నాన్న మనసు - అచ్చంగా తెలుగు
నాన్న మనసు
అక్కిరాజు ప్రసాద్ 

"నాన్నా! ఎలా ఉన్నారు?"
"బానే ఉన్నానమ్మ!"
"మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాకింగుకు వెళుతున్నారా? మోకాళ్ల నొప్పులున్నా సరే వాన అనో ఇంకోటనో మానకండి. రైస్ ఎక్కువగా తినకండి. షుగర్ పెరిగిపోతుంది. అమ్మకు ఇబ్బందవుతుంది..."
"అలాగే.."
"సరే నాన్నా, మళ్లీ తీరిగ్గా మాట్లాడతా. ఫోన్ అమ్మకు ఇవ్వండి."
"ఏవోయ్! ఇదిగో అమెరికా నుండి అమ్మాయి శ్రావణి ఫోన్"... అని అరవై ఐదేళ్ల సదాశివం భార్య పార్వతిని పిలిచాడు.
"ఆ వస్తున్నాను...అని పార్వతి వచ్చి ఫోన్ అందుకుంది.
"ఏమ్మా! ఎలా ఉన్నావు? అన్నట్లు మీకిప్పుడు టైమెంత? నిన్న ఫోన్ చేస్తానన్నావు, చేయలేదు....అడగటం మరచిపోయా! ఆవకాయ, మాగాయ తిన్నారా! అల్లుడిగారికి నచ్చాయా?"
"బాగున్నాయమ్మా! ఆయనకు ఒక పట్టాన ఏవీ నచ్చవులే అమ్మా!..."
మొదలైంది తల్లీ కూతుళ్ల ఫోన్లో రామాయణం...అదే ఊసుపోక లోకాభిరామాయణం. 

"వీళ్లు మారరు కదా" అనుకుని నిట్టూర్చాడు సదాశివం. "బిడ్డను ఎంత అల్లారు ముద్దుగా పెంచాను? భుజాల మీద ఎత్తుకు తిరిగాను, బడిలో దింపాను, పరిగెడుతుంటే ప్రోత్సహించాను, ఏడిస్తే షికారు తిప్పాను...ఒక్క విషయం కూడా గుర్తుకు లేనట్లు నాతో రెండే రెండు పొడి మాటలు, తల్లితో గంటలు గంటలు...నెలకు ఒక్కసారి కూడా ప్రేమగా కూతురి పలకరింపు నోచుకోలేదా నేను, ఏం పాపం చేశాను? దీనికన్నా అల్లుడే నయం, ప్రేమగా పలకరిస్తాడు..." అని లోలోపల బాధపడ్డాడు. 

"ఏమైందండీ! అలా ఆలోచనలో పడ్డారు" అని గంట తరువాత పార్వతి అడిగింది. "ఏమీ లేదు పార్వతీ! నీతో పాటు నేను కూడా సమానంగా కష్టపడి పెంచాను కదా, ఇప్పుడు నా వృద్ధాప్యంలో పిల్లకు నా ధ్యాసే లేదు. ఎంత సేపూ ఎక్కడలేని కబుర్లన్నీ నీతోనే. అవన్నీ నాతో మాట్లాడాలని కాదు. నాతో కూడా కొన్ని విషయాలు పంచుకోవచ్చు కదటే? ఎందుకలాగా?" అని బాధ పడ్డాడు సదాశివం. 

"అలా ఏముందండీ. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆడపిల్లలకు తల్లితో చనువు, అంతే!" అని అక్కడి నుంచి వెళ్లిపోయింది పార్వతి. 

"శ్రావణి నాతో ఎలా పొడి పొడిగా మాట్లాడుతుందో, నీతో ఎంత ఉత్సాహంగా మాట్లాడుతుందో నీకు అర్థం కాదులే పార్వతీ!" అనుకుని సదాశివం మడత కుర్చీలో వెనక్కి వాలాడు. అంతలోనే మళ్లీ ఆలోచనలు. నిజమే. ఆడపిల్లలకు తల్లితోనే ఎక్కువ అనుబంధం కదా. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో! అని పరిప్రశ్నలు వేసుకున్నాడు. మనసు అశాంతిగా మారిపోయింది. 

"అయ్య గారూ! అమ్మ గారు బాత్రూములో జారిపడ్డారాండీ. తలకు రక్తం కారుతోంది, కాళ్లు చేతులు ఆడట్లేదండీ" అని గాభరగా పని మనిషి లక్ష్మి పరుగెత్తుకుంటూ వచ్చి సదాశివంతో చెప్పింది. అతృతగా వెళ్లి చూసిన సదాశివానికి నోటమాట రాలేదు. వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. పార్వతికి రక్తపోటు వల్ల పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు. శ్రావణికి విషయం తెలిసింది. కంగారుగా సదాశివానికి ఫోన్ చేసింది. 

"నాన్నా! ఇలా ఎలా జరిగింది? అసలేమైంది?"
"తెలియదమ్మా! పొద్దునంతా బానే ఉంది. సడెన్‌గా ఇలా..."
"నాన్నా! అమ్మ బీపీ మందు వేసుకుంటుందో లేదో తెలుసా"
"వేసుకుంటూనే ఉండాలి శ్రావణి...మీ అమ్మ అలా మందులు మానేసే మనిషి కాదు..."
"మందులు వేసుకుంటే బీపీ ఎందుకు అంత ఎక్కువ అవుతుంది నాన్నా? అయినా నిన్ను అడిగి ఏం లాభం? నీకు అమ్మ గురించి ధ్యాస ఉంటే కదా?"
"అలా ఏమీ లేదు శ్రావణీ! అమ్మ, నేను వాకింగుకు వెళతాము, తిండి విషయంలో కూడా అమ్మ జాగ్రత్తగానే ఉంటుంది..."
"ఏమో నాన్నా! అన్నీ సరిగ్గా చేస్తే ఇలా ఎందుకు అవుతుంది? మీకు ఎంత సేపు మీ ప్రపంచమే. అమ్మ సంగతి పట్టదు. ఇప్పుడు చూడండి ఏమయ్యిందో. మీరు అమ్మ గురించి శ్రద్ధ చూపించి ఉంటే ఈరోజు అమ్మ కోమాలో ఉండేది కాదు నాన్నా! నేను చిన్నప్పటినుంచీ చూస్తునే ఉన్నాను. మీకు ఎంత సేపు ఆ న్యూస్ పేపర్, న్యూస్ ఛానెల్స్, మీ స్నేహితులు, పుస్తకాలు...ఇల్లు, అమ్మ ఎంత కష్టపడుతుందో ఏమీ తెలియదు...ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఇండియా రాలేను...అమ్మను మామూలు చేయాల్సిన బాధ్యత మీదే..."

శ్రావణి మాటలు వినలేక ఫోన్ పెట్టేశాడు సదాశివం. ఒక పక్క భార్య కోమాలో ఉందని బాధగా ఉంటే, శ్రావణి మాటలు మనసును ఎంతో గాయపరచాయి. జీవితమంతా కష్టపడి ఉద్యోగం చేసి, శ్రద్ధగా పిల్లను చదివించి, పెళ్లి చేస్తే చివరకు మిగిలింది ఇదా? అనుకుని ఆ రాత్రంతా కుమిలి పోయాడు. మరునాడు పొద్దునే తన ధర్మం నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాడు. కూతురు మాటలను పక్కకు పెట్టి పార్వతి కోలుకునేందుకు శత విధాలా ప్రయత్నించాడు. హైదరాబాదులోని బెస్ట్ డాక్టర్లను సంప్రదించి పార్వతి కేసును రివ్యూ చేయించాడు. సదాశివం శ్రమ వృథా పోలేదు. 10 రోజుల డాక్టర్ల భగీరథ ప్రయత్నాల అనంతరం పార్వతి స్పందించటం మొదలు పెట్టింది. ఓ వారం తరువాత పార్వతిని ఇంటికి పంపించారు. 

"నాన్నా! అమ్మకు ఎలా ఉంది? నాకు వివరాలు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఎలాగైనా అమ్మ వీలైనంత త్వరగా కోలుకోవాలి"...శ్రావణి తన ధోరణిలో తండ్రికి సలహాలు. సదాశివం మౌనాన్ని పాటించాడు. దేనికీ సమాధానం చెప్పలేదు. శ్రావణి కోరినట్లు వివరాలు ఏమీ పంపలేదు. ఇంటికి తీసుకు వచ్చిన దగ్గరి నుండి అత్యంత శ్రద్ధతో పార్వతికి ఫిజియోథెరపీ, నడిపించే ప్రయత్నం చేయటం, ప్రతి ఒక్క విషయంలోనూ పసిపిల్లలా చూసుకున్నాడు. రోజుకు 14-15 గంటల పాటు ఈ సపర్యలు. ఏ ఒక్కరి సాయమూ తీసుకోలేదు. 

"నాన్నా! అమ్మ ట్రీట్‌మెంటు కోసం డబ్బులేమైనా కావాలా? మొన్నీ మధ్యనే ఇల్లు కొనుక్కున్నాము. అయినా నా సేవింగ్స్ నుండి పంపించమంటే పంపిస్తాను...."
"మీ అమ్మకు కావలసింది డబ్బు కన్నా సేవ శ్రావణీ!" అని సమాధానం చెప్పాలనుకొని కూడా మౌనంగా ఉన్నాడు సదాశివం. నెలరోజుల తరువాత పార్వతి మాట్లాడటం మొదలు పెట్టింది. "ఏవండీ! శ్రావణి వస్తానంది చెప్పిందా? ఈ ఖర్చులన్నీ ఎలా పెడుతున్నారు? నాకు టెన్షన్ గా ఉంది.." "కంగారు పడకు పార్వతీ! మన వృద్ధాప్యం కోసం గత ఇరవై ఏళ్లుగా నెలకు ఐదు వేలు దాచాను. ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి..." అన్నాడు సదాశివం. భర్త ప్రణాళికకు, ముందుచూపుకు ఆశ్చర్యపోయింది పార్వతి. సదాశివం పట్టుదలతో, ప్రేమానురాగాలతో, సేవాభావంతో పార్వతి 4 నెలలలో నడవగలిగే పరిస్థితికి చేరుకుంది. ఈ నాలుగు నెలలూ తాను ఎంత శ్రమ పడిందీ, ఎంత ఖర్చు పెట్టింది, ఎలా ఇద్దరికీ రోజులు గడిచాయి అన్న వివరాలేవీ సదాశివం శ్రావణికి చెప్పలేదు. పార్వతికి ఈ నాలుగు నెలల్లో వాస్తవాలు అర్థమైనాయి. ఒక్క మారు కూడా శ్రావణి ఫోన్ కాల్స్‌లో తాము ఎలా నెట్టుకు వస్తున్నాము, నాన్న ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడు అన్న విషయమే అడగలేదు అన్నది గమనించింది. ఆరోజు భర్త ఫోన్లో శ్రావణి తనతో పొడిపొడిగా మాట్లాడినందుకు ఎందుకు బాధ పడ్డాడో అర్థమైంది. 

"నాన్నా! నేను క్రిస్మస్ సెలవల సమయంలో పిల్లలతో అమ్మను చూడటానికి వస్తున్నాను. చలికాలం కదా, పిల్లలకు జ్వరాలు, జలుబులు రాకుండా కాస్త్ర ఇల్లు శుభ్రం చేయించండి, దోమతెరలు కొనండి..." అని చెప్పింది. శ్రావణి వచ్చింది. ప్రయాణంలో భర్త లేకుండా ఇద్దరు పిల్లలతో రావటం ఎంత కష్టమైందో, విమానాశ్రయాలలో పిల్లల వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగాయో ఏకరవు పెట్టింది. అవసరార్థం అమ్మను పలకరింపులు, అమ్మ మామూలు కావటానికి ఇంకా ఎన్నాళ్లు అని నాన్నను ప్రశ్నలు...అన్నీ అయిపోయాయి. ఒకరోజు "పిల్లలకు బోర్ కొడుతోంది పార్కుకు తీసుకు వెళ్లండి నాన్నా" అని శ్రావణి సదాశివాన్ని అడిగింది. అలాగే, అందరం వెళదాము అని బొటానికల్ గార్డెన్‌కు అందరు ఆ సాయంత్రం వెళ్లారు. శ్రావణి కూతురు సమీర ఆడుకుంటూ దబ్బున కిందపడబోయింది. ఒక్క అడుగు అవతలకు పడితే పెద్ద గుంటలో పడేది. పిల్లను గమనిస్తున్న సదాశివం ఒక్క ఉదుటున లేచి వెళ్లి మనవరాలి చేయి పట్టుకుని లాగి పెద్ద దెబ్బ తగలకుండా కాపాడాడు. శ్రావణికి గుండె ఆగినంత పనైంది. ఇద్దరు పిల్లలతో ఇండియా వచ్చాను, సమయానికి మా ఆయన లేడు చూశావా నా కష్టాలు అని తల్లితో అంది. అదే సమయం అని గ్రహించిన పార్వతి శ్రావణిని దగ్గరకు పిలిచింది. "అలా ఒక రౌండ్ తిరిగి వద్దాము శ్రావణీ, కాస్త నా చేయి పట్టుకో" అని చెప్పి తల్లి కూతురి సాయం తీసుకుని నెమ్మదిగా నడుస్తూ మాట్లాడటం మొదలు పెట్టింది. 

"శ్రావణీ! నీకు నాలుగేళ్ల వయసు. మనమందరం విశాఖపట్నం వెళ్ళాము. బీచ్‌లో అందరూ ఆనందంగా ఆడుకుంటున్న సమయం. నేను కాస్త దూరంగా కూర్చున్నాను. ఒక్క క్షణంలో నువ్వు నాకు కనిపించలేదు. ఇప్పుడు నువ్వు సమీర కింద పడబోతుంటే ఎంత కంగారు పడ్డావో దానికి వెయ్యి రెట్లు కంగారు పడ్డాను. నాకు ఈత రాదు. నేను ఆలోచించే లోపు నాన్న నీళ్లలోకి దూకారు. ఐదు నిమిషాల తరువాత నిన్ను తన భుజాన వేసుకుని ఈదుకుంటూ బయటకు వచ్చారు. నాన్న ఆ రోజు మన పక్కన లేకపోతే? అదే నాన్న ఈరోజు మన పక్కన లేకపోతే? ఒక్కసారి ఊహించు.." 

నాన్న జీవితమంతా మన కోసమే, మన ఆనందం కోసం, మన రక్షణ కోసం. నువ్వు టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు పబ్లిక్ పరీక్షల రెండు వారాల ముందు నీకు విపరీతమైన జ్వరం. ఇంట్లో బామ్మ మంచాన. నేను ఆవిడను చూసుకుంటే నాన్న నిన్ను చూసుకున్నారు. జ్వరం తగ్గేంత వరకు రాత్రింబవళ్లు నీ పక్కనే ఉన్నారు, పరీక్షలకు ప్రిపేర్ అవ్వటానికి నీకు సాయం చేశారు. నువ్వు తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దారు. ఒక్కగానొక్క బిడ్డవని కంటికి రెప్పలా కాపాడారు. నీకు ఆయనకు మధ్య అంతరం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అమెరికాకు వెళ్లిన తరువాత నీకు ధ్యాస అంతా నీ మీదే. తండ్రిగా ఆయన నీతో నడచిన అడుగులను మరచిపోయి కేవలం నీ అవసరాల కోసం, నీ మానసిక సంతృప్తి కోసం నాతో ఎక్కువ మాట్లాడటం వలన. ఒక్క 2-3 రోజులు మీ ఆయన నీతో లేనందుకు నువ్వు ఎంత ఇబ్బంది పడి మా సానుభూతి కోరుకున్నావో చూశావా? మరి అదే నాన్న 25 ఏళ్లు నీకు ఎన్ని చేశారో ఎప్పుడైనా ఆలోచించావా? ఇది చాలా అన్యాయం శ్రావణీ! నువ్వు చేస్తున్న తప్పుల్లో నాకు కూడా భాగముంది. నేను జబ్బున పడేంత వరకూ నాన్నతో నువ్వు ఎలా మెలగుతున్నావో నేను గమనించి నిన్ను సరిదిద్దలేదు. నాలుగు నెలలు నాన్న నాకు చేసిన సేవ నువ్వు ఊహించలేనిది. రోజూ మాట్లాడే నువ్వు నాకోసం ఒక్క వారం కూడా రాలేకపోయావు, నాన్నకు సాయంగా నిలబడలేక పోయావు. అరవై ఐదేళ్ల వయసులో ఆయన విశ్రాంతి కోరుకునే సమయంలో, నాకు అహర్నిశలూ సేవ చేయాల్సి వచ్చింది. శ్రావణీ! మనవాళ్లు అనుకునేది కష్టకాలంలో నిలబడతారు అన్న దాని బట్టే. కన్న కూతురువైన నువ్వే మాకు అండగా నిలబడలేకపోయావు. నాకు చాలా బాధగా అనిపించింది. అయినా, నేను నీతో చెప్పలేకపోయాను. 

శ్రావణీ! ఆడవాళ్లు మాట్లాడి మనసులోని భావనలను తేలిక పరచుకుంటారు. మగవారికి అలా కాదు. అన్నీ చెప్పుకోలేరు. కానీ, వాళ్లకు కూడా ప్రేమానురాగాలు పొందాలని, జీవిత చరమాంకంలో పిల్లల ఆనందంలో భాగస్వాములుగా ఉండాలని మనసులో ఉంటుంది. తప్పకుండా అవతలి వారి నుండి చేతలలో, మాటలలో సాంత్వన వారికి లభించాలని కోరుకుంటారు. నువ్వు అది ఏ రోజూ ఆయనకు ఇవ్వలేదు. ఆలోచించు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నాన్నకు ఏమి కావాలో, ఆయనతో ఎలా ఉండాలో నిర్ణయించుకుని మసలుకో. గతమంతా ఆయన ఒక్క క్షణంలో మరచిపోయి నిన్ను క్షమిస్తారు..."

శ్రావణికి నోట మాట రాలేదు. కంట నీరు జలపాతమై ఉప్పొంగింది. గతస్మృతులు పెల్లుబికి ఆ పితృమూర్తి పట్ల ఆరాధనా భావం, తన తప్పులపట్ల అపరాధ భావం ఒకే సారి కలిగి ఆత్మశోధనకు దారి తీశాయి. తల్లి తనకు కలిగించిన కనువిప్పుకు మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది. 

"నాన్నా! ఈరోజు సమీర పుట్టిన రోజు. మీరు ఆశీర్వదించాలి. మీరు చిన్నప్పుడు నా పుట్టినరోజు సందర్భంగా నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం నా బిడ్డకు నేను ఇస్తున్నాను. మీరు నా వెంటుండి అందించిన విలువలు, నా వెన్నంటి కలిగించిన ధైర్యం, నా విజయం కోసం చేసిన కృషి...వాటి వలనే ఈనాటి నా అస్తిత్వం. స్వార్థంతో నేను వేసిన తప్పటడుగులను చిన్నప్పటిలాగనే క్షమించండి. మళ్లీ మీ బిడ్డగా మీ భావనలను పంచుకొనే ప్రయత్నం చేస్తాను..." అని కన్నీటితో నమస్కరించింది. తండ్రి హృదయం కరిగింది. పార్వతి దూరంగా నిలుచుని సదాశివానికి నమస్కారం చేసి బిడ్డను, తనను క్షమించమని కనుసైగ చేసింది. నాన్న మనసు ఉప్పొంగి వయసు ఓ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. 

(బాధ్యతగా, క్రమశిక్షణతో, ప్రేమానురాగాలు అందిస్తూ, కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన మా నాన్న లాంటి మంచి నాన్నలకు ఈ కథ అంకితం)

3 comments:

Pages