ఈ దారి మనసైనది... - అచ్చంగా తెలుగు
ఈ దారి మనసైనది...
అంగులూరి అంజనీదేవి
anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com

జీవితం అదృష్టంతో నిండిన అమృతపు గిన్నె.
అత్యల్ప విషయాలతో కూడిన అద్భుతమైన మూట. 
అప్పడప్పడు ఖాళీ అయి.... వెంటనే నవజీవనంతో నిండిపోయే నాజూకైన పాత్ర. ఇంకా చెప్పాలంటే అదొకస్థితి, ఒక పని ... ఒక నిద్ర .... కొంచెం ప్రేమ. అంతే ... అదే జీవితం... ఎక్కడ జీవితం వుంటుందో అక్కడ ప్రేమవుంటుంది.
జీవితమంతా ప్రేమతో గడపాలని.... ప్రేమించబడుతూ  బ్రతకాలని.... ఈ భూ మండలంలో ఎవరికీ దొరకనంతప్రేమ తనకే దక్కాలని, మన్విత ఆకాంక్ష.
 రెడ్ కారులో వచ్చే డుంప్లూ కాని, మారుతిలో వచ్చే బన్నీ, సన్నీ విక్కీ రెండు జడలటింకూ ఒక్కరేమిటి... తనతో ఎల్.కే.జి. నుండి ఎవరెవరు కలిసి చదువుతున్నారో... వాళ్లంతా వాళ్ల తల్లుల ప్రేమను అమృతంలా తాగుతున్నారు మిగిలింది ఒలకబోస్తున్నారు. ఎప్పడైనా ఒక పక్షి తన నోటితో మేతను తెచ్చిపిల్ల పక్షుల నోట్లో పెట్టే సీనరీల్ని చూస్తూ గడపటం ఇంట్రస్ట్ మన్వితకి. తనఫ్రెండ్స్ కాని, ఆ పక్షి పిల్లలు కాని ఆస్వాదించే ప్రేమకన్నా ఇంకా ఎక్కువ ప్రేమ కావాలి మన్వితకి, ముఖ్యంగా అమ్మ ప్రేమ... నాన్న ప్రేమ... తమ్ముని ప్రేమ ... నానమ్మ ప్రేమ... ప్రేమను ఫెన్సింగ్ లా  తనచూట్టూరౌండప్ చేసుకొని అందులో తనోస్టాచ్యూ లా వుండి పోవాలి. ఆతర్వాతే అన్ని... కానీ జరిగిందేమిటి?
*****
విజయవాడ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎం.బి.బి.యస్  అడ్మిషన్స్ జరుగుతున్నాయి.
అమ్మా నాన్న ఇద్దరు కలిసి ... కాలేజి అడ్మిషన్ కోసం తనని తీసికెల్తారని   ఆశపడ్డ మన్వితకి, తనతోపాటుగా అడ్మిషన్ కోసం వచ్చిన అనురాగ్, వాళ్లమ్మ ప్రియభాందవి'తోడుగాఅయ్యారు.
కారణం బిజీగా వున్న నాన్న ... రానని చెప్పిన అమ్మ, ఎక్కడున్నది ప్రేమ? వెతుక్కున్నా దొరకటం లేదే... దురదృష్టం తనకి తోడా? లేక దురదృష్టానికి తను తోడా ? నిరాశగా వుంది మన్వితకి...
అడ్మిషన్స్ జరుగుతున్నాయి.
నెంబర్ల ప్రకారం వరుసగా....
అనుకోకుండా... అనురాగ్ కళ్లు ఒక అందమైన కళ్లతో మాట్లాడుతున్నాయి. ఏదో గొంతు దాటని భావం కళ్లతో చెబుతున్నట్లు..... కళ్లు తన భాష అయితే చూపు తన మాటలవుతున్నాయి.... ఆ భాష ఎవరకిఅర్ధంకాదు. అలాంటి భావమే వాళ్ల మనసులోనూ పడితే తప్ప! అలా పుట్టినప్పడు ప్రేమఅనేది ಇದ್ದಿರಿమధ్యన ఒకే చూపులో ... ఒకే టైంలో.... పుట్టే కెమికల్ రియాక్షన్ అవుతుంది."నీ ఊపిరే నా ప్రాణం." అనే స్థాయికి చేరుతుంది. ఉలి అలికిడికి రాయి మెత్తబడ్డట్లు మనసు మెత్తబడుతుంది. కనుబొమలముడివిడిపోయి బిగుసుకున్న పెదవులు ఎర్ర గులాబిల్లా వికసిస్తాయి.
అనురాగ్ రెప్పవేయకుండా చూస్తుంటే ఆమె రక్తం పై నుండి జారే బంతిలా పరిగెత్తుతోంది. అతను ఆగి ఆగి నవ్వుతుంటే ఆమె గుండె వింతగా అదురుతోంది.
అడ్మిషన్స్ పూర్తయ్యాయి.
వాళ్లకి-వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.
సూడెంట్స్ అందరికి పలానా రోజు కాలేజి స్టార్డ్ అవుతుందని... ఆరోజు డెమాన్స్ట్రేషన్ క్లాసుకి ఉదయం 9 గంటలకి అటెండ్ అవ్వాలని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు చెప్పారు.
అప్పడు గాని ఆ అందమైన కళ్లు అనురాగ్ కళ్లని విడిపోలేదు.
తర్వాత అనురాగ్, అతని తల్లి ప్రియభాందవి, మన్విత హోటల్ అశోకాలో లంచ్ చేసి వరంగల్ బయలుదేరారు.
ట్రైన్లో కూర్చుని వున్న మన్విత మనసులో ఏదో అలజడి, ఓదార్చలేని బాధ. తనతో పాటు అడ్మిషన్ కొచ్చిన సూడెంట్స్ అందరు వాళ్ల పేరెంట్స్తో వచ్చారు. తను మాత్రమే ఒంటరిగా వచ్చింది. అమ్మా నాన్నా వుండి కూడా ఈ ప్రేమరాహిత్యాన్ని తట్టుకోలేక పోతుంది.
అనురాగ్ తన ద్యాసలో తను వున్నాడు. అతని కళ్లు కొత్తగా నేర్చుకున్న భాషకు ఇంకా పదును పెడ్లున్నాడు. కాలేజీ ఎప్పడు స్టార్ట్ అవుతుందాఅని ఎదురు చూస్తూ . ఆ అందమెనకనుదోయిగల ఆ అమ్మాయి కోరికల కోటలోకి ప్రవేశించి . తనని తను గెలుచుకోవాలని .... ఎదురుగా వున్నమన్వితను అతను పట్టించుకోవటం లేదు. ఇంతసేపు అతను చూసింది మన్వితను కాదు.
*****
ఆ రోజు రానే వచ్చింది. కె.ఎమ్.సి.లో....
అనాటమి లెక్చరర్ హాల్లో జరుగుతున్న డెమాన్స్ట్రేషన్ క్లాసుకి మన్విత, అనురాగ్, ప్రియభాందవి, అటెండ్అయ్యారు.
ఆల్ డిపార్ట్మెంట్  హెచ్.ఒ.డి.లు వచ్చి వాళ్ల వాళ్లసబ్జెక్టికి సంబందించిన ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకున్నారు.
సూడెంట్స్ - రోల్ నెంబర్ వైజ్ గా ఒక్కొక్కరు వాళ్ల వాళ్ల ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. 
అప్పడు అనురాగ్ కి ఆ అందమైన కళ్ల అమ్మాయి పేరు, వివరాలు అడకుండానే తెలిశాయి. పేరు దీక్షిత.
నెక్స్ట్ డే .... టైం టేబుల్ ప్రకారం క్లాసులు మొదలయ్యాయి. 
ఉదయం థియరీ క్లాసెస్ .... మధ్యాహ్నం లాబ్స్.
ర్యాగింగ్ ఫియర్ ఎక్కువైంది. 
కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రోజుకు పదిసార్లు పెట్రోలియం జీప్ వస్తున్నా. సీనియర్స్ జూనియర్స్ లాగే వచ్చి పరిచయం చేసుకొని ర్యాగింగ్ చేస్తుంటే ... మన్విత, దీక్షిత మిగిలిన అమ్మాయిలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్నట్లు భయపడ్డారు. 
మన్విత, దీక్షిత, మిగతా అమ్మాయిల్లో కొంతమంది క్యాంపస్లో వుండే లేడిస్ హాస్టల్లో వుంటున్నారు.
ర్యాగింగ్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న మన్విత ర్యాగింగ్ కి భయపడలేదు. ర్యాగింగ్ జరుగుతున్నప్పడు అది తనలో వుండే టాలెంటిని బయటకి తీస్తున్నట్లు భావించింది. తనలో తనకి తెలియని "తననిబయటకు తీస్తున్నట్లు అనుకున్నది. అందరితో అదే విషయం చెప్పింది. అదివిని కొంత మందికి ర్యాగింగ్ పట్ల పాజిటివ్ థింకింగ్ కలిగింది.
దీక్షిత మాత్రం ర్యాగింగ్ కి భయపడింది క్లాసులోకి వెళ్తున్నప్పుడు కానీ క్లాసులోంచి వస్తున్నప్పడు కానీ తను వాళ్లకి ఎక్కడ దొరుకుతానో అని తప్పించుకు తిరగాలని చూస్తోంది. ఆ టైం లో ఫ్రెండ్స్ ధైర్యం చెప్పారు. అయినా ఆమెలో ఆ భయము ఎక్కువై బెలూన్ పగిలినా బాంబు అనుకునే స్థాయికి చేరుకుంది. తల్లిదండ్రులు గుర్తు రావటంతో ...... హోంసిక్ ఎక్కువై ఇంటికెళ్లింది. 
దీక్షిత ఇంటికెళ్లటంతో అనురాగ్ వెలితిగా ఫీలయ్యాడు. 
కొన్ని రోజులు గడవగానే.... ప్రెషర్స్ పార్టీ ప్రిపరేషన్ మొదలైంది. దీక్షిత ఊరి నుండి వచ్చింది.
సీనియర్స్ వచ్చి .... క్లాసులో ఎనౌన్స్ చేసి..... ఎవరెవరికి ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయో పేర్లు ఇమ్మని అడిగారు.
ఐదు రోజులు గడిచాక ఫ్రెషర్స్ డే ని ఆడిటోరియంలో అరేంజ్ చేశారు.
ప్రిన్సిపాల్ గారు, హాస్పిటల్ సూపరిన్డెంట్, కాలేజ్ స్టాఫ్, సీనియర్స్ అబ్బాయిలు, అమ్మాయిలు ఆ పార్టీకి అటెండ్అయ్యారు.
సీనియర్స్ చెప్పినట్లే జూనియర్స్ ఎప్రాన్లు వేసుకొని వచ్చారు. నెంబర్ వైజ్గా అరేంజ్ చేసిన చైర్స్లో కూర్చున్నారు.
వాళ్ల నేమ్లో వున్న మొదటి అక్షరం ప్రకారం నెంబరు వెయ్యడంతో అనురాగ్, దీక్షితల చెయిర్స్ పక్క పక్కన వచ్చాయి. మన్విత మధ్యలో కూర్చొంది.
సరస్వతిదేవి సాంగ్ తో పోగ్రాం మొదలైంది.
ముందుగా . హిసోక్రటిక్ ఓట్ (Hippocratic Oath) చేయించారు.
ఆ తర్వాత అంతా సరదా .. సరదా ....
ఫస్టియర్ అబ్బాయిలైతే అమ్మాయిల్లాగాచీరలు కట్టి జోవియల్ గా, అద్భుతంగా డాన్స్ చెయ్యటం. అక్కడ విశేష అకర్షణ అయ్యింది.
సీనియర్స్ .... జూనియర్స్ అబ్బాయిలను స్టేజి విూదకు పంపించి, అమ్మాయిలు పాడుతున్నప్పడు మైక్ గుంజుకొని రమ్మని చెప్పటం.... ఆ పాటల్ని వినలేని వాళ్లలా బెల్ట్ ని మెడకి ఉరిలా వేసుకొని యూక్షన్ చెయ్యటం. ఆ అమ్మాయిలు డాన్స్ చేస్తున్నప్పడు ఇంకొంతమంది అబ్బాయిల్ని పంపించి పిల్లి మొగ్గలు వెయ్యమనటం.... చేశారు.
అదే విధంగా జూనియర్స్ లో  నచ్చిన అమ్మాయిల్ని - - - కొంతమంది సీనియర్స్ స్టేజి మీద ప్రపోజ్ చెయ్యటం .... వాళ్లు "నో అన్నట్లుగా ఫేస్ పెట్టడంతో క్రింద వున్న సీనియర్స్ ఒప్పకో - - - ఒప్పకోఅంటూ ఒకేసారి గోల చేసి అరవటం చేశారు.
ఆ తర్వాత 'ఐడింటికార్డు జూనియర్స్ కి  సీనియర్స్ ఇవ్వటంతో ప్రెషర్స్ డే ఒక సంబరంగా ముగిసిపోయింది. 
నెల రోజుల తర్వాత ... జూనియర్స్ అంతా కలిసి హోటల్ అశోక కాన్ఫెరెన్స్ హాల్లో గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. 
అక్కడ వాళ్లంతా ఒకరికి ఒకరు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. పాటలు, డాన్స్, జోక్స్ ఇలా ఎవరెవరి టాలెంట్స్ని వాళ్లు బయటపెట్టి.... అక్కడే డిన్నర్ ముగించుకొని .... 
వాళ్ల బ్యాచ్కి ఒక పేరు పెట్టుకున్నారు. 
వాళ్లకి....ఫస్టియర్లో అనాటమి, ఫిజయాలజి, బయోకెమిస్ట్రీ  వున్నాయి. శ్రద్దగా, సీరియస్ గా  చదువుతున్నారు. 
దీక్షితకి దగ్గరకావాలని చూస్తున్న అనురాగ్ కి.... డిసెక్షన్ హాల్లో ఆమెతో మాట్లాడే అవకాశం కలిగింది. 
ఇద్దరు కలిసి డిసెక్షన్చేసేవాళ్లు.... 
అంతే కాకుండా ఎక్సామ్స్ కి  ముందు నోట్స్ ఇవ్వటం, మెటీరియల్ ఇవ్వటం, ఎక్సామ్స్ టైంలో స్ట్రెస్  లేకుండా సైకలాజికల్ గా  సపోర్ట్ ఇవ్వటం చేస్తున్నాడు. అంతకన్నా ఇంకేం లేదు. 
కారణం .... దీక్షిత మౌనమే !!
అయినా ... అప్పుడప్పుడు అనురాగ్ తనని తను కంట్రోల్ చేసుకోలేని మానసిక స్థితి లోకి వెళ్తున్నాడు. తన ఆలోచనలని ఆమెతో పంచుకోవాలని, సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఒకప్పుడు ర్యాగింగ్ చేసిన సీనియర్స్ ఎక్సామ్స్ టైం లో ఫస్టియర్స్కి బాగా హెల్స్ చేశారు. అన్నం తినిపించటం, స్నానానికి నీళ్లు పెట్టడం లాంటివి  కూడా చేశారు. ఫస్టియర్లో అందరు పాసయ్యారు.
******
(సశేషం)

No comments:

Post a Comment

Pages