శ్రీ దేవి దశమహావిద్యలు - 7
6. ఛిన్నమస్త దేవి
శ్రీరామభట్ల ఆదిత్య
శ్రీ దేవి దశమహావిద్యలో ఆరవ మరియు అత్యంత ప్రధానమైన శక్తి శ్రీ ఛిన్నమస్త దేవి. అమ్మ రూపం చూడడానికి విచిత్రంగా మరియు భయంకరంగా ఉన్నా అమ్మ అత్యంత కరుణామూర్తి.
దక్షిణాచార తంత్రంలో అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది. ఏ విపత్తులనైనా క్షణాల్లో ఎదుర్కొని కాపాడే తల్లి ఛిన్నమస్త. అమ్మవారి పుట్టుకకు సంబంధించి నారద పాంచరాత్రంలో ఒక కథ చెప్పబడివుంది. సతిదేవి పరిచారికలైన ఢాకిని మరియు వర్ణినులతో కలిసి అమ్మవారు మందాకిని నదిలో స్నానానికై బయలుదేరారట. స్నానాదికాలు పూర్తిచేసుకున్న ముగ్గురూ హిమాలయ విహారానికై బయలదేరారు. కానీ మధ్యలో తీవ్రమైన ఆకలిగొన్న పరిచారికలు తమ క్షుద్బాధను తీర్చమని అమ్మను వేడుకున్నారు. కైలాస పర్వతం చేరగానే ఆకలి తీరుస్తానని అమ్మ చెప్పినా వారు శాంతించక చాలా ఆకలితో ఉన్నామని అన్నపూర్ణయైన ఆదిపరాశక్తే ఆఖమంటే ఎలా అని అమ్మను పరిపరివిధాలా వేదించసాగారు. చివరకు కారుణ్య జలధి అయిన అమ్మ తన నఖములతో తన తలను కోసివేసుకుంది. అప్పుడు అమ్మ శరీరం నుండి మూడు రక్తధారలు వెలువడ్డాయి. అందులో రెంటిని ఢాకిని మరియు వర్ణినులు అందుకోగా మూడో ధారను అమ్మ తల గైకొంది.
అమ్మవారు ఒకచేత్తో తన తలను పట్టుకోగా మిగిలిన చేత్తో కత్తిని పట్టుకుంటుంది. అమ్మవారిపై ఉన్న ఛిన్నమస్త సహస్రనామం కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారి రూపం ఎర్రటి మందారపు రంగులో ఉంటుంది. శాక్తేయంలోని కాళీకుల వర్గంలో అమ్మవారి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ముండమాలా తంత్రంలో అమ్మవారి రూపానికి నారాయణుడి దశావతారాలలో నారసింహ రూపానికి పోలికలు చెప్పబడ్డాయి. ముండమాలా తంత్రంలో అమ్మకి మరియు పరశురామ రూపానికి పోలికలు చెప్పబడ్డాయి. దేవీభాగవతంలో సతిదేవి తన దశమహావిద్యలతో శివుడిని దశదిశలా చుట్టుముట్టినప్పుడు ఛిన్నమస్తి శివుడి కుడివైపున ఉన్నట్లుగా చెప్పబడి ఉంది.
అమ్మకు సంబంధించి ఇంకో కథ ఏం ప్రచారంలో ఉందంటే క్షీరసాగరమథనంలో నుండి వచ్చిన అమృతంలో రాక్షసుల భాగాన్ని అమ్మనే త్రాగిందట. మళ్ళీ ఆ అమృతం రాక్షసుల పాలు కాకుండా తన తలను శరీరం నుండి వేరుచేసి దేవతలను రక్షించింది జగన్మాత. ఈ కథ ప్రణతోషిణ తంత్రంలో చెప్పబడింది. 'ఛిన్నమస్త తత్త్వం' పేరిట పుస్తకం రాసిన ఆచార్య ఆనంద్ ఝా, సైనికులను అమ్మవారి పూజచేయమని అంటారు ఎందుకంటే అమ్మ పూజ వలన తమపై తమకు నియంత్రణ ఉంటుందని, అమ్మ పూజవలన త్యాగగుణం ఐలవడుతుందని చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ లోని ఉనీ జిల్లాలోని చింతపూర్ణిలో అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ సతీదేవి నుదురు భాగం పడినట్టుగా చెప్పబడి ఉంది. ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాజరప్పాలో కూడా అమ్మవారి ఆలయం ఉంది. ఇవే కాకుండా భారతదేశంలోని తూర్ప భాగంలో అమ్మవారికి చాలా ఆలయాలున్నాయి.
***
No comments:
Post a Comment