డేనియల్ మాస్టర్ చనిపోయాడు! - అచ్చంగా తెలుగు

డేనియల్ మాస్టర్ చనిపోయాడు!

Share This
నాకు నచ్చిన నా కధ (ఇదీ నా కధే!)డేనియల్ మాస్టర్ చనిపోయాడు! 
శారదాప్రసాద్  

ప్రపంచంలోకెల్లా ఇంటిని మించిన మహా విద్యాలయం మరొకటి ఉండదేమో!అది శాంతి నికేతన్ కావచ్చు లేదా డూన్ స్కూల్ కావచ్చు.స్కూల్ కు వెళ్ళేటప్పుడు చాలామంది విద్యార్థులు బాధతోనే వెళుతారు.ఇంటికి వచ్చేటప్పుడు ఆనందంగా వస్తారు. దానికి ముఖ్య కారణం విద్యాలయాల్లోని శిక్షణా విధానమే! ఆనందంగా ఇష్టపడి చదువుకునే విధంగా విద్యార్థులను ఉపాధ్యాయులు మోటివేట్ చెయ్యాలి.శిక్షణలో 'శిక్ష' ఎక్కువైతే కలిగే అనర్ధాలు చాలానే ఉన్నాయి. బెత్తంతో విద్యార్థులను దండించే ఉపాధ్యాయుల మీద విద్యార్థులకు ప్రేమాభిమానాలు, గౌరవం ఉండవు. విద్యార్థులను ఉపాధ్యాయులు శారీరకంగా ,మానసికంగా హిసించటమే దీనికి కారణం.
మా చిన్నతనంలో సంగంజాగర్లమూడిలో శరణు రామస్వామి చౌదరి గారనే ప్రధానోపాధ్యాయుడు ఉండేవారు. ఆయన పంచె ధరించి ఉత్తరీయంతో ఉండేవారు. ఆయన వేష భాషల వల్లే విద్యార్థులకు,తల్లితండ్రులకు ఆయనంటే విపరీతమైన గౌరవం ఏర్పడింది.విద్యార్థులను ఆయన బెత్తంతో ఎప్పుడూ దండించినట్లు వినలేదు.చక్కని నీతి కథలతో విద్యార్థులను అతి చక్కగా తీర్చిదిద్దారు ఆయన. ఆయన క్లాస్ రూమ్ నుంచి ఏ కారణం చేతనైనా ఒక పది నిముషాలు బయటకు రావలసి వస్తే ,కుర్చీ మీద కండువాను వేసి వచ్చేవారు.ఆ కండువా ఆయనకు ప్రతినిధిలాగా ఉండేది.ఆయన తరగతిలో లేని సమయంలో విద్యార్థులు నిశ్శబ్దంగా ఉండేవారు.ఇన్విజిలేటర్స్ లేకుండా పరీక్షలు కూడా నిర్వహించారు.విద్యార్థులు ఎన్నడూ చెడు మార్గానికి దిగలేదు.అదే విధంగా SSLC పబ్లిక్ పరీక్షలను కూడా నిర్వహిస్తానని ప్రకటిస్తే,దానికి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఒప్పుకోలేదు.విద్యార్థులకు కావలసింది అటువంటి శిక్షణ,సచ్చీలత.విద్యార్థులను దండించవలసి వస్తే మందహాసంతో మందలించేవారు,చిరునవ్వుతో చిన్నబుచ్చే వారు.
అప్పుడు నేను సెకండ్ ఫారం చదువుకుండేవాడినని గుర్తు. మా స్కూల్ లో డేనియల్ గారనే ఒక ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆయన లోయర్ classes కు బోధించేవారు.విద్యార్థులను దారుణంగా శిక్షించేవారు.దానికి కారణం-ఆయనలో ఉండే frustration కావచ్చు లేదా ఆర్ధిక ఇబ్బందులు కూడా కావచ్చు.ఆయనకు తాగుడు అలవాటు కూడా ఉండేదని అనుకునేవారు.ఆయన్ని చూస్తే చచ్చేంత భయం కలిగేది. ఎప్పుడు, ఎవరిని ,ఎందుకు శిక్షిస్తారో కూడా చాలాసార్లు తెలిసేది కాదు.అప్పుడు అర్ధ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి.పరీక్షల మధ్యలో ఆదివారం వచ్చింది. ఆ రోజు సాయంత్రం నేను ఇంటిముందు మిత్రులతో గోళీలు ఆట ఆడుతున్నాను.అదే దోవలో సైకిల్ మీద డేనియల్ మాస్టర్ గారు ఎక్కడికో వెళుతున్నారు. నేను గోళీలు ఆడటాన్ని ఆయన చూసారు.నా వైపే వెనక్కి తిరిగి చూసి సైకిల్ మీద వెళ్ళిపోయారు.ఆయన నన్ను చూడటాన్ని నేను కూడా చూసాను.అప్పుడే బిక్క చచ్చినట్లు అయ్యాను.స్కూల్ కు వెళితే తప్పక దండిస్తారని భయంతో ఉన్నాను. ఒక రెండు రోజులు స్కూల్ కి ఎగనామం పెడుదామనుకుంటే ,పరీక్షల వల్ల కుదరలేదు. మరుసటిరోజు భయం భయంగానే స్కూల్ కు వెళుతున్నాను.మిత్రుడు బ్రహ్మానందం(నేటి ప్రఖ్యాత హాస్యనటుడు) ఆనందంతో ,వాడి ఫక్కీలో వివిధ భంగిమలతో ఈలలు వేసుకుంటూ స్కూల్ నుంచి తిరిగివస్తున్నాడు."దేనికిరా! ఈ ఆనందం?" అని వాడిని అడిగాను "డేనియల్ మాస్టర్ రాత్రి చనిపోయాడట!అందుకని ఈరోజు స్కూల్ కు సెలవు ఇచ్చారు " అని వాడి హావభావాలతో చెప్పాడు.నేను కూడా ఆనందంతో గంతులు వేసాను.నేనే కాదు ,చాలామంది విద్యార్థులు కూడా ఆనందపడ్డారు.అది తప్పో ఒప్పో అప్పుడు నాకు తెలియలేదు.అలా అప్పుడు నేను ఆనందపడటానికి గల కారణాన్ని ఇప్పుడు విశ్లేషించుకుంటే.దానికి కారణం ఇప్పటికి దొరికింది.శిక్షణలో 'శిక్ష' శృతిమించటమే ఆ కారణం !మరికొన్ని ముచ్చట్లు మరోసారి!!
***

2 comments:

  1. చదువు చెప్పే టీచర్లు గట్టిగా మందలించినా, పిల్లల్లో ఆ టీచర్ పట్ల గౌరవం సన్నగిల్లుతుంది. గట్టిగా కొట్టి శిక్షిస్తే మరింత ఏహ్యభావం పెంచుకుంటారు. పిల్లలే కాదు, సాధారణంగా ఎవరి పట్లయినా హింసాత్మకంగా ప్రవర్తిస్తే .. "ఎప్పుడు పోతాడురా బాబూ!" అని మనసులోనైనా అనుకోవడం కద్దు. పిల్లలు తెలియని వయసులో అనుకుంటే, పెద్దలు ఇంగితం మర్చిపోయి ప్రవర్తిస్తారు. మంచి సంఘటనను మాకు అందించారు.

    కాంతారావు

    ReplyDelete

Pages