శ్రీ మద్భగవద్గీత -15
6వ అధ్యాయము - ఆత్మసంయమయోగము
రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు
09482013801
ప్రాప్యపుణ్యకృతాంలోకా
నుషిత్వాశాశ్వతీః సమాః
శుచీనాం శ్రీమతాంగేహే
యోగభ్రష్టో బిజాయతే - 41వ శ్లోకం
యోగ భ్రష్టుడు మరణానంతరము పుణ్యలోకములను పొంది, అచట అనేకవత్సరములు వశించి, తదుపరి పరిశుద్ధులైనట్టి, సదాచారవంతులైన శ్రీమంతుల గృహమునందు పుట్టుచున్నాడు.అటుల జన్మించి తానిదివరలో విడిచిపెట్టి వెళ్ళిన యోగాభ్యాసమును మరలా కొనసాగించును.సదాచారపరులైన శ్రీమంతుల ఇంట దారిద్ర్యబాధలెవ్వియునుండవు. సదాచారపరులైనందు వలన భోగవిలాసాది దుశ్చేష్ట లేవియులేకుండును.అందువల్ల ఆ ఇంట పుట్టిన యోగాచారపరాయణునకు అభ్యాసము కొనసాగించుటకు అనువైన వాతావరణము పరమాత్మ కలుగజేయుచున్నాడు.పేదవారైన సదాచారసంపన్నుల ఇంట యోగబ్రష్టుడు జన్మించినచో అచట సామాన్యభోజనాది అవసరాల నిర్వహణకై హెచ్చుగా శ్రమించవలసి వచ్చును.తత్ఫలితముగా యోగాభ్యాసమునకు అంతరాయము కలుగును.దారిద్ర్యములేనట్టి, దురాచారములులేనట్టి ఇండ్లయందే యోగబ్రష్టుని భగవంతుడు జన్మింపచేయుచున్నాడు. సాధకులపై యోగులపై భగవంతునికి ఎట్టి అవ్యాజమైన కరుణగలదో దెలియుచున్నది.
క్రియాయోగమార్గమును విశ్వవిఖ్యాతమొనర్చి భారతీయయోగవిశిష్టతను అమెరికాలో విశదీకరించి లక్షలాది శిష్యులను అమెరికాలో తయారుచేసి క్రియాయోగ పరంపరను క్రమానుగతమొనర్చి ఆఖరి సమాధిలోనూ యోగవిశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన మహా యోగి పరమహంసయోగానందగారి "ఒకయోగి ఆత్మకథ "లో శరీరాన్ని విడిచిన ఆత్మ హిరణ్యలోకాల్లో వారి వారి పుణ్యఫలంగా,సాధనాప్రగతిననుసరించి వర్గీకరించబడి, వివిధ శ్రేణులుగా విభజించబడుచున్నది.అక్కడ వారి సంకల్పశక్తితో వారి అవసరాలు తీర్చబడుతవి. మరలా వారికి అంతే వాసిగల్గిన తల్లిదండ్రులకు పిల్లలుగా జన్మించి యోగబ్రష్టులకు అనుకూలమైన వాతావరణాన్ని హిరణ్యగర్భుడైన ఆ పరమాత్మ కలుగజేయుచున్నాడు. ఆహా! భగవంతునిదెంత బృహత్తరప్రణాలిక ! ప్రపంచమునగల అన్ని జన్మలలో యోగుల వంశమునందలి జన్మయే సర్వోత్కృష్టమైనదని భగవంతుడువచించుటలో దానియొక్క గొప్పతనము వెల్లడియగుచున్నది.
పూర్వాభ్యాసేనతేనైవ
హ్రియతేహ్యవశోపిసః
జిజ్ఞాసురపియోగస్య
శబ్ధబ్రహ్మాతి వర్తతే - 44వ శ్లోకం
పూర్వజన్మనందు చేసిన యోగసాధనా ఫలితమున ఈ జన్మయందు యోగమునుగూర్చి ఇంచుకతెలియకున్ననూ పూర్వజన్మనందలి అభ్యాసబలముచే యోగమువైపునకే ఈడ్వబడుచున్నారు.యోగమునెరుగదలంపుగలవాడైనంత మంత్రముచేతనే వేదములందు చెప్పబడిన కర్మానుష్టానఫలమును మనుజుడు దాటవేయబడుచున్నాడు. పుణ్యము పుణ్యబుద్ధిని కలిగించును పాపము పాప బుద్ధిని కలిగించును కనుకనే కొందరికి పుట్టుకతోనే పరమార్ధ విచారణ కలుగుట సంభవించుచున్నది.
సీతారామాంజనేయ సంవాదమను గొప్ప ఆధ్యాత్మిక గ్రంధరాజము క్రింది విషయములను దెలియజేయుచున్నది. ఆత్మసాక్షాత్కార సంపన్నుడగు గురువువద్ద యోగదీక్ష తీసుకున్న శిష్యులు, వారి పూర్వజన్మ సుకృతము వలన శ్రద్ధగా సాధన చేసిన యెడల అష్టాంగ యోగములు వారికి కరతలామలకములై 6 మాసములలో నిర్వికల్పసమాధిని బడయగలరు. శ్రద్ధ, క్రమశిక్షణ తగ్గేకొలది పరిధి ఒకింత ఆలస్యమై ఈ జన్మలో లేదా మరుజన్మలో వారు సాయజ్య స్థితిని పొందగలరు.
తపస్విభ్యోధికో యోగీ
జ్ఞానిభ్యోపిమతోధికః
కర్మిభ్యశ్ఖాధికోయేగీ
తస్మాద్యోగీ భవార్జున - 46వ శ్లోకం
ఇచట భగవంతుడు తనను చేరుటకు తపనపడే మనుజులలో ఎవరు శ్రేష్టులో, ఏసాధన ఉత్కృష్టమైనదో తెలియజేయుచున్నాడు.అంతమాత్రముననే మిగతా సాధనలన్నియు నిరుపయేగములని కాదు.
ఓ అర్జునా తపస్సుచేయువారి కంటెను,శాస్త్రజ్ఞానముకలవారి కంటెను,అగ్నిహోత్రాది కర్మలు భగవదర్పణచేయువారి కంటెను యోగి శ్రేష్టుడని చెప్పబడుచున్నాడు.కాబట్టి నీవు యోగివి కమ్ము.అనగా శాస్త్రజన్య పరోక్షజ్ఞానము కంటే ఆత్మ జ్ఞాయానము శ్రేష్టమని భావము.ఏది జీవుని పరమాత్మ పదమునకు జేర్పునో, లేక దేని ద్వారా జీవుడు ఆత్మకు అతి సన్నితుడై వర్తించునో,అది తక్కినవాటికంటే శ్రేష్ఠమైనదగును.
యోగివి కమ్మని భగవానుడు అర్జనుని శాశించెను.యోగముయోక్క శ్రేష్ఠత్వమును ముందుగా జెప్పి తదుపరి అట్లానతిచ్చుటగమనించదగినది. దేనినైనను సహేతుకముగ జెప్పినప్పుడే విశ్వాసముగలుగును. ధ్యానము యెక్క పద్దతిని,విలువను చాటి తుదకు "ఈ కారణములచే నీవు యోగివికమ్ము "అని కరుణతో తెలిపెను.భగవానుడు చెప్పిన విధముగా ప్రతివారును యోగికావలనే గాని భోగికారాదు.యోగివికమ్మని భగవానుడు అర్జునునికొక్కనికే బోధించినను, అతనిని నిమిత్తమాత్రునిజేసి సర్వులకు భోదించినట్లే తలంపవలెను. యోగులనగా జటాజూటములు,కాషాయాంబరములు ధరించి నాధువృత్తిని స్వీకరించినవారని అర్ధముకాదు. మనసును బాహ్య విషయముల నుండీ మరలించి, అంతర్ముఖమొనరించి ఆత్మయందు స్థాపించువాడే యోగి. యోగికే భవబంధ విమోచనము గల్గును. ధ్యానము ద్వారా స్వస్వరూప సాక్షాత్కారము కలిగినపుడే జీవుడు ముక్తినొందును.
యోగినామపి సర్వేషాం
మద్గతే నాన్తరాత్మనా
శ్రద్ధావాన్ భజతేయోమాం
సమేయుక్త తమోమతః - 47వ శ్లోకం
ప్రపంచమున అందరికంటే యోగులు అత్తములని చెప్పబడినది. ఆ యోగులలో ఎవరు శ్రేష్టులో తెలుపుచున్నారు.అత్యంత శ్రద్ధగలిగి అంతరాత్మయందే మనస్సును నిలిపి, పరమాత్మ నే ధ్యానించువాడు సర్వోత్తముడని కృష్ణపరమాత్మ ఆనతినిచ్చెను.ఏ మార్గము నునుసరించెడివారైననూ భక్తిని జోడించినపుడే చక్కని ఫలితమునీయగలదు.ఈ భావమే ఇచట తెలపబడినది.భక్తియను జలముతో కూడినపుడే ఏ మార్గమైననూ పరిపూర్ణము కాగలదు.
ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకున్నంతమాత్రమున చాలదు.భగవంతుని దృష్టియందు "యుక్తతముడు" అనిపించుకొనవలెను.
- సశేషం -
***
No comments:
Post a Comment