జవరాలి కధలు -23(2)
ఇంటింటి రామాయణం -2
గొర్తి వేంకట సోమనాధశాస్త్రి(సోమసుధ)
(గత సంచిక తరువాయి భాగం)
"ప్రసూనకి మీ కంపెనీలో గానీ, వేరే చోటగానీ ఉద్యోగం వచ్చిందే అనుకోండి. తెలివైన పిల్ల కనుక తప్పక సంపాదించుకోగలదని నాకు నమ్మకం ఉంది. అలా సంపాదించుకొంటే తనకొచ్చే జీతం మీకు అదనమే కదా! అప్పుడు ఏమి చేయాలనుకుంటున్నారు" వరాలి ప్రశ్నకు తెల్లబోయి చూశాడతను.
"ఏం చేస్తానమ్మా? నా జీతంతో యిల్లు గడవక కొన్ని ఖర్చులను తగ్గించుకొన్నాను. కొన్ని సరదాలను పూర్తిగా మరచిపోయాను. ఈ జీతం వస్తే వాయిదా వేసుకొన్న ఖర్చులను గానీ, మరిచిపోయిన సరదాలను తీర్చుకోవటానికి ఉపయోగించవచ్చు కదా!"
"నిజమే అన్నయ్యా! ఈ ప్రపంచం తీరే అది. మనమూ ఆ ప్రపంచంలోని వాళ్ళమే కదా! నీటికరువు ఉన్న రోజుల్లో ఒక చెంబు నీళ్ళతోటే కాళ్ళు కడుక్కోవాలని చూస్తాం. కానీ అనుకోకుండా మరి నాలుగైదు చెంబుల నీళ్ళు అదనంగా దొరికినా కాళ్ళు కడుక్కోవాలని చూస్తామే తప్ప ఆ నీళ్ళను మరొక పనికి వినియోగించాలని చూడం. సర్దుకుపోయే మనస్తత్వాన్ని త్యాగం చేయాలని చూస్తాం."
"ఏమిటమ్మా నువ్వనేది?"
"ఈరోజు ప్రజల్లో లోపించినదే చెబుతున్నానన్నయ్యా! జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఆర్ధిక క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని నా అభిప్రాయం. మన సంప్రదాయం ప్రకారం తమ తల్లిదండ్రులను, తోడబుట్టినవాళ్ళను చూడవలసిన సామాజిక బాధ్యత మగవాళ్ళకి చాలా ఉంది. ఆ బాధ్యతను విస్మరించమని నేను చెప్పటం లేదు. మీ జీతం మీవాళ్ళకోసం, మీ కుటుంబం నడవటానికి ఉపయోగించటంలో తప్పులేదు. కానీ భవిష్యత్తులో మీకు సంతానం కలిగితే,మీ పిల్లల శారీరక ఎదుగుదలకు, సంఘంలో ఎదుగుదలకు చేయూతనివ్వవలసిన బాధ్యతను మగవాడు తప్పించుకోగలడా? అలాగని అయినవాళ్ళను రోడ్డుకీడ్వటం సబబు కాదుగదా! అలాంటి సమయంలో ప్రసూన జీతం మీకు అక్కరకు వస్తుంది. అందుకే ప్రసూన జీతం రాగానే, ఆమెను ఖర్చులకోసం కొంత ఉంచుకోమని, మిగిలిన జీతాన్ని ప్రభుత్వబాంకులో దాచుకోమని చెప్పండి. అలాగని 'నీ జీతం నీ యిష్టం' అని మీరొదిలేస్తే, ఆమె అనవసరమైన ఖర్చులు పెట్టే అలవాటు చేసుకోవచ్చు."
"తను చెప్పింది నిజమేనండీ! అయితే ఆ దాచుకొనేది మాత్రం వడ్డీ తక్కువ వచ్చినా, అసలును నష్టపోని ప్రభుత్వబాంకులలోనే దాచండి. ఎందుకంటే విదేశాలకన్నా ఎదుటివాళ్ళను మోసం చేయటంలో మనవాళ్ళు ముందుంటారు. అలాంటి మోసగాళ్ళకు సాయం చేసే రాజకీయనాయకులు మనదేశంలో కోకొల్లలు. ఈరోజు మనం ఎన్ని చూట్టం లేదు. ఎక్కువవడ్డీకి ఆశపడి ప్రయివేటురంగంలో తామరతంపరగా పుట్టుకొస్తున్న ఆర్ధికసంస్థలలో పెట్టుబడి పెట్టి, రాత్రికిరాత్రి ఆ సంస్థలు దుకాణం మూసేసి పారిపోతే లబోదిబోమని మొత్తుకోవటం కొందరికి సరదా! రోజూ కళ్ళముందు మోసం జరుగుతున్నట్లు చూసినా వాళ్ళు ఆలోచించరు. అర్ధంతరంగా మూసేసి ప్రజల సొమ్మును కాజేసే ఆ సంస్థలపై చర్య తీసుకోవలసిన న్యాయస్థానాలు కూడా కేసులను ఏళ్ళతరబడి సాగదీసి, ఆ మోసగాళ్ళు దేశం వదిలి పారిపోయేంతవరకూ తీర్పును వెలువరించరు. అందుకే అత్యాశలకు పోకుండా ప్రసూనగారి జీతాన్ని ప్రభుత్వబాంకుల్లో దాచండి" మధ్యలో కలుగజేసుకొని చెప్పాను.
మా మాటలకు అతను దీర్ఘాలోచనలో పడినట్లు కనిపించాడు.
"చూడన్నయ్యా! పెళ్ళికి ముందు జీవితాన్ని సరదాగా గడపాలని అందరికీ అనిపిస్తుంది. పెళ్ళయ్యాక కూడా భార్యాభర్తలిరువురూ ఎవరి సరదా వాళ్ళది అనుకొన్నట్లు ఉండటంవల్లనే యీకాలంలో చాలా కాపురాలు రోడ్డున పడుతున్నాయి. అవి తగ్గాలంటే ఒకరికొకరం అన్నట్లుగా భార్యాభర్తలు కలిసిపోవాలి. ఆనందాలే కాదు, ఆలోచనలు కూడా కలిసి పంచుకోవటం అలవాటు చేసుకోవాలి. పరాయివాళ్ళముందు ఒకరికొకరు చులకన చేసుకోవటం ప్రారంభిస్తే, భార్యాభర్తల మధ్యలో మూడవవ్యక్తి కల్పించుకొని యిద్దరిమధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయవచ్చు. గతంలో పెద్దలు యిబ్బంది పెడుతున్నా దంపతులు అన్నీ ఓర్చుకొని ఎలా కలిసి ఉండేవారు? మరి మన తరం ఎందుకు ఉండలేకపోతున్నాం? కారణం మన జీవితంలోకివచ్చిన వ్యక్తి ఏదో అవసరానికి పనికివచ్చే వ్యక్తిలానే తప్ప, జీవిత భాగస్వామిగా భావించలేకపోవటం వల్లనే! ఒక్కసారి ఆలోచించు అన్నయ్యా!" అంటూ వరాలు జంతికపళ్ళాలను తీసుకొని లోనికెళ్ళిపోయింది.
అతను కొద్దిక్షణాలు మౌనంగా కూర్చుని "వస్తానండీ!" అంటూ లేచాడు.
"సారీ! మీరేదో పని మీద వెడుతూంటే ఆపినట్లున్నాను" అన్నాను.
"లేదండీ! ఇక్కడకు రావటం వల్ల నేనొక విషయం తెలుసుకొన్నాను" అంటూ సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను అతన్ని మర్యాదకోసం గుమ్మం వరకూ దిగవిడిచాను గానీ, అతను మాయింటికి వచ్చి తెలుసుకొన్న విషయమేమిటని అడగలేదు. అతను మా యింటినుంచి రోడ్డు వైపు వెడుతూంటే, నేను గేటు మూసి యింట్లోకి నడిచాను. ఇంతకుముందు అతను ఆవేశంలో వెడుతూంటే అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని సందేహించాను గానీ యిప్పుడా భయం లేదు. కారణం అతనిలో ఆవేశం నశించి, ఆలోచన పెరిగింది.
"వరాలూ! నువ్వేదో పల్లెటూరి అమ్మాయివి, అమాయకురాలివనుకొన్నాను గానీ ఒక వ్యక్తి బుర్రకు పదునుపెట్టించేటంత చాకచక్యం ఉందని అనుకోలేదు సుమా!" వంటింట్లోకెళ్ళి వరాలితో అన్నాను.
"అదే నేనూ అనుకొంటున్నాను-నాకిన్ని తెలివితేటలు ఎలాగ వచ్చాయా అని? మన పెద్దలు చెప్పారు కదా! ఆరునెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని. మరి మీతో నాకున్నది పదినెలల సావాసం. ఆ మాత్రం పదునెక్కనా?"
ఆడవాళ్ళు చాలా చతురులు. నేనేదో ఆవిణ్ణి పొగిడేసి బోల్తా కొట్టిద్దామనుకొంటే, ఆ బాణాన్ని నాపైనే తిప్పికొట్టి నా నోరు మూయించింది.
"ఇంతకూ నాకు తెలివితేటలు పెరిగాయన్నారు కదా?"
"అవును" నవ్వుతూ బదులిచ్చాను.
"మరి నాకు బహుమతి ఏమీ యివ్వరా?" వరాలు ప్రశ్నకు నా నరాలు బిగుసుకున్నాయి. అమ్మో! ఆర్ధిక క్రమశిక్షణ అని ధర్మారావుకి చెప్పి, నాచేత బహుమతి పేరుతో ఖర్చు చేయించాలని చూస్తోంది.
ఆమె మాటలు వినబడనట్లు నటిస్తూ, "మనం యిక్కడ ఉంటే హాలులో ఫాను తిరుగుతోంది. విద్యుత్తు దండగ కదా! కట్టేసి వస్తాను" అని అక్కడనుంచి తప్పుకొన్నాను.
"మీరూ. . .మాటకి దొరకరు గదా!" అంటూ నా వెనకే వచ్చి చేతిలోని పుస్తకంతో అనునయంగా నా తలపై తట్టి, పుస్తక పారాయణ కోసం పడగ్గదిలోకి వెళ్ళింది.
వారం తరువాత -
ఆఫీసుకి బయల్దేరేముందు వాళ్ళింట్లోంచి చిన్న వాగ్వాదం వినిపించి, బూట్లు తొడుక్కొంటూ ఆలకించాను.
"ఎక్కడికిరా దాన్ని తీసుకొని బయల్దేరావు?" సూర్యకాంతం గొంతు పెంచి అడుగుతోంది.
"అమ్మా! ఎక్కడికైనా పని మీద బయల్దేరేముందు అడక్కూడదని నీకు తెలియదా?" ధర్మారావు ప్రశ్నకు ఆవిడ శోకాలు మొదలెట్టింది.
"అయ్యో అయ్యో! ఆఫీసుకెళ్ళే సమయంలో పెళ్ళాన్ని వెనకేసుకు బయల్దేరుతూంటే, ఎక్కడికని అడగటం కూడా పొరపాటేనా? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లు యింతబతుకూ బతికి, యీరోజు నీచేత యిలా చేయకూడదని చెప్పించుకోవలసి వచ్చింది నాయనో!"
"వచ్చాక చెబుతాం కద అత్తయ్యా!" ప్రసూన సమాధానానికి ఆవిడకి పుండుమీద కారం జల్లినట్లయింది.
"ఏంటే చెప్పేది? సంసారం అంటే మొగుణ్ణెంటేసుకొని రోడ్లమ్మట తిరగటం కాదే! అయ్యో! దేవుడా! నా కొడుక్కి యిదేదో మందెట్టిందిరా నాయనా? ఈ ప్రాంతానికి రాకముందు బాగానే ఉండేవాడు. ఎవరేపాఠం చెప్పి నీ బుర్ర మార్చేశార్రా నాయనా?"
"ప్రసూనా! ఆవిడ తరహా నీకు తెలుసుకదా! పద!" ధర్మారావు అనగానే యిద్దరూ యిల్లు వదిలి బయటపడ్డారు.
నెలరోజుల తరువాత - నేను ఆఫీసునుంచి యింటికి వచ్చే సమయానికి ప్రసూన వరాలితో మాట్లాడుతూ కూర్చుంది. నేను వారిని గమనించనట్లు యింట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బాత్రూంలో కాళ్ళు కడుక్కొని వేరే గదిలో కూర్చున్నాను. కొంతసేపటికి ప్రసూన వరాలితో నేనున్న గదిలోకి వచ్చింది. వరాలి పిలుపుతో తలెత్తి చూసిన నాకు ప్రసూన చేతులు జోడించింది.
" ఏమ్మా? " అని పలకరింపుగా ప్రశ్నించాను.
"ఆ రోజు యింట్లో గొడవతో ఆయన ఆవేశంగా బయటకెడుతూంటే చాలా భయపడ్డాను. సమయానికి మీరు ఆపారు. అందుకే మీకు ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను."
"లేదమ్మా! గేటు చప్పుడైతే మా యింటికి ఎవరో వచ్చారనుకొని బయటకొచ్చాను. అదేసమయంలో మీ గేటు తీసుకొని బయటకు వెడుతున్న మీవారు కనిపించారు. ఎవరో కొత్తవ్యక్తిలా ఉన్నారని పలకరించాను. అంతే! ఈ మాత్రం దానికి ధన్యవాదాలెందుకు?" అమాయకత్వం నటిస్తూ అన్నాను. అంతలా నటించకపోతే, వాళ్ళింట్లో గొడవంతా విని బయటకొచ్చినట్లు నేను బయటపడిపోనూ?
"నీకేదో ఉద్యోగం వచ్చిందని చెబుతానన్నావు?" వరాలు గుర్తు చేసింది.
"అవునన్నయ్యా! మావారి కంపెనీకెళ్ళే దారిలోనే ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాను. పదివేలవరకూ యిస్తారు. నా మొదటి జీతంతో యీ స్వీటు పాకెట్. ."చెబుతున్న ఆమె నా ముఖకవళికలను చూసి ఆగిపోయింది.
"అది తీసుకోవటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ నేనేం చేశానని యీ పాకెట్?" అడిగాను.
"ఆయనతో చెప్పి నన్ను ఉద్యోగంలో జేర్చమని చెప్పినందుకు"
"ఏం లేదమ్మా! మీ వారిని పలకరించినప్పుడు మాటలమధ్యలో నువ్వు పి.జి.చేశావని చెప్పారు. పి.జి.చేసిన అమ్మాయిని ఖాళీగా యింట్లో కూర్చోపెట్టడమెందుకని సలహా యిచ్చానంతే! ఇదే పాకెట్టు పట్టుకెళ్ళి మీ అత్తగారికిచ్చి నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో తెచ్చానని చెప్పి, ఆవిడ స్పందన ఎలా ఉంటుందో చూడు."
"నేను ఉద్యోగానికెళ్ళటం ఆవిడకి యిష్టం లేదు."
"పాతకాలం మనుషులు కదా! అయినా ఒక ప్రయత్నం చేసి చూడు. తరువాత . . . ఒక సోదరిగా భావించి యీ మాటలు చెబుతున్నాను. ఆడపిల్లలు చిన్నప్పుడు పుట్టిపెరిగిన వాతావరణం వేరు. ఉన్నంతలో సరదాలు తీర్చుకొంటూ తల్లిదండ్రుల మమకారాన్ని పంచుకొంటూ ఆడపిల్ల పెరుగుతుంది. కానీ అత్తవారింట్లో ఆ వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చాలా యిళ్ళలో అత్తగారు కోడలిని అదుపులో పెట్టాలనే చూస్తుంది. అప్పుడు కోడలు అత్తగారిమీద తిరుగుబాటు చేసిందనుకో! తన ప్రక్కన నిలబడవలసిన భర్త మనసు గాయపడుతుంది. అలా గాయపడితే, యిద్దరిమధ్య మనస్పర్ధలు వస్తాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో, అందులోనూ పెద్ద కుటుంబాలలో యీ అత్తాకోడళ్ళ గొడవల్లో మగవాడు ఎక్కువగా నలిగిపోతాడు. అలాంటి సమయాల్లో జీవితభాగస్వామి తన బాధను అర్ధం చేసుకొంటున్నట్లు అతను గమనించగలిగితే చాలు, ఆ భార్య ఎన్ని తుఫానులైనా తట్టుకొనే సామర్ధ్యాన్ని పెంచుకొనే వీలుంటుంది. అందుకని యింట్లో గొడవలు అయినప్పుడు భార్య సంయమనం పాటించి ఊరుకోవటమే ఉత్తమం. అలా ఊరుకొంటే అవతలి వ్యక్తి ఎంతసేపని కేకలు వేయగలద్ఫు. మాటకి మాట అన్నప్పుడే గొడవలు ఎక్కువవుతాయి. గొడవలు పెరిగితే స్వతహాగానే మగవాడు తల్లి పక్షాన చేరిపోతాడు. సంయమనం పాటిస్తే భార్య సహనాన్ని భర్త ఏదోనాటికి గ్రహించి నీ పక్కకు తిరిగే రోజు వస్తుంది. అలాగని తనపై రాక్షసంగా వాళ్ళు శారీరకదాడి చేస్తే ఊరుకోమని మాత్రం నేను చెప్పను. అలాంటప్పుడు తిరుగుబాటే సరియైన మార్గం. చిన్నచిన్న వాగ్వాదాలలో మాత్రం పట్టించుకోకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. అంతేకాదు. ఇప్పుడు ఉద్యోగంలో చేరానన్న హుషారులో అనవసర ఖర్చులతో వచ్చిన జీతాన్ని ఖర్చుపెట్టడం మంచిది కాదు. పెద్దకుటుంబాల్లో ఉన్నప్పుడు మనం సంపాదించే ప్రతీపైసా ఆర్ధిక క్రమశిక్షణను అలవరచుకొని ఖర్చు పెట్టాలి. లేదంటే కుటుంబం రోడ్డున పడుతుంది. రేపు సంతానం కలిగితే వాళ్ళ కోసమైనా మన సరదాలను కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇలా చెప్పానని మరోలా అనుకోవద్దు."
"అదేం లేదన్నయ్యా! ఈ విషయంలో మావారు చెప్పినట్లే చేయదలచుకొన్నాను."
"సరేనమ్మా!" అనగానే వరాలితో బయటకెళ్ళింది.
మొదట్లో చిందులేసిన అత్తగారు మరేమీ చేయలేక మాటలు, అధార్టీని తగ్గించినట్లు కనిపించింది.
నాలుగు నెలల తరువాత మరొకసారి వాళ్ళింట్లో గొడవ రాజుకొంది. కారణం ధర్మారావు భార్యను తీసుకొని తిరుపతి వెళ్ళటం. పెళ్ళి కావలసిన ఆడపిల్లలు యింట్లో ఉండగా, భార్యను తీసుకొని తిరుపతెలా వెడతాడని అత్తగారు ధ్వజమెత్తింది. తాను డబ్బులిస్తానని, వాటితో మిగిలినవారంతా తిరుపతి వెళ్ళమని ధర్మారావు చెప్పాడు. దానికి వాళ్ళు ఒప్పుకోకపోయినా అతను భార్యతో తిరుపతి ప్రయాణం ఆపలేదు.
ఒకరోజు నేను ఆఫీసునుంచి యింటికి వచ్చే సమయానికి, ఎవరో వ్యక్తి వరాలితో మాట్లాడటం చూశాను. నేను లోపలికి రాగానే ఆమె లేచి నిలబడింది. వాలకం చూస్తే అరవై ఏళ్ళు పైబడ్డ వ్యక్తిలా కనిపిస్తోంది.
" ఫరవాలేదండీ! వయసులో పెద్దవారు. కూర్చోండి" అంటూ నేను నా గదిలోకి వెళ్ళిపోయాను. బట్టలు మార్చుకొని , బాత్రూములో కాళ్ళు కడుక్కొని అలసట తీర్చుకొంటూ కుర్చీలో కూలబడ్డాను. వరాలు వంటింట్లోంచి మంచినీళ్ళు తెచ్చి, నా చేతికి అందించి వెళ్ళిపోయింది. నీళ్ళు త్రాగి గదిలో ఫానుక్రింద సేద తీర్చుకుంటున్న నాకు హాలులోంచి మాటలు వినపడ్డాయి.
"నేనేమని చెప్పాను? ఎలాగు పెళ్ళాన్ని తీసుకొని తిరుపతి వెడుతున్నావు కదా! నీ చెల్లెళ్ళను కూడా తీసుకెళ్ళరా! అన్నాను. అంతలోనే నామీద చెలరేగిపోవాలా? నాకూ పెళ్ళయింది. అత్తగారి అజమాయిషీ చవిచూశాను. కోపమొస్తే మా ఆయన నామీద చిరాకు పడ్డరోజులూ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మావారు పెద్దలమాట ఎదిరించి ఏ పనైనా చేసేవారా?" ఆమె మాటతీరును బట్టి ఆవిడ ప్రక్కింటి సూర్యకాంతంగారని అర్ధమైపోయింది. ఆలోచనలు అదలించి వాళ్ళ సంభాషణపై దృష్టిని కేంద్రీకరించాను.
"మీ అబ్బాయే కాదు పిన్నిగారూ! యీరోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. ఆకాలంలోలాగ యీకాలంలో సర్దుకుపొమ్మంటే కొంత యిబ్బందిగానే ఉంటుంది. మీరే చెప్పండి. ఆకాలం యిళ్ళు విశాలంగా ఒక పది జంటలు కలిసి ఉండేలా ఉండేవి. కానీ యీకాలంలో అలాంటి పెద్ద యిళ్ళూ లేవు. ఆ కాలంలో లాగ ఆస్తులు కూడా తగ్గిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని రోజులొచ్చాయి. ఇలాంటి యీ కాలంలో పెద్ద కుటుంబాలైనా సరే! అద్దె యిచ్చుకోలేక రెండు, మూడు గదులున్న చిన్న యింళ్ళలోనే సర్దుకుంటున్నారు. అందువల్ల కొత్తగా పెళ్ళయిన జంట తమ సరదాలు తీర్చుకొందుకు యిలా హనీమూను అంటూనో, తీర్ధయాత్రల పేరుతోనో ఊళ్ళు తిరుగుతూ కొంత సరదా తీర్చుకోవాలనుకొంటారు. అలాంటివాళ్ళను మనం కూడా చూసీచూడనట్లు వదిలేయాలి. ప్రసూన మాత్రం మీకు పరాయి పిల్లకాదు. మీ అమ్మాయిలాంటిదేకదా! ఆమె తన భర్తతో ఊరెళ్ళితే తప్పేమిటో నాకు అర్ధం కాలేదు."
"అదేంటమ్మా అలా చెబుతావు? పెళ్ళయిన వాళ్ళ సరదాలేమిటో నాకు తెలియనివైతేనా? అవేవో యింట్లోనే తీర్చుకోవచ్చుగా! వాటికోసం బజారుకెక్కాలా? అయినా పెళ్ళి కావలసిన ఆడపడుచులుండగా, అలా మొగుడితో తిరిగితే, వీళ్ళెంత బాధపడతారో ఆలోచించు" పెద్దావిడ క్రాస్ ఎగ్జామినేషను.
"ఇందులో బాధపడేదేముంటుందండీ? మీ అమ్మాయిలు మాత్రం పెళ్ళయితే తమ భర్తలతో బయటకు వెళ్ళరా?" వరాలి ప్రశ్నతో ఆమె బహుశా ఖంగు తిని ఉంటుంది.
"వెళ్ళరమ్మా! వాళ్ళకి పెళ్ళికావలసిన ఆడపడుచులుంటే ఖచ్చితంగా వెళ్ళరు. నా కూతుళ్ళను నేనలా పెంచలేదు" ఢంకా బజాయించి మరీ చెప్పింది సూర్యకాంతం.
"ఇందులో పెంపకాల గురించి ఎందుకులెండి! పోనీ వాళ్ళు వెళ్ళి వచ్చాక మీరు మీ అమ్మాయిలతో వెళ్ళిరండి."
"ఆ మాట మావాడే చెప్పాడు. నా బాధ అదికాదు. పెళ్ళయిన పదినెలల్లో ఏనాడూ వాడిలా పెళ్ళాన్ని వెంటేసుకు తిరగలేదు. ఈ ప్రాంతానికొచ్చాకే ఏ ముదనష్టపోళ్ళు చెప్పి ఏడ్చారో! మా వాడిలా తయారయ్యాడు. నెల్లాళ్ళ క్రితం దాన్ని తీసుకొని ఆఫీసుకెళ్ళాడు. ఆ తరువాత ఉద్యోగం వంకతో అది యింటి పని ఎగ్గొట్టి బయటకుపోతోంది. పోనీ! దాని జీతం అడిగి తీసుకొంటాడా? అది వాడి సొమ్ము తిని తన డబ్బులు బాంకులో దాచుకుంటోంది. సాయపడనప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తున్నట్లు? మా చవటసన్నాసి కూడా నీ జీతం నీ యిష్టం అంటాడు. ఇప్పుడిలా మమ్మల్ని పక్కనెట్టి తిరుపతి పోయారు. వీళ్ళ తంతు చూస్తూంటే ఏదో రోజు వాళ్ళిద్దరూ కలిసి మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేలా ఉన్నారు"
"అలా ఎందుకు చేస్తారండీ? మీరనవసరంగా భయపడుతున్నారు."
"ఏమోనమ్మా! నాభయం నాకుంటుంది కదా! మావాడు యీమధ్య మీవారితో ఎక్కువగా మాట్లాడటం చూశాను. అందుకని. . . "
"అందుకని. . .చెప్పండి. సందేహించవద్దు" వరాలు అడిగింది.
"మరేంలేదమ్మా! ఇప్పుడు మీవారే ఉన్నారు. ఎప్పుడైనా నిన్ను అదేపనిగా ఊరమ్మట తిప్పుతున్నారా? చెప్పు"
"నిజం చెప్పాలంటే. . .వారు రమ్మనే అంటారు. కానీ నేనే వెళ్ళను" ఇండియాలో భార్యలు ఎదుటివాళ్ళకి ఒకపట్టాన దొరకరు. భర్తని యింట్లో సణిగి సతాయిస్తారు. బయటమాత్రం పతి దేవుళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. అందుకే కొంతమంది మగవాళ్ళు అదేపనిగా భార్యలపై పేట్రేగిపోతుంటారు.
"మీరు చెప్పదలచుకొన్నది అదేనా?" సున్నితంగా అడిగినా సూర్యకాంతంగారికి చురకవేసే ప్రశ్న వేసింది. వరాలా? మజాకా?
"అదేనమ్మా! మీవారిని కొంచెం మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మావాడితో చెప్పమనమ్మా!"
"లేదండీ! మావారికి వేరొకరి యింటివిషయాల్లో కలగజేసుకొనే అలవాటు లేదు. అయినా మీరు అనవసరంగా భయపడుతున్నారు. మీ అబ్బాయి అలా చేస్తారని నేననుకోను. అయినా మీరు వారి విషయాల్లో కలగజేసుకోకండి. మీ అమ్మాయితో అల్లుడు సరదాగా ఉంటే సంతోషించరా? అలాగే మీ కొడుకు తన భార్యతో సరదాగా ఉంటే గమనించనట్లే ఉండండి. లేదా అతన్ని మరింత హుషారు చేయండి. దానితో తమ అన్యోన్య దాంపత్యానికి మీరు సహకరిస్తున్నారని మీ కొడలికి, అబ్బాయికి మీ మీద గౌరవం పెరుగుతుంది."
వరాలి మాటలకు ఆమె బదులివ్వకుండా వెళ్ళిపోయింది. వరాలి హితబోధకు ఆమె కడుపెంత రగిలిపోయిందో, వాళ్ళ గేటు చప్పుడే తెలియపరుస్తోంది.
"ఏమిటి? మీ పిన్నిగారేమంటారు? ఇంతకీ ఆవిడ మనల్ని సలహా అడగటానికి వచ్చిందా? తిట్టడానికొచ్చిందా?"
"ఛ! మనని ఎందుకు తిడుతుందండీ?"
" ముదనష్టపోళ్ళెవరో తన కొడుకును పాడుచేశారని చెప్పిందిగా!"
"అది మనగురించే అని ఎందుకనుకొంటున్నారు?"
"మన గురించి కాకపోతే వాళ్ళ గేటు తలుపును భళ్ళున ఎందుకు వేస్తుంది?"
"కొన్ని జీవితాలంతే!" వరాలి మాటలకు భారీగా ఊకదంచే అవకాశం దొరికిందని సంబరపడ్డాను.
"అవును. కొన్ని జీవితాలంతే! పెళ్ళిచూపుల్లో తామే పెద్ద ఆదర్శవాదులమన్నట్లు అతివినయం ప్రదర్శిస్తారు. తీరా పెళ్ళయ్యాక, చూసుకో నా తడాఖా అన్నట్లు విజృంభిస్తారు. వారికి కోడలిరూపంలో వచ్చినది ఒక పనిపిల్లలాగ కనిపిస్తుంది. తన యింటిని తాను సరిదిద్దుకోవటంలో తప్పేమీ లేదు. కానీ కోరి కోడలికి పనులు కల్పించి, వాటిని తగిన సమయంలో పూర్తిచేయలేదని యిలాంటి కొందరు అత్తలు రాచిరంపాన పెడతారు. అత్తవారింట్లో యిబ్బందుల గురించి ఆడపిల్ల తన పుట్టింట్లో చెబితే పెళ్ళి చేయటంతో తమ బాధ్యత తీరిపోయిందని వాళ్ళు చేతులు దులిపేసుకొంటారు. నాకు తెలిసిన ఒకామె కధ యిది. ఆమెకు తండ్రి చనిపోయాడు. తమ్ముడు డిగ్రీ, చెల్లెలు ఎం.ఇడి. చదువుతున్నారు. వాళ్ళ చదువుకోసం ఉద్యోగం చేస్తున్న యీమె ఆదుకోవాలి. కానీ ఆరోగ్యం దెబ్బతిన్న తల్లి ముచ్చటకోసం పెళ్ళి చేసుకోవాలనుకొంది. పెళ్ళిచూపుల్లో నిజాయితీగా తన యింటి పరిస్థితిని చెప్పి, అయిదేళ్ళవరకూ తన జీతాన్ని పుట్టింటికి పంపిస్తానని చెప్పింది. దానితో ఆమెకొచ్చిన చాలా సంబంధాలు తప్పిపోయాయి. చివరికి ఒకరు ఆమె చెప్పినదానికి ఒప్పుకొని పెళ్ళిచేసుకొన్నారు. తీరా పెళ్ళయిన నెల్లాళ్ళకే ఆమె జీతాన్ని తెచ్చి తమ చేతుల్లో పోయాలని గొడవచేశారు. ఆమె వారిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేయగా, ' పెళ్ళికోసం సవాలక్ష చెబుతాం, వాటన్నిటినీ నిలబెట్టుకోవాలని ఎక్కడ ఉంది?' అని నిలదీశారు. దానితో ఆమె కాపురాన్ని వదులుకోలేక కన్నీళ్ళు పెట్టుకొంది. ఆర్ధిక సాయం అందని చెల్లెలు ఎక్కడో చిన్న ఉద్యోగం చూసుకొని, దానితో తన ఎం.ఇడి.ని పూర్తి చేసుకొంది. తరువాత ప్రభుత్వకాలేజీలో ఉద్యోగం సంపాదించుకొని, తన తమ్ముడి అభివృద్ధికోసం ఆ అమ్మాయి పెళ్ళి మానుకొంది. ఈ సంఘంలో వెలుగు చూడని యిలాంటి కధలెన్నో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని చట్టాలు రావటం వల్ల అత్తల అధార్టీ చాలావరకూ తగ్గింది. కానీ అక్కడక్కడ యిలాంటివాళ్ళు తగులుతూనే ఉంటారు. అలాగని కోడళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? అత్తగారు మెతకయితే, ఆమెపై పెత్తనం చేసే కోడళ్ళూ లేకపోలేదు" అంటూ ఊపిరికోసం కాసేపు ఆగాను.
"దీనంతటికీ మూలకారణం డబ్బు. తను కష్టపడి పెంచిన కొడుకుని చెప్పుచేతల్లో పెట్టుకోకపోతే, కోడలు తన కొడుకును అదుపులో పెట్టుకొని, తనను బయటకు అంపకం పెడుతుందేమోనన్న భయం. అలాగే తను గట్టిగా ఉండకపోతే అత్తకి తాను బానిసగా మారుతానేమోనని కోడలికి అభద్రతా భావం. ఈ అత్తాకోడళ్ళ గొడవలు పురాణాల్లో కూడా ఉన్నాయని మనవాళ్ళు చెబుతారు" వరాలిమాటలకు త్రుళ్ళిపడ్డాను.
"పురాణాల్లోనా? అదెలా?" అడిగాను.
"సరస్వతి, లక్ష్మి యిద్దరూ అత్తాకోడళ్ళు అంటారు. వారిద్దరికీ మనస్తత్వాల్లో తేడా గనుక సరస్వతి ఉన్నచోట లక్ష్మి ఉండదని, లక్ష్మి ఉన్న యింట్లో సరస్వతి కాలు పెట్టదని అంటారు. అందుకే, ఎక్కడో కొన్ని చోట్ల తప్ప, కళాప్రావీణ్యం గల ఎన్నో జీవితాలు ఆర్ధిక యిబ్బందుల్లోనే కడతేరిపోతున్నాయి.. ధనవంతుల్లో అధికశాతం కళలవైపు ఏ మాత్రం మొగ్గుచూపరు. ఈ అత్తాకోడళ్ళ వైరుధ్యాలవల్ల మగవాడు కొన్ని సందర్భాల్లో రాక్షసుడిగా మారుతున్న ఘటనలు జరుగుతున్నాయి. నా ఉద్దేశంలో యీ దేశంలో ఒక ఆడమనిషి, అది తల్లైనా పెళ్ళామైనా, మగవాడి చేతిలో మోసపోవటానికి కారణం మరొక ఆడమనిషే! అత్తాకోడళ్ళ మధ్య అన్యోన్యత పెరిగితే ఆ మగవాడు తప్పకుండా యిద్దరికీ యివాల్సిన స్థానాన్ని యిస్తాడు. అలా జరగకనే, కొన్ని యిళ్ళలో రామరావణ యుద్ధాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా మగవాడు పారిపోయినప్పుడే సుఖపడతాడు. పట్టించుకొన్నాడా? రాక్షసుడో, పిచ్చివాడో అవుతాడు."
"అందుకే పెద్దాయన, ఘంటసాల మాస్టారు పాట పాడారు. . ."నా మాటలు పూర్తికాలేదు.
"అత్తలేని కోడలుత్తమురాలు ఓలమ్మా! కోడల్లేని అత్త గుణవంతురాలు" అంటూ వరాలు పాడింది.
"గొంతు బాగానే ఉందోయి! రామాలయం పూజారితో మాట్లాడి గుళ్ళో పాటకచేరీ పెట్టిస్తానుండు. నాలుగు డబ్బులైనా వస్తాయి"
"ఎందుకూ? ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికే యిబ్బంది పడిపోతారు. ఇక నేను సంపాదిస్తేనా? దానికోసం యిద్దరూ కొట్టుకోవాలి"
"ధర్మారావుకేమో ఆచి తూచి ఖర్చు చేయమని చెబుతావు, నేను పొదుపు పాటిస్తానని దెప్పిపొడుస్తావు. నిన్నూ. . ."అంటూ తన తలపై మెల్లిగా మొట్టబోయాను. నన్ను తప్పించుకొని వరాలు పెరట్లోకి పరుగుతీసింది. అదేసమయంలో, చేయి దాటిపోతున్న తన కొడుకు బుర్రను పాడు చేసిన "ముదనష్టపోళ్ళ"పై సూర్యకాంతంగారు కట్టిన తిట్లదండకం, మా యిళ్ళమధ్య ఉన్న పిట్టగోడను దాటుకొని మా చెవుల దగ్గరకు తరలివస్తోంది.
" కొన్ని జీవితాలంతే!" అంటూ మాదంపతులం ఉమ్మడిగా నిట్టూరుస్తూ యింట్లోకి నడిచాం.
No comments:
Post a Comment