అపార్ధం
తురగా శివరామ వెంకటేశ్వర్లు
ఒకరోజున
“ ఏమిటిరా! నువ్వంటున్నదీ?“
“ అవును. నిజమే! అక్కా!”
“నేనమ్మనురా?”
“ మానేయి!”
రెండు రోజులు పోయాక
“ అక్కా!అక్కా! ఈవేళ మళ్ళీ కనపడ్డాడు. లోపలికి వెళ్ళడం రావడం కూడా చూసాను . కుంచెం నీరసంగా ఉన్నాడు. ఇప్పుడైనా నమ్ముతావా?“
“ పోరా! అతను అటువంటివాడు కాదురా! అదీగాక నువ్వెందుకెళ్ళు చున్నావక్కడికీ? “
“ నాకంప్యూటరు క్లాసులు జరిగేది ఆక్రింద ఫ్లోరులోనే కదా!”
“ సరే! పోయి చదువుకో! .
‘మనసులోఏమిటి వీడిల్లా అంటున్నాడు. ఛ ! అతను అటువంటివాడుకాదు.’
మళ్ళీ నాలుగు రోజులతర్వాత కంగారుగా వచ్చి అక్కదగ్గర నుంచున్నాడు.
“ ఏరా?కంగారుగాఉన్నావు?” ఏమయింది?
“ మరేమోనే. ఈ రోజు గోపీ మళ్ళీ అక్కడ కనపడ్డాడు. నీరసంగా చిరాకూ గా ఉన్నాడు . ఇంకో అబ్బాయి సాయంతో మెట్లు దిగుతూ కనపడ్డాడు . కింద నన్నుచూసి పిలిచాడు. తనను అక్కడ చూసినట్లు మీ అక్కతో చెప్పొద్దని బ్రతిమాలి నా చేత ఒట్టు వేయించు కున్నాడు. నిజం అక్కా! ఇప్పుడు నమ్ము అక్కా”. దీనంగా చెప్పాడు మురళి .
“ ఆ! నిజమా?” ఒక్క సారిగా నిలపడి పోయింది నోట మాట రాక గోపిక. కొద్ది సేపటికి తేరుకుని,నాన్నఅమ్మలతో చెప్పకురా! మురళీ” అంది గోపిక.
“సరేలే” అన్నాడు మురళీ
ఆ రాత్రి మేడ మీద తన గదిలోకి పడుకుందుకు వెళ్ళింది గోపిక. మధ్యాహ్నం మురళి గోపి గురించి చెప్పిన విషయం ఆలోచిస్తూ కూర్చుంది. అది నిజమని నమ్మలేను అనుకుంది. ఎప్పటికి గోపి అటువంటి వాడు కాదు అనుకుంది. నిద్రపోవడానికి ప్రయత్నించింది. నిద్రరాలేదు . తనకు గోపీ తో పరిచయం అయిన గతం ఆలోచనలలోనికెళ్లింది గోపిక.
ఒక రోజున కాలేజీ లైబ్రరీలో ఒక రేక్ లో తనకు కావలసిన పుస్తకం మీద తను చేయి వేసి తీయ పోతుంటే , రేక్ కి అటువైపు నుంచి ఎవరిచేయో అదే పుస్తకం మీద పడి తన చేయికి తగలడం తో చిన్న షాక్ లా అనిపించి తన ‘గుండెజారి గల్లంతయింది’ . ఎవరా? అని రేక్ మీద తనకు ఎదురుగా ఉన్న నాలుగు పుస్తకాలు పక్కకు జరిపి చూసాను. కాలేజీలో తను చాలా సార్లు చూసిన అబ్బాయి లా ఉన్నాడు. పుస్తకం తీసేసుకుని బయటకువచ్చేసాను. తనుకూడా బయటకువచ్చి నాప్రక్కన నడుస్తూ , “సారీ ! నేను చూడ లేదు. కావాలని నీ చేయి మీద నా చేయి వేయలేదు. నాకూ ఆ పుస్తకం కావలసివచ్చి తీయ బోయాను. ఏమీ అనుకోవద్దు” అన్నాడు.
అతని మేనర్సునచ్చి ఏ ఇయరు?” అడిగాను.
“ ఎం.యస్.సి. ఫైనల్“ అన్నాడు.
“ నువ్వు? “ బి.యస్.సి ఫైనల్” చెప్పాను .
“పేరు?” గోపీ
“నేనుగోపిక “
నవ్వుతూ, “ నా పర్మిషన్ లేకుండా నాపేరుని నీ పేరులో సగం కలుపుకుంటావా?”అన్నాడు.
“ తప్పేముందీ? ఏదో నీ ఆస్తిని సగం కలుపుకున్నట్లు ఫీలయి పోతున్నావు? పేర్లుకలుపుకోడాలు , ఒళ్ళు కలుపుకోవడాలు మీ మొగాళ్ళకే చెల్లు.శివయ్య పార్వతి ఒళ్ళు సగం కలుపుకోలే?” అన్నాను..
“బాబొయ్! ముదురు కేసే! పురాణాలు కూడా తెలుసు” అన్నాడు. ఇద్దరూ పకపకా నవ్వులు.
“ ఏ వూ రు నీది?” అడిగాను. “నేనులోకల్ ! అన్నాడు. “నేను అడిగింది టౌను మారుతీ టాకిసులో నడుస్తున్న సినీమా పేరు కాదు. మీది ఏఊరు?అని.” “అదే చెపుతున్నా. గుంటూరోడిని” . “అబ్బా!మళ్ళీ దేవీ టాకీసులో ఆడుతున్నసినీమా పేరు చెపుతున్నావు”.అన్నాను. “కాదు తల్లీ! నేను ఇక్కడి వాడినే. మాది ఈ ఊరే ! గుంటూరు . “ అన్నాడు.
“ మరి అల్లా దారికిరా!. “ఇదిగో నా ఫోను నెంబరు. ఇయ్యి నీ ఫోను నెంబరు” అల్లా ఆవేళ ఫోనునెంబర్లు మా ర్చుకున్నాం ఇద్దరం.
నాలుగు రోజులు పోయాక ఒక సాయంత్రం గోపి ఫోను చేసి, “ఇల్లా ఇటువైపుకు రావచ్చుగదా ఒకసారి” అడిగాడు.
“ఎందుకు?”
“ఏమీ లేదు. అల్లాబయటకు వెళ్ళి‘సరదాగా కాస్సేపు’‘ ఉల్లాసంగా ఉత్సాహంగా’తిరిగి
‘కుదురుతే ఒక కప్పుకాఫీ’ త్రాగి వద్దాం” అన్నాడు.
“మరి నేను వచ్చాక ‘ పోకిరీ’ వేషాలు వేసి ‘ఇడియట్’లా ప్రవర్తించవు గదా?”అడిగాను.
“నేనుఅటువంటి వాడిని కాదు. ‘బుద్దిమంతుడిని’ అన్నాడు.
“అల్లాగా? అమ్మాయిల ‘వేటగాడు’వి అనుకున్నానులే ” అన్నాను. ఇద్దరం పకపకలు.
అప్పట్నుంచి టౌనులో పార్కులు, హొటళ్ళు, సినీమా హాళ్ళు అన్నీమావే అయాయి .ఆకలియకలు, ఫొనులు, చాటింగుల్లో ఎన్నికబుర్లు,ఎన్ని ఊసులు,ఎన్ని కథలు,ఎన్నిఊహలు!.
‘’నిన్నుచేసుకున్నవాడు శ్రీ మంతుడు అన్నాడు గోపీ. ‘నీకు నేను నాకు నువ్వు’ అన్నాడు.‘నువ్వంటే నాకెంతో ఇష్టం’ అన్నాడు.‘నువ్వునాకు నచ్చావు’. పిల్లా! నువ్వులేని జీవితం వ్యర్ధం అన్నాడు. ‘నిన్నే పెళ్ళాడుతా’ అన్నాడు. మనది 100%లౌవ్.నీతో‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అన్నాడు. వచ్చే రోజులన్నీమనవి ‘హేపీడేస్’ అన్నాడు. గోపీ కబుర్లకి నేను ‘ ఫిదా’ అయిపోయాను. ఒక పున్నమి నాటి వెన్నెలలో డాబా మీద బయట హాయిగా ఉంది. కుర్చీ తెచ్చుకుని కూర్చున్నాను. గోపీ గురించి సీరియస్ గా ఆలోచించాను. మొదటి సారిగా మా చేతులు ఆ వేళ లైబ్రరీ లో పుస్తకం సాక్షిగా కలిసాయి. అనుకోకుండా నాపేరులో గోపీ పేరు సగం కలిసింది. ఇన్నాళ్ళ పరిచయం లో గోపీ ఎప్పుడూ హద్దులు మీరలేదు. సభ్యత సడలించలేదు. నన్ను ఇష్ట పడుతున్నాడు. కాబట్టి గోపీతో ఇంక ‘అష్టాచెమ్మా’ ఆటలు మానేయాలి. అతనితో ‘అమీతుమీ’ తేల్చు కోవాలి అనుకున్నాను. ఆరాత్రి హాయిగానిద్రపోయాను.
ప్రొద్దున్న లేచి కాపీ త్రాగి గోపికీ ఫోను చేసి ‘ఐలవ్ యూ’ చెప్పాను. నా పేరెంట్సుతో మాట్లాడతాను అన్నాను.”సరే!” అన్నాడుగొపీ. నాన్నఅమ్మలతో గోపి గురించిచెప్పాను. ఇద్దరం ఒకళ్ళి నొకళ్ళు ఇష్టపడుతున్నట్లు పెళ్ళి చేసుకోవావాలని అనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పాను. గోపీ నాన్న రంగారావుతో తనకు పరిచయముందని, ఒక సారి వాళ్ళ ఇంటికెళ్ళి మాట్లాడి వస్తానన్నాడు నాన్న.
వారం రోజులుపోయాక ఒక ప్రొద్దున్నే గోపీకి ఫోను చేసి “శుభోదయం” అన్నాను.
“ ఎమిటీ వేళ హుషారుగా తెలుగులో మాట్లాడుతున్నన్నావు?”అన్నాడు.
“ అవునుహుషారే! మరి. మొన్న మా నాన్న మీయింటికొచ్చి నీతోనూ,మీవాళ్ల తోనూ మాట్లాడేడు ట కదా!” అన్నాను.
“ అవును.మీ నాన్నకి నేను నచ్చానా?”అడిగాడు నవ్వుతూ.
‘’నువ్వుమామూలోడివికాదుట.‘స్వాతిముత్యం’ ట. అన్నాను.
“ఎందుకుట?” అడిగాడు.
‘’లైఫ్ లో నీ ఏమ్బిషన్ అడిగి ఎల్లా సాధిస్తావూ? అనడిగితే ‘ స్వయంకృషి’ తో అన్నావుట. దానికి మానాన్నపొంగి పోయి నిన్ను చేసుకోవాలనే నా సంకల్పం “శుభసంకల్పం’ అన్నాడు. నా ఆలోచన ‘శుభ ప్రదం అన్నాడు. మన జాతకాలు కూడా చూపించాడుట. నీకూ నాకూ వ్రాసిపెట్టి ఉందిట. మనది ‘శ్రుతిలయలు’ తప్పని జీవన గీతం అవుతుందిట.
త్వరలో మనిద్దరికి ‘ సప్తపది’ చేసేస్తానన్నాడు”చెప్పాను.
“ అబ్బా! ఆ పెద్దాయన ఆ విశ్వనాధ్ భాష అర్ధం చేసుకునే స్థాయి నాకు లేదు. నాకర్ధమయేలా మన భాష లో చెప్పవా?” అన్నాడు.
“ అయితే విను . నువ్వుమా నాన్నకినచ్చావు. నువ్వు మంచి బాలుడవు. నీ శక్తి మీద నీకు నమ్మకమున్నవాడవు. నా ఆలోచన మంచిదే! త్వరలో మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాడు మా నాన్న”చెప్పాను.
“ మరి మా నాన్నకి అమ్మకి నువ్వు నచ్చాలికదా” అన్నాడు.
“అందుకే త్వరలో మన ‘పెళ్లిచూపులు’ కూడా. అవునూ! పెళ్ళిచూపుల్లో ఏ ప్రశ్నలు వేస్తావో ముందే చెప్పేయవా? ప్రిపేరయిపోతాను”అన్నాను . ఇద్దరం గట్టిగా నవ్వుకున్నాం.
మొత్తానికి మా ఫైనలియర్సు అయ్యాకా మా పెళ్ళి చేయడానికి నిర్ణయించారు మా వాళ్ళు.
అల్లా గోపీతో పరిచయం, తర్వాత జరిగిన కథతాలూకు ఆలోచనల తో మెల్లిగానిద్రలోకి జారుకుంది గోపిక.
“ఏమండీ! గోపిక ఎందుచేతనో రెండు మూడు రోజులునుంచి ముభావంగా ఉంటోంది. హుషారు లేదు. ఏదో ఆలోచిస్తూ కూర్చుంటోంది . ఏమిటనడిగితే ఏమీలేదు అంటుంది” భర్త జగన్నాధంతో చెప్పింది గోపిక తల్లి శ్యామల.
ఏదోలే! ఇప్పటిఆడపిల్లలకిఅన్నీఆలోచనలే .కోరిక లెక్కువ. అనుకున్నమార్కులు , ర్యాంకులు వచ్చేయాలి. అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. లేకపోతే అనవసర టెన్షనులు, కోపాలు.అందరిని చూస్తున్నాం గదా!అదే సర్దుకుంటుందిలే !” అన్నాడు జగన్నాధం భార్యతో.
“ బయటకు వెళ్ళుతున్నారు కాబోలు వచ్చేటప్పుడు పురుగులు మందు బాటిలొక్కటి తీసుకురండి. వీరన్న వస్తానన్నాడు ఇంట్లో పురుగులు మందుకొట్టడానికి. ఇల్లంతా పురుగులు ప్రాకుతున్నాయి”శ్యామల చెప్పింది జగన్నాధంతో.
ఆరాత్రి, “ ఏమిటే భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు? మొన్నటి నుంచి చూస్తున్నాను. ఏమయింది నీకు? ఏమిటీ వరస? “ అడిగింది తల్లి శ్యామల గోపికను.
“ బాగానే మెక్కుతున్నాను. కాస్త నన్నుపట్టించుకోవడం మానేసి నన్ను ఒంటరిగా వదిలేయ్. నీకుదండం పెటతా” విసుక్కుని పైన తన గదిలోకివెళ్ళిపోయింది గోపిక. మురళి చెప్పిన సంగతి విన్న రోజు నుంచి గోపీ ఆలోచనలు గోపిక మెదడును తినేస్తున్నాయి. గోపీ ఇంత మోసగాడు అనుకోలేదు. ఇంతగా దిగ జారిపోతాడని ఊహించలేదు తను. చెడు పని చేసి ధైర్యంగా నా తమ్ముడుతో ఆసంగతి నాకు చెప్పొద్దని అడుగుతాడా?నా తమ్ముడు నాకు చెప్పడనీ ఎల్లా అనుకున్నాడు గోపి? కావాలనే, మురళి నాకు చెప్పాలనే అల్లా చేసాడు. తెలిస్తే ఇదేమి చేయ గలదని అనుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి అంటే ఇంత లోకువాగోపికి?. ప్రేమించిన అమ్మాయి మనస్సు గురించి తెలిస్తేగదా! ఆ వేళ నేను సరదాగా అన్నమాటలు ఈవేళ నిజమయ్యాయి. గోపీ ఒక పోకిరీ,ఇడియట్,వేటగాడు,మోసగాడు. గోపిని నమ్మి ప్రేమించిన నా జీవితం వృధా! ఆవేశం,ఉద్రేకంతో ఊగి పొయింది గోపిక.
తర్వాతకొద్ది సేపటికి గోపిక ఉద్రేకం తగ్గి గోపికి ఒకసారి ఫోను చేసి మాట్లాడితే ఏం చెపుతాడో అనుకుంది. గొపీ నాకు ఫోను చేసి పది రోజులు దాటింది. సిగ్గు లేకుండా నేను ఫోను చేయడమా? మాట్లాడడమా? ఇంపోస్సిబుల్! నాకు దక్కని గోపీ ముఖం ఇంక చూడ కూడదు. ఇంక ఏమాత్రం ఈ బాధ భరించలేను. దీనికి ఒకటే మార్గం. గోపీకి గుణపాఠం నేర్పాలి. అనుకుని ఈ ఆలోచనలతో ఒక నిర్ణయానికివచ్చింది ఆ రాత్రిగోపిక.
తెల్లవారింది. ముఖం అద్దములో చూసుకుంది. నిద్ర లేక కళ్ళు ఎర్రగా వాచిపోయాయి. జుట్టు రేగిపోయి ఉంది. మళ్ళీ మంచం మీదకెళ్ళి అల్లాగే కాస్సేపు కూర్చింది. టైము చూసుకుంది. ఎనిమిది గంటలయింది. ఇక ఆలస్యం చేయకూడదనుకుంది. లేచింది. రాత్రి నాన్న తెచ్చి బాత్రూములో పెట్టిన పురుగుల మందు బాటిలుని మెల్లగా వెళ్ళి తెచ్చుకుంది. మూత తీయ పోయింది. కొత్త్త బాటిలు మూత రావడం కష్ట మయింది. కసిగా నోటితోకొరికి మూత తీసేసింది. మందు వాసన గుప్ఫు మంది. కాస్సెపు ఆగింది. కళ్ళుమూసుకుంది. త్రాగడానికి బాటిలు పైకి ఎత్తి సిద్ధమయింది. సరిగ్గా అపుడే కాఫీ కప్పుతో గదిలోకి వచ్చిన తల్లి , “ఏమిటే నువ్వు చేస్తున్న పని?”అన్నగట్టి అరుపుతో గోపిక చేతిలోని బాటిలు, తల్లి చేతిలో కాఫీ కప్పు క్రింద పడి పగిలిపోయాయి. వెంటనే గోపిక తల్లిని కౌగలించుకుని ఘొల్లుమంది. “ ఏమయిందే ! నీకు. ఎందుకు చేయాలనుకున్నావు?ఈపని?” తల్లి కూడా ఏడుస్తూ అడిగింది గోపికను.
‘’ఆగోపిమోసం చేసాడమ్మా! వాడి కేరెక్టరు మంచిది కాదు. వాడొక తిరుగుబోతు. డాక్టరు సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నాడు. సుందరం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడుట. మురళి మూడు సార్లు చూసాడు. పైగాతనను హాస్పిటల్ దగ్గర చూసినట్లు నాతోచెప్పొద్దని ఒట్టు వేయించుకున్నాడుట. ఇంకో అబ్బాయి సాయంతో నడుస్తున్నాడుట. ఇంక నేను బ్రతకలేను అమ్మా! ఈ మోసాన్నిభరించలేను”. గోపిక ఏడుస్తూ చెప్పింది.
“ఊరుకో. మేము కనుక్కుంటాములే! ఏమండీ ! ఒకసారి పైకిరండీ! అంటూ కంగారుగా భర్త జగన్నాధాన్ని పిలిచింది. క్రింద హాల్లో ఉన్నజగన్నాధం కంగారుగా మెట్లు ఎక్కుతూ పైకి వచ్చి కూతురుని,భార్యని చూసి కంగారు పడి పోయాడు. క్రిందపడిఉన్న పగిలి పోయిన పురుగులమందు బాటిల్ని,కాఫీ కప్పుని చూసు నిశ్చేష్టడయి పోయాడు.కాస్సేపటికి తేరుకుని జరిగిన విషయం విన్నాడు. “ ఏదీ!డాక్టరు సుందరం అంటే ఆ సుఖరోగాల నిపుణుడు , సెక్సు స్పెషలిస్టు దగ్గరా గోపీ వైద్యం చేయించుకుంటున్నదీ?” అడిగాడు. అవును అన్నట్లు బుర్ర ఊపింది గోపిక. “ ఆ గోపీ గాడు సంగతి ఇప్పుడే తేలుస్తా! వాడు అంతు చూస్తా!వాడుకున్నరోగాలు బయట పెటతా. ఆసుందరం నాకు బాగా తెలుసు. సుందరాన్ని నేను చాలాసార్లు కలిసాను.” అన్నాడు జగన్నాధం.
“మీకెల్లా తెలుసు సుందరం?ఏం ? మీరు కూడా సుందరం దగ్గర వైద్యంచేయించుకుంటున్నారా?” కళ్ళెర్రచేస్తూ అడిగింది శ్యామల. “కాదే బాబూ! అతను టౌను క్లబ్బులోమెంబరు. మేము కలుస్తూ ఉంటాము”చెప్పాడు జగన్నాధం. “సరే! అయితే ఆ పని చూడండి”. పురమాయించింది శ్యామల. “ ఆవిషయం నాన్నచూసుకుంటారు. ఇల్లాంటి తొందర పనులు ఎంకెప్పుడూ చేయ బోకు . రా! క్రిందకి పొదాం” అంటూ తీసుకుపోయింది గోపికను తల్లి.
‘డ్రైవరురాముడు’ని పిలిచి కారు బయటకి తీయమన్నాడు జగన్నాధం. కారు ఎక్కుతూ సుందరం హాస్పిటల్ కి పోనియ్యమన్నాడు. స్పీడుగా వెళ్ళుతున్నకారుని దారిలో కుంచెం స్లో చేసి రాముడు, “ అయ్యా ! మీరు ఆ సుందరం హాస్పిటల్ కి వెళ్ళుతున్నసంగతి అమ్మ గారికితెలియవచ్చా?!”అన్నాడు. “నేను ఆవిడకు తెలిసేవెళ్ళుతున్నాను రాముడూ!” అన్నాడు. “ అయితే మీ సమస్య అమ్మగారికి కూడా తెలిసిపోయిందన్న మాట”. అన్నాడు . “ఓరి! నీమొహం మండ! నాది ఆ..ఆ.. సమస్యకాదు రా! ఇంకోపని మీద వెళ్ళు తున్నాను. పోనియ్యి! తొందరగా కసిరాడు జగన్నాధం రాముడిని.
రాముడు ఒక కమర్షియల్ కాంప్లెక్సు బిల్డింగు దగ్గర కారు ఆపి “దిగండి సార్!” అన్నాడు.
“ ఇక్కడేనా! సుందరం హాస్పిటల్? నీకు తెలుసా? “ అడిగాడు జగన్నాధం.
“ అవునండీ! కావిస్తే ఆయన ఫొటోతో ఉన్న ఆబోర్డు చూడండీ మొదటి ఫ్లోరు మీద” అన్నాడు రాముడు.
కారు దిగి బోర్డు చదివాడు జగన్నాధం. ‘డా. ఎస్. సుందరం. సుఖ రోగాల నిపుణులు,మరియు సెక్సు స్పెషలిస్టు. గుంటూరు’. సరే అనుకుని లోపలికెళ్ళాడు. డాక్టరు గది గుమ్మం దగ్గర కూర్చున్న బోయ్ ని ‘’ డాక్టరు గారు ఉన్నారా?” అడిగాడు జగన్నాధం. “ ఉన్నారు లోపలికివెళ్ళండి” అంటూ పక్కకి తప్పుకున్నాడు బోయ్.
లోపలికి వెళ్ళిన జగన్నాధం కుర్చీలో కూర్చుని ఉన్న డాక్టరుని చూసి ఆశర్యపోయాడు. అతను సుందరం కాదు! టేబులు మీదున్న చిన్న నేమ్ ప్లేటు చదివేడు. ‘డా. కె.వి. సుబ్బారావు. ఎం.బి.బి.ఎస్. ఫిజీషియన్’ అని ఉంది. “కూర్చోండి. చెప్పండి మీ ప్రోబ్లెం” అన్నాడు డాక్టరు సుబ్బారావు.
“ ఇది సుందరం హాస్పిటల్ కాదా? నేను సుందరం కోసం వచ్చాను. సుందరం కావాలి. నేను ఆయన్ను కన్సల్టు చేయాలి” ” అన్నాడు జగన్నాధం.
“ సుందరం ఇక్కడ ప్రాక్టీసు ఎత్తేసి ఇంకో ఊరు వెళ్ళి పోయాడు. అతని దగ్గర నేను ఈహస్పిటల్ తీసుకుని ప్రాక్టీసు పెట్టాను” చెప్పాడు సుబ్బారావు.
“ఎన్నాళ్ళయింది?”జగన్నాధం ప్రశ్న.
“ ఈమధ్యనే! నెలలోపు ”. ఆ మాటలు వింటూ అతడిని చూస్తున్నజగన్నాధానికి సుబ్బారావును ఎక్కడోఎప్పుడో చూసినట్లనిపించింది. కాస్సేపు ఆలోచించాడు. గబుక్కున గుర్తొచ్చి “మీరు ఎస్.కె.బి.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారా”? అనడిగాడు జగన్నాధం. “ అవును. మీరు” ?.. అన్నాడు సుబ్బారావు .
“నేనుజగన్నాధాన్ని”అన్నాడు.
వెంటనే సీటు లోంచి సుబ్బారావు లేచి జగన్నాధం వైపుకి వచ్చి కౌగలించుకుంటూ,“ఎరోయ్! జగన్నాధం! ఎన్నాళ్ళయిందిరా ! నిన్నుచూసి. కాలేజీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కనపడ్డావా? సంతోషం రా! అన్నాడు వీపు నిమురుతూఆవేశంగా. బోయ్ ని పిలిచి కాఫీలు తెప్పించాడు సుబ్బారావు. కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటు న్నారు. ఆ కబుర్లలో అన్నాడు సుబ్బారావు. “జగన్నాధం! నువ్వు అప్పుడు ఎంత బుద్ధిగా ఉండే వాడవురా! ఒక్కసారి మనకాలేజీ రోజులు గుర్తు తెచ్చుకో. కాలేజీలో పొరపాటున గాలికి పైట జారిన అమ్మాయి కనపడితే కళ్ళు మూసుకునేవాడవు. గుర్తుందా? అటువంటి నువ్వు ఇప్పుడు సుందరం దగ్గర వైద్యానికి వచ్చావా? ఏమిటిరాఇది! . ఇంత మారి పోయావు?”
“ ఒరేయ్! సుబ్బారావు! ముయ్యరా! ముయ్ రా! నోరు ముయ్యరా! నేను వచ్చింది సుందరం వైద్యం కోసం కాదురా! నాకొక సమస్య వచ్చి పడింది. గోపీ అనే నాకు కాబోయే అల్లుడు, సుందరం దగ్గర వైద్యం చేయించుకుంటున్నట్లుఈమధ్య పది రోజులుఈహాస్పిటల్ చుట్టూ తిరిగి నట్లు తెలిసి సుందరాన్ని అడిగి గొపీ గురించి సమాచారం రాబట్టు దామనివచ్చాను”చెప్పాడు జగన్నాధం.
“ సుందరం వెళ్ళిపోయి నెల దాటుతోంది. గోపీ ఈమధ్య పది రోజులు తిరిగాడు అంటున్నావు. అయితే ఇక్కడ సుందరమూ లేడు, ఇది అతని హాస్పిటలుకాదు. గోపీ అంటున్నావూ! వాళ్ళనాన్నపేరు రంగారావా?” అడిగాడు సుబ్బారావు.
అవును! నీకెలాతెలుసు?”ఆశ్చర్య పోయాడు జగన్నాధం.
“ రంగారావు నాకు మంచి మిత్రుడు. అసలు ఈ టౌనులో ప్రాక్టీసు పెట్టమని నాకు సూచించినది అతడే! గోపీ నా పేషెంటు. గోపీకి ఎదో గాలి మార్పువల్ల కుంచెం జ్వరం వొళ్ళు నొప్పులు వచ్చాయి. ఆంటీబయోటిక్సు ఇచ్చాను. దానికి కుంచెం నీరసంగా ఉన్నాడు. ఇప్పుడు పెర్ఫెక్టు అయ్యాడు. ఏసమస్య లేదు. గోపీ మంచి వాడు. అల్లుడుగా నీ సెలక్షను బాగుంది.” చెప్పాడుసుబ్బారావు.
ఈమాటలు విన్న జగన్నాధం ఆలోచనలోపడ్డాడు. ఇప్పుడు అర్ధమయింది అతనికి. ఈ మురళీ గాడు బయటున్న సుందరం బోర్దు చూసి లోపలున్నది కూడా ‘సుందరమే’ అనుకున్నాడు. సుబ్బారావు ప్రాక్టీసు పెట్టినది ఈమధ్యనేకాబట్టి వాడికి తెలియ లేదు. అందుకే వాళ్ళ అక్కతో అల్లా చెప్పాడు. ఇప్పుడు ఈసుబ్బారావు గాడి పని చెప్పాలి అనుకున్నాడు.
“ మరి బయట ఆసుందరం బోర్దు ఎందుకు పీకేయలేదు?” అడిగాడు జగన్నాధం.
టేబులు మీదున్నగాజు పేపరు వెయిట్ షోకుగా తిప్పుతూ,“ ఆ బోర్డు నిన్నేమిచేసింది ఇప్పుడు” అన్నాడునవ్వుతూ సుబ్బారావు.
జగన్నాధం ఒక్క సారిగా కోపంగా పైకి లేచి, “ఏం చేసిందా? నా కూతురు ఆత్మహత్య చేసుకోబోయింది. నీవద్దకి వచ్చే పేషెంటులు అందరూ చెడు తిరుగుళ్ళు తిరిగి సుఖరోగాలు తెచ్చుకున్న వాళ్ళు అనుకుంటున్నారు జనం. ఇది చాలదా? ఇంకేమి కావాలి?” అన్నాడు.
“ కూల్!కూల్!జగన్నాధం.నీ కూతురేమిటీ? ఆత్మహత్యఏమిటి? జనాలేమిటి? నిదానంగా చెప్పు” అన్నాడు సుబ్బారావు.
“ చెపుతా విను . గోపీ,మా అమ్మాయి గోపిక ప్రేమించు కున్నారు. వాళ్ళకి త్వరలో పెళ్ళి చేయాలి అనుకున్నాం. ఈలోగా మా అబ్బాయి మురళి గోపీని ......................... అదన్నమాట”. జరిగినదంతా చెప్పాడు జగన్నాధం.
“ బావుందయ్యా! దానికి నేనుమాత్రం ఏం చేయ గలను? సుందరంబోర్డు పీకేసి నా పేరుతో బోర్డువ్రాసి పెట్టడానికి ఇక్కడ కి నేను వచ్చిన వెంటనే ఒక పెయంటరుకి పురమాయించాను. ఎడ్వాన్సుకూడా ఇచ్చాను. కానీవాడు చేసి చస్తేకదా! ఇప్పుడు ఎలక్షను రోజులు వల్ల బ్యానరలు,స్వాగతం బోర్దులు వ్రాయడానికి పోయి నా పని వెనక్కిపెట్టాడు. అయినా నీకు సారీ చెపుతున్నా! రేపే వాడికి కబురు పెట్టి కాలరు పట్టుకునో, కాళ్ళు పట్టుకునో రెండు మూడు రోజుల్లో నా బోర్డు ఏర్పాటు చేస్తాను జగన్నాధం!”సౌమ్యంగా చెప్పాడు డాక్టరు సుబ్బారావు.
“సరే! నేనింక వెళ్తా”! అంటూ బయలుదేరాడు జగన్నాధం. మెట్లూ దిగుతూ కారు వైపుకి వెళ్ళుతున్నఅతనికి అవునూ! ఈచిన్నజ్వరానికి డాక్టరు సుబ్బారావు దగ్గరకి వచ్చిన గోపీ తనను ఇక్కడ చూసినట్లు గోపికకు చెప్పొద్దని మురళిచేత ఎందుకు ఒట్టు వేయించుకున్నట్లు? అని సందేహం వచ్చి,గోపీనే అడుగుతే పోలే! అని రంగారావు ఇంటికి పోనివ్వమన్నాడు కారుని. “ సుందరం డాక్టరు ఉన్నారా? మీపనయ్యిందా?సార్”డ్రైవరు రాముడు అడిగాడు. “ ఇది ఇప్పుడు సుందరంహాస్పిటల్ కాదు. అతను ఇంకోఊరు వెళ్ళిపోయాడు. డాక్టరు సుబ్బా రావు అని ఇంకోయన దీన్నితీసుకున్నారు”. “ అల్లాగండీ ! మాకెవరికీ తెలియదండీ!” అన్నాడు రాముడు. ‘అదే కొంపముంచింది’ అని మనస్సులో అనుకుని త్వరగా పోనియ్యమన్నాడు కారుని.
గోపీ జగన్నాధాన్ని చూసి “రండి. మావయ్య గారూ! నాన్నగారు పని మీద బయట కెళ్ళారు”. అన్నాడు.
“ఏంగోపీ.ఎల్లావున్నావు? జ్వరంవచ్చిందిటకదా!” అడిగాడు.
“ మీకెల్లా తెలిసింది?” కంగారుపడుతూ అడిగాడు గోపీ.
“ నీ డాక్టరు సుబ్బారావు చెప్పాడు”.
“ గోపికకు తెలియ లేదు కదా?” అన్నాడు గోపీ.
“ఏం తెలిస్తేనేం?”జగన్నాధం ప్రశ్న.
“మావయ్య గారూ! గోపిక సంగతి మీకు తెలియదు . నాకు రొంప పటితేనే బాధ పడిపోతుంది. అటువంటిది నేను జ్వరంవచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నట్లు గోపికకు తెలిస్తే ఇంకేమయినా ఉందా? తట్టుకో లేదండీ! ఏడుస్తూ కూర్చుంటుంది. తిండికూడా మానేస్తుంది. గోపికకు నేనంటే ఎంత ఇష్టమో మీకు తెలియదు. నాకు గోపిక సంగతి బాగా తెలుసు. అందుకే ఆవేళ మురళి నన్ను హాస్పిటల్ వద్ద చూసినప్పుడు గోపిక కు ఎట్టిపరిస్థితులలోనూ తెలియకూడ దని గోపికతో చెప్పొద్దని ఒట్టు కూడా వేయించుకున్నాను. నేను ఒకఫోను కూడా గోపిక కు చేయ లేదు. మీకీ విషయం తెలియదు” చెప్పాడు గోపీ .
“బాగుందయ్యా గోపీ! నాకన్నీతెలుసు. మీ ప్రేమలు కాదు గానీ మాదుంపలు తెంపుతున్నాయి. బోర్డు ఎత్తకుండా ప్రాక్టీసు ఎత్తేసాడు ఆ డాక్టరు సుందరం. బోర్డు పెట్టకుండా ప్రాక్టీసు పెట్టేసాడు ఆ డాక్టరు సుబ్బారావు . అక్కడనిన్ను చూసి మురళి అపార్ధం చేసుకున్నాడు. దానికి తగ్గట్టు గోపికకు చెప్పొద్దనీ నువ్వు మురళి తో ఒట్టు వేయించుకున్నావు. మురళి మాటలతో గొపిక నిన్నుఅపార్ధంచేసుకుంది. ఈ అపార్ధాల్లో అంతా గందర గోళం” నెత్తి మీద చెయ్యి పెట్టుకుని చెప్పాడు జగన్నాధం.
“డాక్టరు సుందరం ఇప్పుడు లేరు కదండీ ఇక్కడ ? అపార్ధాలే మిటండీ? మీరు అనే దంతా నాకు గందర గోళంగా ఉంది” అన్నాడు కంగారుగా గోపీ.
అసలు ఏమయిందో చెపుతా విను. నీకు జ్వరంవచ్చిందా? ఆ తర్వాత ...............................................................................................” అదన్న మాట అలా జరిగింది గోపీ! చెప్పాడు జగన్నాధం.
“సారీ మావయ్యగారు ! ఇల్లా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు”.
“ అవునయ్యా! ఒకప్పుడు అపార్ధాలుమనప్రమేయంలేకుండానే కలుగు తుంటాయి. అల్లాగే కొన్ని సంఘటనలుకూడాను”. అని “ సరే! ఇంక బయలుదేరుతా” అన్నాడు జగన్నాధం .
గోపీ కారు వరకు వచ్చి “గోపికను రెండురోజుల్లో కలుస్తానని చెప్పండి.” అన్నాడు.
ఇంటికి చేరగానే జగన్నాధం “ శ్యామలా,గోపికా, మురళీ! అంటూ పెద్ద గొంతు తో పిలిచాడు. అందరూ హాల్లోకి వచ్చారు. శ్యామల అడిగింది, “ ఏమయిందండీ! డాక్టరు సుందరాన్ని కలిసారా”?అని.
“ కలవడానికి అసలు సుందరం ఉంటే కదా?” అన్నాడు. “ ఏమిటండీ! మీరంటున్నది?” అంది శ్యామల.
“అవును. అసలు ఏమి జరిగిందంటె!. సుందరం ఇక్కడినుంచి ప్రాక్టీసు ఎత్తేసి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు. సుబ్బారావని నా కాలేజీఫ్రెండు అక్కడ ప్రాక్టీసు ...................................................” అదన్నమాట. జగన్నాధం చెప్పినదంతా విని “ఆ” అన్నారు ముగ్గురూ నోరు తెరచిపెట్టి.
“ఈగోపికఅపార్ధానికికారకుడుఈ మురళిగాడు అన్నాడు” జగన్నాధం.
“నేను కాదు. ఆడాక్టరు సుందరం బోర్డు నాన్నా! ” అన్నాడుమురళి. అందరూ గట్టిగా నవ్వేరు .
ఇప్పుడు గోపిక సంతోషానికి హద్దులులేవు. ఒక్కసారిగా తల్లిని కౌగలించుకుని ముద్దులుపెట్టించుకుంది. పైన తన గదిలోకి పరుగెత్తు కెళ్ళి హుషారుగా రెండు సార్లు ఈలలు వేసింది. గంతులు వేసింది. డాన్సు చేసింది. పరుపు మీద దిండులను కాగలించుకుని మంచం మీద దొర్లింది కాస్సేపు. టేబులుమీదున్నగోపీఫొటో తీసి ముద్దులు పెట్టుకుంది. ఫోను తీసి గోపీ నెంబరు కొట్టింది.
“నిన్ను అపార్ధంచేసుకున్నందుకు మన్నించు స్వామీ” అందినవ్వుతూ.
“ గోపికా!ఎందుకుఅంత దారుణమైన పని చేయ బోయావు? నేనేమయి పోతా ననుకున్నావు?” అడిగాడు గోపీ.
“ నీ యందు ఇష్టం, నమ్మకం , గౌరవం తో నిండుగా ఉన్న నా మనస్సు మురళి మాటలతో ఒక్క సారిగా గాలి తీసేసిన బుడగలా అయిపోయింది గోపీ! కోరిక తీరక పోవడంతో కోపం వస్తుంది. దాని వెంబడి నువ్వునాకు దక్కవన్న బాధ, భయం అంత పని చేయించాయి” అందిగోపిక.
“పొనీలే! అపార్ధం పోయి అర్ధం చేసుకున్నావు గోపికా! అపార్ధం అనర్ధాలకి దారి తీస్తుందంటారు. కానీ నీ అపార్ధం అర్ధాలకి దారి తీసింది.ఒకవిధంగా మన ప్రేమకు పరీక్షయింది. ఈప్రేమ పరీక్షలోఇద్దరం విజేతలమే! ఇప్పుడు మన మధ్య ప్రేమ కొలిమిలో కాల్చిన బంగారంలా స్వచ్చమయినది.”అన్నాడు గోపీ.
‘’మరి దారి తీసిన ఆ అర్ధాలేమిటో.? “ గోపిక ప్రశ్న.
“ ప్రేమించి పెళ్ళి చేసుకునే అమ్మాయి కాబోయే తన మొగుడు తనకే స్వంతమని ఏకొద్ది తేడా వచ్చినా, అనుమానం వచ్చినా ఎంతకేనా తెగిస్తుందనీ” గోపీ జవాబు.
“ నువ్వుమాత్రంతక్కువతిన్నావా? ప్రేమించిన అమ్మాయికి అంత అపురూపమెందుకు? ఏం? జ్వరంవచ్చిందని తెలిసి ఒక మాటు బాధపడితే ఏమయిపోతుంది?”గోపిక కౌంటరు.
‘’సరే!గాని మన తర్వాత ప్రోగ్రాం ఏమిటో?” గొపీ అడిగాడు.
“ఏముంది! ఫైనలియరు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మన ఇద్దరం మడికట్టుకుని బుద్ధిగా చదువుకుని ఫస్టు క్లాసులు తెచ్చు కోవడమే! “ గొపిక నవ్వుతూజవాబు.
“పగలయితే మడి కట్టుకుంటాం. మరి రాత్రి నిద్రలో కలలోకివస్తే ఎల్లాగా?” గొపీ కొంటె ప్రశ్న
“రాత్రి నిద్ర రాకుండగా టీలు తాగుతూ చదువుకుంటే కలలు రావుకదా”!గోపీక కొంటె జవాబు.
“ బాబోయ్ ! నువ్వు గోపికవు కాదు. బ్రహ్మచారిణివి” ఇద్దరూ నవ్వులు.
“సరే! పరీక్షలయిపోయాయి. ఇద్దరకి క్లాసులు వచ్చేసాయి. మరి తర్వాత?” గోపీ.
“ ఇంకేముంది.?‘శుభలేఖ’లు’, పెళ్ళి పందిరి, డోలుసన్నాయి, పెళ్ళివారు, మాంగల్యంతంతునా, తలంబ్రాలు, అప్పగింతలు.” చెప్పింది గోపిక సంతోషంగా.
“ ఆతర్వాత?”గోపీ.
“ఆ తర్వాత ఏమిటో కూడా నేనే చెప్పాలా? ఈ మొద్దు అబ్బాయికి?” గొపీ గోపికల మధ్య కిల కిల నవ్వులు, ఆల్ ది బెస్టులూ, బై బైలు (శుభాలు)
No comments:
Post a Comment