కష్టాల్లో సానుకూల స్పందన
బి.వి.సత్య నాగేష్, ప్రముఖ మానసిక నిపుణులు
అసలే కష్టాలు. అందులో సానుకూలంగా స్పందించాలంటే కష్టమే. కాని సానుకూల దృక్పధం వల్ల ఎన్నో లాభాలున్నాయని వింటూనే ఉన్నాం. ఆచరించిన వారికి మంచి ఫలితాలొస్తున్నాయి. కాని ఇంకా నిరాశాజీవులు ప్రతికూలంగా స్పందిస్తూనే వున్నారు. మనం విన్న ఒక కధను మరొకసారి ఈ సందర్భంలో గుర్తు చేసుకుందాం.
ఒక ఊళ్ళ ఒక యజమాని దగ్గర ఒక ముసలి గాడిద వుండేది, ఆ గాడిద ఒక నాటి రాత్రి నీరు లేని బావిలో పడిపోయింది. అక్కడి నుంచి బయటపడే మార్గంలేక బాధతో అరవటం మొదలెట్టింది. ఆ గాడిదను బయటకు తీసే ఖర్చు చాలా ఎక్కువ కనుక దాని మీద మట్టి పోసి అదే బావిలో పూడ్చేయాలని
యజమాని నిర్ణయించుకున్నాడు. తెల్లవారేటప్పటికి బావి పూడ్చేయాలని తట్టలతో మట్టిని బావిలో వేయడం మొదలుపెట్టాడు. చాలా మట్టితో పూడ్చేడు. ఇక పూడ్చడం పూర్తయిపోతుందన్న సమయంలో ఎవరో యజమానిని గట్టిగా తన్నినట్లని పించింది. చూస్తే! ఇంకెవరో కాదు, ఆ గాడిదే. ఎలా బయట పడిందోనని యజమాని కలవర పడ్డాడు. మరి గాడిద పైకి ఎలా వచ్చిందో మనం కూడా చర్చించు కోవాలి కదా!
ఒక్కొక్క తట్ట మట్టి తన మీద పడుతున్నపుడు, ఆ మట్టిని దులుపుకుని ఒక మెట్టగా చేసుకుని మట్టిపై నిలబడి, చివరగా యజమానిని ఒక్కసారిగా తన్ని పారిపోతుంది. అంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూలంగా స్పందిస్తే కష్టాల్లో నుంచి బయట పడగలమని, బుద్ధిలేదనుకునే గాడిద కూడా నిరూపిం చింది. మరి మనుషులు ఇంకెంత సానుకూలంగా ఉండాలో కదా!
హైదరాబాద్ మహానగరం శివార్లలో నివసించే రుదీనా బేగం అతిక్లిష్టమైన పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించి ఎవరూ ఊహించని తీరులో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో 98.4% మార్కులు సాధించగలిగింది. వివరాల్లోకి వెళ్దాం.
పదవ తరగతి పరీక్షల్లో 92.16% మార్కులు సంపాదించిన రుబీనా హైదరాబాద్ మహానగరంలో అయిదవ స్థానాన్ని కైవనం చేనుకుంది. మహానగరంలో ఎంతో చదువుకున్నవారు, ధనికులు, ఉన్నత పదవులు, వ్యాపారాలు వున్నవారి పిల్లలందరితో పోటీపడి అయిదవ స్థానం దక్కించుకున్న రుదీనా బేగం గురించి తెలుసుకోవలసిండెంతో వుంది.
తండ్రి ఓ టీ హోటల్లో దినసరి కూలీగా పనిచేస్తున్నారు. పనికి వెళ్ళిన రోజు వంద రూపాయిల సంపాదన వస్తుంది. తల్లి దర్జీ పనిచేస్తూ కుటుంబ పోషణకు ఎంతో కొంత ఆసరాగా ఉంటోంది. మొత్తం ఆరుగురు సభ్యులునన్ని ఈ కుటుంబానికి అదే మొత్తం సంపాదన. వీరి నివాసం చిన్న గది మాత్రమే. అది కూడా స్మశానం ప్రక్కనే, పదవ తరగతి పరీక్షలకు రాత్రిపూట చదువు కుంటున్నపుడు స్మశాన వాతావరణంలో రుబీనాకు భయంగా ఉందేది. అంతేకాదు, శవం కాలుతున్నపుడు వెలువడే వాసన చాలా వెగటుగా, వికారంగా వుండడం వల్ల ఒకోసారి కడుపులో తిప్పింట్టుండేది.
ఈమె చాలా సానుకూలంగా స్పందించింది.ఇంత నిశబ్ద వాతావరణం చదువుకు ఎంతో తోడ్పడుతుందనే భావనతో స్మశాన వాతావరణాన్ని నిశ్శబ్ద
వతారవణంగా భావించి, కృషి చేసి పదవతరగతి పరీక్షల్లో అయిదవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంటర్మీడియెట్లో రాష్ట్రంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలని ఎంతో కృషి చేసి 98.4% స్థానాన్ని మార్కులతో రాష్ట్రంలో అయిదవ సాధించింది. అన్ని వనరులూ వుండి కూడా ఏమీ సాధించలేనివారు సిగ్గుపడేటట్లు నిరూపించింది రుదీనా బేగం. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూల దృక్పధంతో స్పందించడం అంటే ఇదే.
చిరంజీవి అనగానే మనకు గుర్తుకొచ్చేది మెగాస్టార్, కాని మీరు ఇపుడు చదవబోయేది - ప్రతికూల పరిస్థితుల్లో పోరాడి సానుకూలంగా పరిస్థితులనెదుర్కొంటున్న ఒక యువకిశోరం గురించి.
చిరంజీవి తండ్రి అదిలాబాద్ క్రాంతినగర్లో ఒక హమాలి (కూలీ). క్రమంగా ఆయన త్రాగుడుకు బానిసయ్యేడు. చిరంజీవికి మూడేళ్ళ వయసున్నపుడే అతని తల్లి కన్ను మూసింది. తండ్రి మరొక పెళ్ళి చేసుకుని, చిరంజీవిని సాంఘిక సంక్షేమ హాస్టల్లో చేర్చి తన దారి తను చూసుకున్నాడు. చిరంజీవి ఎప్పడైనా ఇంటికి వెళ్తే అతని పిన్ని (సవతి తల్లి) కొట్టేది. దెబ్బలు తినేకంటే డబ్బులు సంపాదించుకునే మార్గం వెదుకుదాం అని ఆలోచించేడు. సెలవు రోజుల్లో హాస్టల్ స్నేహితులు వారి వూర్లు వెళ్ళేవారు.ఏ నీడాలేని చిరంజీవి సెలవుల్లో మట్టి, రోడ్లు పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే వాడు. ఈ విధంగా పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పూర్తి చేసాడు. తరువాత డిగ్రీలో చేరాడు. కాని చిరంజీవి కోరిక డాక్టరవటం. డిగ్రీ చదువుకు స్వస్తి చెప్పి స్నేహితుడి పుస్తకాల సహకారంతో ఎంసెట్ కు నాంది పలికాడు. హోటళ్ళలో, మద్యం షాపులలో మూడు సంవత్సరాల పాటు పనిచేసి నలభై వేల రూపాయిలు సంపాదించాడు. కోచింగ్ తీసుకున్నాడు. మొదటి ప్రయత్నంలో రాకపోయినా సాధన చేసి మొత్తానికి ఎం.బి.బి.యస్ లో సీటు సంపాదించుకున్నాడు. మహబూబ్ నగర్ లోని ఎస్.వి.ఎస్ మెడికల్
కాలేజీలో మెడిసిన్ చదివాడు.
చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న చిరంజీవి ఇంగ్లీష్ పై కూడా పట్టు సాధించాడు. ఎటువంటి ఆర్ధిక స్తోమత లేని కారణం
వలన ఖాళీ సమయంలో ఏదో ఒక పని చేస్తూ తన
ఎం.బి.బి.ఎస్. చదువును కొనసాగించేడు. ఇంటర్మీడియెట్లో కొన్ని నబ్జెక్ట్లు ఫెయిల్ అయినవారిని, ఎంసెట్ (మెడికల్) పరీక్షల్లో ఎన్నోసార్లు వ్రాసి ఉత్తీర్డులు కాలేక ఆశలు వదులుకున్న వారిని ఎందరినో చూస్తున్నాం. ఎటువంటి ఆధారం లేని మన చిరంజీవి అభినందనీయుడు. ఇది కేవలం కష్టాల్లో సానుకూల దృక్పధం వల్ల మాత్రమే సాధ్యమైంది.
కనుక కష్టాల్లో కూడా సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటే కొన్నాళ్ళకు అది ఒక అలవాటుగా మారి జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుందని గట్టిగా నమ్మి, ఆచరించి లక్ష్యాలకు చేరువవుదాం.
No comments:
Post a Comment