జర్నీ ఆఫ్ ఏ టీచర్ - అచ్చంగా తెలుగు
జర్నీ ఆఫ్ ఏ టీచర్ 
చెన్నూరి సుదర్శన్


అత్యంత అధునాతన మైన ఆస్టన్‍కారు సూర్యప్రకాష్ ఇంటి ముందుకు వచ్చి ఆగింది.    
అందులో నుండి నలుగురు పెద్దమనుషులబృందం దిగుతున్న దృశ్యం వారు చాలా ఖరీదైన వారని చెబుతోంది. 
నలుగురూ కూడబలుక్కొని ముందుకు నడిచారు.  
సూర్యప్రకాష్ గొంతు వినపడగానే  చటుక్కున ఆగిపోయారు. 
ఇంటి ప్రక్కనే ఉన్న పెద్ద హాల్లో నుండి వినవస్తున్న సూర్యప్రకాష్ ఉపన్యాస వాగ్ధాటి అది. 
ఇంకా క్లాసు అయిపోలేదు..కాసేపు వేచి చూద్డామన్నట్లుగా.. తమ చేతి గడియారాల వంక చూసుకుంటూ.. వారిలో వారు మాట్లాడుకోసాగారు. 
వీధిలోని సైకిళ్ళను చూస్తూ విద్యార్థుల సంఖ్య బేరీజు వేసుకోసాగారు. 
పది నిముషాలు గడిచాయి.. 
పుట్టలో నుండి వెలువడుతున్న చీమల్లా  బిల, బిల మంటూ బయటికి వస్తున్నారు విద్యార్థులు. 
వారి ముఖాలలో జలతారు మేలి మబ్బుముసుగులు విడిచిన చందమామ వెన్నెల వెలుగులు..  
విద్యార్థులు హాల్లో నుండి వీధిలోకి రావడం.. ఆగి ఉన్న కారును పదే.. పదే చూసుకుంటూ వెళ్తూండడం.. ఆ నలుగురి ఠీవి మరింత ఎగిసి పడ్తోంది. ఆ బృందనాయకుడు తన ఎడంచేతి చిటికెనవేలుతో కుడివైపు మీసాన్ని పైకి ఎగదోస్తున్నాడు.       
పిల్లల హడావుడి తగ్గాక  వారు హాల్లోకి అడుగు పెట్టారు. 
హాల్లో ఒక మూల వాటర్ ఫిల్టర్.. మరో మూల దేవాలయంలో ఉన్నట్లుగా ఒక హుండీ లాంటి పెట్టె చూసి ఆశ్చర్యపోయారు. దానిపై “చదువు మీద శ్రద్ధకు పేదరికం అడ్డురాదు” అని రాసి వుంది 
ఇంకా కొందరు విద్యార్థులు సూర్యప్రకాష్ చుట్టూ నిలబడి తమ, తమ సందేహాలను తీర్చుకుంటున్నారు. 
వారి రాక అలికిడికి పిల్లలు వెనుతిరిగి చూసి సూర్యప్రకాష్‍కు అభివాదము తెలుపుతూ వెళ్లి పోయారు.
ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు సూర్యప్రకాష్. 
“సారీ.. సార్” అంటూ తన నల్ల రేబాన్  కళ్ళద్దాలను తీసి ముందు షర్టు జేబులో పెట్టుకొని రెండు చేతులు జోడించి నమస్కరించాడు వినయంగా.. ఆ బృంద సారథి. 
అతడు ఆజాను బాహుడు.. చామనఛాయ.. బుర్ర మీసాలు.. బట్టతల.. మేడలో బంగారపు గొలుసుకు వన్నె తెస్తూ ఒదిగిన పులిగోర్ల సొగసు.. చేతి వేళ్ళకు ఉంగరాలు.. కుడిముంజేతికి నులకతాడులా బ్రాస్లెట్.. ఒంటి మీద తెల్లని ఖరీదైన ఖద్దరు దుస్తులు.. 
‘ఎవరైనా రాజకీయ నాయకుడా..!’ అన్నట్లు విస్తుపోయి చూస్తూ నిల్చుండి పోయాడు సూర్యప్రకాష్. 
“సార్.. నా పేరు కనకారావు. ‘కాంచన గంగ’ కార్పరేట్ జూనియర్ కాలేజీ వ్యవస్థాపకుణ్ణి” అంటూ సగర్వంగా ప్రకటించుకొని  “వీరంతా మా కాలేజీ లెక్చరర్లు” అని ఒక్కొక్కర్నీ పరిచయం చేసాడు.
“సార్.. నేను” అని సూర్యప్రకాష్ చెప్పబోతుండగా..
“మీ గురించి మాకు క్షుణ్ణంగా తెలుసు సార్.. మీ పేరు సూర్యప్రకాష్.. మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గణిత శాస్త్రోపన్యాసకులుగా  ఇరవై ఐదేండ్లు పని చేసారు. 
ప్రభుత్వ జూనియర్ కళాశాల గుమ్మడిదలలో దాదాపు మూడు సంవత్సరాలు ప్రిన్సిపల్‍గా పనిచేసి  రిటైరయ్యారు. 
మీరు గొప్పలు చెప్పుకునే వారు కారవి తెలుసు. కాని మీరందించిన సేవలు మేము చెప్పుకోవడంలో తప్పులేదుగదా.. 
మన టీవీలో పాఠాలు చెప్పారు. ఎంసెట్ ‘ప్రశ్నల నిధి’ పుస్తకాలు రచించారు. పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు కూర్పు చేసారు. పేపర్ రీవాల్యూయేషన్‍లో ఉన్న లోపాలను ప్రభుత్వానికి ఎత్తి చూపి మార్పులను చేయించి విద్యార్థులకు  ఎంతో మేలు చేసారు.
ప్రస్తుతం అమ్మాయిలకు, అబ్బాయిలకు విడి, విడిగా దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు ఐదారు బ్యాచీలుగా ట్యూషన్లు చెబుతున్నారు” అంటూ కనకారావు ‘సుమతీ’ శతకంలా అప్పగిస్తుంటే అవాక్కయ్యాడు సూర్యప్రకాష్.
“సార్.. ఒక్క నిముషం..” అంటూ సూర్యప్రకాష్ తాను కూర్చున్న  కుర్చీ వెనకాలే ఉన్న గుమ్మం తెరుచు కొని లోనికి వెళ్ళాడు.
“సార్.. మీరు టీలు.. కాఫీలు వగైరా ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోకండి.. మీతో కాస్తా మాట్లాడాలి.. అదీ  ముఖ్యం” అంటూ కనకారావు మొహమాటపడకుండా వాగ్భాణాలు సంధిస్తూనే ఉన్నాడు. 
మరో నిముషంలో సూర్యప్రకాష్ తిరిగి వచ్చి “కనకారావు గారూ.. మనం లోనికి వెళ్లి మాట్లాడు కుందామా.. ” అన్నాడు.
“నో.. సార్.. ఇక్కడే బాగుంది. మీరు అలా కుర్చీలో కూర్చోండి. మేమిలా బెంచీలపై కూర్చుంటాం.. మేమిప్పుడు ఒకరకంగా మీ విద్యార్థులం.. మీరు మాకు గురువులు..” అంటూ పొగడసాగాడు కనకారావు. తన మాటల చతురతకు తనకు తానే లోలోన మురిసిపోతూ.. తన బృందంవైపు చూసాడు. 
‘అవును సార్..’ అన్నట్లుగా.. ఆమువ్వురు తమ కళ్లల్లో పలువన్నెల వెలుగులు చిందిస్తూ కనకారావు వెనకాల బెంచీలపై ఆసీనులయ్యారు. 
సూర్యప్రకాష్ తన కుర్చీలో కూర్చున్నాడు.. ఆశ్చర్యంగా వారిని చూస్తూ.
“సార్.. చల్ల కొచ్చి ముంత దాచడమెందుకు.. విషయం సూటిగా చెబుతాను” అంటూ కనకారావు గొంతు సవరించుకున్నాడు. 
ఎలా మొదలు పెడితే మనుషులు వలలో పడతారో కనకారావుకు వెన్నతో పుట్టిన విద్య.  రిహార్సల్స్ వగైరా వేసుకోవాల్సిన పని లేదు.
“సూర్యప్రకాష్ సార్.. ప్రతీ రోజు నేను నాస్వంతానికి వాడుకునే ఆస్టన్ కారు.. ఇప్పుడు మేమంతా వచ్చామే అది. అదే కారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మన కాలేజీకి తీసుకు వస్తుంది. కాలేజీలో మీరు పాఠాలు చెప్పడం వగైరా పనులన్నీ పూర్తికాగానే  అదే కార్లో మా డ్రైవరు మిమ్మల్ని మీ ఇంట్లో దిగబెడ్తాడు. ఓ.కే. నా సార్..
ఇక మాకు మీరివ్వాల్సింది.. ఒకే ఒక్క చిన్నమాట.. 
మాట ఇచ్చారంటే తప్పరు. మాటే మనిషికి అలంకారం.. మీరు మాట మీద నిలబడే వారని నాకు తెలుసు. మాటంటే మాటే..
ఈ రాతపూర్వక అగ్రిమెంట్లు ఎందుకూ చెప్పండి. శుద్ధ దండుగ.. దయచేసి మీరు మాకు మాటిచ్చారంటే ధన్యుణ్ణి అవుతాను”
ఏమిటా మాట అన్నట్లుగా సూర్యప్రకాష్ ముఖ కవళికలు చూసి.. చెప్పడం కొనసాగించాడు కనకారావు.
“మా విద్యార్థులకు పాఠాలు చెప్తానని మాట ఇవ్వండి చాలు.. అదే మాకు పదివేలు. మీ ఋణం ఈ జన్మలో మర్చిపోను.
ఇప్పుడు మీరు ట్యూషన్ చెప్తూ సంపాదించే దానికన్నా నాలుగు రెట్లు అధికంగా అర్పించుకుంటాను. లేదా మీరు కోరినంత డబ్బు సమర్పించుకుంటాను. 
ఈ ట్యూషన్లు తంటాలు విశ్రాంత జీవనంలో ఎందుకు చెప్పండి.. ప్రశాంతంగా మా కాలేజీలో చెప్పండి.. ‘దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి’ అన్నట్లు ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే మంచిదని నా సలహా.. దయచేసి కాదనకండి” అంటూ కనకారావు బతిమాలే ధోరణిలో వేడుకోసాగాడు.
తన వాక్చాతుర్య మద్దతు కోసం మళ్ళీ ఓరచూపుల కాంతిని వెనక్కి ఫోకస్ చేసాడు. పెదవులపై చిరునవ్వు పులుముకుంటూ.. బుర్రమీసాలను దువ్వుకుంటూ..
“నిజమే సార్..” అని కోరస్ అందుకుంది బృందం. “ఒక్కొక్క విద్యార్థి నుండి ఫీజు కలెక్ట్ చేసుకోవడమూ.. మీకు కష్టమే. గింజుకుంటూ.. గింజుకుంటూ.. గింజలేరుకోవడం కంటే దొరికే కుప్పను దోసిళ్ళతో దాచుకోవడం తెలివైన పని” అంటూ ముఖాలలో తమ నాయకుడు ఫోకస్ చేసిన  కాంతిని పరావర్తనం చేసారు రెట్టింపు మెరుపు వేగంతో..
సూర్యప్రకాష్ దీర్ఘాలోచనలో మునిగి పోయాడు.. 
ఇంతలో ‘టీ’లు తీసుకొని వచ్చి అందరికీ అందించింది సూర్యప్రకాష్ సతీమణి. 
“నా సహచరి.. విద్యావతి” అంటూ పరిచయం చేసాడు సూర్యప్రకాష్. “ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు టీచరుగా పనిచేస్తోంది. ఇంకా నాలుగేండ్ల సర్వీసుంది”
కనకారావు ఆశ్చర్య పోవడం గమనించి “ నా విద్యావతి చదువుపట్ల ఆసక్తి గమనించి నేను స్వయంగా నా పిల్లలతో బాటుగా ట్యూషన్ చెప్పాను. తాను కష్టపడి ప్రవేశ పరీక్షలు రాసి బియ్యే డిగ్రీతో బాటు ఉద్యోగమూ సంపాదించుకుంది” అన్నాడు సూర్యప్రకాష్.
“గ్రేట్ సార్.. ఈరోజుల్లో ప్రతీ మగవాడు రడీమెడ్ బట్టలను వాడినట్లే..  రడీమెడ్ ఎంప్లాయైన  భార్య కావాలనుకుంటున్నాడు.  మీరేమో పెళ్లి చేసుకుని ఎంప్లాయిగా తీర్చిదిద్దారు. మీలాంటి వారు ప్రభుత్వ సంస్థలలో ఉండటం చాలా అరుదు..” అన్నాడు కనకారావు.. భుజాలు అంగుళం మేర ఎత్తి అరచేతులు తిప్పుతూ..
“లేకేం.. సార్! ఉన్నారు.. మంచి ప్రతిభావంతులున్నారు. మీ కార్పరేట్ కాలేజీల్లో ఒక లెక్చరర్ కొన్ని టాపిక్‍లు మాత్రమే ప్రిపేరవుతాడు. వాటినే ప్రతీ తరగతిలో వల్లె వేస్తాడు.. టేప్‍రికార్డులా. దాంతో పిల్లలంతా బాగా చెబుతున్నారని అనుకుంటారు. మరో టాపిక్ ప్రశ్న అడిగితే చెప్పలేరని వారికి తెలీదు...
ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ ఒకే ఒక్కనికి  అన్ని టాపిక్స్ చెప్పే సత్తా వుంటుంది. ఒక్కొక్క టాపిక్‍ను రక, రకాలుగా చెబుతూ పిల్లలను తీర్చి దిద్దడంలో ఏంతో నైపుణ్యం ప్రదర్శిస్తాడు.. 
మీ దగ్గర విద్యార్థుల సంఖ్యా అధికమే.. ఫెయిలయ్యే వారూ అధికమే..  
మీరు కొంత మందిని ప్రైవేటు విద్యార్థులుగా పరీక్షలు రాస్తున్నట్లు చూపించి ఉత్తీర్ణత శాతం అధికంగా ప్రకటించుకుంటారు..” అని సూర్యప్రకాష్ అనగానే ఖంగు తిన్నాడు కనకారావు. 
           “సార్.. మీకు తెలియందేముంది?. మా కాలేజీలు నడవాలి కదా.. ఏవో జిమ్మిక్కులు చేస్తుంటాం గాని.. ముందు మీరు మాకు మాటివ్వండి.. ప్లీజ్. అంత వరకు మేము కదలం” అంటూ డ్రైవర్‍ను పిలిచి కార్లో ఉన్న సరంజామ ఇంట్లో అందివ్వమన్నట్లుగా  సంకేతాలందించాడు. 
అది గమనించిన సూర్యప్రకాష్ “నో...నో...నో..” అంటూ అడ్డుకున్నాడు.
“ముందు నా అభిప్రాయం వినండి..” అంటూ చెప్పడం మొదలు పెట్టాడు సూర్యప్రకాష్.
“కనకారావు గారూ.. మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కాని నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా దారి వేరు. మీరు అనుకున్నట్లుగా నేను డబ్బులకు ఆశపడే వాణ్ణి కాదు. మీరు కాస్త సమయమిస్తే నా మనసులోని మాటను వివరంగా చెబుతాను.. సుత్తి వేస్తున్నాని అనుకోవద్దు.” అంటూ నలుగురి వంకా చూసాడు. 
“అమ్మమ్మ ఎంత మాట. సార్.. మేము ముందే చెప్పాం. మీరు మాకు గురువులు.. మేము మీకు శిష్యులం. మీరు చెబితే వింటాం. సందేహాలు అడిగి తీర్చుకుంటాం..” అంటూ కనకారావు నెమ్మదిగా బెంచీకి ఒరిగి నడుంకు  కాస్తా విశ్రాంతినిచ్చాడు.
సూర్యప్రకాష్ హృదయం తేలిక పడింది.
“సార్.. దానం అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేది. దానాలు పలురకాలు. అందులో ఒకటి చతుర్విద దానాలు..  అంటే నాలుగు రకాల దానాలన్నమాట.
ఒకటి.. ప్రాణ హాని ఉన్నదని భీతిల్లే వారికి ప్రాణ అభయమివ్వడం అభయదానమంటాం.
రెండవది.. రోగాల బారిన పడిన వారికి వైద్యం చెయ్యడం వైద్యదానం. 
మూడవది.. పేదలకు ఉచితంగా విద్యనందించడం విద్యాదానం. 
నాలుగవది.. క్షుద్భాధతో అల్లాడే వారికి ఆకలి తీర్చడం..  అన్నదానం. 
నా సర్వీసులో నేను విద్యాదానం చేసి ఎరగను.. నా కుటుంబ పోషణ కోసం.. నా పిల్లల అభివృద్ధి కోసం విద్యార్థులకు విద్యనందించాను. ఫలితంగా జీతం రూపేణా డబ్బు తీసుకున్నాను. 
అది దానం కింద రాదు.
భగవంతుని దయవల్ల నాపిల్లలు ప్రయోజకవంతులయ్యారు. వారి, వారి జీవితాలు హాయిగా గడుపుకుంటున్నారు. నాఅర్థాంగి తనూ సంపాదనపరురాలే.. నాకూ పెన్షన్ వస్తోంది.. ఇంకా నాకు డబ్బు ఝంఝాటమెందుకు? చెప్పండి. 
మనిషి బ్రతకడానికి డబ్బు అవసరమే గాని డబ్బు కోసమే మనిషి బ్రతకడం.. అది రాక్షసత్వమనిపించు కుంటుదని నాఅభిప్రాయం. 
నావిశ్రాంత జీవనంలో నాకు వీలైనది విద్యాదానం చేయాలనుకున్నాను.. చేస్తున్నాను. 
నా విద్యావతి సైతం ప్రస్తుతం తన తీరిక వేళల్లో వయోజనులతో అక్షరాలు దిద్దిస్తోంది. పదవీ విరమణ అనంతరం పూర్తి స్థాయిలో విద్యాదానం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. 
ఆ మూలకున్న పెట్టె చూడండి.. అది ఒక రకంగా మాకు అక్షయ పాత్ర. అందులో  కొంత మంది కలిగిన 
విద్యార్థులు తమకు కలిగిన మేరకు పొదుపు చేస్తుంటారు. ఆ డబ్బును నిరుపేద విద్యార్థులు పరీక్ష ఫీజులకు తదితర ఖర్చులకు వాడుకుంటారు.. 
దానికి తోడు నాకు వచ్చే పెన్షన్ డబ్బుల్లో అధిక శాతం  అదే పెట్టెలో పొడుపు చేస్తాను.
ఇందులో నాకు తృప్తి ఉంది. నేను ఎంతో ప్రశాంతంగా నా విశ్రాంత టీచరు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా ను.        
ఈ మధ్య ఈనాడు ఆదివారం అనుబంధంలో చదివారా.. 
అమెరికాలో చదివిన అలోక సాగర్ అనే ఒక ఐ.ఐ.టి. ప్రొఫెసర్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి మధ్యప్రదేశ్‍లో ఒక మారుమూల ప్రాంతంలో గిరిజనులకు సేవ చేస్తూ తరిస్తున్నాడు. నాది అంతకంటే గొప్ప నిర్ణయమేమీ కాదు.                                                                   
దయచేసి మీరు నాకు అడ్డు రాకండి. మీ కాలేజీలో పాఠాలు చెప్పడానికి మీకు ఎంతో మంది దొరుకుతారు. కాని ఇలాంటి బీదపిల్లలకు విద్యాదానం చేసే వారు దొరకడం అరుదు. నన్ను మన్నించండి” రెండు చేతులు జోడించాడు సూర్యప్రకాష్. 
ఈ వయసులో శత్రువులయినా.. దుర్మార్గులయినా.. స్నేహపూర్వకంగా చేతులు జోడించడం ఉత్తమమని సూర్యప్రకాష్ అలవాటు చేసుకున్నాడు.
కొయ్యబారి పోయాడు కనకారావు.
గేలానికి ఎర వాటంగా గుచ్చి ధీటైన మరచేపను పట్టాలని కలలుగన్న కనకారావుకు కళ్ళు గిర, గిరా తిరిగాయి. తన ఆశాసౌధాలన్నీ నేలమట్టమయ్యాయి. కళ్ళల్లో ఓటమి తాలూకు చిహ్నాలేవీ అగుపడకుండా తిరిగి నల్ల కళ్ళజోడెక్కించాడు.
‘డబ్బుకు లోకం దాసోహ’ మనే  కనకరావు వాదన.. సూర్యప్రకాష్ బోధనకు దాసోహమంది.      
నీళ్ళు నములుతూ.. చేసేదేమీ లేక ప్రతి నమస్కారం చేస్తూ  వెనుతిరిగాడు కనకారావు. 
సంచీలోని సరంజామాతో ఎదురైనా డ్రైవరుకు రివర్స్ గేర్ వేయుమన్నట్లుగా చేతితో  సంకేతాలిచ్చాడు.
కనకారావు అతడి బలగం వెనుదిరిగి  వెళ్ళడం.. తృప్తిగా శ్వాస పీల్చుకున్నాడు సూర్య ప్రకాష్. 
ప్రభుత్వ కాలేజీ అంటే ఎందుకంత లోకువ.. అని మనసులో అనుకుంటూ ఇంట్లోకెళ్ళి  హాల్లో వున్న వాలుకుర్చీలో కుర్చీలో కూర్చోబోతుంటే..
“వెళ్ళిపోయారా.. ఎదో మాటా.. మూటా.. అని వినవచ్చింది” అంటూ వచ్చింది విద్యావతి.
చిరునవ్వు నవ్వుతూ విషయం చెప్పబోయాడు సూర్యప్రకాష్. ఇంతలో కుక్కర్ ఈలవేసి పిలిచేసరికి ‘అ.. వస్తున్నా..!‘ ఆన్నట్లుగా వంటిట్లోకి పరుగు తీసింది. చిరునవ్వునలాగే కొనసాగిస్తూ.. “నేనలా  ఈల వేసి  సైగ జేస్తే పరుగెత్తుకుంటూ వస్తావా విద్యా.. అన్నాడు కొంటెగా. విద్యావతి వెనుతిరిగి.. చిలిపి చూపుల నవ్వుల  బాణం వదిలింది. ఆ మరుల బాణాన్ని తన గుండెల్లో పదిలపర్చుకోబోతుంటే అతడి పదవీ విరమణ సభలో విద్యావతి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. 
ఆనాడు విద్యావతి మాట్లాడుతూ “నేను మావారికి రెండవ భార్యను” అంది. ‘నిజమా..!’ అన్నట్లు సభ యావత్తు విస్తుబోయింది. వెనువెంటనే.. “మొదటి భార్య ఉద్యోగమంది” సభలో చప్పట్లు.. చప్పట్లు.. చప్పట్లు.
“నిజమే.. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను తను పెనవేసుకున్న దృశ్యాలు అంతరంగంలో అలలు అలలుగా కదలాడసాగాయి. అలాగే వాలు కుర్చీలో వెనక్కి వాలిపోయాడు.    
***

(సశేషం)

1 comment:

  1. మనం కలిసి కొన్ని సంవత్సరాలే ఉద్యోగం చేసినా నేటికీ మన స్నేహం చేరగా లేదు. ఆ చక్కని అనుభూతులను ఇక్కడ కథల రూపంలో వ్రాయడం ఆనంద దాయకం. ఉద్యోగం చేతప్పుడు ఉండే ఏ ఒక్క భావనను మర్చి పోలేదు.అభినందనలు.
    గొట్టుముక్కుల బ్రహ్మానందము~విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడు~వ్యక్తిత్వ వికాస ప్రేరణాత్మక ఉపన్యాసకుడు.

    ReplyDelete

Pages