "రివర్ హైట్స్" ప్రాంతంలో పేరున్న న్యాయవాది. చిన్నతనంలోనే తల్లి చనిపోవటం వల్ల తండ్రి "హన్నా గ్రూ" అన్న ఆమెను నాన్సీకి సంరక్షకురాలిగా నియమించాడు. నాన్సీ ఎమర్సన్ కాలేజీలో మానసికశాస్త్రం చదువుతున్నది. ఆమెకు చాలా కళల్లో ప్రావీణ్యం ఉంది. నాన్సీ తెలివి గల అమ్మాయే గాక, సాహసకార్యాల పట్ల ఆసక్తి ఉన్నందున, ఆమె తండ్రి తాను చేపట్టిన కేసులలో రహస్యాలను భేదించటానికి కూతురిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆమెకు జార్జ్, బెస్ అనే స్నేహితురాళ్ళు ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు. జార్జ్, బెస్ లిద్దరూ కజిన్లు. జార్జ్ సన్నగా, రివటలా ఉంటుంది, మగరాయుడి(టాం బోయ్)లా ప్రవర్తిస్తుంది. బెస్ కొద్దిగా బొద్దుగా ఉంటుంది. భయపడే మనస్తత్వం. ఫక్తు ఆడపిల్ల నడవడిక. నాన్సీ స్నేహితుడైన నెడ్ నికర్సన్ కొన్ని సాహసకార్యాల్లో మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తాడు. తన సాహసకార్యాల ద్వారా నాన్సీ డ్రూ అమెరికా ప్రజలకు అభిమానపాత్రురాలైంది.
నాన్సీ పాత్రను 1930 లో ఎడ్వర్డ్ స్ట్రేట్ మేయర్ అన్న వ్యక్తి సృష్టించాడు. ఆ పాత్రకు వచ్చిన గుర్తింపుతో "స్ట్రేట్ మేయర్ సిండికేట్" ను స్థాపించి, నాన్సీ సాహసకార్యాలను ఒక సిరీస్ లాగ విడుదల చేశాడు. ఈ సిండికేట్లో చేరిన అనేకమంది అజ్ఞాత రచయితలు నాన్సీ సాహసకార్యాలను కధలుగా వ్రాశారు. సిండికేట్ ఒప్పందం ప్రకారం నాన్సీ సిరీస్ కధలన్నీ "కెరొలిన్ కీనె" అన్న కలం పేరుతో మాత్రమే వ్రాయాలి. ఆ కలంపేరును నాన్సీ కధలను వ్రాసే అజ్ఞాతరచయితలెవరూ తాము వ్రాసే వేరే కధలకు వాడుకోకూడదు. కధారచయితలకు కొంతమొత్తాన్ని ఫీజుగా చెల్లించి, సిండికేట్ నాన్సీ సాహసగాధలను కొంటుంది. ముద్రించిన ఆ కధలపై వచ్చే రాయల్టీ మాత్రం ఆ సిండికేట్ కే సొంతం. అలా 1930 నుంచి 1979 వరకూ నాన్సీ గాధలు కెరోలిన్ కీనే అన్న కలం పేరుతో వెలుగును చూశాయి. వాటిలో ది సీక్రెట్ ఇన్ ద ఓల్డ్ అటిక్ అన్న కధను "అటక మీది మర్మం" అన్న పేరుతో అనువదించి కొన్ని భాగాలుగా మీ ముందుకుతెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అనువాద ప్రక్రియ కష్టమైనా, ముప్పది ఏళ్ళుగా యీ కధను అనువదించాలన్న కోరికను తీర్చుకొని మీ ముందు ఉంచుతున్నాను. ఈ అనువాదాన్ని చదివి మీ అమూల్య అభిప్రాయాలను తెలియపరచమని కోరుతూ. . .మీ...సోమనాధశాస్త్రి(సోమసుధ).)
@ @ @
"వీటిలో క్లూ కోసం వెతకటం వింతే! కానీ అదే నన్ను చేయమని కోరారు నాన్సీ!" కార్సన్ డ్రూ జేబులోంచి తీసిన ఉత్తరాలకట్టను చూస్తూ అన్నాడు. ఆ కట్టను డైనింగ్ టేబిల్ మీద ఉంచాడు.
అతడు రివర్ హైట్స్ పట్టణంలో పేరున్న న్యాయవాది. చాలా క్లిష్టమైన కేసులను తన తెలివితేటలతో గెలిపించాడు.
"క్లూ దేని గురించి?" నాన్సీ అడిగింది.
"పోయిన సంగీతం గురించి"
"సంగీతమా? ఏ రకమైనది?"
"బాగా ప్రజాదరణ పొందినది. కానీ ప్రచురించబడనిది" అంటూ ఆగాడు. "అసలీ పని నాకు యిష్టమైనది కాదు. ఇవి ప్రేమలేఖల్లా ఉన్నాయి. ఇంకా. . . "
అతను కంగారుగా ఆ కట్టను కట్టిన బ్లూ రిబ్బను విప్పబోతుంటే, నాన్సీ నవ్వుతూ తండ్రి చేతిలోని కట్టను తీసుకొంది.
"కేసు వివరాలు చెప్పండి. నేను సాయపడగలనేమో!" అంటూ కట్ట ముడి విప్పింది.
". .గలవు" కళ్ళలో మెరుపుతో అన్నాడతను. "ఇది నాకన్నా నీకు యిష్టమైన రహస్యం నాన్సీ!" అందమైన నీలికళ్ళతో ఉన్న తన కూతుర్ని ఆత్మీయంగా చూశాడు. మిస్టర్ డ్రూ తన పద్దెనిమిదేళ్ళ కూతుర్ని చూసి గర్వపడతాడు. ఆమె ఎన్నో రహస్యాలను భేదించి మంచిపేరు తెచ్చుకొంది. నాన్సీ మూడవ యేటనే తల్లిని కోల్పోవటంతో , తండ్రికి మరీ చనువైంది. సలహాలకు గానీ, సహాయానికి గానీ ఒకరిపైనొకరు ఆధారపడతారు. అయితే వారి యింట్లో వీరితో పాటు హన్నాగ్రూ అన్న ఆమె నాన్సీకి సంరక్షకురాలిగా ఉంటోంది.
" ఈ ఉత్తరాల్లో మీరేం చూడాలి?" నాన్సీ అడిగింది.
"నాకు తెలీదు. సూచనలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ సాయంత్రం నేను ఆఫీసులో లేనప్పుడు, ఫిలిప్ మార్చ్ అనే ముసలాయన యీ ఉత్తరాలను నా కార్యదర్శి దగ్గర వదిలి వెళ్ళాట్ట. వీటిని చూసి మాయమైపోయిన కొన్ని అసలైన పాటలకు సంబంధించిన క్లూ కనుక్కోమన్నాట్ట" చెప్పాడతను.
"వాటి బాణీలెవరు కట్టారు?" నాన్సీ అడిగింది.
"నాకు తెలియదు."
నాన్సీ ఆ ఉత్తరాలను బ్లూ రిబ్బనుతో కట్ట కట్టేసి తండ్రి చేతికిచ్చింది. అతడు వాటిలోంచి ఒక ఉత్తరాన్ని బయటకు లాగి ఆత్రుతగా చదివాడు.
"దీనిలో నాకే క్లూ దొరకలేదు. నువ్వు కూడా ఒకసారి చూడు" అంటూ ఉత్తరాన్ని కూతురికి యిచ్చాడు. నాలుగేళ్ళ క్రితం ఫిప్ అనే యువ ల్లెఫ్టినెంట్ తన భార్యకు వ్రాసిన ఉత్తరమది.
"నాక్కూడా దీనిలో ఆధారమేమీ కనపడటం లేదు. ఫిప్ అంటే ఫిలిప్ కి ముద్దు పేరు. ఇతను ఆ మార్చ్ కి కొడుకు కాదు గదా!" నాన్సీ సందేహంగా అంది.
" . . .కావచ్చు" చేతిలోని మిగిలిన ఉత్తరాలు కూతురికిస్తూ అన్నాడతను. "వీటిని చదవాలంటే యిబ్బందిగా ఉంది. ప్రేమలేఖలు ప్రపంచానికి బహిర్గతపరిచే వస్తువులు కాదు గదా!"
తండ్రి మాటలు సబబే! మార్చ్ అన్న అతను యీ ఉత్తరాలు వ్రాసిన అతనికి దగ్గర బంధువైతే, సరయిన కారణం లేకుండా వీటిని బయటపెట్టేవాడు కాదు.
" మీరు మార్చ్ ను ఎప్పుడైనా కలిశారా?" తండ్రిని అడిగింది.
"లేదనే అనుకొంటున్నా! అయితే యిక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో, యీ పట్టణ శివార్లలో ఉన్న నదిగట్టున ఒక పెద్ద భవంతి ఉంది. బహుశా యితను ఆ భవంతిలో నివసించే కుటుంబానికి చెందినవాడు కావచ్చు. ఈ సాయంత్రం మార్చ్ యిక్కడికి వస్తున్నాడు. త్వరలోనే యీ ఉత్తరాల వివరాలు మనకు తెలుస్తాయి"
నాన్సీలో అతన్ని కలవాలన్న ఆసక్తి పెరిగింది. ఆ ఉత్తరాలను, ముఖ్యంగా కొన్నిచోట్ల జాలువారే కవితాసోయగాలను ఆస్వాదిస్తూ చదివింది. కానీ ఆ ఉత్తరాలలో ఆమెకు ఎక్కడా పోయిన సంగీతం తాలూకు ఆధారం దొరకలేదు. మార్చ్ రాకకోసం ఎదురుచూడసాగింది.
" ఈ పద్యాలే మాయమైన పాటల్లోని పదాలు కాదుగదా! కావచ్చు" ఆలోచిస్తున్న ఆమెకు కాలింగ్ బెల్ వినిపించి, పరుగున వెళ్ళి తలుపు తీసింది.
మిలటరీ దుస్తుల్లో ఉన్న అతను ఆమెకు అభివాదం చేసి, తనను ఫిలిప్ మార్చ్ గా పరిచయం చేసుకొన్నాడు. నెరిసిన జుట్టుతో ఉన్న అతను మాసిపోయిన బట్టలు వేసుకొన్నాడు. పాలిష్ చేసిన బూట్లు, విస్త్రీ చేసిన కోటు ధరించి ఉన్నాడు. మనిషి వాలకం మాత్రం నీరసంగా ఉంది.
"మా నాన్నగారు మీ కోసమే చూస్తున్నారు. రండి" లోనికి ఆహ్వానించింది.
నాన్సీ అతన్ని హాల్లో ఎదురుచూస్తున్న తండ్రి వద్దకు తీసుకెళ్ళి, తాను బయటకు వెళ్ళబోయింది. అతను ఆమెను కూడా ఆగమని చెప్పి, తన కధను వినమని కోరాడు. అతను అలసటగా కుర్చీలో కూర్చున్నాడు.
" మీకింత కష్టమైన పని యిచ్చినందుకు క్షమించండి మిస్టర్ డ్రూ."
అతని మాట నీరసంగా ఉంది.
"ఈ మధ్య నాలో తెలీని నిరాశ ఆవహించి, వెంటనే సాయం కోసం మీ ఆఫీసుకి వచ్చాను. మీరు, మీ అమ్మాయి చాలామందికి సాయపడ్డారని తెలిసింది" చెబుతున్న అతను చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపించింది. అతను సేద దీరటానికి సమయమిస్తూ, నాన్సీ లోనికెళ్ళి కాఫీ తెచ్చి యిచ్చింది. తరువాత డ్రూ ఆ ఉత్తరాలు వ్రాసిన వానితో తనకు గల సంబంధం గూర్చి అడిగాడు.
"అతను మా అబ్బాయి. నా ఏకైక సంతానం. నాలాగే మిలటరీలో పని చేసేవాడు. నాలుగేళ్ళ క్రితం విధినిర్వహణలో కన్నుమూశాడు."
తండ్రీకూతుళ్ళిద్దరూ తమ విచారాన్ని వ్యక్తపరిచారు.
"ఫిప్. . .మా ఫిలిప్ చిన్నప్పటినుంచి అలాగే పిలిపించుకొనేవాడు. చివరికి అదే పేరు స్థిరపడిపోయింది" అతను చెప్పటం ప్రారంభించాడు.
"ఫిప్ ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు. అతను చనిపోయిన కొద్దిరోజులకే ఆమె మరణించింది. ఆ తరువాత నా భార్య పోయింది. ప్రస్తుతం నాకు మిగిలింది సుశాన్ ఒక్కతే. ఆమె తల్లి చనిపోతూ ఆ పాపను నాకు అప్పగించింది."
"సుశాన్ మీ మనవరాలా?" నాన్సీ అడిగింది.
"అవునమ్మా! ఆరేళ్ళ పాప. ఆమెను నా వద్ద ఉంచుకొని మంచి సంరక్షణలో పెంచాలంటే, ఒక ఆయాను పెట్టాలి. దానికి నా ఆదాయం చాలదు. అందుకోసం ఫిప్ సంగీతాన్ని అమ్మాలి. దానితో పాటు నా యింటిని కూడా పోగొట్టుకోవచ్చు."
"ఆ సంగీతం గురించి వివరంగా చెప్పండి" నాన్సీ ఉత్సుకతతో అడిగింది.
"దాని కన్నా ముందు మా వంశం గురించి చెప్పాలి. మా వంశీకులు కొన్ని తరాలపాటు యీ రివర్ హైట్స్ ప్రాంతంలో గొప్పగా, దర్జాగా బ్రతికారు. అందుకే నా మనవరాలి కోసం ఎవరినీ దయాభిక్ష అడగటం నాకు యిష్టం లేదు. మా ఫిప్ ఉన్నా, దానికి ఒప్పుకొనేవాడు కాదు" చెప్పటం ఆపి కాఫీని చప్పరించాడతను.
ఈలోపున డ్రూ ' పోయిన సంగీతం ఎంత విలువ చేయవచ్చు 'నని అడిగాడు.
"ఆ పాటలు యింతవరకు ప్రచురించబడలేదు. కానీ చాలా బాగుంటాయి" అంటూ నాన్సీ వైపు తిరిగాడు.
" నీలాంటి యువతకు బాగా నచ్చుతుందమ్మా!" నాన్సీ అతనివైపు ఉత్సాహంగా చూచింది.
"కానీ నా కుమారుడికి పూర్తిగా సంతృప్తిని యివ్వకపోవటం వల్ల, దాన్ని ఏ ప్రచురణకర్త వద్దకు తీసుకెళ్ళలేదు. ఇంతలో ఉద్యోగం వచ్చింది. ఆ సాహిత్యాన్ని ఎక్కడో రహస్యంగా దాచి వెళ్ళాడు. దాన్ని కనుక్కొని అమ్మితే తప్ప, నా మనవరాలిని సరిగా పోషించలేను."
"మిస్టర్ మార్చ్! ఈ ఉత్తరాలలో వాటికి సంబంధించిన సమాచారం ఉంటుందని ఎలా అనుకొంటున్నారు?" నాన్సీ అడిగింది.
" నా కోడలు ఆ పాటల వివరాలకై భర్తకు వ్రాసినప్పుడు, తాను వ్రాసే ఉత్తరాలలోనే వాటికి చెందిన ఆధారాన్ని సూచించినట్లు చమత్కరించాడు. ఆపై కొన్ని ఉత్తరాల తరువాత అవి రావటం ఆగిపోయాయి" అంటూ బాధగా తలవంచుకొన్నాడు.
వారి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం.
"నాన్సీకి, నాకు వాటిలో ఆధారమేమీ దొరకలేదు" డ్రూ చెప్పాడు. "బహుశా మరింత లోతుగా చదివితే ఆధారం (క్లూ) దొరకవచ్చేమో!"
"ధన్యవాదాలు" అంటూ అతను కృతజ్ఞతగా చూశాడు.
"నేను యీ సాయాన్ని నా మనవరాలి గురించి అడుగుతున్నాను. మీరు చేసే యీ సాయాన్ని జన్మలో మరిచిపోను. ఈ మధ్యనే ఒక స్నేహితురాలు సుశాన్ ని తన యింటికి తీసుకెళ్ళింది. ఆమె దూరప్రాంతాలకి తన నివాసాన్ని మారుస్తోంది గనుక తిరిగి పాపను నాకు అప్పగిస్తోంది. నా మనవరాలిని చూట్టానికి నేను తప్ప బంధువులెవరూ లేరు. ఆమెను నేను సాకాలంటే బిచ్చం ఎత్తాల్సి ఉంటుంది. దానికి పైనున్న ఆమె తల్లిదండ్రుల ఆత్మలు రోదిస్తాయి. అందుకే తను నా దగ్గరకు వచ్చేలోగా నేనేదో చేయాలి" అంటూ లేచాడతను.
నాన్సీ, ఆమె తండ్రి తప్పక సాయం చేస్తామని హామీ యిస్తూ గుమ్మం వరకు అతని వెంట వచ్చారు. మార్చ్ గుమ్మం బయట కాలు పెట్టగానే ఎక్కడినుంచో ఒక రాయి గుండ్రంగా తిరుగుతూ వచ్చి, వేగంగా అతని తలను తాకింది. వెంటనే నేలపై అతను కుప్పకూలిపోయాడు.
"ఓహ్!" అంటూ నాన్సీ అతని వద్దకు పరుగున వెళ్ళింది.
ఆమె తండ్రి రాయి వచ్చిన దిక్కుగా చూశాడు. నాలుగురోడ్ల కూడలిలో బస్సులు వరుసలో ఆగి ఉన్నాయి. వాటి మధ్యనుంచి ఒక మనిషి నడిచి వెళ్తున్నాడు. ఇంతదూరం నుంచి వెళ్ళి అతన్ని పట్టుకోవటం కష్టం.
తండ్రీ కూతుళ్ళిద్దరు స్పృహ తప్పి పడిపోయిన మార్చ్ ను మోసుకెళ్ళి, హాలులోని సోఫాలో పడుకోబెట్టారు. ఈ లోపున వాళ్ళింట్లో పనిచేసే హన్నా కంగారుగా వచ్చింది.
"వెంటనే డాక్టర్ని పిలిస్తే మంచిది" అంటూ డాక్టరుకి ఫోను చేసింది. పనిలోపనిగా పోలీసులకు కూడా సంగతి తెలియపరచింది. డాక్టరు వచ్చే సమయానికి ఆ మిలటరీవానికి స్పృహ వచ్చింది. డాక్టరు పరీక్షించి ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం లేదన్నాడు.
"ఈయన తలపై గాయం కన్నా, సరియైన తిండి లేక నీరసంగా ఉన్నారు. ఈ స్థితిలో ఒంటరిగా వెళ్ళటం గానీ, కారు నడపటం గానీ మంచిది కాదు. అతనికి కొన్నాళ్ళు విశ్రాంతి, బలమైన ఆహారం అవసరం."
డాక్టరు మాటలకు మార్చ్ నీరసంగా నవ్వాడు. "నాకు కారు లేదు లెండి. అంత స్థోమత నాకు లేదు" అని చెప్పాడు.
"ఈయన్ని యిక్కడే ఉండిపొమ్మందాం" నాన్సీ తండ్రి చెవిలో గొణిగింది.
వెంటనే డ్రూ అతన్ని తన యింట్లోనే ఉందిపొమ్మన్నాడు. మొదట్లో మొహమాటపడినా, చివరికి అతను ఉండిపోవటానికి ఒప్పుకొన్నాడు.
డాక్టరు సాయంతో న్యాయవాది అతన్ని మేడమీద గదిలోకి తీసుకెళ్ళాడు.
"నాన్సీ! నేను రసం తయారుచేస్తాను. నువ్వు రొట్టెల్ని కాలుస్తావా?" హన్నా అడిగింది. ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళారు.
వంట పూర్తి కాగానే నాన్సీ అతిధికోసం మేడమీదకి ఆహారం తీసుకెళ్ళింది. అతను కడుపునిండా తిని నిద్రపోతూ, ఉదయాన్నే వెళ్ళిపోతానంటూ పలవరించాడు.
కానీ ఉదయం నాన్సీ పాటలకు చెందిన మరికొంత సమాచారాన్ని చెప్పమని అతన్ని ఆపేసింది.
"మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం ఉత్తరాల గురించి మాట్లాడుదాం" నాన్సీ మాటలకు ఆగిపోయాడతను.
మధ్యాహ్నం ఆమె ట్రేలో భోజనం తెచ్చిపెట్టింది. అతను తింటూండగా, తన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకొంది. మాటల్లో అతను సంస్కారవంతుడని, సరదాగా ఉంటాడని గ్రహించింది. ఇటీవల తనకు అనారోగ్యంగా ఉండటం వల్ల, అతను ఎక్కడా పనిచేయటం లేదు.
"ఒకసారి మా యింటికి వచ్చి చూస్తే బాగుంటుంది. అది చూట్టానికి దెయ్యాలకొంపలా ఉండవచ్చు. నేను యింటిని పరిశుభ్రంగా ఉంచేటంతటి వాణ్ణి కాదు, దానికోసం పనిపిల్లను పెట్టుకొనే తాహతు నాకు లేదు. తోటమాలిని మానిపించి చాలారోజులైంది" చెప్పాడతను.
"ఇల్లు కట్టి ఎన్నాళ్ళయింది?" నాన్సీ అడిగింది.
"రెండు వందల సంవత్సరాలు కావచ్చు.. . .పూర్తి యిల్లు కాకపోయినా, ఆ యింటిలో కొంతభాగమైనా కట్టి అన్ని సంవత్సరాలై ఉంటుంది."
"మీకు యింటికి వెళ్ళే ఓపిక వచ్చాక, నేను కారులో దిగబెడతాను. అప్పుడు మీ యిల్లంతా చూస్తాను" నాన్సీ మాట యిచ్చింది.
ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. నాన్సీ మంచం ప్రక్కనే ఉన్న రేడియో పెట్టింది.
"ఇప్పుడే వస్తాను" అంటూ మేడ దిగి వీధితలుపు తీసింది.
"హై జార్జ్! హల్లో బెస్!" వచ్చిన స్నేహితురాళ్ళను పలకరిస్తూ వీధి తలుపును బార్లా తెరిచింది. వాళ్ళు గుమ్మం దాటి యింట్లోకి అడుగుపెట్టారు.
"అరె! జుట్టు బాగా తగ్గించేశావే!" అంటూ జార్జిని పలకరించింది.
జార్జ్ ఫియానె ముందుకు పడ్డ నల్లటి జుట్టును హుందాగా వెనక్కి నెట్టింది.
" ఎవరికి నచ్చకపోయినా, బర్ట్ ఎడిల్టన్ కి నచ్చితే చాలు" అంది నవ్వుతూ.
"నాన్సీ! మన ఎమర్సన్ కాలేజీలో జరిగే నాట్య కార్యక్రమంలో పాల్గొంటున్నాం కదా! దానిలో పాల్గొనేందుకు కొత్త బట్టలు కొనటానికి వెళ్తున్నాం. వస్తావా?" బెస్ మార్విన్ అడిగింది.
జార్జ్ ఫియానె, బెస్ మార్విను లిద్దరూ దగ్గర చుట్టాలు. వాళ్ళ అమ్మలు స్వయానా అక్కచెల్లెళ్ళు . జార్జ్ సన్నగా, రివటలా ఉంటుంది. కానీ మగరాయుడిలా దూసుకుపోయే మనస్తత్వం(టాంబోయ్). బెస్ ఆమెకు పూర్తి విరుద్ధం. కొంచెం పిరికి స్వభావం, చొరవతో దూసుకుపోయే తత్వం కాదు. మనిషి మాత్రం ముద్దుగా, బొద్దుగా ఉంటుంది. వారిద్దరూ నాన్సీకి ప్రాణస్నేహితులు.
"నేను దానిమీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఒక కేసులో నాన్నకి సాయం చేయాలనుకొంటున్నాను" నాన్సీ చెప్పింది.
"ఓహో! నువ్వు ఏదైనా కేసు చేపట్టావంటే బుర్రంతా దానిపైనే పెడతావుగా" జార్జ్ చమత్కరించింది.
"ఆ కేసేదో మేము తెలుసుకోవచ్చా?" బెస్ అడిగింది.
వాళ్ళకి ఫిప్ మార్చ్ కేసు వివరాలు నాన్సీ క్లుప్తంగా చెప్పింది. వాళ్ళు అంతా విని అవసరమైతే తమ సాయం అందిస్తామన్నారు.
"తప్పకుండా పిలుస్తాను" నాన్సీ చెప్పింది.
"డాన్స్ గురించి మరిచిపోకు" అని మరొకసారి ఆమెకు గుర్తు చేసి, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
వీధితలుపు మూసి, నాన్సీ మేడ మీదకు వెళ్ళేసరికి రేడియోలోంచి మంచి పాట వినిపిస్తోంది. చక్కని నాదస్వర సంగీతంలో మిళితమైన ఆ పాటను వింటున్న మార్చ్ ఉన్నట్లుండి గట్టిగా అరిచాడు.
(ఎందుకలా అరిచాడో తెలుసుకోవాలంటే ఒక నెల వరకూ ఆగవలసిందే! - సశేషం)
No comments:
Post a Comment