అటక మీది మర్మం (పరిశోధనాత్మక నవల) - 2
(మూలం : ది సీక్రెట్ ఇన్ ది ఓల్డ్ అట్టిక్ - ఆంగ్లనవల)
తెలుగు సేత : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
(జరిగిన కధ : కనిపించకుండా పోయిన తన కుమారుడి సాహిత్యం విషయంలో న్యాయవాది కర్సన్ డ్రూ వద్దకు ఫిలిప్ మార్చ్ అన్న వ్యక్తి తన కుమారుడు, కోడలికి వ్రాసిన ఉత్తరాలతో వస్తాడు. తన వివరాలు చెప్పి వెళ్ళిపోతున్న అతని పైకి ఆగంతుకుడెవరో రాయిని విసరటంతో గాయపడతాడు. డాక్టర్ సూచనపై ఆ రాత్రి అతను వీరింట్లోనే ఉండిపోతాడు. కాలక్షేపానికి పెట్టిన రేడియోలోంచి పాట వింటున్న అతను అకస్మాత్తుగా అరుస్తాడు. తరువాత -)
"ఈ పాట మా అబ్బాయి వ్రాసినదే! దీన్ని ఎక్కడా వాడు ప్రచురించలేదు. ఈ పాట దొంగిలించబడింది. మీరా దొంగను పట్టుకోవాలి" తట్టుకోలేని ఉద్వేగంతో అరవసాగాడు.
"దొంగిలించబడిందా? ఈ పాట. . . "నాన్సీ అడిగింది.
"ఖచ్చితంగా!" అంటూ పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు.
"ఆ పదాలు. . .ఆ బాణీ. . . మొత్తం వాడివే!" అంటూ తలను చేతులతో బాదుకోవటం మొదలెట్టాడు.
నాన్సీ కంగారుగా అతని వద్దకెళ్ళి శాంతపరిచింది. తలగడను ఎత్తుగా సర్ది అతను దానిపై చేరబడేందుకు సాయపడింది.
"అంతలా ఉద్వేగానికి లోనుకావద్దు. మీరు ఈ పాటను వినటం వల్ల మంచే జరిగింది. అనౌన్సర్ పాట పాడిన వారి పేరు చెబుతుందేమో చూద్దాం."
దురదృష్టవశాత్తూ పాట పాడిన వారి పేరు చెప్పకుండానే రేడియో కార్యక్రమం ముగిసిపోయింది. ఆ రోజంతా అదే పాటను మళ్ళీ వేస్తారేమోనని రేడియో పెట్టే ఉంచారు. కానీ సాయంత్రం అతను నిద్రకు ఉపక్రమించేవరకూ మళ్ళీ ఆ పాట రాలేదు. కానీ అది తన కుమారుడి పాటేనన్న విశ్వాసం ఆ మిలటరీ వ్యక్తిలో ప్రగాఢంగా ఉంది.
నాన్సీ అతన్ని ప్రక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టి దుప్పటి దులిపి అతనికి ప్రక్క వేస్తోంది. మార్చ్ తన కొడుకు ప్రతిభను గుర్తు చేసుకొంటూ చెప్పసాగాడు.
"మావాడు గొప్ప ప్రతిభావంతుడు. వాడు ఆరు రకాల వాయిద్యాలలో ప్రవీణుడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడే అటకపైన కూర్చుని, ఏకాంతంలో తన పాటలకు బాణీలు కట్టేవాడు. అది పూర్తయ్యాక క్రిందకు దిగి తన సంగీతపు గదిలో మాకు వాటిని పాడి వినిపించేవాడు."
"మీకు ఎవరిమీదనైనా అనుమానం ఉందా?" నాన్సీ ప్రశ్నకు లేదన్నట్లు తలూపాడు.
పరిశోధనలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, తగిన సాక్ష్యం లేకుండా నిందితుణ్ణి నేరస్తుడిగా పరిగణించకూడదని ఆమెకు తెలుసు. ఆమెకు ప్రస్తుతం ఉన్న లక్ష్యాలు రెండు. దొంగను పట్టుకోవాలి, మాయమైన ఫిప్ సాహిత్యాన్ని కనిపెట్టాలి.
నాన్సీ, మార్చ్ లిద్దరూ ఫిప్ ఉత్తరాలను మరొకసారి చదివారు. కానీ వాటిలో ఎలాంటి ఆధారం(క్లూ) దొరకలేదు.
"మీరు మీ అబ్బాయి సంగీతపుగది, మిగిలిన యిల్లంతా వెతికారా?" నాన్సీ అడిగింది.
"చాలాసార్లు. కానీ ఫలితం లేదు."
"అటక మీద?"
"అక్కడ కూడా చూశానమ్మా! వాడి పాటలన్నీ పోయాయి. ఇందాక ఆ పాట రేడియోలో విన్న తరువాత, మొత్తం పాటలన్నీ దొంగిలించబడ్డాయని నాకు అనిపిస్తోంది."
ఇతన్ని గాయపరచిన వ్యక్తికి యీ దొంగతనంతో సంబంధం ఉందేమోనని ఆమె సందేహించింది.
'బహుశా ఆ వ్యక్తి మార్చ్ ని అనుసరించి ఉండవచ్చు. అతను లాయర్ని కలుసుకున్నాడని గ్రహించి గాయపరచి ఉండొచ్చు. అలా చేస్తే యితను భయపడి, యింతకన్నా ముందుకెళ్ళే ప్రయత్నం చేయడని ఆ అగంతకుడి పన్నాగం కావచ్చు' ఆ యువతి విశ్లేషించుకుంది.
పోలీసులనుంచి వివరాలు రాలేదంటే, వాళ్ళు అగంతకుణ్ణి పట్టుకొని ఉండరు.
మరునాడు సాయంత్రం మార్చ్ తన యింటికి వెళ్ళవచ్చునని డాక్టర్ చెప్పాక, నాన్సీ అతన్ని తన కారులో అతని యింటి వద్ద దింపుతానని చెప్పింది. ఆ సాయంత్రం ఆమె పెందరాళే భోజనం ముగించి, తన స్నేహితురాళ్ళయిన జార్జ్, బెస్ లతో కలిసి మార్చ్ ని తన యింటివద్ద దింపటానికి బయల్దేరింది.
"నా ఎస్టేట్ చూపించటానికి మిమ్మల్నందరినీ కష్టపెడుతున్నాను. ఒకప్పుడు రివర్ హైట్స్ ప్రాంతంలో యీ ప్రాంతం పెద్ద విహారకేంద్రంగా ఉండేది."
అతని మాటలు వింటూ, నదీప్రాంతంలో నల్లమేఘాలు ముసురుకొంటున్న ఆకాశాన్ని చూస్తున్నారు వాళ్ళు.
"అదే మా యిల్లు. . . .ఆ పళ్ళతోట అవతల. . .ఆ! ఇక్కడే మలుపు తిప్పాలి" కారు ముందు సీట్లో కూర్చున్న అతను కారు నడిపే నాన్సీకి దారి చూపిస్తున్నాడు. కారు యింటి ప్రాంగణంలోకి ప్రవేశించింది. నాన్సీ కారు వేగం తగ్గించి మెల్లిగా పోనిస్తోంది.
"ఈ భవనం పేరు "ప్లెజెంట్ హెడ్జెస్" చెప్పాడతను. రోడ్డు మీదనుంచి చాలా లోపలకి ఉందా భవనం. భవనం ముందంతా చాలా దూరం ఖాళీగా ఉంది. పేరుకు 'అందమైన పొదరిల్లే' అయినా, పేరుకు తగ్గట్లుగా ఆ భవన ప్రాంగణం లేదు. చుట్టూ దుబ్బుగా పెరిగిన పొదలతో, తుప్పలతో భయంకరంగా ఉంది. ఇంటిముందు ప్రాంతమంతా శుభ్రం చేసి చాలాకాలం అయినట్లుంది. ఎత్తుగా పెరిగిన గడ్డితో, యింటిమీదకు ఒరిగి ఉన్న పైన్ చెట్లను చూస్తే భయమేస్తోంది. బలంగా వీస్తున్న గాలికి చుట్టూ ఉన్న పొదల్లోంచి వచ్చే శబ్దం గుండెదడను పుట్టిస్తోంది.
"భయానకంగా ఉంది" కారు వెనుక సీట్లో కూర్చున్న బెస్ ప్రక్కనున్న జార్జ్ చెవిలో గొణిగింది.
"మార్చ్ పై రాయి విసరినవాడు మనపై దాడి చేయటానికి యిక్కడనే ఎక్కడో నక్కి ఉండొచ్చు."
"అందుకే కళ్ళు బాగా విప్పార్చి చూద్దాం" జార్జ్ అంది.
ఆ ప్రాంతంలోనే విశాలంగా విస్తరించిన ఆ భవనంలో కొంతభాగాన్ని చెట్లతీగలు అల్లుకున్నాయి. ఆ భవనం ఒకప్రక్క బూడిదరంగు రాళ్ళతోను, మిగిలిన భాగమంతా మరొకరంగు పలకలతోను కట్టినట్లుగా ఉంది. రెండవభాగంలో చాలావరకు వాతావరణ ప్రభావానికి లోనై దెబ్బతిన్నట్లుంది. నాన్సీ కారును ఆ భవనం ముందు ఒక ప్రక్కకు ఆపింది.
"మొత్తానికి చేరుకొన్నాం" అంటూ నాన్సీ కారు దిగి యిటువైపు వచ్చి కారు తలుపు తీసింది. మార్చ్, బెస్, జార్జ్ కారు దిగారు.
"మేము లోనికొచ్చి యింట్లో కూడా చూడవచ్చునా? మనం నలుగురూ కలిస్తే కనిపించకుండా పోయిన సాహిత్యాన్ని కనిపెట్టవచ్చు." నాన్సీ మాటలకు కృతజ్ఞతగా చూశాడతను.
"నువ్వు సాయపడతానంటే కాదంటానా? చిన్నదానివి. నీ కళ్ళు నా కళ్ళ కన్న చురుగ్గా పనిచేస్తాయి" బదులిచ్చాడతను.
నాన్సీ నిలబడ్డచోటినుంచే ఆ భవనాన్ని ఆ చివరనుంచి యీ చివరకు ఒకసారి పరికించింది. సమాంతరంగా చాలా పొడవుగా ఉన్న భవనం రెండు భాగాలుగా కనిపించింది.
"అక్కడ బూడిదరంగు రాళ్ళతో కట్టినది, యీ పలకలతో కట్టిన భాగం కన్న పురాతనమైనదనుకుంటా!" నాన్సీ అంది.
"అవునమ్మా! అది యీ యింట్లో పనివాళ్ళు ఎక్కువగా ఉన్న రోజుల్లో వాళ్ళు ఉండటానికి కట్టిన నివాసాలు(క్వార్టర్స్). మనం మొదట అక్కడ చూసి వద్దాం" ఆంటూ వాళ్ళను పనివాళ్ళ నివాసాల(క్వార్టర్ల) వైపు తీసుకెళ్ళాడు. కలుపు మొక్కలతో నిండిన బాటలో అతని వెనకే వెళ్ళారు ముగ్గురు. అతను వారిని నాచు పట్టిన మెట్ల దగ్గరికి తీసుకెళ్ళాడు.
"ఈ క్రిందభాగంలో గుర్రాలశాల ఉంది" అని చెప్పాడు.
వెంటనే అమ్మాయిలు ముగ్గురు మెట్లు దిగి, అక్కడ ఉన్న లైటు వేశారు. కొన్ని సంవత్సరాలుగా దాన్ని వాడకపోవటం వల్ల అక్కడ అంతా రాళ్ళతోను, బురదతోను అశుభ్రంగా ఉంది. గుర్రాలశాల స్టాల్స్ లో గుర్రాలు లేకపోయినా, వాటి పేర్లను తెలిపే బోర్డులింకా తగిలించి ఉంచటం అమ్మాయిలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
"రన్నింగ్ మేట్" బెస్ బోర్డులను గట్టిగా చదవసాగింది. "ఇదిగో యిక్కడ 'కెంటక్కీ బ్లూ'! ఆసక్తిగా లేదూ?"
వాళ్ళ మాటలు విన్న అతను చెప్పాడు. "ఆ రెండు మా తాతగారి గుర్రాల పేర్లు. ఆ రోజుల్లో గుర్రప్పందాల్లో మావాళ్ళకి మంచిపేరు ఉండేది. మావాళ్ళు యింత పెద్ద గుర్రాలశాలను కలిగి ఉన్నారని దేశమంతా తెలుసు. గుర్రాలకు శిక్షణ యిచ్చేవారు పై అంతస్తులో ఉండేవారు" ఉత్సాహంగా చెబుతూ, వాళ్ళకి యిరుకుగా ఉన్న మెట్ల వైపు చూపించాడు.
ముగ్గురు అమ్మాయిలు అటెళ్ళి, మెట్లెక్కి అక్కడ ఉన్న లైట్లు వేశారు. వాళ్ళు ఒక హాలు మధ్యనుంచి వెడుతూ, దానికి రెండుప్రక్కలా ఉన్న చిన్నచిన్న పడకగదుల్లోకి తొంగిచూశారు. నాన్సీ అక్కడ గోడల్లో గానీ, నేలమీద గానీ ఫిప్ తన సాహిత్యాన్ని దాచిన రహస్యపు అరలేమైనా ఉన్నాయేమోనని చేతితో తట్టి చూసింది. కానీ అలాంటివేమీ ఆమెకు కనపడలేదు. తరువాత వారు ముగ్గురూ పురాతనమైన మెట్లదారిని క్రిందకు దిగారు. వాళ్ళ బరువుకి ఆ మెట్లు మూలుగుతున్నాయి.
అమ్మాయిలు తన వద్దకు రాగానే, మార్చ్ వెనుదిరిగి నిర్మానుష్యమైన కూలీల నివాసప్రాంతంనుంచి, వాళ్ళను అసలు భవనం వద్దకు తీసుకొచ్చాడు. తన జేబులోంచి ఒక పొడవైన తాళంచెవిని తీసి, అతికష్టం మీద ఆ భవన ముఖద్వారాన్ని తెరిచాడు. చాలా పురాతనమైన, బరువైన ఆ తలుపును తోయగానే భయం పుట్టించే శబ్దంతో తెరుచుకొంది.
"ఇల్లంతా ఖాళీగా ఉంది" నిరాశతో నిట్టూర్చాడు మార్చ్. "చిన్ని సుశాన్ పోషణకి కావలసిన డబ్బు కోసం యింట్లో ఉన్న విలువైన ఫర్నిచరంతా అమ్మాల్సివచ్చింది."
వాళ్ళు మాట్లాడుకొంటూ వెళ్తుంటే ఖాళీగా ఉన్న విశాలమైన ఆ హాలు, వాళ్ళ మాటల్తో ప్రతిధ్వనిస్తోంది. అక్కడనుంచి అతను వారిని మొదటి అంతస్తులోనున్న సంగీతపుగదికి తీసుకెళ్ళాడు. అక్కడ పసుపురంగు మీటలున్న పాత మోడల్ పియానో, దానిముందు నవారు కుర్చీ ఉన్నాయి. మొదటి అంతస్తులోని చాలా గదులు ఖాళీగా, చాలారోజులుగా మూతబడి ఉన్నట్లు కనిపించాయి. వాటిలో కొన్ని కిటికీలకు కట్టిన సిల్క్ తెరలు రంగు వెలసి, చిరిగిపోయి ఉన్నాయి. ఒక మూలకు ఉన్న భోజనాల గదిలో భోజనాల బల్ల, కొన్ని కుర్చీలు, వంటసామాను పెట్టుకొనేందుకు మేజాబల్ల మాత్రం ఉన్నాయి. కానీ ఆ గదిలో మూలగా ఉన్న అర మాత్రం గిన్నెలేమీ లేక ఖాళీగా, బోసిపోయినట్లు ఉంది.
"అందులో ఉన్న పింగాణీ, గాజు పాత్రలన్నీ అమ్మేశాను" చెబుతున్న అతని గొంతు బొంగురుపోయింది. "పదమ్మా! రెండవ అంతస్తుకి వెడదాం."
రెండవ అంతస్తులో పడకగదులు ఉన్నాయి. వాటిలో మాత్రం కొంత ఫర్నిచర్ కనిపించింది. కానీ సాధారణంగా ధనవంతుల యిళ్ళలో ఉండే ఖరీదైన మంచాలు గానీ, డ్రెస్సింగ్ టేబిల్స్ గానీ లేవు. అమ్మివేసిన ఆధునిక తరహా ఫర్నిచర్ స్థానంలో పనికిరాని పాత తరహా ఫర్నిచర్ ఉంది. ఇదంతా చూస్తే ఆ మిలటరీ వ్యక్తి ఆర్ధికసమస్యతో ఎలా నలిగిపోతున్నాడో నాన్సీకి అర్ధమైంది. అందుకే ఆ యువ గూఢచారి బయట అమ్మటానికి పనికొచ్చే పురాతన వస్తువులేమైనా దొరుకుతాయేమోనని అన్ని గదులను పరిశీలనగా చూడసాగింది. నాన్సీ అదృశ్యమైన పాటల గురించి అన్వేషణ మొదలెడదామని స్నేహితురాళ్ళతో చెప్పింది.
"కానీయండమ్మా!" మార్చ్ అన్నాడు.
రెండు గంటలసేపు ముగ్గురు అమ్మాయిలు భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లోనున్న హాలు మొదలు మొదటి అంతస్తులోని సంగీతపు గది, వంటిల్లు, మూసి ఉన్న యితర గదులు, రెండవ అంతస్తులో ఉన్న పడకగదులన్నీ గాలించారు. గోడలన్నిటినీ చేతులతో తట్టి చూశారు. ఏ.సి.లు లేని రోజుల్లో, చలిదేశాల్లో గది వెచ్చదనం కోసం మంటలు వేసుకొందుకు కొన్ని గూళ్ళలాంటివి కట్టుకొనేవారు. వాటిని నిప్పుప్రాంతాలు అంటారు. అమ్మాయిలు ముగ్గురు గదుల్లో ఆ నిప్పుప్రాంతాలకి ఆనుకొని ఉన్న అలమరాలను తెరిచి చూశారు. నేలమీద తొలగించటానికి వీలుగా ఉన్న పలకలను తొలగించి చూశారు. నాన్సీ మూడుసార్లు పలకలతో కట్టిన సంగీతపు గదిలోకి వెళ్ళి శోధించింది. కానీ వారికి ఎలాంటి ఆధారం దొరకలేదు.
"ఇంక వెతకటానికి ఏమీ లేవు ఒక్క అటక తప్ప!" యువ గూఢచారి మార్చ్ తో చెప్పింది.
"మనం పైకి వెళ్ళవచ్చా?"
"నేను మెట్లదారిని చూపిస్తాను. అటక చాలా ఎత్తులో ఉంది. దాని మెట్లు సులువుగా ఎక్కేందుకు అనువుగా గాక, కొంచెం నిటారుగా ఉంటాయి" అంటూ వారిని మెట్లదారి ఉన్న తలుపు దగ్గరకు తీసుకెళ్ళాడు. "నేను తరచుగా పైకి వెళ్ళను. నాకు ఊపిరి పట్టేస్తుంది" అంటూ తలుపులు తీశాడు. వెనక్కి వెళ్ళి వెలిగించిన కొవ్వొత్తితో వచ్చి, వాళ్ళను మెట్ల దగ్గరకి తీసుకెళ్ళాడు.
"పైన లైట్లు లేవు. కానీ యీ కొవ్వొత్తి వెలుతురులో మీరు బాగా చూడగలరనుకొంటున్నాను."
నాన్సీ తన కారులో ఫ్లాష్ లైట్ మరిచిపోయినందుకు తనని తాను తిట్టుకొంది. కారు వద్దకెళ్ళి దాన్ని తెస్తానని వారికి చెబుతొంది. అప్పుడే క్రింద ఎవరో తలుపులు బ్రద్దలు కొడుతున్న శబ్దం వినిపించింది.
(ఎవరో తెలుసుకోవాలంటే వచ్చే నెలవరకూ ఆగాల్సిందే!)
No comments:
Post a Comment